Site icon V.E.R Agro Farms

అమ్మో..! ఆహార సంక్షోభం?

ఆహార సంక్షోభం మానవాళికి  పెనుముప్పుగా మారనుందా?  ప్రపంచ జనాభా ఏటేటా ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుండడం, ఆహార పంటల దిటుబడి నానాటికీ తగ్గిపోతుండడం దీనికి కారణం కానుందా? అంటే.. అవుననే జవాబు ఆహార రంగ నిపుణుల నుంచి వస్తోంది. ఇప్పటికే అనేక దేశాల్లో పెరుగుతున్న జనాభా అవసరానికి చాలినంత ఆహారం దొరకని సంఘటనలు ఉన్నాయి. ముఖ్యంగా ఆఫ్రికా దేశాల్లో ఆహారం కొరత కొన్నేళ్లుగా తాండవం చేస్తోంది. ఆహారం సంక్షోభానికి గ్లోబల్ వార్మింగ్ సహా అనేక ఇతర కారణాలు కూడా ఉన్నాయని ఆహార రంగ నిపుణులు చెబుతున్నారు. ప్రకృతి వనరులను మానవాళి వాడుకుంటున్న తీరు మారకపోతే ఉపద్రవం మరింత ఉధృతంగా ఉండొచ్చని వారు అంటున్నారు. మరో పాతికేళ్లలో ఆహారధాన్యాల కరువు వచ్చే ప్రమాదం ఉందని ఆహారరంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.నిజానికి ఈ భూమ్మీద మనుషులకు అవసరమైన వనరులు పరిమితం. దాంట్లో మళ్లీ సాగుభూమి మరీ తక్కువ. ప్రపంచవ్యాప్తంగా ఏ పంట అయినా పండించగల భూమి కేవలం 140 కోట్ల హెక్టార్లు మాత్రమే అని గణాంకాలు చెబుతున్నాయి. సాగునీరు ఈ 140 కోట్ల హెక్టార్లకే లభిస్తోందని లెక్కలు తేల్చాయి. సాగువిస్తీర్ణం సంగతి ఎలా ఉన్నా  ప్రపంచ జనాభా ఏటికేడాది పెరుగుతూనే ఉంది. 2050 నాటికి ప్రపంచ జనాభా వెయ్యి కోట్లకు చేరుతుందన్నది ఒక అంచనా. ఇదే జరిగితే ప్రపంచం ఆహార సంక్షోభం ఎదుర్కోవడం ఖాయమంటున్నారు నిపుణులు. వెయ్యి కోట్ల జనాభాకు రెండుపూటలా ఆహారం కావాలంటే తిండిగింజలు సరిపోవనేది నిపుణుల హెచ్చరిక. దీనికి తోడు మన దేశంలో పెరుగుతున్న జనాభా నివాసాల కోసం వేలాది ఎకరాల భూములలో ఇళ్ల నిర్మాణం, మరో పక్కన లక్షలాది ఎకరాలలో ఆహార ధాన్యాలు కాకుండా ఆక్వా కల్చర్‌ సాగుకే రైతులు ఎక్కువ మొగ్గు చూపడం కూడా ఆహారం కొరత వచ్చేందుకు ఆస్కారం అవుతుందంటున్నారు.వెయ్యి కోట్ల జనాభాకు రెండుపూటలా ఆహారం అందించాలంటే 2017 వ సంవత్సరంతో పోలిస్తే 70 శాతం ఎక్కువ పండించాలంని ఆహార రంగ నిపుణులు అంటున్నారు. అయితే అది అంత తేలిక కాకపోవచ్చు. జనాభాకు తగినట్టు తిండిగింజలు పండించాలంటే సాగు విస్తీర్ణానికి ఉన్న పరిమితులు ప్రధాన అడ్డంకి అంటున్నారు. భారతదేశం మౌలికంగా వ్యవసాయం మీద ఆధారపడిన దేశం. ఒకప్పుడు నూటికి డెబ్భయి మందికి పైగా వ్యవసాయం పైనే జీవనం గడిపేవారు. వ్యవసాయమే వారి జీవనాధారం. అయితే కొన్ని దశాబ్దాలుగా మన దేశంలో వ్యవసాయరంగం పరిస్థితి బాగోలేదనేది నిపుణుల అంచనా.భారతదేశంలో వ్యవసాయం అనేక అంశాల మీద ఆధారపడి ఉంది. వ్యవసాయానికి నీటి వసతి అతి ముఖ్యం. రుతుపవానాలు, భూగర్భజలాలు ఇవన్నీ నీటి యాజమాన్య నిర్వహణలో కీలకం. వ్యవసాయం చేయడానికి మంచి పోషకాలున్న నేల అవసరం. సారవంతమైన భూమిలోనే పంట దిగుబడులు వస్తాయి. నేలలో అనేక జీవక్రియలు జరగడానికి అవసరమైన వాతావరణం ఉన్నప్పుడే ఇది సాధ్యం అవుతుంది. మన దేశంలో వ్యవసాయ యోగ్యమైన నేలకు కొరత లేదు. అయితే.. రసాయనాలు, ఇతర కారణాలతో ఇప్పటికే మన దేశంలో 40 శాతం నేల దెబ్బతిన్నదని ఆహార రంగ నిపుణులు చెబుతున్న మాట. అంటే అంతమేరకు భూమి నిస్సారం అయిందని దాని అర్థం.నేల నిస్సారం కావడానికి పలు కారణాలున్నాయి. అశాస్త్రీయమైన వ్యవసాయ విధానాలే దీనికి ప్రధాన కారణం అంటున్నారు శాస్త్రవేత్తలు. నేలను పదేపదే ఉపయోగించడం వల్ల అందులోని సారం తగ్గిపోతున్నదని శాస్త్రవేత్తలు చెబుతున్న మాట. నేలలో సేంద్రీయత ఎంత ఎక్కువగా ఉంటే సేద్యానికి అంత మేలు. భూమిలో సేంద్రీయత కనీసం నాలుగు లేదా మూడు శాతం ఉండాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కానీ.. మన దేశంలో అనేక ప్రాంతాల్లో సేంద్రీయత  కేవలం 0.2 శాతం మాత్రమే ఉంటోందని ఒక అంచనా. ఇంత తక్కువ సేంద్రీయత ఉండటం పంటల సాగుకు మంచిది కాదు. పంట దిగుబడిపై దీని ప్రభావం ఉంటుంది. తక్కువ సేంద్రీయత  ఉన్న భూమిలో సేద్యం వల్ల పంట దిగుబడి బాగా తగ్గుతుంది. అలాంటి భూమిలో పండించే పంటలలో పోషక విలువలు కూడా తక్కువగా ఉంటాయంటున్నారు సైంటిస్టులు.భూసారాన్ని కాపాడుకోకపోవడమే మన దేశ వ్యవసాయరంగం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అంటున్నారు శాస్త్రవేత్తలు. వానలు, వరదల్లో కొంతమేరకు భూసారం కొట్టుకుపోతుందని, ఒకసారి భూసారం తగ్గితే మళ్లీ పెంచుకోవడం అంత సులభం కాదని వ్యవసాయ రంగ నిపుణులు చెబుతున్నారు. నేల 2.5 శాతం సెంటీమీటర్ల మందంలో సారవంతంగా మారడానికి 500 ఏళ్లు పడుతుందని అంటున్నారు శాస్త్రవేత్తలు.ప్రపంచ వ్యాప్తంగా వాతావరణంలో విపరీతమైన మార్పులు వస్తున్నాయి. భూమి సగటు ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉండాలి. గతంలో ఇది దానికన్నా కాస్త ఎక్కువగా లేదా కొంచెం తక్కువ కూడా ఉండేది. మునుపటి కన్నా చాలా వేగంగా ఇప్పుడు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఉష్ణోగ్రతలు విపరీతంగాపెరగడాన్ని తీవ్రంగా పరిగణించాల్సి వస్తుంది. ఈ మార్పు ప్రపంచానికి డేంజర్ బెల్స్ మోగిస్తోందంటున్నారు శాస్త్రవేత్తలు. వాతావరణ మార్పులకు గ్రీన్ హౌస్‌ ఎఫెక్ట్ ప్రధాన కారణం అటున్నారు. గ్రీన్ హౌస్‌ ఎఫెక్ట్ అంటే సూర్యుడి నుంచి భూమిపైకి వచ్చే శక్తిలో కొంత భూమిపైనే నిలిచిపోవడం. భూమిపై నుంచి పరావర్తనం చెంది అంతరిక్షంలోకి వెళ్లాల్సిన సౌరశక్తిని గ్రీన్ హౌస్‌ వాయువులు గ్రహించి తిరిగి భూమిపైకే పంపిస్తున్నాయి. దీనితో భూ వాతావరణం ఊహించనంతగా వేడెక్కుతోంది. దీనితో ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో పచ్చటి ప్రదేశాలు భవిష్యత్తులో ఎడారులుగా మారే  ప్రమాదం ఉందని సైంటిస్టులహెచ్చరిస్తున్నారు.

వాతావ‌ర‌ణ మార్పుల ప్ర‌భావం పంట‌ల దిగుబ‌డిపైన ప‌డుతోంది. దీంతో ఆహార భ‌ద్ర‌తకు సవాల్‌అవుతోంది. చివరికి తిండి గింజల కోసం  ప్ర‌జ‌లు పాట్లు పడాల్సిన ప‌రిస్థితిరావచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మ‌న ‌దేశంలో ఆక‌లి చావులు అంతగా లేవు  కానీ పోషక‌ఆహార లోపం స‌మ‌స్య ఉంది. మ‌రో ప‌దేళ్ల‌కు గోధుమలు, మొక్క‌జొన్న వంటి పంట‌ల దిగుబ‌డులు త‌గ్గ‌వ‌చ్చ‌ని  ఓ అంచనా. వాతావ‌ర‌ణ మార్పులు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో పోష‌కాహార లోపం మ‌రింత పెరిగే ప్ర‌మాదం ఉంటుందని నిపుణుల హెచ్చరిక. మన దేశంలో వ్యవసాయం లాభసాటిగా లేకపోవడంతో చాలా మంది రైతులు తమ పంట భూములను వృథాగా వదిలిపెట్టి పట్టణాలు, నగరాలకు పొట్ట చేతపట్టుకొని వలస వెళ్లిపోతున్నారు. ఇది కూడా ఆహార భద్రతకు ప్రమాదం వచ్చేందుకు అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఎస్. అబ్దుల్ ఖాలిక్ అనుమతితో…

Exit mobile version