వేగంగా అంతరించిపోతున్న 500 రకాల దేశీ విత్తనాలను సేకరించారు. వాటిని జన్యుపరంగా మార్పులేవీ చేయకుండా సహజ పంటల విధానంలో పండిస్తున్నారు. ఆ విత్తనాలను దేశంలోని ఔత్సాహిక రైతులకు అమ్ముతున్నారు. మన పక్కటెముకల మాదిరిగా వంపులు తిరిగిన ఆకృతి గల టమోటాలు, అత్యంత భారీ గుమ్మడికాయలు, ఘాటైన మిర్చిలు, నలుపు, ఎరుపు, పచ్చరంగుల మిర్చిలు, దేశీ వంగ విత్తనాలు.. ఇలా సాగుబడి నుంచి కనుమరుగైపోతున్న అనేక దేశీ విత్తనాలను సేకరించి, పునరుత్పత్తి చేసి, విక్రయిస్తూ దేశీ విత్తనాల రక్షకుడిగా మారారు మనవరి ప్రదీప్.. 31 ఏళ్ల ప్రదీప్ తమిళనాడులోని వెల్లూరు జిల్లా లప్పయ్‌క్రిష్ణాపురంలో కొద్దిపాటి భూమిని అద్దెకు తీసుకుని అంతరించిపోతున్న దేశీ కూరగాయల విత్తనాలు పండిస్తున్నారు. వాటిని జాగ్రత్తగా నిల్వ ఉంచుతున్నారు.
ప్రపంచాన్ని కోవిడ్ మహమ్మారి అతలాకుతలం చేసినప్పుడు ఆయన తన మెడికల్ రిప్రజెంటేటివ్ ఉద్యోగం వదిలేశారు. ఏ పల్లెటూరిలో, ఏ గిరిజన ప్రాంతంలో అరుదైన దేశీ విత్తనాలు ఉంటే అక్కడల్లా తిరిగి ఆయా విత్తనాలు సేకరించారు. అయితే.. 2020 నవంబర్‌లో జరిగిన ప్రమాదంలో కాలు విరగడంతో ప్రదీప్ జీవిత గమ్యం మారిపోయింది. తన భవిష్యత్తు గురించి ఆలోచించుకునేందుకు సమయం చిక్కింది. విరిగిన కాలు నయం అవుతున్న రోజుల్లోనే ప్రదీప్ పలు సమాజసేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పర్యావరణ హితమైన విత్తనాలను సేకరించి, వాటిని కంపోస్ట్ ఎరువు, మట్టి మిశ్రమంలో పెట్టి, సీడ్ బాల్స్‌గా చేసేవారు. వాటిని సమాజ సేవా కార్యక్రమాలలో రిటర్న్ గిఫ్ట్‌లుగా అందజేసేవారు.తమిళనాడులో ఆర్గానిక్ ఫార్మింగ్ పితామహుడిగా ప్రసిద్ధి చెందిన జి.నమ్మాళ్వార్ ఫొటో ఒక కార్యక్రమంలో ప్రదీప్‌కు కనిపించింది. దీంతో నమ్మాళ్వార్ గురించి ప్రదీప్ తెలుసుకోవడం ప్రారంభించారు. ఈ క్రమంలో ఆయన జన్యుపరంగా మార్పు చెందిన విత్తనాలు, హైబ్రిడ్ విత్తనాలు, దేశీ విత్తనాల గురించిన అధ్యయనం చేయడం ప్రదీప్ జీవితంలో మంచి టర్నింగ్ పాయింట్ అయింది. దేశీ విత్తనాలు వేగంగా కనుమరుగైపోతున్న విషయం అర్ధం అయింది. అలాంటి విత్తనాలను రైతుల కోసమే కాకుండా పర్యావరణ పరిరక్షణ, ఆహార వైవిధ్యం కోసం వాటిని సేకరించడం ప్రారంభించారు. ఈ క్రమంలో ప్రదీప్ 2021 జనవరిలో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు.ప్రదీప్ కుటుంబానికి వ్యవసాయ భూమి లేదు. దీంతో 2021 డిసెంబర్‌లో ఏడాదికి రూ.20 వేల చొప్పున ఇచ్చేలా ఐదు ఎకరాల భూమిని కౌలుకు తీసుకున్నారు. ఆ భూమిలో అరుదైన దేశీ విత్తనాల సాగు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ప్రదీప్ వివిధ సాంప్రదాయ విత్తన రకాలను సేకరించేందుకు తమిళనాడులోని అనేక పల్లెటూర్లు, గిరిజన గ్రామాలు తిరిగారు. ఆయా గ్రామాల్లోని గిరిజనులు, వృద్ధులైన రైతులు ఇప్పటికీ దాచి ఉంచిన అనేక పాతతరం విత్తనాలను సేకరించారు. ఈ పర్యటన సమయంలోనే ఒక్క తమిళనాడు రాష్ట్రంలో దాదాపు 800 రకాల వంకాయ రకాలు ఉండేవని ప్రదీప్ విన్నారు. వాటిలో ఇప్పుడు వంద రకాలు మాత్రమే ఉన్నట్లు తెలుసుకున్నారు.ఇలా ఒక ఏడాదిలో ప్రదీప్ జన్యుపరంగా స్వచ్ఛమైన 500 రకాల తల్లి విత్తనాలను, నాటేందుకు ఉపయోగపడే మొక్కల సామగ్రిని సేకరించారు. వాటిలో 100 దుంప రకాలు, మరో 50 రకాల కట్‌చేసి నాటే కూరగాయల మొక్కలు, మరో 350 వెరైటీల దేశీ విత్తనాలు సమకూర్చుకున్నారు. వాటిలో 50 రకాల టమోటా, వంగ విత్తనాలు, సుమారు 80 రకాల మిర్చి రకాలు ఉన్నాయి. హైబ్రిడ్ రకం టమోటా సాగు మొదలైన తర్వాత దేశీ టమోటా సాగు చాలా వేగంగా తగ్గిపోయింది. ఇప్పుడు కొద్ది మంది రైతులు మాత్రం ఈ విత్తనాలను తయారు చేసి రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు.
మనవరి ప్రదీప్ సేకరించి, రక్షిస్తున్న విత్తనాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లె టమోటా విత్తనాలు కూడా ఉన్నాయి. ఆరెంజ్, పసుపు రంగులు కలగలిసి ఉండి, మంచి పుల్లని రుచి కలిగి ఉండే అరుదైన మదనపల్లె టమోటా విత్తనం ఉనికి నుంచి కనుమరుగైపోయిందనే చెప్పాలి. ప్రదీప్ సేకరించిన అరుదైన విత్తనాల్లో చెర్రి టమోటా విత్తనం ఒకటి. సాంప్రదాయ బద్ధంగా చేసుకునే రసంలో వేసేందుకు ఈ స్వీట్ టమోటాలను గిరిజనులు పండించేవారు. ధ్రువ ప్రాంతానికి చెందిన టమోటా, రిబ్‌డ్, మధురమైన టమోటాలను హైబ్రిడ్ టమోటా రాక ముందు రెండు తరాల ముందు వరకు రైతులు పండించేవారని గ్రామాల్లోని వృద్ధులు చెప్పారని ప్రదీప్ అన్నారు. ఇలాంటి టమోటాలను సుమారు 200 ఏళ్ల క్రితం వరకు పండించేవారని తన అధ్యయనంలో తెలిసిందన్నారు ప్రదీప్.తమిళనాడులో మాత్రమే ఉండే పూర్తి దేశీ విత్తన రకాలైన మూల్ కత్తిరిక్కయ్ వంగ విత్తనాలు ప్రదీప్ వద్ద ఉన్నాయి. లేతగా, ప్రత్యేక తీపితో ఉండి, పొడవుగా, లైట్ గ్రీన్ రంగులో ఇవి ఉంటాయి, అరుదైన వయమ్‌పట్టి పూసాని గుమ్మడి విత్తనాలు ప్రదీప్ సేకరించారు. ఇవి అర కిలో నుండి అత్యధిక బరువులో కూడా ఉంటాయి. పెళ్లిళ్లు లాంటి పంక్షన్‌లతో వీటిని సాంప్రదాయ బహుమతిగా ఇచ్చేవారు. పూర్వకాలంలో ఈ రకం గుమ్మడి కాయలు 40 కిలోల బరువు వరకు ఉండేవట. వాతావరణ మార్పుల వల్ల ఇప్పుడు 22 కిలోలు ఉన్న వాటిని కూడా పెద్ద గుమ్మడికాయలుగా పరిగణిస్తున్నారు.తమిళనాడుకు కేరళ పొరుగు రాష్ట్రమే కాబట్టి అక్కడి రైతులు, సేకరించే వారి నుంచి ప్రదీప్ అనేక మిర్చి రకాల విత్తనాలను తెచ్చి పునరుత్పత్తి చేస్తున్నారు. ఇప్పుడు ప్రదీప్ పొడవుగా ఉండే తమిళనాడుకు చెందిన విత్తనాలు, గుండ్రంగా ఉండే గుంటూరు రకం, గూబ గుయ్యిమనే కారం ఉండే గాంధారి రకాలతో పాటు సుమారు 80 రకాల మిర్చి విత్తనాలను నిల్వ ఉంచారు. ప్రదీప్ సేకరించిన అరుదైన విత్తనాల్లో జవధు కొండల ప్రాంతంలోని గిరిజన తెగల నుంచి సేకరించిన విత్తనాలు కూడా ఉన్నాయి. గిరిజన తెగల నుంచి ప్రదీప్ నిత్యం తేనె కొంటూ ఉంటారు. వారితో అరుదైన విత్తనాల గురించి వివరాలు తెలుసుకుంటారు. వారు ఇప్పటికీ తమ ఇంటి ఆహార అవసరాల కోసమే కొన్ని రకాల పంటలు పండిస్తారు కాబట్టి ఆ వివరాలు తెలుసుకుంటారు.దేశీ విత్తనాలు సహజంగా ఆయా ప్రాంతాల వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా పెరుగుతాయి. అనేక దేశీ రకాల పంటలు తెగుళ్లు, క్రిమి కీటకాలను తట్టుకుంటాయి. హైబ్రిడ్ రకాల కన్నా ఇవి అతి వృష్టి, అనావృష్టి పరిస్థితులను, వాతావరణంలో మార్పులను తట్టుకుని బతుకుతాయి కాబట్టి దేశీ విత్తనాల పంటలకు తాను ఇంత ప్రాధాన్యం ఇచ్చానంటారు ప్రదీప్. దేశీ విత్తనాలు చక్కని రుచి, ఆకృతి కలిగి, వండుకుని ఆహారంగా తీసుకునేందుకు బాగుంటాయంటాయి. శిబిరాలు నిర్వహించి, పర్యావరణ హితమైన వ్యవసాయం, టెర్రస్ గార్డెనింగ్, ఆర్గానిక్ సాగు పద్ధతుల గురించిన రైతులకు అవగాహన కల్పిస్తుంటారు ప్రదీప్. మనవరి ప్రదీప్ ఇప్పుడు దేశీ కూరగాయల విత్తనాల ఉత్పత్తి కోసం, తమ ఇంటి అవసరాల కోసం పండిస్తున్నారు. దేశీ విత్తనాలు కావాలంటే ప్యాకెట్ రూ.30 చొప్పున కొరియర్ ద్వారా దేశ వ్యాప్తంగా పంపిస్తుంటారు. ఒక సీజన్‌లో తాను 120 రకాల దేశీ విత్తనాలను ఇస్తుంటానని ప్రదీప్ వెల్లడించారు. అనేక అరుదైన స్వచ్ఛమైన విత్తనాలను సేకరించి, నిల్వ ఉంచే ఇతరులతో తర వద్ద ఉన్న విత్తనాలను మారకం చేస్తుంటానన్నారు. మన పూర్వీకుల ఆహార వారసత్వాన్ని కొనసాగించేందుకు ఇలా దేశీ విత్తనాలను సేకరించి, నిల్వ ఉంచున్నట్లు ప్రదీప్ తెలిపారు.