Site icon V.E.R Agro Farms

పాల పెంపు, పునరుత్పత్తిలో మేటి

మెరుగైన పోషక విలువలు కలిగి ఉంటుంది. పశువులకు చాలా ఇష్టమైనది. రుచిగా, పోషక విలువలు ఎక్కువ ఉండేది. పాల దిగుబడిని పెంచుతుంది. పశువుల ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. వాటి పునరుత్పత్తికి బాగా సహకరిస్తుంది. నెలకు ఒక కోత వస్తుంది. వేడి, తేమ, సారవంతమైన భూమిలో ఏడాది పొడవునా ఏపుగా పెరుగుతుంది. ఏడాది పొడవునా పశువులకు పచ్చిమేతగా పనికివచ్చే జింజువ గడ్డి లేదా మార్వెల్‌ గడ్డి. నాటిన నెల రోజుల్లోనే తొలి కోత వస్తుంది. మంచినీటి వసతి ఉంటే మరింత బాగా పెరుగుతుంది జింజువగడ్డి.

ప్రోటీన్లు, ఖనిజ లవణాలు కలిగిన జింజువగడ్డి పశువులు, మేకలకు పుష్టికరమైన ఆహారం. జింజువ గడ్డిలో 12 శాతం ప్రోటీన్‌ ఉండడం ప్రత్యేకత. ఒకసారి నాటితే ఐదు ఆరు సంవత్సరాల పాటు దిగుబడి వచ్చే జింజువగడ్డిని పచ్చి మేతగానే కాకుండా ఎండబెట్టి, నిల్వ చేసి కూడా పశువులకు మేతగా వేయొచ్చు. జింజువ గడ్డిని పశువులకు చాపింగ్‌ అంటే ముక్కలుగా కోయకుండానే ఉన్నది ఉన్నట్లు వేయొచ్చు. సన్నగా ఉండే జింజువ గడ్డి తిన్న పశువులు ఎక్కువ పాల దిగుబడిని ఇస్తాయి. తద్వారా రైతుకు అధిక ఆదాయమూ వస్తుంది. జింజువ గడ్డిని నాలుగు ఎకరాల్లో సాగుచేసి, తన పాడి పరిశ్రమ నుంచి ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నారు కృష్ణా జిల్లా గంటసాలపాలెం రైతు ఉప్పల ప్రసాదరావు.జింజువ గడ్డి తిన్న పశువుల నుంచి పాల ఉత్పత్తి చాలా ఎక్కువ వస్తోందని ప్రసాదరావు తెలిపారు. ఈ గడ్డి తిన్న పశువులు వేసవికాలంలో పునరుత్పత్తి చేయడం కూడా రైతుకు కలిసివచ్చే అంశం అన్నారు. సాధారణంగా వేసవిలో పశువులు పునరుత్పత్తి చేయడం అంటే మాటలు కాదన్నారు. మంచి పోషక విలువలున్న గ్రాసం ఇస్తేనే పునరుత్పత్తి చేయగలవన్నారు. జింజువ గడ్డి తిన్నప్పుడు ఒక్కో గేదె ఆరు లీటర్ల పాలు ఇస్తే.. మరో దాణా వేసినప్పుడు నాలుగున్నర లీటర్లకు తగ్గిపోయిన విషయం గమనించామన్నారు. మళ్లీ జింజువ గడ్డి వేస్తే.. మళ్లీ పాల దిగుబడి పెరుగుతోందని చెప్పారు.పూర్వకాలంలో మొలవగడ్డి ఉండేది. మెట్ట ప్రాంతాల్లో, గట్ల మీద సహజసిద్ధంగా పెరిగేది. దానిలో ఎన్నో పోషక విలువలు ఉండేవి. ఆ గడ్డిని శాస్త్రవేత్తలు క్రాస్‌ చేసి జింజువ గడ్డిని రూపొందించారు. జింజువ గడ్డి ఒక్కో దుబ్బులో లెక్కలేనన్ని పిలకలు వస్తాయి. గడ్డి మొక్క సన్నగా ఉంటుంది. అందువల్ల కోసుకోవడం కూడా చాలా సులువు. ఎంతో రుచిగా ఉండే ఈ గడ్డిని పశువులకు వేస్తే.. ఒక్క పరక కూడా మిగల్చకుండా ఇష్టంగా తింటాయి. జింజువ గడ్డి తిన్న పశువులకు జీర్ణ సంబంధమైన ఇబ్బందులు రావు. కాకపోతే.. ఈ గడ్డిని పెంచేందుకు పశువుల ఎరువు బాగా ఎక్కువ వేయాల్సి ఉంటుందని ప్రసాదరావు వివరించారు. భూమిలో పోషక విలువలు ఉంటే గడ్డిలోకి వస్తాయని, ఈ గడ్డికి రసాయన ఎరువులు వేయకూడన్నారు.పశువుల కోసం తాను 48 ఏళ్లుగా పలు రకాల గ్రాసాలు వేసినట్లు ప్రసాదరావు చెప్పారు. తాను చూసిన అన్నింటి కంటే జింజువ గడ్డి చాలా మంచి రకం అన్నారు. మాగాణిలో కాకుండా ఒక వారం నీళ్లు ఉండి, మరో వారం లేని భూమిలో ఈ గడ్డి దిగుబడి అత్యధికంగా వస్తుంది. ఈ గడ్డిలో పీచు పదార్థం కాస్త తక్కువ. ఆకులో మాత్రం పీచు కొంచెం ఎక్కువ ఉంటుంది. సాగుచేసే మెళకువలు పాటిస్తే.. తక్కువ స్థలంలోనే అత్యధిక దిగుబడి వస్తుంది జింజువ గడ్డి. పాలడెయిరీ నిర్వాహకులకు జింజివ గడ్డి వరప్రసాదం అంటారు ప్రసాదరావు.రెండు విధానాల్లో జింజువ గడ్డిని నాటుకోవచ్చు. గడ్డిని ముక్కలు కోసి, ఒక కణుపు భూమిలో ఉండేలా నాటుకోవచ్చు. ఇలా నాటే విధానంలో ఖర్చు కాస్త ఎక్కువ వస్తోందన్నారు ప్రసాదరావు. అందుకే ఎకరానికి 10 ట్రక్కుల పెంట ఎరువు వేస్తానన్నారు. పెంటతో పాటు భూమిని బాగా ఎడాపెడా దున్నిస్తామన్నారు. దానిపైన రొటావేటర్‌ వేయిస్తామని చెప్పారు. కల్టివేటర్‌ నాగళ్లను ప్రతిసాలుకు 8 అంగుళాల దూరం ఉండేలా జరిపించి దున్నిస్తానన్నారు. కల్టివేటర్‌ చేసిన సాళ్లలో రెండు మూడు జింజువ గడ్డి పరకల చొప్పున పరిచి, వాటిపై మట్టి కప్పేసి, నీళ్లు పెడతామన్నారు. జింజువ గడ్డి మొదటిసారి ఎక్కువగా పెరగదు కాబట్టి ఎకరానికి ఐదారు కేజీల పిల్లిపెసర విత్తనాలు చల్లుతామన్నారు. రెండో కోత నుంచి జింజువ గడ్డి బాగా ఎత్తుగా అల్లుకుపోతుందని ప్రసాదరావు చెప్పారు. మొదటిసారి జింజువ గడ్డి 40 నుండి 45 రోజులకు కోతకు వస్తుంది. రెండోసారి నుంచి నెలనెలా కోత వస్తుందన్నారు.జింజువ గడ్డికి ఒక్క వేసవి కాలంలో మాత్రమే మనం నీటి సౌకర్యం కల్పించాలి. మిగతా కాలాల్లో అది సహజంగానే పెరిగిపోతుంది. ఏడాదికి ఎకరం భూమిలో 120 టన్నులకు తక్కువ కాకుండా దిగుబడి వస్తుందని ప్రసాదరావు వెల్లడించారు. ఒకసారి నాటితే నాలుగైదు ఏళ్ల వరకు జింజువ గడ్డి దిగుబడి తీసుకోవచ్చు.కేవలం దిగుబడినే ప్రామాణికంగా కాకుండా పశువుల ఆరోగ్యానికి మేలుచేస్తుంది జింజువ గడ్డి. తక్కువ ఖర్చు, అతి తక్కువ శ్రమ, ఎక్కువ దిగుబడితో పాటు రైతు రొక్కం.. పశువుకు బలాన్నిచ్చే జింజువ గడ్డి పాడి రైతులకు వరదాయనిగా చెప్పుకోవచ్చు.

 

 

Exit mobile version