Site icon V.E.R Agro Farms

శ్రీగంధం సాగు.. ఈ తప్పులు చేయొద్దు

శ్రీగంధంలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. శ్రీగంధం అంటే చందనం పేస్ట్‌ ముఖానికి రాస్తే చర్మాన్ని ముడతలు పడకుండా ఉంచుతుంది. ముఖానికి చక్కని కాంతివంగా చేస్తుంది. ఎండ వల్ల నల్లబడ్డ చర్మానికి శ్రీగంధం మంచి ఉపశమనం ఇస్తుంది. శ్రీగంధం పేస్ట్‌ను తలకు రాసుకుంటే తలనొప్పి తొందరగా తగ్గిపోతుంది. శ్రీగంధం నూనెలోని యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఫంగల్‌ గుణాలు చర్మవ్యాధులు, ఇన్ఫెక్షన్లు, వాపులను తగ్గిస్తాయి. శ్రీగంధం సువాసన మన మెదడును ప్రశాంతంగా ఉంచుతుంది. ధ్యానం చేసేవారికి మనసు కేంద్రీకృతం అయ్యేందుకు తోడ్పడుతుంది. పూజలు, శుభకార్యాల్లో శ్రీగంధం వినియోగిస్తే వాతావరణం పవిత్రంగా మారి, సానుకూల శక్తి వస్తుంది. శ్రీగంధం చెక్క నుంచి తీసిన నూనెను సబ్బులు అగరబత్తులు, సుగంధ ద్రవ్యాలు, సౌందర్య సాధనాల తయారీ వినియోగిస్తారు. శ్రీగంధం సాగు చేస్తే దీర్ఘకాలంలో ఎక్కువ లాభాలు ఇస్తుంది.

మొన్నా మధ్య కాలంలో ఎక్కడ ఫార్మ్‌ ల్యాండ్‌ బిట్లు వేసినా వాటిని తయారు చేసిన భూమి వ్యాపారులు ప్రధానంగా ప్రస్తావించి అంశం శ్రీగంధం మొక్కలు పెట్టాం. ఆ ఫార్మ్‌ల్యాండ్‌ బిట్లు కొనుగులో చేసిన వారికి వాటి ద్వారా భవిష్యత్తులో మంచి లాభదాయక ఆదాయం వస్తుందని చెప్పేవారు. అయితే.. శ్రీగంధం మొక్కలు నాటడమే కాదు అవి ఎలాంటి నేలల్లో బాగా పెరుగుతాయి? వాటి యాజమాన్య పద్ధతులు ఏంటి? తీసుకోవాల్సిన ప్రాథమిక జాగ్రత్త ఏమిటి? ఎలాంటిం తప్పులు చేయకూడదు, ప్రణాళికా బద్ధంగా, శాస్త్రీయ దృక్పథంతో సాగు చేసే విధానం గురించి రైతు రాము వెల్లడించారు. శ్రీగంధం అత్యంత విలువైన కలప పంటలలో ఒకటి. సరైన ప్రణాళిక, శాస్త్రీయ దృక్పథంతో సాగు చేసిన రైతులకు దీర్ఘకాలంలో అద్భుతమైన ఆదాయం, వారి భవిష్యత్‌ తరాలకు నిలకడగా ఉండే ఆర్థిక భద్రత అందిస్తుంది. శ్రీగంధం సాగు ప్రారంభించే ముందు రైతు తెలుసుకోవాల్సిన ప్రాథమిక అంశాలు, తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏమిటో చూద్దాం.శ్రీగంధం సాగు చేయడానికి దక్షిణ భారతదేశంలోని వాతావరణం, నేలలు అనుకూలం. ఎర్రమట్టి నేలలు, ఇసుక పాత నేలలు, కంకర నేలల్ఓ శ్రీగంధం మొక్కలు వేగంగా పెరుగుతాయి. నది పరీవాహక ప్రాంతాలు, కొండవాలు ప్రాంతాలు, నీరు తొందరగా ఇంకిపోయే కంకర నేలలు దీనికి అనుకూలం. వర్షపు నీరు ఒకేచోట నిల్వ ఉంటే శ్రీగంధం మొక్కలకు వేరుకుళ్ళు తెగులు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే నీరు సులభంగా బయటకు వెళ్లిపోయేలా వాలు ఉన్న భూమిని ఎంచుకోవాలి. నేలలో ఉండే ఆమ్ల, క్షార గుణాలను తెలిపే pH విలువ శ్రీగంధం పెరుగుదలలో కీలక పాత్ర పోషిస్తుంది. శ్రీగంధం సాగుకు 6.0 నుండి 7.5 మధ్య pH విలువ కలిగిన నేలలు చక్కగా అనుకూలిస్తాయి. భూమిని సిద్ధం చేసుకునే ముందే మట్టి పరీక్ష చేయించి pH విలువను చూసుకోవడం మంచిది. శ్రీగంధం మొక్కలు నాటే సమయం దాని జీవనాన్ని, జీవిత కాలాన్ని నిర్ణయిస్తుంది. శ్రీగంధం మొక్కలను మే చివరి వారం లేదా జూన్ నుండి సెప్టెంబర్ వరకు అంటే నైరుతి రుతుపవనాల కాలంలో నాటేందుకు ఎంతో అనుకూలం. నీటి వసతి, డ్రిప్ ఇరిగేషన్ సదుపాయం ఉంటే అక్టోబర్ వరకు కూడా నాటుకోవచ్చు. తీవ్రమైన ఎండలు ఉండే వేసవి కాలంలో  శ్రీగంధం మొక్కలను అస్సలు నాటకూడదు.అలాగే.. నాణ్యమైన శ్రీగంధం మొక్కను ఎంచుకోవడంపైనే తోట భవిష్యత్‌ ఆధారపడి ఉంటుంది. కనీసం 20 నుండి 30 సంవత్సరాల వయస్సు ఉన్న ఆరోగ్యకరమైన తల్లి శ్రీగంధం చెట్టు నుండి సేకరించిన విత్తనాల ద్వారా పెంచిన మొక్కలనే ఎంపిక చేసుకోవాలి. నర్సరీ నుండి తెచ్చే మొక్కల వయసు 6 నెలల లోపు ఉండేలా చూసుకోవాలి. 6 నెలలు దాటిన మొక్కల వేర్లు క్యారీ బ్యాగ్ దాటి భూమిలోకి వెళ్లడం వల్ల, వాటిని మార్చేటప్పుడు వేర్లు దెబ్బతిని మొక్క ఎదుగుదల తగ్గుతుంది. పక్క కొమ్మలు ఎక్కువగా లేని, నిటారుగా ఉన్న ఆరోగ్యకరమైన మొక్కలను ఎంచుకోవాలి.శ్రీగంధం మొక్క సైజును బట్టి గుంతల పరిమాణం నిర్ణయించాలి. 6 నెలల లోపు చిన్న మొక్కలకు అర అడుగు నుండి ఒక అడుగు వెడల్పు, అర అడుగు లోతు గుంత సరిపోతుంది. అదే 8-12 నెలల మొక్క అయితే కనీసం ఒక అడుగు లోతు, మొక్క చుట్టూ ఒక అడుగు వెడల్పు ఉండేలా గుంతలు తవ్వాలి. మొక్క నాటే ముందే భూమిని, గుంతలను శుద్ధి చేస్తే స్థానిక సిలీంధ్రాల నుండి రక్షణ ఉంటుంది. మొక్కలు నాటడానికి నెల రోజుల ముందే బాగా కుళ్ళిన పశువుల ఎరువును సిద్ధం చేసుకోవాలి. గుంతలు పూడ్చే సమయంలో పశువుల ఎరువుతో పాటు ట్రైకోడెర్మా విరిడి లేదా సాఫ్ వంటి శిలీంధ్ర నాశినిని కలిపి గుంతలలో వేయాలి. ఇది వేరుకుళ్ళు, హానికర బ్యాక్టీరియాను అరికడుతుంది. తక్కువ నీటితో పెరిగే కలప జాతి మొక్క శ్రీగంధం. అతిగా నీరు అందిస్తే మొక్కలు చనిపోయే ప్రమాదం ఉంది. తోటలో వర్షపు నీరు లేదా అదనపు నీరు నిల్వ ఉండకుండా నీరు సులభంగా బయటకు వెళ్లిపోయేలా వాలు ఏర్పాటు చేసుకోవాలి.శ్రీగంధం పాక్షిక పరపోషక మొక్క. తనకు కావలసిన ఆహారంలో 70 శాతం మాత్రమే కిరణజన్య సంయోగక్రియ ద్వారా తయారు చేసుకోగలదు. మిగతా 30 శాతం పోషకాల కోసం ఇతర మొక్కల వేర్లపై ఆధారపడుతుంది. మొదటి సంవత్సరంలో ప్రాథమిక హోస్ట్ ప్లాంట్‌గా గడ్డి జాతి, పప్పుధాన్యాల జాతి మొక్కలను క్యారీ బ్యాగ్‌లోనే శ్రీగంధంతో పాటు పెంచాలి. ఇలా చేస్తే శ్రీగంధం మొక్క తొలిదశ పెరుగుదలకు పనికొస్తుంది. చెట్లు పెద్దవి అయ్యాక వాటికి గాలి, వెలుతురు సరిగ్గా అందడానికి, అంతర పంటల సేద్యానికి స్థలం అవసరం అవుతుంది. ప్రాక్టికల్ అనుభవం ప్రకారం మొక్కకి మొక్కకి మధ్య, వరుసల మధ్య కనీసం 14 అడుగుల దూరం ఉండేలా నాటుకోవటం ఉత్తమం. ఈ దూరం వల్ల భవిష్యత్తులో ట్రాక్టర్లు తిరగడానికి, తోట శుభ్రం చేయడానికి, చెట్లు త్వరగా లావుగా తయారవడానికి అనుకూలంగా ఉంటుంది.శ్రీగంధం సాగులో తెగుళ్ళ నివారణ, సంరక్షణ చర్యల తెలుసుకుందాం. శ్రీగంధం మొక్క వయస్సు ఒక సంవత్సరం నుంచి మొదళ్ల వద్ద చిన్న చిన్న పురుగులు లేదా వాటి గుడ్లు కనిపిస్తాయి. ప్రతి మొక్కను జాగ్రత్తగా గమనిస్తూ, మొదళ్ల వద్ద ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. మొక్క బాగా పెరిగి 1.5 నుండి 2 ఏళ్లు వచ్చాకే ప్రూనింగ్ చేయాలి. అయితే.. సరిగ్గా పెరగని మొక్కలకు మాత్రం ప్రూనింగ్‌ చేయకూడదు. మొక్క మొత్తం ఎత్తులో 30% మాత్రమే ప్రూనింగ్ చేయాలి. మిగతాది 70% భాగం పైనే ఉండాలి. ఉదాహరణకు.. 8 అడుగుల మొక్క ఉంటే కింద 2.5 అడుగుల వరకు మాత్రమే కత్తిరించాలి. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లోనే ప్రూనింగ్ చేయడానికి అనువైన సమయం. ఎండాకాలంలో శ్రీగంధం మొక్కను కట్ చేస్తే నీటి తడికి మళ్లీ చిన్న చిన్న కొమ్మలు వచ్చి శ్రమ వృథా అవుతుంది. ఈ మొక్కలను ప్రూనింగ్‌ చేయడానికి కత్తులు వాడకూడదు. హాక్సా బ్లేడ్ లేదా సాప్రో కట్టర్ ఉపయోగించాలి. కొమ్మ చివర అర అంగుళం లేదా పావు అంగుళం వదిలిపెట్టి కొమ్మకు పగుళ్లు రాకుండా కత్తిరించాలి.వర్షాకాలంలో బలమైన గాలులు వచ్చినప్పుడు మొక్కలు పడిపోకుండా ఉండేందుకు మొక్క చుట్టూ అడుగు ఎత్తులో మట్టి దిమ్మ కట్టాలి. తోటలో పిచ్చిగడ్డి, తుంగ పెరగకుండా రోటోవేటర్‌తో ఎప్పటికప్పుడు శుభ్రంగా చేయాలి. బాగా ఎండిన పశువుల ఎరువును మాత్రమే శ్రీగంధం మొక్కలకు వేయాలి. పచ్చి ఎరువు వేస్తే తెగుళ్లు వచ్చే ప్రమాదం ఉందని గ్రహించాలి. ఉగాది సమయంలో తెచ్చి పెట్టుకున్న ఎరువును వర్షాకాలం ముందు దున్ని, మొక్కల మొదళ్లలో 1-2 తట్టలు వేసి మట్టి కప్పడం వల్ల మొక్కకు మంచి బలం అందుతుంది. మొక్కల కాండంపై రంధ్రాలు పడి, కింద పిండిలాగా రాలుతుంటే కాండం తొలిచే పురుగు ఉన్నట్లు గుర్తించాలి. దాని నివారణకు మోనోక్రోటోఫాస్ మందును నీటిలో ఒక భాగం, 4 భాగాల నీరు కలిపి రంధ్రంలో ఇంజెక్ట్ చేస్తే పురుగు చనిపోతుంది. ఇది చలికాలం ప్రారంభంలో ఎక్కువగా వస్తుంది.మొక్కలను నాటే సమయంలోనే వాటి మధ్య కనీసం 14 అడుగుల దూరం ఉంచితే గాలి, వెలుతురు బాగా తగిలి మొక్క దృఢంగా పెరుగుతుంది. మధ్యలో ఉండే ఖాళీ స్థలంలో మొక్కలకు ఐదారు ఏళ్లు వచ్చే వరకు చిక్కుడు, వంగ వంటి కూరగాయలను అంతర పంటలుగా సాగు చేసుకోవచ్చు. శ్రీగంధం త్వరగా పెరగాలంటే వాటి మొదలు వద్ద కనీసం అడుగు దూరంలో ప్రాథమిక హోస్ట్ మొక్కలు క్రోటాన్స్ లాంటివి పెంచాలి. హోస్ట్‌ మొక్కల వేర్లు శ్రీగంధం వేర్లతో కలిసి మొక్కకు అవసరమైన పోషకాలు అందించడంలో సహాయపడతాయి.శ్రీగంధం సాగులో విజయం సాధించాలంటే కేవలం మొక్కలు నాటడమే కాదు, క్షేత్రస్థాయిలో వచ్చే సమస్యలను అర్థం చేసుకుని సరైన సమయంలో చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం.  శ్రీగంధం మొక్క సొంతంగా అన్ని పోషకాలను గ్రహించలేదని ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా. దానికి  హోస్ట్ ప్లాంట్ అంటే ఆశ్రయ మొక్క తోడుగా ఉండాలి. అయితే ఆశ్రయ మొక్కను ఎంపిక చేయడంలో, నాటడంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. శ్రీగంధం పక్కన ‘సరుగుడు’ వంటి వేగంగా పెరిగే మొక్కలను చాలా దగ్గరగా నాటకూడదు. సరుగుడు చెట్టు వేగంగా 30 నుంచి 40 అడుగులు ఎత్తు పెరిగిపోయి శ్రీగంధం మీదకు వాలిపోతాయి. దీనితో శ్రీగంధం మొక్క వంకర్లు తిరిగి సరిగ్గా పెరగదు. శ్రీగంధానికి, ఆశ్రయ మొక్కకు మధ్య కనీసం 6 నుండి 7 అడుగుల దూరం ఉండాలి. శ్రీగంధం నాటిన వెంటనే పర్మనెంట్ హోస్ట్ వేయకూడదు. శ్రీగంధం నాటిన రెండేళ్ల తర్వాత మాత్రమే శాశ్వత ఆశ్రయ మొక్కలు నాటాలి. ఉదయం పూట సూర్యరశ్మి శ్రీగంధం మొక్కపై నేరుగా పడేలా ఆశ్రయ మొక్కల దిశను ఎంచుకోవాలి. ట్రాక్టర్‌తో దుక్కి దున్నేటప్పుడు అది తిరిగేందుకు ఇబ్బంది లేకుండా లైన్లకు కాస్త పక్కగా నాటుకోవాలి. ఒకవేళ ఆశ్రయ మొక్క శ్రీగంధం కంటే ఎత్తు పెరిగి ఇబ్బంది కలిగిస్తుంటే, దానిని మొదలు దాకా నరకకుండా భూమి నుంచి 6 అడుగుల ఎత్తులో కత్తిరించాలి. ఇలా చేయడం వల్ల ఆశ్రయ మొక్క చనిపోదు, శ్రీగంధానికి పోషణ అందిస్తూనే ఉంటుంది. శ్రీగంధం ఎత్తును మించి పెరగకుండా అదుపులో ఉంటుంది. సంక్రాంతి తర్వాత జనవరి, ఫిబ్రవరి నెలలు మాత్రమే ప్రూనింగ్‌కు అనుకూలం.శ్రీగంధం, ఆశ్రయ మొక్కల మధ్య మిగిలిన ఖాళీ స్థలాన్ని వృథా చేయకుండా డ్రాగన్ ఫ్రూట్, వంకాయ వంటి అంతర పంటలు పండించవచ్చు. దీనితో భూమి సద్వినియోగం అవుతుంది. శ్రీగంధం దిగుబడి వచ్చేలోపే రైతుకు అదనపు ఆదాయమూ వస్తుంది. పొలం మధ్యలో నాటిన శ్రీగంధం మొక్కల కంటే, పొలం గట్ల మీద నాటిన మొక్కలు చాలా వేగంగా, బలంగా పెరుగుతాయి. గట్ల వెంట అప్పటికే ఉన్న టేకు, కానుగు, చీమచింత వంటి పెద్ద చెట్ల వేర్ల నుండి శ్రీగంధానికి సహజంగానే మంచి పోషకాలు లభిస్తాయి. పొలం మధ్యలోని చెట్లు చేవగా తయారవడానికి 15 ఏళ్లు పడితే, గట్లపై పెంచిన చెట్లు 12 నుండి 13 సంవత్సరాలకే కోతకు వస్తాయి. వీటిలో గట్టి కలప (హార్డ్ వుడ్) కూడా ఎక్కువగా తయారవుతుంది. అందుకే శ్రీగంధం చెట్ల పెంపకానికి గట్లను ఎక్కువగా వినియోగిస్తే మేలు. శ్రీగంధం మొక్కలకు వర్షాకాలంలో చిగుర్లు ఎక్కువ వచ్చి పొట్టిగా కనిపిస్తున్నాయని చాలామంది కొమ్మలు కత్తిరిస్తారు. కానీ వర్షాకాలంలో కొమ్మలు కత్తిరిస్తే.. వర్షపు నీరు కత్తిరించిన భాగాల ద్వారా కాండం లోపలికి వెళ్లి చెట్టుకు తెగుళ్లు/కుళ్లు తెగులు సోకే ప్రమాదం ఉంది. అందుకే ప్రూనింగ్ చలికాలం ముగిసే సమయంలో మాత్రమే చేయాలి.సాధారణ వ్యవసాయంతో పాటు రైతులు తమ పొలం గట్లపైన లేదా ఖాళీ ప్రదేశాలలో తమ సామర్థ్యాన్ని బట్టి 20 నుండి 50 శ్రీగంధం మొక్కలు పెంచితే తక్కువ పెట్టుబడితో భవిష్యత్‌ తరాలకు గొప్ప ఆస్తి అందించిన వారవుతారు. శ్రీగంధం సాగులో సరైన యాజమాన్య పద్ధతులు, సరైన దూరంలో హోస్ట్ ప్లాంట్ల పెంపకం, సమయానికి ప్రూనింగ్ చేస్తే ముందుగానే నాణ్యమైన దిగుబడి సాధించవచ్చు. శ్రీగంధం చెట్టు సిరులు ఇచ్చే నిత్య పచ్చని చెట్టు. తక్కువ పెట్టుబడి, తక్కువ నీటి వినియోగంతో దీర్ఘకాలికంగా అత్యధిక లాభాలు తెచ్చిపెడుతుంది.

 

Exit mobile version