విరజాజి పూలు… జాస్మిల్ మోలె లేదా జుహి జాస్మిన్ పూలు అందానికి, చక్కని సువాసనకు ప్రసిద్ధి. భారతీయ సంస్కృతిలో ప్రముఖ స్థానంలో ఉన్న ఈ పూలు మల్లె జాతికి చెందినవి. పూజలు, శుభకార్యాలు, వివాహ వేడుకలలో విరజాజి పూలను విరివిగా వాడుతుంటారు. సాయంత్రం వేళ విరజాజి పూలు సువాసనలు వెదజల్లుతాయి. నేచురల్ ఎయిర్ ఫ్రెష్‌నర్లు అని కూడా విరజాజులను చెబుతారు.
విరజాజి పూలను పెర్ఫ్యూమ్‌లలో, అత్తరులు, సౌందర్య సాధన ఉత్పత్తుల తయారీలో మంచి వాసన కోసం వినియోగిస్తారు. విరజాజులు చర్మవ్యాధుల చికిత్సలో వినియోగిస్తారు. గాయాలు తొందరగా తగ్గిపోవడానికి ఇవి బాగా పనిచేస్తాయి. ఒత్తిడిని తగ్గించి, మానసిక ఉల్లాసం, ప్రశాంతతను కలిగిస్తాయి విరజాజులు. బాలింతలలో పాల ఉత్పత్త తగ్గించడానికి విరజాజులు పనిచేస్తాయని చెబుతారు. విరజాజి పూల మొక్కలకు ఎక్కువ తేమ ఉండే వాతావరణం అవసరం. ఎన్నో ప్రయోజనాలను మనకు అందించే విరజాజి మొక్కలను ఇంటి పెరట్లో, బాల్కనీలో, టెర్రస్‌పైన కూడా పెంచుకోవచ్చు.విరజాజి కొమ్మలను కుండీల్లో నాటుకున్నా వేరు వ్యవస్థ ఏర్పడి మొక్కలు పెరుగుతాయి. ఈ మొక్కలు పొద మాదిరిగా ఎదుగుతాయి. ఎండాకాలంలోనే కాకుండా వర్షాకాలంలో విరజాజులు విరివిగా పూస్తాయి. వానల సీజన్ ముగిసిన వెంటనే ప్రూనింగ్ చేస్తే.. చలికాలంలో కూడా పూస్తాయి. అలాగే ఫివ్రవరి, మార్చి నెలల్లో కూడా ప్రూనింగ్ అవసరం అవుతుంది. విరజాజి మొక్కను ఒకేసారిగా పెద్ద టబ్‌లో వేసుకోకూడదు. ముందుగా 12 అంగుళాల కుండీలో నాటుకోవాలి. సాధారణంగా మొక్కలకు ప్రూనింగ్ చేసి, కంపోస్ట్ ఎరువు వేసి, నీటిని సరఫరా చేస్తాం. కానీ మల్లె, విరజాజి పూల మొక్కలకు అలా చేస్తే.. మొక్కలకు పూలు కంటే ఎక్కువగా ఆకులు వస్తాయి. ప్రూనింగ్ చేసిన తర్వాత రెండు రోజుల పాటు మొక్కను ఎండనివ్వాలి. ఆ తర్వాత కంపోస్ట్ వేసి, నీరు ఇస్తే.. పూర్తిస్థాయిలో ఫ్లవరింగ్ మొదలవుతుంది. విరజాజి మొక్కలను కుండీలో నాటిన రెండో సంవత్సరం నుంచే ఫుల్‌గా పూలు పూస్తాయి.విరజాజి మొక్కలను ప్రూనింగ్ చేసే కట్టర్‌ని ముందుగా స్టెరిలైజ్ చేస్తే మంచిది. కట్టర్‌తో బాగా ముదిరిన కొమ్మలను కాకుండా.. కొస్త లేత అంటే సెమీ హార్డ్ కొమ్మలను 45 డిగ్రీల యాంగిల్‌లో కట్ చేసుకోవాలి. మల్లె, విరజాజి మొక్కలను ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఒకసారి, జూన్, జులై నెలల్లో మరోసారి ఆకులు. లేత కొమ్మలను కట్ చేసుకుంటే ఏడాది పొడవునా పూలు పూస్తూనే ఉంటాయి. ఆకులను లాగేయకుండా గిల్లుకోవాలి. విరజాజి కొమ్మలు సున్నితంగా ఉంటాయి కాబట్టి లాగేస్తే.. కొమ్మ నుంచి తోలు కూడా ఊడి వచ్చేస్తుంది. ఆకులను ఇలా లాగడం మొక్కకు మంచిది కాదు.కొమ్మ నుంచి మొక్కలను తయారు చేసే విధానం తెలుసుకుందాం. 45 డిగ్రీల యాంగిల్‌లో కత్తిరించిన కొమ్మల నుంచి ఆకులన్నీ కట్ చేయాలి. ఒక ప్లాస్టిక్ సీసాను సగానికి కత్తించి, అడుగున కొన్ని రంధ్రాలు చేయాలి. ఆ రంధ్రాల నుంచి నీరు వేగంగా బయటకు పోకుండా ఉండేందుకు కోకోపిట్ వేసుకోవాలి. ఆ తర్వాత శాండ్ మిక్స్‌తో నింపాలి. దాంట్లో నీళ్లు పోయాలి. మట్టిలో నీళ్లు ఇంకిపోయిన తర్వాత ముందుగా కత్తిరించి పెట్టుకున్న కొమ్మను యాంటి ఫంగల్‌గా, వేర్లు రూపొందించే హార్మోన్‌గా, మొక్కకు ఫ్లవరింగ్ వచ్చేందుకు చాలా బాగా పనిచేసే అలోవీరా జెల్‌తో కొమ్మ మొదలును ముంచి మట్టిలో నాటుకోవాలి. అలా నాటిన మొక్కలను వారం రోజుల పాటు పాక్షిక నీడలో ఉంచాలి. వాటికి కొత్త చిగుర్లు వచ్చిప్పుడు నేరుగా సూర్యరశ్మి ఉండే చోటకు మార్చుకోవాలి. ఇలా ఈజీగా విరజాజి కొమ్మలతో మొక్కలను తయారుచేసుకోవచ్చు.జూన్, జులైలో కొమ్మలు నాటుకుంటే ఫిబ్రవరి, మార్చి నెలల్లో వాటిని కాస్త పెద్ద కుండీలోకి మార్చుకోవాలి. కొమ్మ నుంచి మొక్క తయారైన తర్వాత, వేర్లు తెగిపోకుండా జాగ్రత్తగా మట్టితో సహా మొక్కలను బయటికి తీయాలి. అడుగు భాగంలో చిన్న రంధ్రాలు ఉన్న 12 అంగుళాల వెడల్పు కుండీలోకి ఆ మొక్కలను మార్చుకోవాలి. కుండీకి రంధ్రాలు ఎక్కువ ఉంటే వాటిని పెంకులతో మూసి, పైన కోకోపిట్ వేసి కవర్ చేయాలి. దీంతో కుండీలోని రంధ్రలు పూర్తిగా మూసుకుపోకుండా ఉంటాయి. కోకోపిట్ పైన మెత్తగా చేసుకున్న సాయిల్ మిక్స్ వేయాలి. 50 శాతం మోతాదులో గార్డెన్ సాయిల్, 10 శాతం ఇసుక, 40 శాతం ఏదైనా కంపోస్ట్ ఎరువు, కొద్దిగా నీమ్ పౌడర్, ట్రైకో డెర్మా తప్పకుండా కలిపి సాయిల్ మిక్స్ తయారు చేసుకోవాలి. దీని వల్ల మట్టిలో ఉండే హానికర సూక్ష్మజీవులు చనిపోయి, రూట్‌రాట్ లాంటి తెగులు, ఫంగస్ ఇబ్బందులు మొక్కలను భద్రంగా ఉంచుతుంది. ఈ విధానంలో మొక్కలు కూడా చాలా పచ్చగా, ఆరోగ్యంగా ఎదుగుతాయి. విరజాజి మొక్కలకు సోకే తామర తెగులును వేపనూనె స్ప్రే చేయడం ద్వారా నివారించుకోవచ్చు.సంవత్సరం పాటు 12 అంగుళాల కుండీలోని విరజాజి మొక్కలను వేరు వ్యవస్థ దెబ్బతినకుండా జాగ్రత్తగా బయటికి తీసి, మరింత పెద్ద కుండీలోకి మార్చుకోవాలి. విరజాజి కొమ్మకు రూటింగ్ హార్మోన్‌గా వాడిన అలోవీరా కొమ్మల ముక్కలను పెద్ద కుండీలోని మట్టిలో పూర్తిగా మునిగిపోయేలా గుచ్చాలి. లేదా అలోవీరా జెల్‌ను నీటిలో కలిపి కూడా మొక్కలు నాటిన కుండీలో ఇచ్చుకోవచ్చు. ఇది ఎరువుగా పనిచేసి, మొక్కలకు వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందుతుంది. మొక్కల నుంచి పూల దిగుబడి కూడా అదే విధంగా వస్తుంది.