ఇంటి వరండాలు, డాబా మెట్లు, మిద్దె తోటల్లో లేదా పెరటి తోటల్లో చాలా సులువుగా పెంచేందుకు వీలైన అతి సులభమైన మొక్కలలో కొత్తిమీర ఒకటి. కొత్తిమీ సాగు కోసం పెద్ద తోట, ఖరీదైన పరికరాల అవసరం లేదు. ఒక కుండ, మంచి మట్టి, గుప్పెడు విత్తనాలు ఉంటే చాలు కొత్తిమీరను ఈజీగా పెంచుకోవచ్చు. విత్తనాలు చల్లిన 35 రోజుల్లోనే కొత్తిమీర మన చేతికి వచ్చే వరకు ఏమి చేయాలో దీపు వివరించారు.
కొత్తిమీర మనం వండుకునే ఆహారానికి చక్కని రుచి, సువాసన ఇస్తుంది. కొత్తిమీర ఆహారంలో తీసుకున్నవారి శరీరానికి విటమిన్లు అందిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లను కూడా ఇస్తుంది. కొత్తిమీర జీర్ణశక్తిని మెరుగు పరుస్తుంది. బ్లడ్‌లో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. శరీరంలోని విష పదార్థాలను చక్కగా బయటకు పంపుతుంది. కొత్తిమీరతో కడుపు ఉబ్బరం, అజీర్తి తగ్గిస్తుంది. జీర్ణ రసాయనాలను విడుదల చేస్తుంది. కొత్తిమీర నీరు తాగిన వారి మూత్రపిండాలు, కాలేయం క్లీన్ అవుతాయి. దీనిలోని విటమిన్ ఏ, సీ, ఈ శరీరాన్ని రక్షిస్తాయి. ముఖం మీద ఏర్పడ్డ మొటిమలు, మచ్చలను తగ్గిస్తుంది. చర్మాన్ని కాంతివంతం చేస్తుంది.ఇలాంటి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఇవ్వడంతో పాటు ఇంటిలోనే సులువుగా సాగు చేసుకునే చిట్కాను అనంతపురం జిల్లాకు చెందిన గార్డెనింగ్‌కు సంబంధించిన చిట్కాలను కంటెంట్ క్రియేటర్ దీపు వివరించారు. అదెలాగో చూద్దాం. విత్తనాల తయారీ నుండి తాజా కొత్తిమీర ఆకుల వరకు 35 రోజుల్లోనే కుండీలో కొత్తిమీరను ఎలా పెంచాలో దీపు వెల్లడించారు. విత్తనాలు నాటే ముందుగా వాటిని తేలికగా నలిపి, నానబెట్టి, తర్వాత తోటమట్టి, కోకోపీట్, కంపోస్ట్ మిశ్రమంలో నాటుకోవాలి.ధనియాల గింజలపై గట్టి పొర ఉంటుంది. గింజలు రెండుగా విడిపోయేలా వాటిని తేలికగా దంచాలి లేదా చేతులతో నలపాలి. గింజను పూర్తిగా పొడిగా చేయకూడదు. ప్రతి గింజలోని రెండు భాగాలు విడిపోతే చాలు. విడదీసిన విత్తనాలను నీటిలో వేసి, 24 గంటల పాటు నానబెట్టాలి. దీంతో అవి నాటుకునేందుకు రెడీ అవుతాయి. కొత్తిమీర సరిగా పెరగాలంటే మట్టి మిశ్రమం ముఖ్యం. ఈ మట్టి మిశ్రమాన్ని దీపు 40 శాతం తోటమట్టి, 30 శాతం కోకోపీట్, మరో 30 శాతం కంపోస్ట్‌ను కలిపి సాధారణ మిశ్రమం తయారు చేయాలన్నారు. ఆ మిశ్రమంలో గుప్పెడు వేప పొడి, చెంచాడు ట్రైకోడెర్మా కలిపి అవన్నీ మట్టిలో బాగా కలిసేలా బాగా కలుపుకోవాలి.సిద్ధం చేసుకున్న మట్టి మిశ్రమాన్ని కుండ లేదా ప్లాస్టిక్ టబ్‌లో నింపుకోవాలి. నానబెట్టిన కొత్తిమీర విత్తనాలను మట్టిలో లోతుగా కాకుండా మట్టిపైనే సమానంగా చల్లాలి. విత్తనాలు చల్లిన తర్వాత వాటిపై కొకోపీట్‌ను పలచని మల్చింగ్ పొరగా కప్పాలి. తర్వాత కుండ లేదా టబ్‌లో జాగ్రత్తగా నీరు పోయాలి. ధనియాల విత్తనాలు చల్లిన మట్టి తేమగా ఉండాలి కానీ బురదగా మారకూడదు. కుండ, టబ్‌లో ఎక్కువైన నీరు బయటకు వెళ్లిపోయేందుకు వీలుగా వాటి అడుగు భాగంలో రంధ్రాలు చేసుకోవాలి.విత్తనాలు చల్లిన పదో రోజున వాటి నుంచి చిన్న ఆకుపచ్చని మొలకలు వస్తాయి. అప్పుడు కూడా మట్టిలో తేమ ఉండేలా చూసుకోవాలి. మొక్కలకు సూర్యరశ్మి చక్కగా తగిలే చోట కుండీలు పెట్టాలి. ఈ దశలో మొలకలు మరింత సున్నితంగా ఉంటాయి కనుక వాటి చుట్టూ ఉన్న మట్టిని కదిలించకూడదు. 30వ రోజు నాటికి కొత్తిమీర మొక్కలు పెరుగుతాయి. టబ్‌లోని మట్టిని క్రమం తప్పకుండా పరిశీలిస్తూ అవసరమైనప్పుడు నీరు పోస్తూ ఉండాలి. మంచి సూర్యరశ్మి, సరైన నీటి పారుదల సౌకర్యం ఉంటే కొత్తిమీర మొక్కలు, ఆకులు ఆరోగ్యంగా పెరుగుతాయి. మొక్కలు పెరుగుతున్న తీరును బట్టి సుమారు 35వ రోజుకు కొత్తిమీర కోతకు వస్తుంది.పెరిగిన కొత్తిమీర మొక్కల మిగిలిన భాగాన్ని టబ్‌లోనే ఉంచి, మనకు అవసరం ఉన్నంత మేరకు ఆకులు, కాడలు కోసుకోవచ్చు. మొక్కలను వేళ్లతో సహా తీసేయ వద్దు. మట్టికి రెండు అంగుళాలకు పైన కొత్తిమీర మొక్కలు కోయాలి. ఇలా చేస్తే కొత్తిమీర మొత్తం ఒకేసారి కాకుండా రెండు మూడు సార్లు పెరుగుతాయి. మన వంటల్లోకి పలుమార్లు తాజా కొత్తిమీర అందిస్తాయి. కొత్తిమీరను కోసిన తర్వాత అదే పద్ధతిలో మరోసారి పంట పండించవచ్చు. కొద్దిగా స్థలం ఉండి, క్రమం తప్పకుండా సంరక్షిస్తే కొన్ని టబ్‌లలో పెంచుకుని మనకు కావాల్సినంతా తాజా కొత్తిమీరను నిత్యం కోసుకోవచ్చు.కొత్తిమీర మొక్కలు పెంచుకునే టబ్ లోతుగా కంటే వెడల్పుగా ఉండాలి. టబ్ ఎత్తు 6 నుంచి 8 అంగుళాలు సరిపోతుంది. దానిలో ఎక్కువైన నీరు కిందికి వెళ్లిపోయేలా డ్రైనేజ్ రంధ్రాలు చేయాలి. కొత్తిమీర మొక్కలు పెంచే టబ్‌లో ఎండాకాలంలో ప్రతిరోజూ, చలికాలంలో రోజు విడిచి రోజు నీరు పోస్తే సరిపోతుంది. నీరు సమానంగా మొక్కలన్నింటికి అందేందుకు స్ప్రేయర్ ఉపయోగిస్తే మేలు. కొత్తిమీర మొక్కలకు ఎండ ఎక్కువ తగిలితే ఆకులు పలచబడి మొక్క తొందరగా పూత పూస్తుంది. కొత్తిమీర సాగు శీతాలకాంలో చేసుకుంటే ఉత్తమం అంటారు దీపు. జనవరిలో కూడా కొత్తిమీరను సులభంగా పెంచుకోవచ్చు.
ధనియాల విత్తనాలు టబ్ మట్టిలో చల్లిన తర్వాత 12 నుండి 15 రోజుల తర్వాత వర్మీ కంపోస్ట్‌ను పలచని పొరగా పైన వేసుకుంటే మంచిది. లేదా లీటరు నీటిలో చెంచాడు సముద్రపు నాచు లేదంటే పంచగవ్వ కలిపి ద్రవరూపంలో ఎరువుగా కూడా వాడొచ్చు. దీపు అనుసరించే పద్ధతిలో కొత్తిమీర పెంపకం చాలా సులువుగా ఉంటుంది. కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉంటే కొత్తిమీర సాగుతో ప్రారంభించడం మంచి అవకాశం. @_gardening.with.deepu అనే పేరుతో దీపు ఇన్‌స్టాగ్రామ్‌లో గార్డెనింగ్ చిట్కాలు పంచుకునే కంటెంట్ ఇస్తుంటారు.