పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ప్రకృతి వ్యవసాయం అంటే గౌరవం. వ్యక్తిగతంగా తనకు వ్యవసాయం అంటే చాలా మక్కువ అంటారు. ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం అందాలని, భావితరాలు ఆరోగ్యంగా ఉండాలని తాను కోరుకుంటానన్నారు. ఆరోగ్యకరమైన ప్రజలు ఉంటేనే దేశం బలంగా ఉంటుందని పవర్‌స్టార్ తెలిపారు. ఎరువులు లేకుండా సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయం చేయాలనేది తన తపన అన్నారు పవన్ కళ్యాణ్. భూమ్మీద ప్రజలు మాత్రమే కాకుండా చాలా జీవాలు బ్రతకాలనే ఉద్దేశంతో ప్రకృతి వ్యవసాయం ప్రారంభించినట్లు పేర్కొన్నారు.
ఈ క్రమంలో తనకు తన సోదరుడు నాగబాబు జర్మనీ శాస్త్రవేత్త రాసిన ‘గడ్డిపరకతో విప్లవం’ అనే పుస్తకం బహూకరించారన్నారు. వ్యవసాయం ఆదాయంతో పాటు మనకు విజ్ఞానం కూడా ఇవ్వాలనేది ఆ పుస్తకం చదివాక తెలిసిందన్నారు. అంతే కాకుండా వ్యవసాయం ద్వారా మానసిక ఆనందం కూడా పొందాలనేది ‘గడ్డిపరకతో విప్లవం’ చదివాక తెలిసిందన్నారు. వ్యవసాయం ద్వారా మంచి మనుషులు, మంచి సమాజం ఏర్పడాలనేది జర్మన్ శాస్త్రవేత్త రాసిన పుస్తకం సారాంశమన్నారు పవన్ కళ్యాణ్. ఆ పుస్తకం ద్వారా ప్రభావితం అయిన తాను తన వ్యవసాయ క్షేత్రంలో కొంతమేరకు సాధన కూడా చేసినట్లు వెల్లడించారు. ప్రకృతిపరంగా ఏవేవి మొక్కలు సహజంగా ఎదగాలో వాటిని పెంచడం ప్రారంభించానన్నారు.
కరోనా విపత్తు పరిస్థితుల్లో వేలాది మంది పట్టణాలు, నగరాలు వదిలి తమ తమ సొంతూళ్లకు వెళ్లిపోయారని పవన్ కళ్యాణ్ అన్నారు. అలాంటివారు తమ ఊళ్లోనే ఉపాధి పొందేందుకు వ్యవసాయ సాగు నమూనాలు రూపొందిస్తున్నామని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ సందర్భంలో విజయరామారావు తనకు ఓ అద్భుతమై నమానా గురించి వివరించారని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఒక కుటుంబానికి 50X50 అడుగుల చతురస్రాకారపు భూమిలో ఎంత పంట పండుతుంది? ఓ కుటుంబంలోని నలుగురు కలిసి ఆ భూమిలో ప్రకృతి వ్యవసాయం చేస్తే ఎంత ఆదాయం వస్తుందనేది విజయరామారావు వివరించారని పవన్ కళ్యాణ్ చెప్పారు. విజయరామారావు చెప్పిన మాటలు విన్నాక తన వ్యవసాయ క్షేత్రంలోనే ఐదారు నమూనాలు తయారుచేసి, అందరికీ ముఖ్యంగా యువతకు తెలియజేస్తే మంచిదని భావించానన్నారు.
అనంతకోటి జీవ వైవిధ్యంతో ఈ భూమ్మీద మనిషి మనుగడ ఉందని విజయరామారావు అన్నారు. వానపాములు, సూక్ష్మజీవులు వ్యవసాయం చేస్తాయన్నారు. భూమి పుట్టినప్పుడు ఎలాంటి పోషకాలతో ఉందో.. పారిశ్రామికీకరణ వచ్చిన తర్వాత ఆరోగ్యం విషయంలో ఎంతో వెనక్కి వెళ్లిపోయామన్నారు. మన తండ్రులు, తాతలు, ముత్తాతలు ఉన్నంత ఆరోగ్యంగా మనం లేకపోవడానికి పారిశ్రామికీకరణే ప్రధాన కారణం అన్నారు. ప్రకృతిని వదిలేసి, ప్రకృతిలో లేని అసహజ విధానాల్లో పంటలు పండించడమే ఇందుకు కారణమన్నారు. తిరిగి మన ఆరోగ్యాన్ని మనం పొందాలంటే ప్రకృతి వ్యవసాయం వైపు వెళ్లడం ఒక్కటే మార్గమని విజయరామారావు పేర్కొన్నారు.
ప్రకృతి పంటలంటే ప్రేమతో పవన్ కళ్యాణ్..

