Site icon V.E.R Agro Farms

కుప్పం ప్రకృతి పొలంలో అమెరికా విద్యార్థులు

విష రసాయనాలతో పండించిన పంటల ఆహారంతో విసిగిపోయిన ప్రజలు ప్రపంచవ్యాప్తంగా సహజ పద్ధతిలో పండిన పంటలే ఎక్కువగా వినియోగిస్తున్నారు. మన దేశంలో ప్రధాని మోడీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రకృతి పంటల సాగు రైతులకు సబ్సిడీలు, ఇతర విధానాల్లో చేయూత ఇస్తున్నారు. ప్రకృతి పంటలను బాగా ప్రోత్సహిస్తున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా అనేక విశ్వవిద్యాలయాలు ప్రకృతి పంటలపై పాఠ్యాంశాలు బోధిస్తున్నాయి. విద్యార్థులకు ప్రకృతి పంటల ప్రత్యేకత, విశిష్టత గురించి అవగాహన కల్పిస్తున్నాయి. నేరుగా ప్రకృతి పద్ధతి సాగు క్షేత్రాల్లోకి అధ్యయనం కోసం పంపిస్తున్నాయి. ప్రకృతి పంటల సాగు విధానాలపై అధ్యయం చేసేందుకు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని క్షేత్రాలను అమెరికాలోని ప్రెస్టిషియన్‌ యూనివర్శిటీ విద్యార్థులు సందర్శించారు. ఈ కార్యక్రమాన్ని రైతు సాధికార సంస్థ- AP కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్ (RYSS – APCNF) ఆధ్వర్యంలో జరిగింది.అమెరికా విద్యార్థులు శాంతిపురం మండలం ఎం.కే. పురం, రామకుప్పం మండలం చెల్దిగానిపల్లి, పెదగనూరు గ్రామాల క్షేత్రాలను పరిశీలించారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులతో వారు ప్రత్యక్షంగా మాట్లాడారు. ఆ రైతులు అనుసరిస్తున్న సాగు విధానాలు, పంటల నిర్వహణ, జీవామృతం, ఘనజీవామృతం, గో ఆధారిత వ్యవసాయ పద్ధతులు వంటి అంశాలను అడిగి తెలుసుకున్నారు. తర్వాత ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి, అక్కడ అమలవుతున్న విధానాలను పరిశీలించారు. రైతుల అనుభవాల గురించి అమెరికా విద్యార్థులు ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు.కుప్పం నియోజకవర్గంలో అమలవుతున్న ప్రకృతి వ్యవసాయ విధానం ఆదర్శప్రాయంగా ఉందని అమెరికా విద్యార్థులు ప్రశంసించారు. రైతులు అనుసరిస్తున్న పద్ధతులు పర్యావరణ పరిరక్షణతో పాటు ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తికి దోహదం చేస్తున్నాయని వారు అభిప్రాయపడ్డారు. కుప్పం ప్రకృతి వ్యవసాయ క్షేత్ర పర్యటన ద్వారా అనేక కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం లభించిందని వారు ఆనందం వ్యక్తం చేశారు.ప్రకృతి వ్యవసాయం అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి దూరదృష్టి, నాయకత్వం,  స్వర్ణ కుప్పం లక్ష్యాల గురించి ముఖ్య అతిథి, ఏఎంసీ చైర్మన్‌ వీ.రాజు వివరించారు. సహజ పంటల వ్యవసాయం ద్వారా రైతులకు ఆదాయం పెరుగుతుందని, భూమి ఆరోగ్యంగా మారి, సారవంతం అవుతుందని, ఇలాంటి పంటల ఆహారం తీసుకున్న ప్రజల ఆరోగ్యం మెరుగు అవుతున్నట్లు రాజు పేర్కొన్నారు.అమెరికా విద్యార్థుల పర్యటన కార్యక్రమంలో ఏఎంసీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు, శాంతిపురం,  రామకుప్పం మండలాల ప్రజాప్రతినిధులు, డీపీఎం అమృతవల్లి, నోడల్ అధికారి బాజీబాబు, APCNF క్షేత్రస్థాయి సిబ్బంది, FMTలు, సీఆర్‌పీలు, కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.

Exit mobile version