Site icon V.E.R Agro Farms

ప్లాస్టిక్ బాటిళ్లతో శాశ్వత డ్యామ్‌

ఎకో బ్రిక్స్‌ అంటే ఏంటో తెలుసా? వాటితో నిర్మించిన డ్యాం వందేళ్ళ దాకా నిలిచి ఉంటుందంటే నమ్ముతారా? ఎకో బ్రిక్స్ అంటే మరేదో కాదు.. ప్లాస్టిక్‌ సీసాలు. మామాలుగా అయితే.. ప్లాస్టిక్‌తో పర్యావరణానికి ఎంత ముప్పో మనందరికీ బాగా తెలుసు. ప్లాస్టిక్‌ వాడకాన్ని ప్రభుత్వాలు నిషేధించాయి. ప్లాస్టిక్‌ వాడకం నివారణ కోసం ప్రభుత్వాల్లు కోట్ల రూపాయలు ఖర్చు చేసి మరీ ప్రచారం నిర్వహిస్తున్నాయి. రోడ్లపైన, చెత్తకుప్పల్లోనూ పడేసిన ప్లాస్టిక్ బాటిళ్లు మన కళ్ల ముందే ఏళ్ల పాటు అలాగే ఉండడం మనం చూస్తూనే ఉంటాం. ప్లాస్టిక్‌ను కాలిస్తే పర్యావరణాన్ని దెబ్బతీసే పొగ వస్తుంది. పూడ్చిపెడితే భూమి ముప్పుగా మారుతుంది. వందల ఏళ్ల పాటు చెడిపోని ప్లాస్టిక్‌ సీసాలను పర్యావరణ హితమైన ఎకో బ్రిక్స్‌గా మార్చి, కొండవాలులో కురిసిన వర్షపునీరు కాలువలో సమృద్ధిగా పట్టి ఉంచేలా చక్కని డ్యామ్‌ నిర్మించవచ్చు. కరువు ప్రాంతాల్లో నీటి విప్లవం సృష్టించవచ్చు. నేలలను శాశ్వత పచ్చని పంట భూములుగా మార్చవచ్చు. మధ్యప్రదేశ్‌లోని ఝబువా, అలీరాజ్‌పూర్ ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా ఈ అద్భుతాన్ని చేసి, చూపించారు పర్యావరణ ప్రేమికుడు మణికాంత్ పటేల్.

ఝబువా, అలీరాజ్‌పూర్ ప్రాంతాల్లో కొండలు ఎక్కువ. అక్కడి భూములు గట్టి రాతి నేలలుగా ఉంటాయి. వర్షాకాలంలో మూడు, నాలుగు నెలలు భారీ ఎత్తున  వర్షాలు కురిసినా, ఆ నీరు నేలలోకి ఇంకేది కాదు. కొండ వాలుల వెంట వర్షపునీరు వేగంగా వెళ్లిపోయి వాగులు, నదుల్లో కలిసిపోయేది. వర్షాలు ఆగిన తర్వాత మిగిలిన ఎనిమిది నెలలూ ఆ ప్రాంతమంతా కరువుతో అల్లాడిపోయేది. బావులు ఎండిపోయేవి, భూగర్భ జలాల కోసం వేసిన చేతి పంపులు కొడితే వేడిగా గాలి వచ్చేది కానీ నీటిచుక్కలు కూడా వచ్చేవి కావు. తాగునీటి కోసం మహిళలు బిందెలు పట్టుకుని మైళ్ల దూరం నడిచి వెళ్లాల్సి వచ్చేది. నీటి సదుపాయం లేక పొలాలు పండేవి కాదు. పొట్టకూటి కోసం, కూలి పని కోసం ఆ ప్రాంతాల్లోని యువకులు ఇతర రాష్ట్రాలకు పొట్ట పట్టుకొని వలసలు వెళ్లాల్సిన దుస్థితి ఎదురయ్యేది.అయితే.. వర్షపు నీటిని ఆపేందుకు ఝుబువా, అలీరాజ్‌పూర్‌ ప్రాంతంలో ఇంతకు ముందు ప్రయత్నాలు జరగలేదా? అంటే జరిగాయి! సిమెంట్ వాడేసిన తర్వాత వాటి సంచుల్లో ఇసుక, మట్టి నింపి కాలువలకు అడ్డు కట్టేవారు. కానీ.. వర్షాల తర్వాత వచ్చే ఎండ వేడికి అవి చిరిగిపోయేవి. వర్షపు నీటి ధాటికి కొట్టుకునిపోయేవి. ఇక పెద్ద కాంక్రీట్ చెక్‌డ్యామ్‌లు కట్టాలంటే పదిహేను, ఇరవై లక్షల రూపాయల వరకు ఖర్చ చేయాలి. అంత భారీ మొత్తం ఖర్చు చేయాలంటే చిన్న చిన్న గ్రామ పంచాయతీలకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయి?ఇలాంటి పరిస్థితులను చక్కగా అవగాహన చేసుకున్న పర్యావరణ హితుడు మణికాంత్ పటేల్ ఓ మంచి ప్రయోగంతో ముందుకు వచ్చారు. ఇసుక, రాళ్లు నింపిన సిమెంట్‌ సంచుల దారాలు కొన్ని నెలలకే కరిగిపోయి, చిరిగిపోయేవి. ఇక్కడే మణికాంత్ పటేల్‌ ఆలోచన పదునుదేరింది. వందల ఏళ్ల పాటు చెక్కుచెదరని ప్లాస్టిక్‌ సీసాలు వినియోగించి డ్యామ్‌ నిర్మిస్తే.. నీరు నిల్వ చేసే డ్యామ్‌కు ఎలాంటి ఢోకా ఉండదని భావించారాయన. ప్లాస్టిక్ బాటిళ్లలో ఇసుక, మట్టి, చిన్న చిన్న రాళ్లు పూర్తిగా ఎలాంటి ఖాళీ లేకుండా నింపి డ్యామ్‌కు ఉపయోగిస్తే.. శాశ్వతంగా ఉంటుందని భావించారు. ఈ విషయం ఝుబువా, అలీరాజ్‌పూర్‌ ప్రాంతాల రైతులు, ప్రజలకు వివరించారు. అయితే.. ఆయన ఆలోచన విన్న అనేక మంది నవ్వేశారు. కొండల నుంచి అధిక ఒత్తిడితో పరుగెత్తే వర్షపునీటిని ఆపడం ప్లాస్టిక్‌ సీసాలు ఆపుతాయా? అని పరిహాసం చేశారు.రోడ్ల పక్కన ఎక్కడ చూసినా వాడి, పడేసిన నీళ్ల బాటిళ్లు, కూల్‌డ్రింక్ సీసాలు కనిపిస్తూనే ఉంటాయి. వాటిని చూస్తే చిరాకొస్తుంద కూడా. అయితే.. అవే పంట పొలాలకు నీరు అందించే బలమైన సాధనంగా మారతాయని ఎవరైనా ఊహిస్తారా? కానీ మధ్యప్రదేశ్‌లోని ఝబువా, అలీరాజ్‌పూర్ ప్రాంతాల్లో ఒక సామాన్యుడి ఆలోచన, ఊరి ప్రజల కష్టం కలిసి ప్లాస్టిక్ బాటిళ్లతోనే నీటిని నిలిపే అద్భుతం సృష్టించాయి. కరువు నేలలో పచ్చదనాన్ని నింపిన ఈ కథ ప్రతి రైతుకూ, ప్రతి సామాన్యుడికీ స్ఫూర్తిదాయకం అనే చెప్పాలి.సాగునీటి సమస్యకు పరిష్కారం చూపిన వ్యక్తి పర్యావరణ ప్రేమికుడు మణికాంత్ పటేల్. రోడ్లపై, చెత్తకుప్పల్లో పడేసిన ప్లాస్టిక్ బాటిళ్లు వందల ఏళ్ల పాటు చెడిపోకుండా ఉంటాయని అందరికీ తెలుసు. వాటిని కాలిస్తే పొగ వస్తుంది, పూడ్చిపెడితే భూమికి ప్రమాదం. వందల ఏళ్ల పాటు చెడకుండా ఉండే గుణాన్ని ఉపయోగంలో పెట్టారు మణికాంత్ పటేల్‌. ప్రపంచమంతా చెత్త అనుకునే ప్లాస్టిక్ బాటిళ్లతోనే పెద్ద ఎత్తున వర్షపునీటిని ఆపే బలమైన డ్యాంలా ఎందుకు మార్చకూడదు? అని ఆలోచించారు.ప్లాస్టిక్‌ సీసాలతో డ్యామ్ ఏంటి అని ఊరి జనం మొదట్లో నమ్మలేదు. ఇదేమి ఆలోచన? సాధ్యమైన పనేనా? అని సందేహించారు కూడా. కానీ మణికాంత్ పటేల్ పట్టుదల వదిలిపెట్టలేదు. ముందుకే సాగారు. ఊరిలోని పలువురు యువకులను తోడు తీసుకుని దగ్గరలోని పట్టణాలు, స్క్రాప్ దుకాణాల నుంచి వేలాది ఖాళీ ప్లాస్టిక్ బాటిళ్లు సేకరించారు. వీటినే ‘ఎకో బ్రిక్స్’ (పర్యావరణానికి మేలు చేసే ఇటుకలు) అనవచ్చు.ప్లాస్టిక్ సీసాల ఎకో బ్రిక్స్‌ వినియోగించే పద్ధతిలో పెద్ద పెద్ద యంత్రాలు గానీ, క్లిష్టమైన సాంకేతికత గానీ లేవు. ఊరి ప్రజలు మామూలుగా నిత్యం చేసుకుని పనుల్లాగే చాలా సులభంగా చేశారు. ఒకటి లేదా రెండు లీటర్ల ఖాళీ బాటిళ్లలో పొడి ఇసుక, సన్నని మట్టి, చిన్న గులకరాళ్లను కర్రతో గట్టిగా కూరారు. లోపల ఖాళీ లేకుండా గట్టిగా నింపడం వల్ల ఆ బాటిల్ రాయిలా గట్టిగా మారింది. తర్వాత మూతను గట్టిగా బిగించారు. కాలువ అడుగున రాళ్లతో పునాది వేశారు. దానిపైన మట్టి నింపిన బాటిళ్లను ఇటుకల్లా పేర్చారు. బాటిళ్లు జారిపోకుండా, కదలకుండా ఇనుప కడ్డీలు, వైర్ జాలీతో కట్టారు. ముందు వెనుక పెద్ద రాళ్లు పేర్చి, మధ్యలో తడి మట్టి నింపారు.నిజానికి ఇది బయట నుంచి చూస్తే రాళ్లతో కట్టిన అడ్డుకట్టలా కనిపిస్తుంది. కానీ లోపల బలం అంతా ఆ ప్లాస్టిక్ బాటిళ్లదే. 2018 వర్షాకాలంలో భారీ వర్షాలకు వరద నీరు పోటెత్తినప్పుడు ఈ అడ్డుకట్ట నీటి వేగాన్ని తట్టుకుని నిలబడింది. బాటిళ్లకు ఉండే స్వల్పంగా సాగే గుణం వల్ల నీటి తాకిడి తగ్గింది. క్రమంగా ఆ గోడ వెనుక సారవంతమైన ఒండ్రు మట్టి చేరి, మరింత గట్టిపడింది. దీంతో మణికాంత్ పటేల్‌ ఆలోచన చక్కని కార్యరూపం దాల్చింది. ఎవరూ ఊహించనంత బలీయమైన డ్యామ్‌గా రూపుదిద్దుకుంది.ఈ ఒక్క విజయం గ్రామ ప్రజల్లో కొత్త ఆశలు నింపింది. ముందుగా మణికాంత్‌ పటేల్‌ వ్యూహం అర్థం కాక సందేహించిన వాళ్లే స్వయంగా బాటిళ్లు ఏరి తీసుకురావడం మొదలుపెట్టారు. సుమారు ముప్పైకి పైగా గ్రామాల్లోని వాగులు, కాలువలపై ఇలాంటి అడ్డుకట్టలు నిర్మించారు. పదిహేను, ఇరవై లక్షల రూపాయలు ఖర్చయ్యే కాంక్రీట్ పనిని, కేవలం పది, పదిహేను వేల రూపాయల ఖర్చుతో వైర్లు, బాటిళ్లు ఉపయోగించ సాధించడం విశేషం. ఎకో బ్రెక్స్‌ డ్యాం నిర్మాణాలతో రైతులకు, ప్రాంత ప్రజలకు వచ్చిన లాభాలు కళ్ల ముందు ప్రత్యక్షం అయ్యాయి.

 

 

Exit mobile version