Site icon V.E.R Agro Farms

పోషకాల అమ్మ దానిమ్మ

దానిమ్మ పండులో మనకు లభించే ప్రయోజల కారణంగా దాన్ని పోషకాల అమ్మ అనవచ్చు. దీంట్లో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువే. రక్తం పెరిగేందుకు, గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు, రోగనిరోధక శక్తి మెరుగు పరిచేందుకు, జీర్ణక్రియ చక్కగా జరిగేందుకు దానిమ్మ పండు బాగా పనిచేస్తుంది. దానిమ్మలో లభించే ఐరన్‌, విటమిన్లు కొత్త రక్తం తయారుచేసి, రక్తహీనత లేకుండా చేస్తాయి. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, రక్తం మంచిగా ప్రసరణ అయ్యేలా చేసి, హార్ట్‌ ఎటాక్‌ నుంచి రక్షిస్తాయి. దానిమ్మలోని విటమిన్ సీతో రోగనిరోధక శక్తి పెరిగి, మనల్ని ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. దానిమ్మ గింజల్లో ఉండే పీచుపదార్థం మలబద్ధకాన్ని తగ్గిస్తుంది, జీర్ణక్రియ సరిగా జరిగేలా చేస్తుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు మన చర్మాన్ని కాంతివంతం చేస్తాయి. చర్మం ముడతలు పడకుండా రక్షిస్తాయి. దానిమ్మలో విటమిన్ కే లభిస్తుంది. రోజూ ఒక దానిమ్మ పండు తింటే దీర్ఘకాలిక రోగాలు రాకుండా కాపాడుతుందని నిపుణులు చెబుతారు. దానిమ్మ పండు తింటే మూత్రపిండాల ఆరోగ్యం మెరుగువుతుంది. కిడ్నీలో రాళ్లు తయారవకుండా నిరోధిస్తుంది. దానిమ్మ పండులో లభించే పాలీ ఫెనాల్స్‌ బ్లడ్ సుగర్‌ స్థాయిలను తగ్గించి, ఇన్సులిన్‌ సెన్సివిటీని మెరుగు పరుస్తాయి.

రుచికరంగా ఉండి, ఆరోగ్య ప్రయోజనాలు అందించే ఔషధ మొక్క దానిమ్మ. దీని పండ్లు మాత్రమే కాకుండా ఆకుల్లోనూ అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దానిమ్మ మొక్కలోని ప్రతి భాగం ఔషధంలా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతారు. దానిమ్మ ఆకులు కామెర్లు, విరేచనాలు, కడుపు నొప్పి, నిద్రలేకపోవడం లాంటి సమస్యలకు మంచి ఔషధం అంటారు ఆయుర్వేద వైద్య నిపుణులు. దానిమ్మ ఆకుల కషాయం కొవ్వును తగ్గిస్తుంది.జోగులాంబ గద్వాల జిల్లాలోని బస్వాచెర్వు గ్రామ రైతు పుల్లమ్మగారి విజయభాస్కర్‌రెడ్డి ఐదేళ్లుగా భగవ దానిమ్మ పంట సాగుచేస్తున్నారు. నాలుగుసార్లు ఆయన దానిమ్మ పంట దిగుబడి తీశారు. విజయభాస్కర్‌రెడ్డి ఆరు ఎకరాల్లో దానిమ్మ సాగు చేపట్టారు. ఆరు ఎకరాల్లో ఆయన 2,200 ఒక్కో ఎకరంలో 380 మొక్కలు నాటి పెంచుతున్నారు. మొక్కల మధ్య 8 అడుగులు, వరుసల మధ్య 12 అడుగుల దూరంలో నాటారు. అంటే సాళ్ల మధ్య 12 అడుగుల ఖాళీ ఉంచారు. మొక్కలు నాటిన ఏడాదిన్నరకు ఆయనకు తొలి పంట వచ్చింది. అప్పుడు తనకు 8 టన్నుల పంట దిగుబడి వచ్చిందన్నారు. అప్పటి నుంచి ఏడాదికి మూడుసార్లు దానిమ్మ పంట తీస్తున్నారు. జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఒకసారి, మే, జూన్‌లో మరోసారి ఆగస్టు, సెప్టెంబర్‌లో ఇంకోసారి దానిమ్మ పంట కోసుకోవచ్చు. నాలుగోసారి మాత్రం 40 టన్నుల దిగుబడి వచ్చినట్లు తెలిపారు. అయితే.. తాము 60 టన్నులు వస్తుందని భావించామన్నారు.భగవ దానిమ్మ మొక్కలను మహారాష్ట్ర నుంచి కొని తెచ్చినట్లు రైతు విజయభాస్కర్‌రెడ్డి చెప్పారు. ఒక్కో మొక్క రూ.32 చొప్పున కొన్నట్లు తెలిపారు. వర్షాకాలంలో తాము దానిమ్మ మొక్కలను నాటామన్నారు. మొక్క నాటేందుకు భూమిలో రెండు అడుగుల లోతు, రెండు అడుగుల వెడల్పుతో గుండ్రని గుంతలు తీయాలి. గుంతల్లో ఎరువు, పొరేట్‌ గుళికలు వేసి, మొక్క నాటాలి. మొక్కలు కాస్త పెద్దవి అయ్యాక భూమికి బోదెలు చేస్తారు. ఒక్కో బెడ్‌ మీద మధ్యలో, రెండు అంచుల్లో రెండు మొత్తం మూడు లైన్ల డ్రిప్ ఇచ్చారు. దానిమ్మ మొక్కలకు నీటి సరఫరా పుష్కలంగా ఇవ్వాలి. ఎండాకాలంలో నీళ్లు మరింత ఎక్కువ అందించాలి.పూత పిందెగా మారినప్పటి నుంచి మొక్కలకు నీరు ఎక్కువగా ఇవ్వాలి. కాయలు కోసిన తర్వాత మూడు నెలలు మొక్కలకు విశ్రాంతి సమయం కింద వదలాలి. తర్వాత మొక్కలకు ఎరువు వేసి, బాగా నీరు పెట్టాలి. చెట్టు బాగా తయారైన తర్వాత నెల రోజులు నీళ్లు ఇవ్వకుండా నేలను పొడిగా ఉంచాలి. తర్వాత ఆకు రాలిపోయే మందు కొట్టాలి. ఆకు రాలిన తర్వాత మళ్లీ భూమికి నీళ్లు వదలాలి. దీంతో దానిమ్మ మొక్కలకు ఒకేసారిగా చిగుర్లు, పూత వస్తాయని విజయభాస్కర్‌రెడ్డి చెప్పారు. దానిమ్మ మొక్కలకు పూత మొదలైన తర్వాత పంట కోతకు రావడానికి 6 నెలల సమయం పడుతుంది. మొక్కలకు రెస్ట్ పీరియడ్‌లో ఎరువు ఎక్కువగా ఇచ్చి, డ్రిప్‌ ఇస్తే.. సరిపోతోంది. ఆ తర్వాత డ్రిప్‌ ద్వారా నీళ్లు ఇచ్చుకుంటే సరిపోతుంది. డ్రిప్‌ ద్వారానే కాకుండా దానిమ్మ తోటకు నేరుగా నీల్లు పారించవచ్చు.దానిమ్మ మొక్కలకు తెగుళ్లు కాస్త ఎక్కువగానే వస్తాయన్నారు విజయ భాస్కర్‌రెడ్డి. ప్రతి నాలుగు రోజులకు ఒకసారి పురుగు మందులు తప్పనిసరిగా స్ప్రే చేయాల్సిందే. ఫంగిసైట్స్‌ కూడా వస్తాయి. దానిమ్మ సెన్సిటివ్‌ క్రాప్‌. ఏ మాత్రం అశ్రద్ధ చేసినా నష్టం రావచ్చు. వర్షం పడిన తర్వాత ఫంగిసైడ్‌ స్ప్రే చేయకుండా ఒక్క రోజు ఆలస్యం చేసినా కాయలకు అంతరకోస్‌ డిసీజ్‌ వచ్చి, డ్యామేజ్‌ అవుతాయి. కాయలపై ఫంగిసైడ్‌ మందు కాస్త ఎక్కువ కొట్టిన చోట ఎండ తగిలి సన్‌బర్న్‌ అవుతుంది. అయితే.. లోపల ఉన్న గింజలకు నష్టం ఏమీ ఉండదు. దానిమ్మ చెట్లకు విశ్రాంతి సమయంలో 15 రోజులకు ఒకసారి పురుగు మందులు కొట్టాలి. కరెంట్‌ ఉన్నప్పుడు పవర్ స్ప్రేతోను, కరెంట్ లేనప్పుడు ట్రాక్టర్‌ను వినియోగించి మందులు స్ప్రే చేస్తారు.దానిమ్మ సాగులో ప్రధానంగా ఎక్కువగా పురుగు మందులకు అయ్యే మెయింటెనెన్స్‌ ఖర్చే ఎక్కువ. పంట కాలంలో దానిమ్మకు ఎకరానికి లక్ష రూపాయల వరకు పురుగు మందులకు, డ్రిప్‌లో ఇచ్చే ఎరువుల కోసం ఖర్చవుతుంది. మొక్కల మధ్య పెరిగే కలుపు తీసేందుకు కూలీలకు ఖర్చు వస్తుంది. వీడ్‌ మ్యాట్ వేసుకుంటే కొంత ఖర్చు తగ్గుతుంది. కలుపు తీసేందుకు ఆరు ఎకరాలకు ఒకసారికి లక్ష రూపాయలు అయితే.. వీడ్‌ మ్యాట్‌కు రూ.4 లక్షలు అవుతుంది. ఒక పంట కాలంలో మనుషులతో నాలుగుసార్లు కలుపు తీయాల్సి ఉంటుంది. దానిమ్మ చెట్ల కొమ్మలకు కాయలు కాసినప్పుడు విరిగిపోకుండా ఉండేందుకు చెట్ల వరుసల్లో ఐదు చెట్లకు ఒకటి చొప్పున 12 అడుగుల ఎత్తున సిమెంట్‌ పోల్‌ వేయాలి. ఎక్కువ కాయలు ఉన్న కొమ్మలను వైర్లతో పైకి లాగి సిమెంట్ పోల్స్‌కు కట్టాలి. ఇలా ఆరు ఎకరాల్లో విజయ భాస్కర్‌రెడ్డికి 3 లక్షల రూపాయలు అయింది. ఒకసారి పోల్‌ వేసుకుంటే చాలా ఏళ్లు ఉంటుంది కాబట్టి దీని ఖర్చు ఒక్కసారే ఉంటుంది. దానిమ్మ మొక్కలు బాగా పెరిగేందుకు, చెట్లకు పశువుల ఎరువు వేయాలి. చెట్టుకు 20 కిలోల పశువుల ఎరువు ఏడాదికి ఒకసారి వేస్తే చాలు. పోల్స్‌ కాకుండా దానిమ్మ సాగు కోసం విజయ భాస్కర్‌రెడ్డి ఆరు ఎకరాలకు రూ. 12 లక్షలు ఖర్చు చేశారు. దానిమ్మ పండ్లు కోసేందుకు, గ్రేడింగ్‌ చేసేందుకు, హైదరాబాద్‌లోని బాటసింగారం ఫ్రూట్‌ మార్కెట్‌కు పంపేందుకు అయ్యే రవాణా ఖర్చు అన్నీ కలిపి ఆరు ఎకరాలకు లక్ష రూపాయల వరకు ఉంటుంది.దానిమ్మ కాయలు కోసే ఒక్కో కూలీకి రోజుకు రూ.400 ఇవ్వాలి. ఆరు టన్నుల కాయలు తెంపేందుకు 15 మంది కూలీల అవసరం ఉంటుంది. అంటే కూలీలకు రూ.6 వేలు కూలి అవుతుంది. గ్రేడింగ్‌ చేసే ఒక్కో కూలీకి రోజుకు వెయ్యి రూపాయలు ఇవ్వాలి. నలుగురు కూలీలు గ్రేడింగ్‌కు సరిపోతారు. అంటే 10 టన్నుల కాయలు కోసి, గ్రేడింగ్‌ చేసేందుకు రూ.10 వేలు ఖర్చు వస్తుంది. కూలీలకు భోజనాల ఖర్చు రైతే భరించాలి. మొత్తం మీద టన్ను దానిమ్మ కాయలకు రూ.2 వేలు ఖర్చవుతుంది. మార్కెట్‌కు పంపేందుకు ట్రాన్స్‌పోర్ట్‌ ఖర్చు కూడా రైతు పెట్టుకోవాలి. నిల్వ కూలీలతో పాటు అన్ని ఖర్చులూ పోయినా, రైతుకు ఆదాయం బాగానే ఉంటుంది.దానిమ్మ కాయలను సైజును బట్టి గ్రేడింగ్ చేస్తారు. అనుభవం ఉన్న కూలీలతో గ్రేడింగ్‌ చేయించాలి. మచ్చలను బట్టి కూడా గ్రేడింగ్ అవుతాయి. దానిమ్మ కాయలను 11 రకాలుగా గ్రేడింగ్ చేస్తారు. పెద్దసైజులో ఉండి, మచ్చలు లేకుండా నీట్‌గా ఉండే కాయలను డబుల్ Sగా గ్రేడింగ్‌ చేస్తారు. మరింత పెద్ద సైజు ఉంటే ట్రిపుల్‌ S, 4 S గ్రేడ్‌లు కూడా చేస్తారు. ఆ తర్వాత సింగిల్ S వెరైటీగా గ్రేడింగ్‌ చేస్తారు. అలాగే A1, A2 రకాలు ఉంటాయి. పది కిలోల బాక్స్‌ డబుల్‌ S కాయలకు రూ.1,490 వరకు రైతులు ధర వస్తుంది. ఈ రేటు మార్కెట్‌లో డిమాండ్‌ను బట్టి తగ్గుతూ, పెరుగుతూ ఉండొచ్చు. చిన్న కాయలైతే బాక్స్‌కు రూ.500 పలుకుతుంది. ఒక లైన్‌లో ఉన్న దానిమ్మ చెట్ల నుంచి కాయలు ఒక టన్ను వరకు దిగుబడి వస్తాయి. ఒక్కో చెట్టు నుంచి 18 నుంచి 20 కిలోల కాయలు వస్తాయి.సున్నితంగా ఉండే దానిమ్మ కాయలను రాత్రి వచ్చే డేగ అనే రెక్కల పురుగులు కుట్టి, చెట్టు నుంచి రాలిపోతాయి. డ్యామేజ్‌ అయిన వాటిని తీసుయాలి. ఇలా 10 శాతం కాయలు డ్యామేజ్‌ అవుతాయి. సన్‌బర్న్‌, డేగ పురుగులు ఇలా మొత్తం పంటలో 20% కాయలు డ్యామేజ్‌ అవుతాయి. దానిమ్మ సాగును రైతులు చాలా జాగ్రత్తగా చేసుకుంటేనే లాభదాయకం. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా, నిర్లక్ష్యం చేసినా నష్టం వచ్చే ప్రమాదం ఉంటుంది. అన్నీ బాగుంటే దానిమ్మ పంటలో వరి సాగు కన్నా రెండు రెట్లు, ఒక్కోసారి మూడు రెట్ల లాభం రావచ్చని రైతు విజయభాస్కర్‌రెడ్డి చెప్పారు.

దానిమ్మ సాగులో మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే రైతు విజయ భాస్కర్‌రెడ్డిని 8341045253 నెంబర్‌లో సంప్రదించవచ్చు.

 

 

Exit mobile version