Site icon V.E.R Agro Farms

తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాల అశ్వగంధ

అశ్వగంధ మూలిక ఆయుర్వేదంలో అద్భుతం అంటారు. ఒత్తిడి కలిగించే కార్టిసాల్‌ హార్మోన్‌ స్థాయిలను తగ్గిస్తుంది. ఆందోళనను తగ్గిస్తుంది. శరీర శక్తిని పెంచుతుంది. అలసటను తగ్గిస్తుంది. మెరుగైన నిద్ర వచ్చేలా చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచి, కండరాలను బలంగా ఉంచుతుంది. హార్మోన్లను సమతుల్యం చేస్తుంది. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను పెంచుతుంది. మగవారిలో టెస్టోస్టిరాన్‌ లెవెల్స్ పెంచడం ద్వారా సంతానోత్పత్తిని మెరుగు పరుస్తుంది. ఒక టీస్పూన్‌ అశ్వగంధ పౌడర్‌ను రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలతో కానీ, తేనెతో కానీ కలిపి తీసుకోవచ్చు. అయితే.. గర్భిణులు, పాలు ఇచ్చే తల్లులు అశ్వగంధను తీసుకోకూడదు. డయాబెటిస్‌, బ్లడ్‌ప్రెషర్‌ మందులు వాడుతున్నవారు వైద్యుడి సూచన ఉంటేనే అశ్వగంధను వాడితే మంచిదని ఆరోగ్య నిపుణుల సూచన.

నల్లరేగడి నేలలు మాత్రమే అశ్వగంధ సాగుకు అనుకూలం. వర్షాలు బాగా కురిసినప్పుడు అశ్వగంధ దిగుబడి ఎక్కువ వస్తుంది. అశ్వగంధ సాగుకు పెట్టుబడి చాలా తక్కువ. అనంతపురం జిల్లా హనుమాపురం రైతు లాలూ మోహన్‌. ఆయన నాలుగు ఎకరాల్లో ఈ పంట ఎనిమిది ఏళ్లుగా సాగుచేస్తున్నారు. అశ్వగంధ విత్తనం మాత్రమే రైతులు కొనాల్సి ఉంటుంది. విత్తనాలు కిలో రూ.100 నుండి రూ.120 వరకు దొరుకుతాయి. ఎకరం భూమికి 8 కిలోల విత్తనాలు అవసరం అవుతాయి. ఈ పంటకు ఎరువులు ఏవీ వేయాల్సిన అవసరమే ఉండదు. ఎప్పటికప్పుడు కలుపు తీసేయాల్సి ఉంటుంది. కలుపు తీసేందుకు, పంట ఆఖరులో మొక్కలను పీకేందుకు కూలీల ఖర్చు అవుతుంది.ఎండాకాలంలో భూమిని బాగా దున్నుకొని విత్తనాలు నాటుకోవాలని లాలూ మోహన్‌ చెప్పారు. దుక్కి దున్నేటపుడు కానీ, ఆ తర్వాత కానీ ఎరువులు వేయనక్కరలేదన్నారాయన. నాటుకునే ముందు అశ్వగంధ విత్తనాలను శుద్ధి చేయాల్సిన అవసరం కూడా ఉండదు. విత్తనాలను ట్రాక్టర్‌ గొర్రుతో నాటుకుంటే భూమి అంతా సమానంగా పడతాయి. ఆగస్టు ఒకటో తేదీ నుంచి విత్తనాలు ఎప్పుడైనా వేసుకోవచ్చు. విత్తనాలు మొలిచిన తర్వాత 150 రోజులకు పంట కోతకు వస్తుంది. వర్షం కురిస్తే అశ్వగంధ విత్తనాలు పది రోజుల్లో మొలుస్తాయి. మొలిచిన తర్వాత ఐదు నెలల వరకు నీరు లేకపోయినా అశ్వగంధ మొక్కలు బతుకుతాయి. ఇది ఏడారి పంట కాబట్టి తక్కువ వర్షపాతం ఉన్నా సులభంగా పండుతుంది. అశ్వగంధ పంట సాగు చేసిన తర్వాత వేసే మరో పంటకు ఎలాంటి ఎరువుల అవసరం రాదు.అశ్వగంధ వేరును విరిచినప్పుడు గట్టిగా ఉంటే ధర ఎక్కువ వస్తుందని లాలూ మోహన్ చెప్పారు. నీరు ఎక్కువ ఇస్తే.. మొక్కలు ఎక్కువ ఎత్తు ఎదుగుతాయి. దాని వేరు లావు అవుతుంది. కానీ లోపల డొల్లగా మారుతుంది. అందువల్ల నీటి సదుపాయం చేయాల్సిన అవసరం కూడా ఉండదు. అశ్వగంధ మొక్కలకు పురుగులు ఆశించవు. కాబట్టి పెస్టిసైడ్స్‌ కొట్టాల్సిన అవసరం ఉండదు. ఈ మొక్కలను పశువులు తినవు. కాబట్టి కాపలా కాయాల్సిన, లేదా కంచె వేయాల్సిన ఖర్చు కూడా ఉండదు. వర్షాలు సరిపడినంతగా కురిస్తే.. అశ్వగంధ వేరు ఎండబెట్టిన తర్వాత దిగుబడి ఎకరాకు మూడు క్వింటాళ్ల వరకు వస్తుంది. లేకపోయినా రెండు క్వింటాళ్లకు తగ్గదు. వర్షాలు తక్కువ కురిసినప్పుడు అతి తక్కువ దిగుబడి ఒకటిన్నర క్వింటాళ్లే వచ్చినట్లు లాలూ మోహన్ చెప్పారు. అత్యధికంగా తనకు మూడు క్వింటాళ్ల 15 కిలోలు వచ్చిందన్నారు. అశ్వగంధ వేర్లను కట్‌ చేసిన తర్వాత పల్చగా వేస్తే.. ఐదారు రోజుల్లో ఎండిపోతుంది.అశ్వగంధ వేర్లను 2022లో క్వింటాలు రూ.29 వేలకు అమ్మినట్లు రైతు లాలూ మోహన్ తెలిపారు. ఆ తర్వాత ఎప్పుడూ రూ.22 వేలకు ధర తగ్గలేదన్నారు. తొలిసారి అశ్వగంధ పంటను బళ్లారి తీసుకెళ్లి రూ.18 వేలకు అమ్మినట్లు చెప్పారు. కొనుగోలు చేసేవారే చేను వద్దకు వచ్చి, డబ్బులు చెల్లించి వారే తీసుకెళతారు. తెలుగు రాష్ట్రాల్లో అశ్వగంధ కొనుగోలు చేసేందుకు సరైన మార్కెట్ లేదు. ఆసియాలోనే అది పెద్ద సుగంధ ద్రవ్యాల మార్కెట్‌ అయిన మధ్యప్రదేశ్‌లోని నీముచ్‌ మార్కెట్లో అశ్వగంధను అమ్ముకోవచ్చు.ఎకరం నేలలో అశ్వగంధ సాగుకు విత్తనం, ట్రాక్టర్‌ అద్దె, కటింగ్ కూలీలు అన్నీ కలుపుకొని రూ.18 వేల వరకు ఖర్చు అవుతుంది. వేళ్ల కొసలు కత్తిరించి, నిఖార్సయిన దుంప అమ్మితే రూ.35 వేలు వరకు ధర పలుకుతుంది. అశ్వగంధకు మార్కెట్‌లో క్వింటాలుకు రూ.20 వేలు వచ్చినా లాభదాయకమే అన్నారు లాలూ మోహన్‌. ఎకరాకు అత్యధికంగా రూ.20 వేలు ఖర్చు అయనా.. మూడు క్వింటాళ్లకు రూ.20 వేలు చొప్పున వచ్చాయని రూ.60 వేలు వస్తుంది. పెట్టుబడి రూ.20 పోయినా ఇంకా రూ. 40 వేలు లాభం వస్తుంది. ఇంత మొత్తంలో ఎకరం భూమిలో ఏ పంటకూ లాభం రాదని ఆయన చెప్పారు.అశ్వగంధ సాగు విషయంలో ఎలాంటి అనుమానాలు ఉన్న రైతు లాలూ మోహన్‌ను 8247728559 నెంబర్‌లో సంప్రదించవచ్చు.

 

 

 

Exit mobile version