మునగ ఆకులకు ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉన్న విషయం, మునగ పంట సాగు గురించి గతంలో తెలుసుకున్నాం. ఇప్పుడు మునగ గింజల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, ఇంకా ఏయే రకాలుగా ఉపయోగపడతాయో తెలుసుకుందాం. మునగ ఆకు, కాయలు, విత్తనాలను మన పూర్వీకుల నుంచి పంట పండించి, ఆహారంలో వినియోగిస్తున్నారు. మునగ గింజల్లో ఉండే పాజిటివ్ ఛార్జ్ నీటిలోని నెగెటివ్ చార్జ్‌ను 98 శాతం తగ్గిస్తుందని తాజా అధ్యయనంలో స్పష్టమైంది. అతి తక్కువ ఖర్చుతోనే మురికినీటిని శుభ్రం చేయగల గుణం ఉన్న మునగ గింజలకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ మరింత పెరుగుతుంది. మునగ రైతులకు మరింత అధిక ఆదాయం వచ్చేందుకు తోడ్పడుతుంది.
మునగ విత్తనాల్లో ఎన్నో పోషకాలు ఉన్నాయి.. ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి. మునగ విత్తనాల్లో జింక్, ఐరన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఏ, ఈ, సీలు ఎక్కువ. ఇవి జుట్టు కుదుళ్ల ఆరోగ్యాన్ని పెంచుతాయి. జుట్టును ఆరోగ్యంగా, బలంగా చేస్తాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ జుట్టు రాలకుండా నివారిస్తాయి. జుట్టు బాగా పెరిగేలా చేస్తాయి. మురికి నీటిని సహజంగా శుభ్రం చేస్తాయి. మునగ గింజల్లోని పాజిటివ్ చార్జ్ ప్రోటీన్లు నీటిలోని నెగెటివ్ చార్జ్ గల మురికి కణాలను, బ్యాక్టీరియా, మైక్రో ప్లాస్టిక్స్ అంటే అతి సూక్ష్మ ప్లాస్టిక్ కణాలను ఆకర్షించి, గడ్డకట్టేలా చేస్తాయి. నీటిలో ఉన్న మురికి మొత్తం అడుగుభాగానికి చేరుతుంది. పరిశుభ్రమైన నీరు పైకి ఉంటుంది. ఒక లీటరు నీరు పరిశుభ్రం చేయడానికి ఒక మునగ విత్తనం చాలు. కానీ నీటిలో మురికి ఎక్కువగా ఉంటే రెండు గింజలు వినియోగించాలి.బాగా ఎండిన మునగకాయల్లోని విత్తనాలు బయటికి తీసుకోవాలి. గింజలపై ఉండే పొట్టు పొరలను తీసేయాలి. గింజల్లోపల ఉండే తెల్లని పప్పులు తీసుకోవాలి. అయితే.. పాడైన, రంగు మారిన గింజలు నీటి శుద్ధికి పనికిరావు. తెల్లని మునగ గింజల పప్పును రోటిలో కానీ, మిక్సీలో కానీ వేసి, మెత్తని పౌడర్‌గా చేయాలి. మునగ గింజల పొడికి కొద్దిగా పరిశుభ్రంగా ఉన్న నీరు కలిపి, పేస్ట్ మాదిరి తయారు చేయాలి. ఆ పేస్ట్‌ను చిన్న సీసాలో స్వచ్ఛమైన నీటిలో వేసి, నిమిషం పాటు బాగా కలపాలి. ఇలా చేసినప్పుడు విత్తనాల్లోని శుద్ధి చేసే గుణాలు సిద్ధం అవుతాయి. తెల్లటి మునగ గింజల ద్రవాన్ని పల్చని వస్త్రంలో పోసి వడకట్టాలి. ద్రవంలోని పిప్పిని సెపరేట్ చేసి, తెల్లని పాలు లాంటి ద్రవాన్ని నీటిని శుద్ధి చేయడానికి ఉపయోగించాలి.ఫిల్టర్ చేసిన మునగ గింజల ద్రవాన్ని శుభ్రం చేయాలనుకున్న మురికినీటిలో పోయాలి. నిమిషం పాటు నీటిని వేగంగా కలపాలి. తర్వాత 5 నుంచి 10 నిమిషాలు అతి నెమ్మదిగా ఒకే దిశలో నీటిని తిప్పాలి. నీటిని మెల్లగా తిప్పడం వల్ల మురికి కణాలు ఒకదానికి మరొకటి అతుక్కుని గడ్డలుగా మారిపోతాయి. తర్వాత ఆ నీరు ఉన్న పాత్రను ఒకటి రెండు గంటల పాటు కదపకుండా ఉంచేయాలి. దీంతో మురికినీటిలోని మురికి, బ్యాక్టీరియాలు మొత్తం పాత్ర అడుగు భాగానికి చేరతాయి. స్వచ్ఛమైన నీరు పైకి వస్తుంది. పైకి చేరిన శుభ్రమైన నీటిని జాగ్రత్తగా మరో పాత్రలోకి తీసుకోవాలి. ఇలా శుభ్రమైన నీటిని వేడిచేసి, చల్లార్చి, మరోసారి వడకట్టుకుని తాగితే మంచిదని నిపుణుల సూచన.నీటి ఎద్దడిని తట్టుకుని, అతి తక్కువ ఖర్చుతోనే వేగంగా పెరిగే మునగ పంట సాగుకు భారతదేశం అత్యంత అనువైనదిగా అధ్యయం తేల్చింది. ‘ఏసీఎస్ ఒమేగా’ జర్నల్ ప్రచురించిన తాజా అధ్యయనం మునగ గింజలతో కలిగే అత్యంత కీలకమైన ఉపయోగం గురించి వెల్లడించింది. నీటిలోని మైక్రో ప్లాస్టిక్స్‌ను మునగ గింజల పొడి తొలగించి, మురికి నీటిని పరిశుభ్రం చేస్తుందనే విషయం వెల్లడించింది. చాలా సూక్ష్మంగా ఉండే మైక్రో ప్లాస్టిక్స్ ముక్కలు నదులు, భూగర్భ జలాలు, ఆహారం చివరికి మానవ శరీరంలో కూడా ఉన్నట్లు సైంటిస్టులు కనుగొన్నారు. వాటిని నివారించడం చాలా కష్టం. అయితే.. అతి స్వల్ప ఖర్చుతో తయారయ్యే మునగ గింజల పొడి వాటిని వేరుచేస్తుందని పరిశోధనల ద్వారా సైంటిస్టులు తేల్చారు.నీటిని శుద్ధి చేసుకోవాలంటే రసాయనాలు, ఇతర పదార్థాల కోసం ఖర్చు ఎక్కువే అవుతుంది. అయితే.. దేశీయంగా మన రైతులే పండించే ముదిరిన మునగ కాయల్లోని గింజలతో చాలా సులువుగా నీటి శుద్ధి సాధ్యం అవుతోంది. తక్కువ ఖర్చుతోనే మురికిని శుద్ధి చేసి, స్వచ్ఛమైన నీరు అందించే మునగ గింజలకు భవిష్యత్తులో మంచి డిమాండ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.