Site icon V.E.R Agro Farms

మామిడి సాగుకు ప్రభుత్వ బీమాతో ధీమా!

వాతావరణంలో మార్పు చోటుచేసుకున్నప్పుడు మామిడి పంట సాగు చేస్తున్న రైతులు నష్టాల పాలవుతున్నారు. మామిడిచెట్లకు పూత పూసినప్పుడు కురిసే మంచు వల్ల, కాయలు కోతకు వస్తాయనే సమయంలో వచ్చే అకాల గాలి, వాన, తుఫాన్‌లు, వడగళ్ల వానలతో నష్టాలు వస్తున్నాయి. అలాగే ఉష్ణోగ్రతలో తీవ్ర హెచ్చు తగ్గులు సంభవించినప్పుడు కూడా మామిడి రైతుకు కష్టాలు తప్పడం లేదు. ఇలాంటి వాతావరణ ఆధార పంటలకు బీమా పథకం, ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజన ద్వారా మామిడి రైతులకు ఆర్థికంగా రక్షణ ఉంటుంది. ఇదే క్రమంలో 2026-27 సంవత్సరంలో మామిడి రైతులకు పంటల బీమా పథకం చక్కగా ఆదుకుంటుంది.

ఈ క్రమంలో ఈ ఏడాది మామిడి రైతులకు ప్రభుత్వం బీమా భరోసా కల్పిస్తోంది. పంటల బీమా పథకం కింద ఎకరాకు 35 వేల రూపాయల వరకు మామిడి రైతుకు రక్షణ లభించే అవకాశం కల్పించింది. మామిడి రైతులు ఎకరాకు రూ. 1,650 నుంచి రూ.2,250 వరకు ప్రీమియం చెల్లించి ఈ బీమా పొందవచ్చు. పంటల బీమా ద్వారా మామిడి పంటకు పెట్టుబడులు పెట్టి, పంట చేతికి వచ్చే సమయంలో వాతావరణం దెబ్బతో నష్టపోయే రైతులకు ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పిస్తోంది. అకాల వర్షాలు, ఉష్ణోగ్రతల్లో మార్పులు, బలమైన గాలులు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుంచి మామిడి తోటలను కాపాడేందుకు 2026-27 సంవత్సరానికి పంటల బీమా పథకాలను ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం, ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పరిధిలో మామిడి పంటకు బీమా సౌకర్యం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఈ పథకం కింద మామిడి రైతులు ఎకరాకు అత్యధికంగా రూ.35 వేల వరకు బీమా రక్షణ పొందవచ్చు. దీని కోసం రైతులు తమ వాటాగా ఎకరాకు రూ.1,650 నుంచి రూ.2,250 వరకు ప్రీమియం చెల్లించాలి. సగటున రూ.1,750 ప్రీమియంతో పంటకు బీమా రక్షణ పొందే అవకాశం ఉంది. బీమా నిబంధనలకు అనుగుణంగా వాతావరణ పరిస్థితుల వల్ల పంటకు నష్టం వాటిల్లినప్పుడు అర్హులైన రైతులకు ఈ పరిహారం అందుతుంది.అయితే.. మామిడి పంట విషయంలో వేర్వేరు వాతావరణ పరిస్థితులకు ప్రత్యేక కాలపరిమితులు నిర్ణయించింది ప్రభుత్వం. అకాల వర్షాలు, అధిక వర్షపాతం వల్ల కలిగే నష్టాలకు 2026 డిసెంబర్ 15 నుంచి 2027 ఫిబ్రవరి 28 వరకు ఈ బీమా వర్తిస్తుంది. ఇదే సమయంలో తెగుళ్లు, చీడపీడలు వ్యాప్తి చెందడానికి అనుకూలించే వాతావరణ పరిస్థితులనూ బీమా పరిధిలోకి వస్తాయి. ఉష్ణోగ్రతల్లో ఆకస్మికంగా హెచ్చు తగ్గులు ఏర్పడినప్పుడు మామిడి పంటకు వచ్చే నష్టాలకు 2027 జనవరి 1 నుంచి మార్చి 15 వరకు బీమా రక్షణ కల్పిస్తుంది. అధిక వేగంతో వీచే గాలుల వల్ల మామిడి పంటకు నష్టం జరిగితే 2027 మార్చి 1 నుంచి మే 31 వరకు నిర్ణయించిన సమయంలో బీమా వర్తిస్తుంది.పంటల బీమా పథకంలో చేరాలంటే రైతులు 2026 డిసెంబర్ 31 లోగా నిర్ణీత ప్రీమియం చెల్లించి, తమ వివరాలు నమోదు చేసుకోవాలి. గడువు ముగిసిన తర్వాత ప్రీమియం చెల్లించేందుకు, వివరాలు నమోదు చేసుకునేందుకు అవకాశం ఉండకపోవచ్చు. అర్హులైన మామిడి సాగుదారులు ఆఖిరి గడువు దాకా చూడకుండా ముంద దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ఉద్యానవర శాఖ సూచించింది.

ఎలా నమోదు చేసుకోవాలి?:

రైతులు మొబైల్ యాప్ ‘PMFBY Crop Insurance Farmer’ ద్వారా స్వయంగా దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా సేవా కేంద్రాలైన కామన్ సర్వీస్ సెంటర్లు (CSC), సంబంధిత బ్యాంకులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఆథరైజేషన్‌ ఉన్న బీమా ప్రతినిధుల ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చు. ఇంకా ప్రభుత్వ సేవలైన గ్రామ, మండల ఉద్యానవనశాఖ అధికారులు, రైతు సేవా కేంద్రాల సహాయకులను సంప్రదించి కూడా దరఖాస్తు చేయొచ్చు.పంటల బీమా పథకానికి దరఖాస్తు చేసేందుకు ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఆధార్ కార్డు జెరాక్స్‌ కాపీ, బ్యాంకు ఖాతా వివరాలతో కూడిన పాస్‌బుక్ జిరాక్స్, భూమి పాస్‌బుక్ లేదా 1-బీ నకలు, మామిడి పంట సాగు చేస్తున్నట్లు సొంత ధ్రువీకరణ పత్రం, కౌలు రైతులైతే కౌలు గుర్తింపు పత్రం, మొబైల్ నంబర్, పాస్‌పోర్ట్ సైజు ఫొటోను సిద్ధంగా ఉంచుకోవాలి. మామిడి పంట నష్టపోయిన తర్వాత బాధపడే బదులు ముందుగానే బీమా పరిధిలోకి వెళ్తే రైతులకు మేలు జరుతుంది. ఈ పథకం ద్వారా లబ్ధి పొందడానికి రైతులు గడువు లోగా ప్రీమియం చెల్లించి, తమ తోటల వివరాలు నమోదు చేసుకోవడం చాలా ముఖ్యం అని గమనించాలని ఉద్యానవన శాఖ అధికారులు సూచించారు.

Exit mobile version