పది ఎకరాల్లో చేసే సాగు కంటే పావు ఎకరంలో వ్యవసాయమే ఎక్కువ నికర లాభం ఇస్తుంది. ఖర్చు తక్కువ, పంట నాణ్యత అధికం. ఆరోగ్యానికి మేలు. డిమాండ్, ధర ఎక్కువే. నిరంతర ఆదాయ చక్రం. ఇదే సాంద్ర సూక్ష్మ వ్యవసాయం. ఈ విధానంలో మొక్కుబడిగా మొక్కలు నాటడం ఉండదు. చేతిలో ఇమిడిపోయే చిన్న చిన్న పనిముట్లతోనే సాగు చేయొచ్చు. ఒక విధంగా దీన్ని అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అనవచ్చు.
సాంద్ర సూక్ష్మ వ్యవసాయ పద్ధతిలో నేలను ఒక జీవంలా చూడాలి. అంటే లివింగ్ ఆర్గానిజం. నేల ఎంత బలంగా ఉంటే మొక్కలు అంత వేగంగా పెరుగుతాయి. సాధారణ వ్యవసాయంలో 40 రోజుల్లో వచ్చే పంట మైక్రో ఫార్మింగ్‌లో 30 రోజుల్లోనే చేతికి వస్తుంది. మొక్కలు ఎంత ఏపుగా పెరిగితే పంట అంత ఎక్కుగా వస్తుంది. మొక్కల్లో రోగనిరోధక శక్తి అధికంగా ఉంటుంది కాబట్టి పురుగు మందుల ఖర్చు ఉండది. ఇలా పండించిన పంటలకు నాణ్యతే అతి పెద్ద అడ్వర్టైజ్‌మెంట్ అని చెప్పొచ్చు.వేలాది రూపాయలతో కొనే రసాయన ఎరువుల కంటే వంటింటి వ్యర్థాలు, పశువుల ఎరువే వెయ్యి రెట్లు భూమికి మెరుగైనది. సాంద్ర సూక్ష్మ వ్యవసాయంలో ముఖ్యమైన పెట్టుబడి శ్రద్ధ, క్రమశిక్షణ. నిజం చెప్పాలంటే మైక్రో ఫార్మింగ్‌లో ఆరోగ్యానికి, ఆదాయానికి అన్నింటికీ మంచిది. ఖర్చు ఇంచుమించు జీరో. ప్రతిరోజూ చేతికి ఆదాయం ఇదీ మైక్రో ఫార్మింగ్ రహస్యం. నిర్వహణ, నియంత్రణ సరిగా చేస్తే కొద్దిపాటి భూమి నుంచి కూడా నిత్యం నగదు ప్రవాహం ఉంటుంది. ఈ వ్యవసాయ విధానంలో లక్షల రూపాయలతో కొనే ట్రాక్టర్లు, పవర్ టిల్లర్లు లాంటివి అవసరం లేదు. మనకు అందుబాటులో ఉండే పలుగు, పార, నీళ్లు పోసేందుకు చిన్న క్యాన్ లాంటి చిన్న చిన్న పరికరాలతోనే మైక్రో ఫార్మింగ్ చేయొచ్చు. ఈ వ్యవసాయ పద్ధతి నాలుగు ప్రధాన అంశాలపై ఆధారపడి ఉంటుంది.పావు ఎకరం భూమిలో వ్యవసాయం చేయడం, లాభాలు పొందడం అసాధ్యం అని పలువురు వ్యాఖ్యానించారు. అయితే.. ఒక రైతు మాత్రం అవేమీ పట్టించుకోలేదు. అతని దగ్గర పెద్ద పెద్ద వ్యవసాయ యంత్రాలు లేవు. లక్షల రూపాయలు చేతిలో లేవు. అయితే.. విభిన్నమైన ఆలోచనతో ఒక్కడే కొద్దిపాటి భూమిలో సాంద్ర సూక్ష్మ వ్యవసాయం చేశాడు. కొద్ది రోజుల్లో ఆ రైతు ఆలోచన, కృషి ఫలించాయి. చక్కని దిగుబడులు మొదలయ్యాయి. ప్రతిరోజూ ఆదాయం రావడం మొదలైంది. దీంతో అంతకు ముందు పెదవి విరిచిన వారంతా నోళ్లు వెళ్లబెట్టారు. ఔరా! అంటూ ముక్కున వేలు వేసుకున్నారు. ఈ ముసలోడు ఘటికుడే అనుకున్నారు. వాస్తవానికి కార్పొరేట్ వ్యవసాయం లేదా రసాయనాలతో చేసే సాగు విధానం రాక ముందు మన పూర్వీకులు చిన్న చిన్న కమతాల్లోనే బహుళ పంటలను ప్రకృతి సిద్ధమైన విధానంలో పండించేవారు. అదే విధానాన్ని ఇప్పుడు ఈ వృద్ధుడు ఫాలో అవుతున్నాడు. కచ్చితత్వం, సమయ పాలన, నేల స్వభావాన్ని అర్థం చేసుకోవడం సాంధ్ర సూక్ష్మ వ్యవసాయంలో అతి ముఖ్యమైనవి. ఆ వృద్ధుడు తమ చిన్నపాటి పొలాన్ని ఎలా చక్కగా నిర్వహించాడు? ఎలాంటి దిగుబడులు, ఆదాయం, లాభాలు సాధించాడో చూద్దాం.ఉదయం 8 గంటలకే తన పొలంలో పంట ఉత్పత్తులు అమ్మేందుకు వృద్ధుడు సిద్ధం చేసేవాడు. అంటే ఆ రోజు ఉదయం కోసిన పంట గంటలోనే వినియోగదారుల వంటింట్లో ఉండేవి. ఆ పంట ఉత్పత్తులు వాడిన వారు, మరికొందరి నుంచి సాయంత్రానికి కొత్త ఆర్డర్లు వచ్చేవి. మరుసటి ఉదయమే మళ్లీ అప్పటికప్పుడు కోసిన పంట ఉత్పత్తులను వినియోగదారుల ముంగిట్లో ఉంచేవాడు. తద్వారా ప్రతిరోజూ తన చిన్న భూమి నుంచి ఆ వృద్ధుడికి ఆదాయం వచ్చేది. అంటే నిరంతరం ఒక నగదు ప్రవాహం వ్యవస్థను సృష్టించాడు.సాంధ్ర సూక్ష్మ వ్యవసాయం నాలుగు ముఖ్యమైన అంశాలపై ఆధారపడి ఉంటుంది. వాటిలో మొదటిది మొక్కల సాంధ్రత. అంటే దగ్గర దగ్గరగా మొక్కలు నాటడం. పెంచడం. సాధారణ సాగు విధానంలో మొక్కల మధ్య కాస్త ఎక్కువ దూరం ఉండేలా నాటుతారు. మొక్కల మధ్య యంత్రాలు, మనుషులు తిరిగేందుకు ఖాళీ ఉండాలని ఇలా చేస్తారు. కానీ సాంధ్ర సూక్ష్మ వ్యవసాయ విధానంలో మొక్కల మధ్య అనవరసమైన ఖాళీ అస్సలు ఉండదు.పెరిగిన తర్వాత పక్కపక్కన ఉండే మొక్కల ఆకులు ఒకదానికి ఒకటి తగిలేలా నాటుకోవాలి. దీని వల్ల మూడు లాభాలు ఉంటాయి. మొదటిది నేలకు నీడ ఉంటుంది. నేల మీద సూర్యరశ్మి నేరుగా పడదు. దీనితో నేలలోని తేమ ఆవిరైపోదు. అంటే తక్కువ నీటితోనే పంటలు సాగు చేయవచ్చు. ఇక రెండో లాభం.. కలుపుమొక్కలు రావు. నేల ఖాళీ ఉన్న చోట మాత్రమే కలుపు పెరుగుతుంది. సాంద్ర సూక్ష్మ వ్యవసాయంలో నేల ఖాళీ ఉండదు కాబట్టి కలుపు రాదు. కలుపు తీసే శ్రమ, ఖర్చు ఉండవు. మూడో లాభం అధిక దిగుబడి వస్తుంది. సాధారణ విధానంలో ఒక మొక్క నాటే ప్రదేశంలో మూడు నుంచి, నాలుగు మొక్కలు నాటడం ఈ విధానం ప్రత్యేకత. దాంతో ఆదాయం మూడు రెట్లు పెరుగుతుంది.రెండో అంశం.. నిరంతర పంటల చక్రం. వ్యవసాయంలో ఖాళీ సమయాన్ని అతి పెద్ద శత్రువు అంటారు. ఒక పంట వేసి, అది చేతికి వచ్చే వరకు ఖాళీగా ఉంటే అది నష్టం అనుకోవచ్చు. సాంధ్ర సూక్ష్మ వ్యవసాయంలో ఖాళీ సమయమే ఉండదు. ఉదాహరణకు ఒక మడిలో ముల్లంగి సాగు చేస్తే.. 30 రోజుల్లో పంట చేతికి వచ్చేస్తుంది. ఆ పంట తీసిన వెంటనే పాలకూర లాంటి ఆకుకూరల విత్తనాలు భూమిలో చల్లాలి. ఇలా ఒక పంట వెంటనే మరో పంట వేసుకుంటూ ఉంటే భూమి నుంచి ఏడాది పొడవునా ఆదాయం వస్తుంది. ఒక పంట పూర్తవగానే మరో పంట కోతకు రావాలి. అంటే ఒక చైన్ విధానం అన్నమాట.మూడో అంశం.. నేలను సరిగా పోషించడం. నేలను కేవలం మట్టికుప్పలా చూడడం సాంధ్ర సూక్ష్మ వ్యవసాయ విధానంలో ఉండదు. నేలను జీవం అంటే లివింగ్ ఆర్గానిజంలా చూస్తాం. నేలకు రసాయన ఎరువులు ఇస్తే.. భూసారం నిస్సారం అవుతుంది. కంపోస్ట్, ఆవుపేడ, ఎండిన ఆకులు లాంటి సేంద్రియ పదార్థాలు ఇస్తే.. నేల మరింత సారవంతం అవుతుంది. బలంగా ఉన్న నేలతో పంట బలంగా పెరుగుతుంది. మామూలుగా 40 రోజుల్లో వచ్చే పంట దిగుబడి కేవలం 30 రోజుల్లోనే చేతికి వచ్చేస్తుంది. ఆరోగ్యవంతమైన భూమిలో పెరిగే మొక్కలకు రోగనిరోధక శక్తి ఎక్కువ. వాటికి చీడ పీడలు, క్రిమికీటకాల బెడద ఉండదు. పురుగు మందులకు పెట్టే ఖర్చు జీరో అవుతుంది.ఆరోగ్య వంతమైన పంట దిగుబడులను మధ్యవర్తులు లేకుండా నేరుగా వినియోగదారులకే అమ్మడం సాంధ్ర సూక్ష్మ వ్యవసాయ విధానంలో నాలుగో అంశం. అంటే డైరెక్ట్ మార్కెటింగ్. ఎంత బాగా పంట పండించినా హోల్‌సేల్‌గా అమ్మితే లాభం సరిగా ఉండదు. దాని బదులు రైతు తన చుట్టుపక్కల అపార్ట్‌మెంట్లలో కస్టమర్లకే నేరుగా తీసుకెళ్లి అమ్మడం. ఉదయం కోసిన ఆకు కూరలు, కూరగాయలో గంటలోనే వినియోగదారుల ఇళ్లలో ఉంటాయి. వాటి తాజాదనాన్ని చూసిన కస్టమర్లు మార్కెట్ ధర కన్నా కాస్త ఎక్కువ రేటు కొనేందుకైనా ఆలోచించరు. మన పంట ఉత్పత్తుల క్వాలిటీయే ఒకరి నుంచి మరొకరికి డైరెక్ట్‌గా ప్రచారం అవుతుంది.ఒక పూట తినే బిర్యానీ కొనేందుకు అయ్యే రెండు మూడు వందల రూపాయలతో వందల మొక్కలు తయారయ్యే విత్తనాలు కొనవచ్చు. సాంధ్ర సూక్ష్మ సాగులో పెట్టుబడి కేవలం రైతు శ్రద్ధ, క్రమశిక్షణ. రోజుకు గంట లేదా రెండు గంటల సమయం కేటాయించినా సాంధ్ర సూక్ష్మ వ్యవసాయానికి సరిపోతుంది. కొద్దిగానే ఉన్నా భూమిని మొత్తం ఒకేసారి దున్నకూడదు. కొంచెం కొంచెం భూమిని సాగు కోసం అంచెలంచెలుగా సిద్ధం చేసుకోవాలి. భూమిని 30 అడుగుల పొడవు, 30 అంగుళాల వెడల్పు ఉండేలా మడులు తయారు చేయాలి. 30 అంగుళాల వెడల్పు ఎందుకంటే.. మనం మడిలో అడుగు పెట్టకుండానే రెండు వైపుల నుంచి వంగి పనిచేసుకోవచ్చు. దీని వల్ల నేల గట్టిపడదు.నేలను బాగా దున్ని, లేదా తవ్వి, దానిలో కంపోస్ట్ ఎరువు కలపాలి. దీంతో నేల మొత్తం మెత్తగా స్పాంజ్‌లా ఉండాలి. సిద్ధం చేసుకున్న భూమిలో సాగు కోసం ముందుగా త్వరగా చేతికి పంట వచ్చే తోటకూర, పాలకూర, కొత్తిమీర, ముల్లంగి లాంటి వాటిని వేసుకోవాలి. ఇవన్నీ నెల రోజుల్లో దిగుబడి వస్తాయి. ఈ వారం ఒక మడిలో విత్తనాలు వేస్తే.. తర్వాతి వారం మరో మడిలో వేయాలి. దీనితో ప్రతి వారం మనకు పంట అందుబాటులో ఉంటుంది. ఈ లైన్ పట్టుకుంటే తక్కువ భూమి నుంచి కూడా నిరంతరం ఆదాయం వచ్చే మంత్రం మనకు చిక్కుతుంది. ఇది కేవలం వ్యవసాయం మాత్రమే కాదు. ఒక బిజినెస్ మోడల్ అనవచ్చు. సాధారణ వ్యాపారాల్లో ఉండే రిస్క్ ఈ విధానంలో చాలా తక్కువ.ప్రజలు రోజూ ఆహారం తింటారు. మనం విషం లేని, నాణ్యమైన పంట అందిస్తే.. వినియోగదారులే రైతు వెంట పరుగెత్తుకు వస్తారు. సాంధ్ర సూక్ష్మ వ్వయసాయం అంటే కేవలం డబ్బు సంపాదించేంది మాత్రమే కాదు.. భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన ఆహారం అందించే విధానం.