పోషకాలు, ఆరోగ్యాల గని గెనిసిగడ్డ (చిలగడదుంప- Sweet Potato). దీనిలో బీటా కెరోటిన్ ఎక్కువ. దీన్ని ఆహారంగా తీసుకుంటే శరీరం లోపల విటమిన్ ‘ఏ’గా మారుతుంది. కంటి చూపు మెరుగవుతుంది. రేచీకటి రాకుండా రక్షిస్తుంది. గెనిసిగడ్డలోని విటమిన్ ‘సీ’, యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో తెల్ల రక్తకణాలను పెంచుతాయి. సీజనల్‌గా వచ్చే జలుబు, దగ్గు రాకుండా చేస్తాయి. గెనిసిగడ్డలో కరిగిపోయే, కరగని పీచుపదార్థం ఉంటుంది. మలబద్ధకం నివారణకు, జీర్ణక్రియ చక్కగా జరిగేలా పనిచేస్తాయి. గ్యాస్, ఉబ్బరాలను గెనిసిగడ్డ దరిచేరనివ్వదు. దీనిలో ఉండే పొటాషియం, మెగ్నీషియం రక్తనాళాలపై ఒత్తిడిని తగ్గిస్తాయి. బ్లడ్‌ప్రెషర్‌ను కంట్రోల్ చేస్తాయి.
చిలగడదుంపల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ. అందుకే రక్తంలో సుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరిగిపోకుండా నెమ్మదిగా విడుదల చేస్తాయి. చిలగడదుంపలు ఆహారంగా తీసుకుంటే దీనిలోని ఫైబర్‌తో కడుపు త్వరగా నిండినట్లు అవుతుంది. తద్వారా ఎక్కువగా ఆహారం తినకుండా చేసి, బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది. గెనిసిగడ్డలోని యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి. గుండెను పదిలంగా ఉంచుతాయి. చిలగడదుంపల్లో లభించే ఫైటో ఈస్ట్రోజెన్లు హార్మోన్లను సమతుల్యం చేస్తాయి. దీనిలోని మాంగనీస్, విటమిన్ ‘సీ’ ఎముకలను దృఢంగా ఉంచుతాయి.
సుధాకర్‌రెడ్డి వ్యవసాయంలో అదును చూసి పంటల సాగు చేస్తారు. ఏప్రిల్ నెలలో వంకాయ పంట పూర్తయిన తర్వాత భూమి సారాన్ని కాపాడేందుకు ‘పంట మార్పిడి’ విధానం పాటిస్తారు. అక్టోబర్, నవంబర్ నెలల్లో వర్షాధార పంటగా చిలగడదుంపల సాగు ప్రారంభిస్తారు. అక్టోబర్‌లో విత్తనం నాటితే సంక్రాంతి, శివరాత్రి పండుగల సీజన్‌కు పంట చేతికి వచ్చేస్తుంది. పండుగల సమయంలో చిలగడదుంపలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. దీంతో మంచి లాభాలు కూడా వస్తాయి.
గెనిసిగడ్డ సాగుకు రాళ్లు లేని, గుల్లగా ఉండే ఎర్రనేలలు అనుకూలంగా ఉంటాయి. బంకమట్టి లేదా నల్లరేగడి నేలల్లో దుంపలు సరిగ్గా ఊరవు, తవ్వడానికి కష్టంగా ఉంటుంది. విత్తనాలు విత్తే ముందు ఎకరాకు నాలుగైదు ట్రాక్టర్ల పశువుల ఎరువు వేసి, నేలను బాగా దున్నాలి. మట్టి ఎంత మెత్తగా, గుల్లగా ఉంటే దుంప అంత ఎక్కువ లావుగా పెరుగుతుంది. ఈ పంటకు నర్సరీల నుండి మొక్కలు కొనకుండా, సొంతంగా పెంచుకున్న తీగలనే జానెడు పొడవున కత్తిరించి నాటుకుంటే మంచి ఫలితం వస్తుంది. మొక్క తీగ ముక్కలు నాటేందుకు ఎకరానికి 20 నుండి 25 మంది కూలీలు అవసరం అవుతారు.
చిలగడదుంపల సాగు చేస్తే కేవలం భూమిలో పెరిగే దుంపలే కాకుండా, పైన పెరిగే తీగలు కూడా రైతుకు చక్కని ఆదాయం ఇస్తాయి. ఒక రోజుకు సుమారు 20 సెంట్ల భూమిలో చిలగడదుంపలు తవ్వితే 1.5 నుండి 2 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. ఈ దుంపలను పరిమాణాన్ని బట్టి గ్రేడింగ్ చేసి మార్కెట్లకు తరలించాలి. దళారుల బారిన పడకుండా స్వయంగా మార్కెట్‌కు తీసుకెళితే మంచి ఆదాయం చేతికివస్తుంది.
గెనిసిగడ్డ తీగలు పశువులు ఇష్టంగా తినేందుకు మెత్తని, బలమైన ఆహారం. ఈ తీగలను తిన్న పశువుల్లో పాల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుంది. ఉదాహరణకు 2 లీటర్ల పాలు ఇచ్చే ఆవు 3 లీటర్ల వరకు ఇస్తుంది. అందుకే స్థానిక పాడి రైతులు స్వయంగా పొలానికి వచ్చి, తీగలను కోసుకుని దుంపలను తవ్వి ఇవ్వడంలో సహాయపడతారు. దీనివల్ల రైతుకు కూలీల ఖర్చు కూడా ఆదా అవుతుంది.
చిలగడదుంపల సాగు లాభసాటిగా ఉన్నా కొన్ని ప్రాథమిక సమస్యలు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా కౌలు భూముల సమస్య. కౌలుకు తీసుకున్న భూమికి ఏటేటా లేదంటే ముందుగా ఒప్పుకున్న కాలమానం ప్రకారం కౌలు రేటు పెంచాలి. దీంతో చిలగడదుంపల సాగు చేసే కౌలు రైతుకు భద్రత అంతగా ఉండదు. అందుకే కౌలు కాలాన్ని కనీసం 5 నుండి 10 ఏళ్లకు పెంచితే రైతులు భూమిని మరింత అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. లేదా సొంత భూమిలో సాగు చేస్తే మరింత ఉపయోగం ఉంటుంది. ఉద్యానవన, వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, ప్రభుత్వ సబ్సిడీలు, పంట బీమా పథకాలపై రైతులకు అవగాహన కల్పిస్తే బాగుంటుంది. ఎలుకలు, పందులు, కోతుల నుండి పంట రక్షణ కోసం పొలం చుట్టూ భద్రత కోసం కర్రల స్తంభాలు పాతి, దారాలు, పాత చీరలు కట్టి నిరంతరం కాపలా కాస్తే ఫలితం బాగుంటుంది.

