Site icon V.E.R Agro Farms

ఆగాకరతో అంతా లాభమే

ఆగాకర లేదా బోడకాకరలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాల్షియం, విటమిన్ సీ, పోటాషియం, ఐరన్‌, మెగ్నీషియం, పీచు పదార్థం బాగా లభిస్తాయి. ఆగాకరలోని విటమిన్‌ సీ, కాల్సియంలు ఎముకలను బలంగా ఉంచుతాయి. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు వర్షాకాలంలో వచ్చే వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు, జలుబు, దగ్గు నుంచి రక్షిస్తాయి. ఆగాకర ఆహారంగా తీసుకున్న వారికి రక్తంలో షుగర్‌ లెవెల్స్ తగ్గించి, డయాబెటీస్‌ను నియంత్రిస్తుంది. దీనిలో లభించే పొటాషియం బ్లడ్‌ ప్రెషర్‌ను అదుపులో ఉంచుతుంది. ఆగాకరలోని ఫైబర్‌ జీర్ణవ్యవస్థను మెరుగుపరిచి, అజీర్తి సమస్య తగ్గిస్తుంది. గర్భిణులు ఆగాకరను తింటే గర్భంలోని శిశువు ఎదుగుదల బాగుంటుంది.ఆగాకర మొక్క నాటిన 50 రోజుల్లోనే దిగుబడి వస్తుంది. అప్పటి నుంచి మూడు నెలల వరకు ప్రతి ఐదు రోజులకు ఒకసారి కాయలు కోతకు వస్తాయి. ఎకరం నేలలో ఆగాకర పండిస్తే.. ఒక్కో కోతకు దాదాపు రెండు క్వింటాళ్ల వరకు పంట వస్తుంది. ఆగాకర సాగు కోసం ప్రతిఏటా పెట్టుబడి అవసరం ఉండదు. పదేళ్లకు ఒకసారి పెడితే సరిపోతుంది. ఒక ఏడాది పెట్టుబడి పెట్టి పంట మొదలు పెడితే పదేళ్లపాటు దిగుబడి వస్తూనే ఉంటుంది. రెండు లక్షల పెట్టుబడి పెడితే ప్రతి ఏటా రెండు లక్షల రూపాయల ఆదాయం వస్తుందని చినబాబు తెలిపారు.ఆగాకర మొక్కలకు పది రోజులకు ఒకసారి నీరు సరఫరా చేసినా సరిపోతుంది. ఎకరం పొలంలో సుమారు 300 మొక్కలు నాటుకోవచ్చు. ఆగాకర మొక్కలను ఆగ, మగ మొక్కలను ఒకేచోట నాటుకోవాలి. లేదంటే పంట రాదని శ్రీకాకుళం జిల్లా హిరమండలం మండలం కుంపిరిగూడలోని ఆదర్శ రైతు రాయల చినబాబు వెల్లడించారు. పదేళ్లకు పైగా ఆయన ఆగాకర సాగును విజయవంతంగా చేస్తున్నారు. ఆరు అడుగుల దూరం ఉండేలా మొక్కలను నాటుకోవాలి. సాలుకు సాలుకు మధ్య పది అడుగులు ఉంచుకోవాలి. నిజానికి శ్రీకాకుళం జిల్లాలో ఆగాకర పంటను రైతులు ఎవ్వరూ సాగు చేయరు. తాను హైదరాబాద్‌ నుంచి మేలురకం నాటు విత్తనాలు తీసుకొచ్చి పంట పండిస్తూ, చక్కని లాభాలు పొందుతున్నట్లు రాయల చినబాబు చెప్పారు.విత్తనాలు కవర్లలో ఉంచితే ఏప్రిల్, మే నెలల్లో మొక్కలు వస్తాయని చినబాబు చెప్పారు. జూన్‌ నెలలో ఆ మొక్కలను భూమిలో నాటుతారు. ఒక్కోచోట నాలుగైదు మొక్కలు నాటుతామన్నారు. ఆడ, మగ మొక్కలు వేర్వేరుగా కనిపిస్తాయని, మగ మొక్కల నుంచి దిగుబడి రాదు కాబట్టి కొద్ది రోజుల తర్వాత ఒక మగ మొక్కను ఉంచి, మిగతా వాటిని పీకేస్తామని చెప్పారు. ఒకే చోట ఎక్కువ మొక్కలు ఉంటే కొన్ని కుళ్లిపోతాయన్నారు. మొక్కల మొదళ్లకు కాస్త దూరంగా నేలను పలుగుతో రంధ్రాలు చేసి, వాటిలో  డీఏపీ, యూరియా, పొటాష్‌ వేస్తామని చెప్పారు. పొలంలో కలుపు గడ్డి ఎక్కువ అయితే.. ఆడమొక్కల మొదళ్లను ఎలుకలు తినేస్తాయి. కలుపు నివారిస్తే ఎలుకల బెడద ఉండదన్నారు.ఆగాకర మొక్క నుంచి తీగలు పైకి పాకేందుకు కర్రలతో పందిరి వేసుకోవాలి. హార్టికల్చర్‌ శాఖ అధికారులు తమకు పందిరి కోసం కర్రలు, ఇనుప తీగలు ఇచ్చారని చెప్పారు. ఆగాకర కాయలు తయారైన తర్వాత వాటిని తినేందుకు పసుపుపచ్చ పురుగు బెడద ఉంటుంది. వాటి నివారణకు అప్పుడప్పుడూ పురుగు మందులు స్ప్రేయాల్సి ఉంటుంది. దోమకాటు మందులు స్ప్రే చేయాలి. ఇంతకు మించి ఆగాకరకు ఇతర రోగాలేవీ రావని చినబాబు చెప్పారు. ఆగాకర పూలు రాలిపోకుండా కొన్ని మందులు కొట్టాల్సి ఉంటుంది. పసుపుపచ్చ పురుగు, దోమకాటు, పూత రాలిపోవడాన్ని నివారించుకుంటే ఇతర ఇబ్బందులేవీ ఆగాకర సాగులో ఉండవని చినబాబు వివరించారు. బంకమట్టిలో కన్నా ఎర్ర నేలల్లో అయితే.. కలుపు సమస్య ఎక్కువగా ఉండదని చెప్పారు.పందిరి నుంచి కింది వేలాడే తీగలను కత్తిరిస్తామని చినబాబు చెప్పారు. పందిరిపైన తీగ ఉన్నప్పుడే దిగుబడి ఎక్కువ వస్తున్నట్లు తమ అనుభవంలో తెలుసుకున్నామని అన్నారు. హైబ్రీడ్ రకం ఆగాకరకు సీజన్ లేనప్పుడు మార్కెట్‌లో ధర తక్కువ ఉంటుందని తాము నాటు ఆగాకర పండిస్తున్నట్లు తెలిపారు. నాటు ఆగాకరకు మార్కెట్‌లో కిలో రూ.200 వరకు ఉంటుందని, తాము మాత్రం వ్యాపారులకు రూ.150కి అమ్ముతామని చెప్పారు. ఆగాకర పంట కోత పూర్తయిన తర్వాత అదే పందిరిపై బీర, కాకర సాగుచేస్తామన్నారు.

ఆగాకర మొక్క భూమిలో పాతినప్పటి నుంచి దిగుబడి వచ్చే వరకు పందిరి కోసం కర్రలు, ఇనుప తీగలు సహా పెట్టుబడి ఎకరానికి సుమారు రూ.10 లక్షలు అవుతుంది. ప్రతి ఏటా దాదాపు రూ.2 లక్షలు ఆదాయం వస్తుంది. ఇలా పదేళ్ల పాటు ఆగాకర నుంచి ఆదాయం వస్తూనే ఉంటుంది. వరి పంట కన్నా ఆగాకర పంట వల్ల తాము ఎక్కువ ఆదాయం పొందుతున్నట్లు రైతు చినబాబు చెప్పారు. మూడు ఎకరాల్లో వరి పంటపై వచ్చే ఆదాయం ఎకరం ఆగాకర సాగు ద్వారానే వస్తోందన్నారు.

Exit mobile version