Site icon V.E.R Agro Farms

పొలం కింద కోట్ల లీటర్ల జలనిధి

కొత్తగా ఉంది కదా.. పంటలు పండే భూమి కింద కోట్లాది లీటర్ల జలనిధిని దాచెపెట్టడం అంటే..! కానీ.. ఇది నిజంగా నిజం…! ప్రకృతిని సరిగా అర్థం చేసుకుంటే ఇది సాధ్యమే అని నిరూపించారు ఓ ఇంజనీర్‌ రైతు. వర్షపునీరు తమ పొలంలోకి ఇంకిపోయేలా అద్భుత ప్రయోగం చేసి, విజయం సాధించారు. భారీ వర్షాలు కురిసినప్పుడు వేగంగా ప్రవహిస్తూ సారవంతమైన మట్టిని లాక్కెళ్లిపోయే నీటిని తమ పంటపొలంలోకి మళ్లిస్తున్నారు. క్షేత్రంలో అక్కడక్కడా మట్టికట్టలు వేసి, నీరంతా ఒక్కసారిగా బయటికి వెళ్లిపోకుండా నిలుపుతున్నారు. ఆ నీరంతా వ్యవసాయ భూమిలోనే ఇంకిపోయేలా చేస్తున్నారు. రైతులు పొలంలో ఫామ్‌ బండ్‌లు నిర్మిస్తారు. కానీ ఈ రైతు మాత్రం తమ మొత్తం పొలాన్ని ఇంకుడుగుంతలా మార్చేశారు.

‘అద్భుతం జరిగే ముందు ఎవరూ గుర్తించరు.. అది జరిగాక గుర్తించాల్సిన అవసరం లేదు’ అనేది సూపర్‌స్టార్ మహేష్‌బాబు నటించిన ‘ఖలేజా’ సినిమాలోని అందరినీ ఆలోచింపజేసిన డైలాగ్‌. సమాజానికి మేలు చేసే ప్రతి మంచి ప్రయత్నాన్ని మనం సరైన సమయంలో గుర్తించాలి. ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా తడికలపూడి ఇంజనీర్‌ ప్రసాద్‌ తన పొలంలో చేసిన సక్సెస్‌ఫుల్‌ నీటి సంరక్షణ ప్రయోగం అలాంటి ఒక అద్భుతమే చెప్పాలి. ఒక వర్షాకాలపు సీజన్‌లో ఆయన లక్షలాది లీటర్ల నీటిని తమ వ్యవసాయ పొలంలో ఇంకిపోయేలా చేస్తున్నారు. తద్వారా పంట పొలం కింద జలనిధిని ఏర్పాటు చేశారంటే అతిశయోక్తి కాదు. ఒక ఎకరంలో సుమారు 29 లక్షల లీటర్ల నీరు ఇంకేలా చేశారు.మామూలుగా అయితే.. రైతులు సాగునీటి కోసం తమ వ్యవసాయ క్షేత్రాల్లో బోర్ బావులు తవ్వుతారు. లేదంటే పొలాల చివరలో చిన్న చిన్న గుంతలు ఏర్పాటు చేస్తారు. కానీ ప్రసాద్ అందుకు కాస్త విభిన్నంగా ఆలోచించారు. తమ పొలం చుట్టూరా, మధ్యలో నాలుగు నుండి ఐదు అడుగుల ఎత్తులో పెద్ద పెద్ద గట్లు ఏర్పాటు చేశారు. రోడ్డు మీదుగా వృథాగా వెళ్లిపోయే వర్షపు నీటిని కూడా తమ పొలంలోకి మళ్లిస్తున్నారు. నీరు ఎక్కడికక్కడ పంటభూమిలో నిలిచి ఉండేలా పైపులు, కట్టలు ఏర్పాటు చేశారు. క్రమేమీ ఆ నీరు వ్యవసాయ క్షేత్రంలోనే ఇంకిపోయే ఏర్పాటు చేశారు. సుమారు 3 ఎకరాల పొలంలో భారీ వర్షం పడినా ఒక్క నీటి చుక్క కూడా బయటకు పోకుండా లోపలే నిలిచేలా డిజైన్ చేశారు. రోడ్డు వెంబడి వృథాగా వెళ్లిపోయే వర్షపునీటిని పైపుల ద్వారా మళ్లించి, పొలం అంతా తిరిగేలా ప్రసాద్‌ ఏర్పాటు చేశారు. ప్రసాద్‌ తమ పొలం అంతటా నీరు సమానంగా వెళ్లేలా రెండు అంగుళాల సైజు పైపులు పరిచారు. ఇలా భూమి అంతా నీరు వెళ్లే చేయడం ద్వారా నేల పైనుంచి 100 అడుగుల లోతు వరకు నీరు నిల్వ ఉంటుంది.గడిచిన 30 సంవత్సరాలుగా ప్రసాద్‌ రసాయన ఎరువులు వాడడం లేదు. జీవ ఎరువులు మాత్రమే భూమికి ఇవ్వటం వల్ల ఆయన పొలంలోని మట్టి చక్కగా గుల్లగా తయారైంది. దీంతో ఆయన పొలంలో ఎంత నీరు నిలిచినా, కేవలం గంటన్నర సమయంలోనే మొత్తం భూమిలోకి ఇంకిపోతుంది. 2025లో ఏలూరు జిల్లాలో 722 మిల్లీమీటర్ల వర్షపాతం పడింది. అప్పుడు ఆయన ఒక్క ఎకరంలోనే దాదాపు 29 లక్షల లీటర్ల నీరు తమ పంటభూమిలో ఇంకిపోయేలా చేశారు. ఆ నీరు సంవత్సర కాలం పాటు సగటున 15 కుటుంబాల నీటి అవసరాలకు సరిపోతుందని చెప్పాలి.వ్యవసాయ క్షేత్రంలో కేవలం నీటిని నిల్వ చేయడంతోనే ఇంజనీర్ ప్రసాద్‌ ఆగిపోలేదు. తమ పొలంలో ఎంత వర్షం పడిందో కొలిచేందుకు ‘రెయిన్ గేజ్’ (Rain Gauge) అనే చిన్న పరికరం ఏర్పాటు చేశారు. వర్షం పడిన ప్రతిసారీ ఎన్ని మిల్లీమీటర్లు నమోదైందో క్రమం తప్పకుండా నోట్ చేస్తారాయన. ‘మనం భవిష్యత్ తరాలకు ఏమి ఇస్తున్నాం?’ అనే ప్రశ్నే ప్రసాద్‌ను ఈ సాంకేతిక పరికరం ఏర్పాటు చేసే బాధ్యతాయుతమైన మార్గం వైపు నడిపించింది.ప్రసాద్‌ భూమిలోకి ఇంకింపజేస్తున్న లక్షలాది లీటర్ల నీటితో కేవలం ఆయన పంటపొలం మాత్రమే కాకుండా చుట్టుపక్కల రైతుల బోర్లలోనూ నీటి మట్టాలు పెరిగాయి. తడికలపూడిలో  పచ్చని పంటలు పండుతున్నాయి. బోరు బావులు, కరెంట్ స్విచ్‌లపైనే ఆధారపడకుండా ప్రకృతి ప్రసాదించిన వాననీటిని భూమికి మళ్లీ చక్కగా అందజేయడమే అసలైన వ్యవసాయం అని ప్రసాద్ నిరూపించారు.రసాయన ఎరువులు వాడగా వాడగా భూమి గట్టిపడుతుంది. బల్లపరుపు రాయిలా మారుతుంది. భూమిని గుల్లగా జల్లెడలా చేసి, నీటిని లోపలికి ఇంకేలా చేసే వానపాములను సింథటిక్‌ ఎరువులు వాడి వాటిని చంపేసి, పంటపొలాల్లోనే పాతి పెట్టామని చెప్పొచ్చు. ఇలాంటి భూమిలో నీరు ఎలా ఇంకుతుంది? ఎలా ఇంకుతుంది? ఎంత వర్షం కురిసినా బండరాయి మీద పడినట్లుగా కిందకి జారిపోతుంది. ఇంజనీర్ ప్రసాద్‌లా ఎంతమంది రైతులు ఆలోచిస్తారనేది ప్రశ్న.సహజ వనరులను విచ్చలవిడిగా వాడేస్తున్న ఈ కాలంలో 60 ఏళ్ల వయస్సులో కూడా ప్రసాద్ చూపిస్తున్న ఉత్సాహం రైతుల్లో స్ఫూర్తి నింపుతుంది. సమాజం పట్ల ఆయనకు ఉన్న బాధ్యత వెలకట్టలేనిది. దేశంలోని అన్ని గ్రామాల్లోనూ ప్రతి రైతు ఇంజనీర్ ప్రసాద్‌లా ఆలోచిస్తే అసలు నీటి కొరతే రాకపోవచ్చు. భావి తరాలకు మనం ఇవ్వగల గొప్ప కానుక భూగర్భ జలాలే అని ప్రసాద్‌ ప్రయోగం చాటిచెబుతోంది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు సరిగా కురవక, భూగర్భ జలాలు కూడా ఊహించని విధంగా అడుగంటిపోతున్న ఇలాంటి సమయంలో ప్రసాద్‌ మోడల్‌ నీటి సంరక్షణ చక్కగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు.

వివరాలు తెలుసుకోవాలంటే.. ఇంజనీర్ ప్రసాద్‌ ఫోన్‌: 9441781397 లో సంప్రదించవచ్చు.

 

 

 

 

 

Exit mobile version