ఏ రకం మొక్కలైనా ఎకరం భూమిలో 500 మొక్కలు నాటడం, అధికదిగుబడి తీయడం ఇజ్రాయెల్ సాంకేతిక విధానం. దీన్నే హైడెన్సిటీ సాగు విధానం లేదా అధిక సాంధ్రత వ్యవసాయం అంటారు. తక్కువ భూమి నుంచి, డ్రిప్ ఇరిగేషన్ ద్వారా తక్కువ నీరు అందించి, ఎక్కువ దిగుబడులు సాధించడం ఇజ్రాయెల్ టెక్నాలజీ సాగు పద్ధతి ప్రత్యేకత. ఇలా హైడెన్సిటీ వద్ధతిలో పలు రకాల పండ్ల మొక్కల సాగు చేస్తున్నారు కపిల్ ఆగ్రో ఫార్మ్ నిర్వాహకులు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా, మొయినాబాద్ మండలం శ్రీరామ్‌నగర్ సమీపంలో ఉన్న సుమారు 200 ఎకరాలు ఉన్న పామ్‌లో మొత్తం 14 రకాల పండ్ల తోటలు పెంచుతున్నారు. దీంతో పాటు కూరగాయలు, ఆకుకూరలు, డెయిరీ ఫాం నిర్వహిస్తున్నారు. ఈ క్షేత్రంలోని 100 ఎకరాల్లో వారు హైడెన్సిటీ పద్ధతిలో రకరకాల పండ్ల మొక్కలను ఏడేళ్లుగా పెంచుతున్నారు.
హైడెన్సిటీ ఫార్మ్ పనులు 2013లో ప్రారంభించినా 2016లో ప్లాంటేషన్ చేసినట్లు సీనియర్ శాస్త్రవేత్త సురేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. ఫార్మ్‌లో ఐదు ఎకరాల్లో హైడెన్సిటీ పద్ధతిలో లక్నో 49, అలహాబాద్ సఫేద్ వెరైటీ జామ మొక్కలు పెంచుతున్నట్లు చెప్పారు. జామ మొక్కలను వరుసల మధ్య 16 అడుగులు, మొక్కల మధ్య 5 అడుగుల దూరంలో నాటినట్లు తెలిపారు. మొక్కలు నాటిన మూడో ఏట తొలిసారి ఎకరానికి 6 టన్నుల దిగుబడి వచ్చింది. అప్పటి నుంచి ప్రతి ఏటా దిగుబడి పెరుగుతోందన్నారు.జామ ఫ్రూటింగ్ అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు వస్తుంది. మామిడి ఏప్రిల్ నుంచి జూన్ వరకు పంట వస్తుంది. నీటి సౌకర్యాన్ని బట్టి తాము ఎక్కడెక్కడ ఏ పండ్ల మొక్కలు నాటాలో ఆలోచించి వేశామని సురేంద్రనాథ్‌రెడ్డి చెప్పారు. ఎండాకాలం పంట కాబట్టి మామిడికి అంతగా నీటి అవసరం ఉండదన్నారు. ఏ సమయంలో ఏ రకం మొక్కలకు ఎక్కువ నీరు అవసరమో వాటికి మాత్రమే ఇస్తున్నట్లు చెప్పారు. అన్ని మొక్కలకు అవసరం లేకపోయినా నీటిని ఇవ్వడం వృథా అనేది ఇజ్రాయెల్ టెక్నాలజీ విధానం అన్నారు.మామిడిలో బంగినపల్లి సహా 4 రకాల మొక్కలను పరిశోధన పద్ధతిలో అభివృద్ధి చేసినట్లు కపిల్ ఆగ్రో ఫార్మ్ సీనియర్ సైంటిస్ట్ సురేంద్రనాథ్‌రెడ్డి చెప్పారు. రెండేసి ఎకరాల్లో ప్రతి వెరైటీని ఎకరానికి అటు వైపు ఒక రకం, ఇటు వైపు మరో రకం వేశారు. హెక్టారులో అటు వైపు ఒక రోడ్డు ఇటు వైపు ఒక రోడ్డు వేయగా నికరంగా రెండు ఎకరాలలో మొక్కలు నాటినట్లు చెప్పారు. ఇజ్రాయెల్‌లో మామిడి చెట్ల నుంచి ఎకరానికి 22 టన్నుల దిగుబడి వస్తోందని తెలిపారు. అక్కడి వాతావరణం, వారి సాగు వెరైటీలు వేరు. మన దగ్గర కనీసం 9 టన్నులైనా దిగుబడి తీయాలనే ఉద్దేశంతో ఒక రీసెర్చ్ ఫార్మ్‌లా తాము కృషిచేస్తున్నామన్నారు. బంగినపల్లి చెట్లకు ప్రతి రెండు నెలలకు కొత్త చిగుర్లు వస్తుంటాయి. దాంతో తాము ఎప్పటికప్పడు ప్రూనింగ్ చేస్తూ చెట్టు ఎక్కువ ఆకులతో గుబురుగా మారకుండా నియంత్రిస్తున్నట్లు చెప్పారు. మామిడి పంట అయిపోయిన వెంటనే ప్రూనింగ్ చేయాలన్నారు.రెండెకరాల్లో దసేరి రకం మామిడి పండిస్తున్నారు. దీని ఆకులు తక్కువ ఉండి, కాపు ఎక్కువ వస్తుంది. దీని కాయలు కాస్త చిన్నగా ఉంటాయి. ఎకరానికి 6.5 టన్నుల వరకు దిగుబడి వస్తోంది. ఉదయం పూట తూర్పు వైపు, సాయంత్రం పశ్చిమ దిక్కున ఎక్కువగా ఉన్న కొమ్మలు, ఆకులను ప్రూనింగ్ చేయాలి. పై నుంచి సూర్యరశ్మి ప్రతి కొమ్మకు బాగా తగిలేలా చెట్టుపైన ప్రూనింగ్ చేస్తారు.పాత పద్ధతిలో ఎక్కువ దూరంలో మామిడి మొక్కలు నాటిన రైతులకు జాతీయ సగటున ఒకటిన్నర నుంచి రెండు టన్నుల దిగుబడి మాత్రమే వస్తోందని సురేంద్రనాథ్‌రెడ్డి చెప్పారు. గతంలో రైతులు ఎకరంలో 40 నుంచి 50 మొక్కలు నాటేవారు. ఇప్పుడు 100 మొక్కల వరకు వేస్తున్నారు. హై డెన్సిటీ విధానంలో మొక్కలు నాటి, తమ తోటలో ఎకరం నుంచి ఏడేళ్లకే మూడు టన్నుల వరకు దిగుబడి తీస్తున్నట్లు తెలిపారు. తామైతే ఎకరంలో మామిడి, సపోటా, జామ, సీతాఫలం ఇలా ఏ మొక్కలైనా 500 నాటినట్లు చెప్పారు.సపోటా కూడా ఇదే విధానంలో వరుసల మధ్య 16 అడుగులు, మొక్కల మధ్య ఐదు అడుగుల దూరంలో నాటారు. కపిల్ ఆగ్రో ఫార్మ్‌లో కాలాపత్తి సపోటా పెంచుతున్నారు. సపోటా దిగుబడి ఎకరానికి 7 టన్నుల వరకు వస్తోంది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటే 10 టన్నులకు పైగా వచ్చే అవకాశం ఉందని సురేంద్రనాథ్‌రెడ్డి చెప్పారు. కాలాపత్తి సపోటా కాయలు చెట్టు నుంచి కోసిన తర్వాత పది రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఈ సపోటా మొక్క స్టేజిని బట్టి నీటి సరఫరా ఇవ్వాలి. ఎండలు ఎక్కువగా ఉంటే ఒక్కో మొక్కకు 30 లీటర్ల వరకూ నీరు కావాలి. లేకపోతే ఒకోసారి 20 లేదా 10 లీటర్ల నీరు సరిపోతుంది.ఈ ఫార్మ్‌లో కొంకణ్ నిమ్మ జాతి పంట సాగు చేస్తున్నారు. ఈ కాయలు మామూలు కన్నా పెద్దగా ఉంటాయి. మామూలు నిమ్మ కన్నా ఇది కాస్త పులుపు తక్కువ ఉంటుంది. మొక్కలు నాటిన మూడో ఏట నుంచే దిగిబడి వస్తోంది. అత్యధిక దిగుబడి ఇచ్చే నిమ్మ ఏదైనా ఉందంటే కొంకణ్ నిమ్మ అన్నారు సైంటిస్ట్ సురేంద్రనాథ్‌రెడ్డి. ఏడాదికి ఎకరం తోట నుంచి 18 టన్నుల దిగుబడి వస్తోందన్నారు. ఎండాకాలంలో షర్బత్ తయారీకి ఈ ప్రీమియం వెరైటీని వాడతారు. ఇటీవల ఈ నిమ్మకాయలతో ఊరగాయ పెడుతున్నారు. ఈ మొక్కలు నాటే బెడ్ 3 నుంచి 4 అడుగుల ఎత్తు ఉండాలి. దీనివల్ల వర్షపునీరు వరుసల మధ్య భూమిలో ఇంకిపోతుంది. వరుసల మధ్య నీరు వేగంగా బయటి పోకుండా మధ్య మధ్యలో స్పీడ్ బ్రేకర్లు వేస్తారు. తద్వారా నీరు ఎక్కడికక్కడ భూమిలో ఇంకుతుందని చెప్పారు.గతంలో ఈ ఫార్మ్ భూమిలో 600 అడుగుల లోతులో లభించే భూగర్భ జలాలు ఇప్పడు 200 అడుగుల్లోనే వస్తోంది. మొత్తం పండ్ల మొక్కల తోటలకు సంబంధించి 3 లక్షల లీటర్ల సామర్ద్యంతో రెండు ఓవర్‌హెడ్ ట్యాంకులు నిర్మించినట్లు సురేంద్రనాథ్‌రెడ్డి చెప్పారు. వాటిలో నీరు నింపేందుకు రెండు మూడు బోర్ మోటార్లే సరిపోతున్నాయని అన్నారు. ఏ పంటకు నీరు ఎప్పుడు అవసరమో గమనించి దానికే ఇస్తామన్నారు. ఒకేసారి అన్ని పంటలకు నీరు పెట్టాల్సిన అవసరం ఉండదన్నారు. దీంతో మొత్తం తోటలకు ఐదారు లక్షల లీటర్ల నీరే సరిపోతుందని చెప్పారు.ఈ ఫార్మ్‌లో 22 ఎకరాల్లో హైడెన్సిటీ పద్ధతిలో బాలానగర్ సీతాఫలం సాగువుతోంది, మొక్కలు నాటిన నాలుగో ఏట నుంచే దిగుబడి మొదలైంది. ఎకరానికి ఐదు టన్నులు వచ్చింది. సీతాఫలం మొక్కలకు నీటి అవసరం కాస్త ఎక్కువ. అందుకే ఒక్కో బెడ్ మీద రెండు డ్రిప్‌లు వేశారు. సీతాఫలాలను చెట్టు నుంచి కోసిన తర్వాత మే నెల వరకు ఈ తోటకు నీరు ఇవ్వకుండా ఆరబెడతారు. మే నెలలో తూర్పు వైపు, పడమర దిక్కున, చెట్టు పైభాగంలో ప్రూనింగ్ చేస్తారు. గజిబిజిగా, సన్నని కొమ్మలను కత్తిరిస్తారు. మన వేలు మందంలో కొమ్మ ఉంటే సీతాఫలాల సైజు పెద్దగా వస్తుంది.తమిళనాడు నుంచి తెచ్చిన కరుగ రకం మునగ సాగును రెండెకరాల్లో చేస్తున్నారు. ఏడాదికి ఒకసారి మునగచెట్లను ప్రూనింగ్ చేస్తారు. ఒకటి లేదా రెండు అడుగుల ఎత్తు వరకు మొదలును ఉంచి, కట్‌చేస్తే.. ఎక్కువగా కొమ్మలు వస్తాయి. కొమ్మలు ఎక్కువగా వస్తే దిగుబడి అంతే అధికంగా ఉంటుంది. రెండు ఎకరాల్లో ఏడాదికి 12 టన్నుల వరకు దిగుబడి తీసినట్లు శాస్త్రవేత్త చెప్పారు. ఉష్ణోగ్రత 32 డిగ్రీల కన్నా ఎక్కువ ఉంటేనే మునగ చెట్లకు ఎక్కువ పూత వచ్చి, కాయలు కాస్తాయి. పూత వచ్చిన నెల రోజులకే మునగకాయలు కోతకు వస్తాయి. ఈ కాయ సైజు పెద్దగా ఉంటుంది. బరువు ఎక్కువ వస్తుంది. మంచి రుచి కూడా ఉంటుంది.రెండెకరాల్లో యాపిల్ బేర్ లేదా గంగిరేగు పండ్ల మొక్కలను ఈ ఫార్మ్‌లో వేశారు. ఎకరం నుంచి ఐతు టన్నులకు పైగా దిగుబడి వచ్చే ఈ చెట్ల కొమ్మలు బరువుతో కిందకు పడిపోకుండా అటు ఇటూ వైర్లతో సపోర్ట్ ఇవ్వాలి. మొక్క పెట్టిన నాలుగో ఏట నుంచే దిగుబడి వస్తోంది. ఈ ఫార్మ్‌లో హిమాయత్ రకం మామిడిని రెండెకరాల్లో వేశారు. నాలుగో సంవత్సరం నుంచి దీని కాపు వస్తోంది. మిగతా మామిడి రకాలతో పోలిస్తే.. దిగుబడి తక్కువ. కానీ ఈ మామిడికి డిమాండ్ ఎక్కువ. ధర అధికంగా వస్తుంది. కీసర రకం మామిడిని హైడెన్సిటీ పద్ధతిలోనే రెండు ఎకరాల్లో పండిస్తున్నారు. రెండు ఎకరాల్లో 10 టన్నుల వరకు దిగుబడి వస్తోంది.బళ్లారి గ్రీన్ రకం అంజీరను రెండెకరాల్లో పండిస్తున్నారు. ప్రతి ఏటా ఈ మొక్కలకు ప్రూనింగ్ చేయాలి. కొత్తగా వచ్చే కొమ్మల నుంచి కాయలు పెద్దగా ఎదుగుతాయి. ఇలా చేస్తే.. ఎకరానికి 6 టన్నుల అంజీర దిగుబడి వస్తుంది. మార్కెట్‌లో ఎక్కువ డిమాండ్ ఉన్న అంజీరను పచ్చిగా ఉండగా అమ్మేస్తారు. మరో రెండెకరాల్లో కొంకణ్ ప్రాలిఫిక్ వెరైటీ అల్ల నేరేడు ఈ పార్మ్‌లో సాగవుతోంది. ఈ పండులో కండతో పాటు మంచి రుచి ఉంటుంది. విత్తనం చిన్నగా ఉంటుంది. రీసెర్చ్ ఫార్మ్‌గా చేస్తుండడం వల్ల అల్ల నేరేడు చెట్లకు ఆల్టర్‌నేటివ్ వరుసల్లో ప్రూనింగ్ చేస్తున్నట్లు సైంటిస్ట్ వెల్లడించారు. రెండు ఎకరాల్లో ఐదున్నర టన్నుల పండ్లు వచ్చాయి.PKM 1 రకం చింత తోటను రెండు ఎకరాల్లో వేశారు. దీన్ని స్వీట్ టామరిండ్ అంటారు. చెట్ల పైభాగం కలిసినప్పుడు ఏడాది విడిచి ఏడాది ప్రూనింగ్ చేస్తారు. రెండెకరాల్లో కొంకణ్ బాహడోలి వెరైటీ పనస మొక్కలు పెట్టారు. నాటిన ఆరో ఏట నుంచి పనస దిగుబడి వస్తోంది. కాయ సైజ్ బాగా ఉంది. పదేళ్ల నుంచి దీని నుంచి సరైన దిగుబడి వస్తుంది. పండ్ల తోటలతో పాటు కపిల్ ఆగ్రో ఫార్మ్‌లో కూరగాయలు, ఆకు కూరలు 15 ఎకరాల్లో పండిస్తున్నారు. పాలి హౌస్‌లో కాప్సికం, కీరదోస సాగవుతోంది. ఫార్మ్‌లోనే 36 ఆవులు, గేదెలతో డెయిరీ ఫార్మ్ ఉంది. వాటి నుంచి రోజుకు 200 లీటర్ల పాలు వస్తున్నాయి.
మరింత సమాచారం కోసం 7815886309లో Kapil Agro Farmను సంప్రదించవచ్చు.