నీలగిరి చెట్లను జామాయిల్ అని, ఇంగ్లీషులో యూకలిప్టస్ అని పిలుస్తారు. నీలగిరి చెట్టు గుజ్జును కాగితం తయారీలో వినియోగిస్తారు. ఇంధనంగా దీని కలప పనికి వస్తుంది. ఇంటి నిర్మాణంలో స్తంభాలుగా నీలగిరి చెట్లు ఉపయోగపడతాయి. నీలగిరి ఆకుల నుంచి తీసిన తైలంలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. నీలగిరి ఆకుల నూనెను కొవ్వును కరిగించేందుకు, కీళ్ల నొప్పుల నివారణకు వాడతారు. నీలగిరి ఆయిల్ నొప్పిని నివారిస్తుంది. చర్మ వ్యాధులు, శ్వాసకోశ సమస్యలు తగ్గించేందుకు వాడతారు. నీలగిరి ఆకులు క్రిమి సంహారిణిలుగా, సువాసన కోసం వినియోగిస్తారు. నీలగిరి చెట్లు గాలిని శుద్ధి చేసి, కాలుష్జాన్ని నియంత్రిస్తాయి. నీలగిరి ఆకులు, వేళ్లు, చెట్టు బెరడు ఆయుర్వేద మందులు తయారీలో ఉపయోగపడతాయి. సుగంధ ద్రవ్యాల తయారీలో వాడతారు. చల్లగా ఉండే నీలగిరి కొండల్లో పెరగడంతో వీటికి నీలగిరి చెట్లు అని పేరు వచ్చింది.
పంటలు పండించేందుకు పనికిరాని కొండలు, రాళ్లతో నిండిన నేలల్లో నీలగిరి చెట్లు సులువుగా, చాలా వేగంగా పెరుగుతాయి. ఒక్కో చెట్టు నిటారుగా దాదాపు 15 నుంచి 20 మీటర్ల ఎత్తు వరకు పెరిగిపోతుంది. నీలగిరి మొక్కల పెంపకానికి ఖర్చు, శ్రమ కూడా చాలా తక్కువ. ఎకరం భూమిలో 700 వరకు నీలగిరి మొక్కలు నాటుకోవచ్చు. వీటిని ఐదు నుంచి ఏడేళ్ల వయస్సు వచ్చే వరకు పెరగనిస్తే.. 2.800 టన్నుల వరకు కలప దిగుబడి వస్తుంది. టన్ను నీలగిరి కలపకు కనీసం రూ.450 చొప్పున ధర వచ్చినా రూ.12 లక్షల వరకు ఆదాయం వస్తుంది. నీలగిరి చెట్టును మొదట్లో కట్ చేస్తే.. దాన్నుంచి మళ్లీ చిగుర్లు వస్తాయి.
నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలోని వట్టిపల్లి రైతు వెంకటరెడ్డి ఐదున్నర ఎకరాల్లో జామాయిల్ తోట పెంచుతునున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ప్రాంతంలోని నర్సరీ నుంచి తాను జామాయిల్ మొక్కలు తెచ్చుకున్నట్లు చెప్పారు. ఒక్కొక్క మొక్క ఖరీదుకు, రవాణాకు రూ.6.50 నర్సరీవారు తీసుకున్నారన్నారు. మొత్తం 8,500 మొక్కలు నాటినట్లు చెప్పారు. మొక్కలు నాటుతున్న సమయంలో నీటి సరఫరా కోసం డ్రిప్ ద్వారా నీటిని అందించినట్లు తెలిపారు. సాళ్ల మధ్య బోదెలలో నీళ్లు నిల్వ ఉండేలా చూడాలన్నారు. నీరు ఎంతగా తీసుకుంటే అంత త్వరగా నీలగిరి మొక్కలు పెరుగుతాయన్నారు. నీలగిరి మొక్కలు నెలకు ఒక అడుగు చొప్పున ఎదుగుతాయి. తాను నాటిన మొక్కలు మాత్రం రెండున్నర నెలల్లోనే మూడు అడుగులు పెరిగాయని వెంకటరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. నీలగిరి మొక్కలకు అన్ని ఖర్చులతో కలిపి పెట్టిన పెట్టుబడికి లాభమే గానీ నష్టం రాదని చెప్పారు.

