స్టార్ కాకర లేదా పొట్టి కాకర రకం కాకరలో ప్రసిద్ధమైన హైబ్రీడ్ రకం. సాధారణ కాకరతో పోల్చితే పొట్టి కాకర అధిక దిగుబడి ఇస్తుంది. అనేక ఆరోగ్య ప్రయోజనాలను మనకు అందిస్తుంది. స్టార్ కాకరను ఆహారంలో భాగం చేసుకుంటే.. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని తేలింది. స్టార్ కాకరలో ఉండే పాలీ పెప్టైడ్-పి, చారంటిన్ లాంటివి మన శరీరంలో సహజసిద్ధ ఇన్సులిన్‌లా పరిచేస్తాయి. బ్లడ్ సుగర్ లెవెల్స్‌ను నియంత్రిస్తాయి. శరీరంలోని కణాలు గ్లూకోజ్‌ను సమర్ధంగా వినియోగించుకునేలా చేస్తాయి. చక్కెర స్థాయిలను అకస్మాత్తుగా పెరగనివ్వదు. పొట్టి కాకరలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది పేగు కదలికలను సులువు చేస్తుంది. తద్వారా మలబద్ధకం లేకుండా చేస్తుంది. దీనిలోని పీచుపదార్థం వల్ల ఆహారంగా తిన్నప్పుడు కడుపు నిండిన ఫీలింగ్ ఇస్తుంది. బరువు తగ్గిస్తుంది. జీర్ణాశయంలోని హానికారక బ్యాక్టీరియాను, నులిపురుగులను నాశనం చేస్తుంది.
పొట్టి కాకరలో క్యాలరీలు, కొవ్వులు చాలా తక్కువ. దీనిలో ఎక్కువగా లభించే సీ విటమిన్, యాంటీ ఆక్సిడెంట్ల వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. సీజనల్‌గా వచ్చే వ్యాధులు, జలుబు, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. కాలేయం పనితీరును చక్కదిద్దుతుంది. శరీరంలోని వ్యర్థాలు, టాక్సిన్‌లను బయటకు నెట్టేస్తుంది. రక్తం శుద్ధిలో పొట్టి కాకర గట్టి ఫలితాన్నే ఇస్తుంది. దీనిలోని విటమిన్ ఏ వల్ల కళ్లను ఆరోగ్యంగా ఉంచి, కంటిచూపును మెరుగు పరుస్తుంది. రేచీకటి సమస్య నివారిస్తుంది. పొట్టి కాకర తిన్న వారి రక్తాన్ని శుద్ధి చేయడం వల్ల చర్మం కాంతివంతం అవుతుంది. మొటిమలు, ముఖంపై నల్ల మచ్చలను తగ్గిస్తుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్న స్టార్ కాకరను వారానికి రెండుసార్లు కూర, వేపుడు లేదా జ్యూస్‌గా తీసుకుంటే మంచిదని ఆరోగ్య, ఆహార నిపుణుల సలహా.అన్నదాతకు స్థిరమైన ఆదాయాన్ని ఇచ్చే పంటగా ఇటీవలి కాలంలో స్టార్ కాకర నిలుస్తోంది. మార్కెట్‌లో దీని ధర ఆశాజనకంగా ఉండడంతో రైతులకు కాసుల పంట పండిస్తోంది. పొడవు కాకరకు అధిక డిమాండ్ ఉండేది. దాని స్థానాన్ని స్టార్ కాకర ఆక్రమించిందనే చెప్పాలి. కాకరను నేలపై సాగుచేస్తే.. నాలుగు నెలలే దిగుబడి వస్తుంది. అదే సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ.. పందిరి మీద పెంచితే.. ఆరేడు నెలల నుంచి 8 నెలల వరకు పంట దిగుబడి వస్తుంది. పొట్టికాకర పంట కాలంలో ఎకరానికి 15 నుంచి 18 టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉంది.మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ మండలం కొండాపూర్ యువరైతు భాస్కర రామవర్మ ఆరు ఎకరాల్లో పదేళ్లుగా 1315 రకం పొట్టి కాకర సాగుచేస్తున్నారు. పొడవు కాకర కంటే స్టార్ లేదా పొట్టి కాకరకు కిలోకు రూ.10 అదనంగా ధర పలుకుతుందని చెప్పారు. ఈ రకం కాకర విత్తనాలు విత్తనం నాటిన 50 రోజుల నుంచే దిగుబడి ఇస్తున్నట్లు తెలిపారు. ఎకరం భూమిలో పొట్టి కాకర 15 నుంచి 20 టన్నుల దిగుబడి వస్తోందని రామవర్మ వెల్లడించారు. పందిరిపై పొట్టి కాకర పండిస్తూ.. మంచి ఆదాయం సంపాదిస్తున్న రామవర్మ ఇతర రైతులకు స్ఫూర్తిగా నిలిచారు.కాకర పండించే భూమిలో అడుగు ఎత్తులో బెడ్లు వేసి, మల్చింగ్ షీట్ కప్పినట్లు వర్మ తెలిపారు. అవసరమైన పురుగు మందులు పిచికారి చేయడం, మైక్రో న్యూట్రియంట్లు ఇవ్వడం, ఫంగిసైడ్ నివారణ, ధరణి శుద్ధి, తీగలపై నానోగోల్డ్ స్ప్రే చేయడంతో తమ కాకర పాదులు బలంగా, పచ్చగా ఎదిగాయన్నారు. దీంతో వర్షాలు ఎక్కువగా కురిసినా పంట నిలబడిందని, మార్కెట్‌లో మంచి ధర పలికిందన్నారు. ధరణి శుద్ధి ఇస్తే తీగ బాగా వస్తుంది. భూమి గుల్లబారుతుందన్నారు. కాకర పాదు వేగంగా ఎదుగుతుంది. ధరణి గోల్డ్‌లో భూమి లోపల మైక్రో చర్యలు పెంచేందుకు కావలసిన అన్ని పోషకాలు ఉన్నాయి. వారానికి ఒకసారి నానోగోల్డ్ ఇస్తే.. మైక్రో న్యూట్రియంట్స్ సమస్య రాదు. వారానికి ఒకసారి ధరణిశుద్ది ఇస్తున్నట్లు వర్మ చెప్పారు. వీటితో పాదు బలంగా ఎదిగి, పూత, దిగుబడి అధికంగా వస్తున్నాయని తెలిపారు.కాకర పందిరి రాళ్లను 15 అడుగుల దూరంలో వేశారు. అంటే వరసల మధ్య 15 అడుగుల దూరం ఉంచారు. మొక్కల మధ్య మూడు అడుగుల దూరం పెట్టారు. ఒక్కొక్క డ్రిప్ పాయింట్ వద్ద నాలుగేసి పొట్టి కాకర విత్తనాలు నాటినట్లు చెప్పారు. ఎక్కువ చేదు ఉండే ఈ రకం 10 నుంచి 15 కాయలు కిలో బరువు ఉంటాయి. పొట్టి కాకరకాయల కూర పొడవు కాకర కన్నా కాస్త ఎక్కువ సమయం నిల్వ ఉంటుంది. జూన్ 20 తాము విత్తనాలు నాటామని, డిసెంబర్ నుంచి జనవరి నెలాఖరు వరకు దిగుబడి వచ్చే ఛాన్స్ ఉంటుందన్నారు రైతు వర్మ.భూమిని బాగా దున్ని, ఎకరానికి 25 టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలని రైతు వర్మ తెలిపారు. భూమిలో అడుగు ఎత్తున బెడ్లు తయారు చేసుకోవాలి. వాటిపై మల్చింగ్ షీట్ వేసి, విత్తనాలు నాటుకోవాలి. ఎకరానికి అరకిలో విత్తనాలు పడతాయి. విత్తనాలు నాటిన తర్వాత 15 నుంచి 20 రోజుల మధ్య మైక్రో న్యూట్రియంట్స్ ఇవ్వాలి. కాకరపాదు తీగలను దారం కట్టి పందిరి రాటకు ఎక్కించిన తర్వాత వారానికి ఒకసారి మైక్రో న్యూట్రియంట్స్ స్ప్రేయాలని వర్మ చెప్పారు. వారానికి ఒకసారి ఎకరానికి కిలో చొప్పున భూమికి ధరణిశుద్ధి ఇస్తూ ఉండాలి. విత్తనాలు నాటిన 20 రోజులు దాటిన తర్వాత ఎకరానికి 4 కిలోల 19:19:19లు తర్వాత వారానికి 12:61 ఎరువులు మార్చి మార్చి ఇస్తూ ఉండాలి.కాకర పంటకు ఇటీవలి కాలంలో ప్రధానమైన సమస్య వైరస్. దీని వల్ల కాకరతోట మొత్తం తీసేయాల్సిన పరిస్థితి కూడా ఎదురు కావచ్చు. వర్షాల వల్ల కాకర ఆకులు పండిపోయి రాలిపోతుంటాయి. వీటి నుంచి పంట రక్షణ కోసం విత్తనాలు నాటిన 15వ రోజున, 22వ రోజున పెర్‌ఫెక్ట్ మందు స్ప్రే చేస్తే ఫలితం ఉంటుంది. తామరపురుగు, తెల్లదోమ, పచ్చదోమ కంట్రోల్ కోసం పెగాసిస్, ప్లీడర్ గోల్డ్, మార్కర్ మందుల్లో ఏదో ఒకటి ప్రతి ఐదు రోజులకు ఒకసారి స్ప్రేచేస్తూ ఉండాలి. తామరపురుగుకు మందు చల్లేటపుడే ఫంగిసైడ్‌లు కూడా స్ప్రేచేస్తామని వర్మ చెప్పారు. వర్షం కురిసినా, మంచుపడినా ఆకులపై తెల్ల మచ్చలు వచ్చి, ఆకు అంతా విస్తరిస్తాయి. దీని నివారణకు ముందుగానే గమనించి రెడామిల్ గానీ, అమిస్టాటాబ్ లేదా ఎర్గాన్ గానీ వారానికి ఒకసారి స్ప్రే చేయాలి. ఇలా చేసుకుంటే తెల్లమచ్చలు వచ్చినప్పుడు, అసలు ఆ మచ్చలు రాకుండా కూడా అరికట్టవచ్చు.చలికాలంలో కాకరపాదులకు ఎక్కువగా పౌడర్‌మిల్ వస్తోందని వర్మ చెప్పారు. దానిని అరికట్టేందుకు బోనో లేదా లోనా లాంటివి వారానికి ఒకసారి స్ప్రేచేయాలి. విత్తనం నాటి 20 రోజుల వరకు వర్మ క్షేత్రంలో మొజాయిక్ తెగులు రాలేదు. మధ్యలో పది రోజులు అది కనిపించింది. యాజమాన్య పద్ధతులు సరిగా చేయడంతో కంట్రోల్ అయిందన్నారు. వర్షపాతం ఎక్కువ ఉంటే వేరుకుళ్లు తెగులుతో అక్కడక్కడా కాకర మొక్కలు చనిపోతాయి. దాని నివారణకు స్టైకోడెర్మా, సూడోమోనాస్, మేటరైజం, బవేరియా బసియా లాంటివి భూమికి ఇవ్వాలన్నారు. వేరుపురుగును మేటరైజం చంపేస్తుంది.కాకర విత్తనాలు నాటిన 55 నుంచి 60 రోజుల మధ్య తొలిసారి పంట కోతకు వస్తుంది. ఆ తర్వాత ప్రతి రెండు రోజులకు ఒకసారి కాయలు కోయాలి. పదేళ్ల కాకరసాగు అనుభవంలో తాను ఒక్కొక్క సమస్యను తెలుసుకొని, అధిగమిస్తున్నట్లు వర్మ వివరించారు. కాకర కోత మొదలైన 15 రోజుల్లోనే అంతవరకు పెట్టిన పెట్టుబడి వచ్చినట్లు వర్మ వెల్లడించారు. తనకు సగటున కిలో 45 నుంచి 50 రూపాయలు ధర వచ్చిందన్నారు. ధర కాస్త ఎక్కువ వస్తే మొదటి రోజుల్లోనే లాభం కనిపిస్తుందని, రేటు కాస్త తక్కువైనా తరువాతి కోతల్లో కవర్ అవుతుందన్నారు. పొట్టి కాకర అధిక వర్షపాతాన్ని తట్టుకుంటుంది. యాజమాన్య పద్ధతులు సరిగ్గా చేస్తే.. 45 నుంచి 50 రోజుల్లోనే తొలికోత వస్తుంది. పొడవు కాకర కన్నా పొట్టి కాకర నెల రోజులు ఎక్కువ పంట కాలం ఉంటుంది.పొట్టి కాకర సాగు చేయడానికి ఎకరానికి అన్నీ కలుపుకొని లక్షన్నర నుంచి రూ.2 లక్షల వరకు ఖర్చు అవుతుందని భాస్కర వర్మ చెప్పారు. స్టార్ కాకర దిగుబడిలో ఎలాంటి ఇబ్బందీ ఉండదని తెలిపారు. సరైన యాజమాన్య పద్ధతులు పాటించకపోతే.. వర్షాలు ఎక్కువగా కురిసినప్పుడు తోటలు తీసేయాల్సిన పరిస్థితి రావచ్చని భాస్కర వర్మ హెచ్చరించారు. కాకర పాదులను నిరంతరం నిఘా ఉంచి, జాగ్రత్తగా గమనించి, సస్య రక్షణ చేపడితే లాభదాయక పంట అనే చెప్పొచ్చు.