Site icon V.E.R Agro Farms

పిండితో పంటే పంట!

మిద్దె తోటలో పంటలు సాగుచేసే ఔత్సాహికులకు ఆశ్చర్యం కలిగించే పోషక ఎరువు గురించి తెలుసుకుందాం. మొలకలు వచ్చే పది రకాల గింజలను మెత్తగా పౌడర్‌గా చేసుకుని దాన్ని నీటిలో కలిపి కంటైనర్లు, లేదా గ్రో బ్యాగ్‌లలోని మొక్కలు, తీగ పాదులకు స్ప్రే చేసుకుంటే ఊహించిన దాని కంటే ఎక్కువ దిగుబడి వస్తుంది. అది కూడా ఆరోగ్యకరమైన పండ్లు, కూరగాయలు, పూలు మనకు అందిస్తుంది. విత్తనాల పిండిని మొక్కల మొదళ్లలో మట్టిలో వేసుకునే కంటే స్ప్రే చేసుంటే మరింత మంచి ఫలితం వస్తుంది.మొక్కలకు బలవర్ధకమైన పోషకాహార ఎరువు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటంటే.. పెసలు, మినుములు, నువ్వులు, ఉలవలు, ఆవాలు, వేరుశనగ గుళ్లు, బొబ్బర్లు, అలసందలు, గోధుమలు, పందిరిచిక్కుడు లాంటి చిక్కుడు జాతికి చెందిన గింజలు, ఆయిల్‌ ఎక్కువ ఉండే గింజలు తీసుకోవాలి. వీటితో పాటు ఆముదం గింజలు, వేపగింజలు, కానుక గింజలను ఈ పిండి ఎరువులో కలిపి తయారు చేసుకుని వాడితే ఈ మిశ్రమం మంచి ఫెస్టిసైడ్‌గా, ఫెర్టిలైజర్‌గా పనిచేస్తుంది. ఈ మిశ్రమం వాడిన మొక్కలు ఎంతో ఆరోగ్యంగా, ఏపుగా ఎదుగుతాయి. దిగుబడి అదే రేంజ్‌లో అందిస్తాయి.ఒక్కోరకం గింజలను 100 వంద గ్రాముల చొప్పున తీసుకొని, ఫ్లోర్‌ మిల్లులో మెత్తగా పట్టించాలి. ఇంట్లో మిక్సీలో కూడా పిండి చేసుకోవచ్చు కానీ.. పైన చెప్పిన మోతాదులో రెండు మూడు కిలోల పిండిని తయారు చేసుకుంటే.. నిల్వ ఉంచుకుని దఫ దఫాలుగా మొక్కలకు అందించవచ్చు. పది రకాల గింజల పౌడర్‌ను నెలకు ఒకసారి మొక్కలకు స్ప్రే చేసినా సరిపోతుంది.  అర కిలో గింజల పిండి మిశ్రమానికి 50 లీటర్ల నీరు కలుపుకోవాలి. ఈ పిండితో ద్రావణంలో మొక్కలకు అవసరమైన అన్ని పోషకాలు, సూక్ష్మ పోషకాలు సమృద్ధిగా అందుతాయని మిద్దెతోట గార్డెనింగ్‌లో ఎంతో అనుభవం ఉన్న బొడ్డేపల్లి అరుణ వివరించారు.ఐదు లీటర్ల వేస్ట్‌ డీ కంపోజ్‌ ద్రావణంలో అరకిలో గింజల పౌడర్‌, కార్బన్‌, పొటాషియం ఉండి మొక్కలకు చాలా సహాయం చేసే 50 గ్రాముల కట్టెల బూడద కలుపుకోవాలి. వేస్ట్‌ డీ కంపోజ్‌ ద్రావణం, గింజల పొడి, బూడిదను ఒక కట్టెతో బాగా కలపాలి. మిశ్రమం ఉన్న డబ్బాకు కొద్దిగా గాలి తగిలేలా చిన్నమూతతో గాని, పల్చటి బట్టతో కానీ కప్పాలి. ఈ మిశ్రమాన్ని రోజూ ఒకసారి కలుపుతూ ఉండాలి. ఏడు రోజులు కలిపేసరికి బాగా పర్మంటేషన్ అవుతుంది. ద్రావణం పైన తెట్టులా వస్తుంది. ఇందులో హెల్దీ బ్యాక్తీరియా బాగా అభివృద్ధి చెందుతుంది.చిన్న చిన్న మొక్కలకు కూడా అంచనాలకు మించి పూత వస్తుంది. కాయలు, పండ్లు, పువ్వులు గుత్తులు గుత్తులుగా వస్తాయి. మొక్క నాటిన తొలి రోజుల్లో 15 రోజులకు ఒకసారి, పూత, కాయ వచ్చే దశలో నెలకు ఒకసారి ఈ ద్రావణాన్ని స్ప్రే చేసుకుంటే మొక్కలు చాలా ఆరోగ్యంగా, పచ్చగా ఎదుగుతాయి. స్ప్రే చేసిన తర్వాత మొక్క సైజును బట్టి దాని మొదట్లోని మట్టిలో కూడా అర లీటర్ నుంచి లీటర్ వరకు ఈ ద్రావణం వేసుకోవచ్చు. దీన్ని వేయడం వల్ల మట్టి బాగా గుల్లగా అవుతుంది. వేరు బాగా పెరుగుతుంది. మొక్క ఎదుగుదలకు సాయపడుతుంది.గింజల పౌడర్‌తో తయారు చేసుకున్న మిశ్రమ ద్రావణాన్ని 40 శాతం, 60 శాతం నీటిలో కలిపి, ఫిల్టర్ చేసుకొని, స్ప్రే చేయడం వల్ల మొక్కలు, పాదులకు పూత రాలిపోకుండా బాగా వస్తుంది. పూలు, కాయలు, పండ్ల దిగుబడి ఎక్కువ వస్తుంది. వాటి సైజ్‌ కూడా బాగా ఉంటుంది. కాయలు చిన్నప్పుడే పసుపురంగులో మారి రాలిపోకుండా కాపాడుతుంది. ద్రావణాన్ని మొక్కల ఆకులు తడిసేలా సాయంత్రం 6 దాటిన తర్వాత స్ప్రే చేసుకుంటే పచ్చగా ఉంటాయి. గింజల పొడి ద్రావణంతో ఐరన్‌, మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం, ఫాస్పరస్‌ సహా అనేక పోషకాలు మొక్కలకు సమృద్ధిగా అందుతాయి. వేస్ట్‌ డీ కంపోజ్‌ ద్వారా నైట్రోజెన్‌, సల్ఫర్‌, బోరాన్ అందుతాయి. గింజలపొడితో చేసిన ద్రావణం ద్వారా మొక్కలకు కావాల్సిన మైక్రో, మేక్రో పోషకాలన్నీ అందుతాయి. మొక్కలకు అన్ని రకాల లోపాలను ఈ ద్రావణం నివారిస్తుంది. మొక్కల ఎదుగుదలకు సహాయపడుతుంది. చక్కని దిగుబడి వచ్చేలా చేస్తుంది.

Exit mobile version