ముందు ఆయనో శాస్త్రవేత్త. ఇస్రోలో ప్రాజెక్ట్ సైంటిస్ట్‌గా పనిచేశారు. ఉన్నత హోదా. అయినా ఆయన ‘మళ్లీ మట్టి వైపు’ అంటూ తన మూలాల దిశగా అడుగేశారు. తండ్రి అనారోగ్యం, ప్రకృతి పంటల సాగుపై ఉన్న మక్కువ ఆయన ‘మళగి మన్నగె’ తిరిగి మట్టిలోకి పేరిట సేంద్రీయ విధానంలో ఖర్జూర సాగు చేపట్టారు. 2013లో రెండున్నర ఎకరాల్లో ఖర్చూర సాగు ప్రారంభించారు. ఏటా నాలుగు టన్నులకు పైగా నాణ్యమైన సేంద్రీయ ఖర్జూర పంటను తీస్తున్నారు. తద్వారా ప్రతి సంవత్సరం 15 లక్షల రూపాయలకు పైగా ఆదాయం సంపాదిస్తున్నారు. సైంటిస్ట్ నుంచి సేంద్రీయ రైతుగా మారి విజేతగా నిలిచిన ఆయనే కర్ణాటకకు చెందిన దివాకర్ చెన్నప్ప. ఆర్గానిక్ రైతులకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు.
ఆర్గానిక్ ఖర్జూ సాగులో విజయాలు సాధించిన దివాకర్ చెన్నప్ప ఆలోచనను పలువురు అవహేళన చేశారు. మంచి ఉద్యోగం వదిలేసి వ్యవసాయం చేయాలనుకున్న దివాకర్ నిర్ణయం సరికాదని సందేహ పడ్డారు. వారే ఇప్పుడు దివాకర్ చెన్నప్పను విజయాల గురించి గర్వంగా చెబుతున్నారు. మంచి జాబ్ వదిలి వ్యవసాయంలోకి రావాలనుకునే వారికి దివాకర్ గొప్ప ఉదాహరణగా నిలిచారు. కృషి, పట్టుదల, సరైన ప్రణాళిక ఉంటే మట్టిలో మాణిక్యాలు పండించవచ్చని దివాకర్ నిరూపించారు. మట్టిని నమ్మి వ్యవసాయం చేయడం ఎంతో సంతృప్తి ఇస్తోందని దివాకర్ చెప్పారు. ఉన్నత ఉద్యోగం కంటే ప్రకృతి సిద్ధమైన పంట పండించడంలోనే నిజమైన సార్థకత, సంతృప్తి ఉన్నాయని దివాకర్ నమ్మారు. ప్రకృతి పంటలో విజయాలు సాధించిన దివాకర్ ప్రయాణం గురించి తెలుసుకుందాం.దివాకర్ చెన్నప్ప బెగూర్ అనే చిన్న గ్రామంలో జన్మించారు. బెంగళూరు నగరం ఇబ్బడిముబ్బడిగా విస్తరించడంతో ఆ గ్రామం ఉనికిని కోల్పోయింది. తమ తండ్రి వ్యవసాయం కొనసాగించేందుకు బెంగళూరుకు 100 కిలోమీటర్ల దూరంలో బలవంతంగానే భూమి కొనాల్సి వచ్చిందన్నారు. బెంగళూరు ఇస్రోలో ప్రాజెక్ట్ సైంటిస్ట్‌గా పనిచేసిన ప్రొఫెసర్ దివాకర్ చెన్నప్ప నగర జీవితాన్ని విడిచిపెట్టి తమ పల్లెటూరు గౌరీబిదనూరు తాలూకా సాగనహళ్లిలో ఆర్గానిక్ రైతుగా అవతారం ఎత్తారు. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన దివాకర్ తన మూలాలకు తిరిగివచ్చారు. కర్ణాటకలో ప్రత్యేకంగా ఆర్గానిక్ విధానంలో ఖర్చూరం పండించిన తొలి రైతుగా దివాకర్ నిలిచారు. దివాకర్ తండ్రి ఎప్పుడూ తన కొడుకును వ్యవసాయానికి దూరంగానే ఉంచారు. జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదగాలనే కోరుకునే వారాయన. దివాకర్. తమను ఒక్క రోజు కూడా వ్యవసాయ భూమిని చూసే అవకాశం ఇవ్వలేదన్నారు. మంచి చదువుల కోసం తమను బెంగళూరు పంపించారని తెలిపారు.బెంగళూరు ఇస్రోలో ప్రాజెక్ట్ శాస్త్రవేత్తగా ఉద్యోగం రావడంతో 2009 వరకు తమ వ్యవసాయ మూలాలకు దూరంగా ఉండాల్సి వచ్చిందని దివాకర్ తెలిపారు. ఆ ఏడాదే తన తండ్రికి స్ట్రోక్‌తో పక్షవాతం రావడంతో దివాకర్ బెంగళూరు వదిలిపెట్టి తమ గ్రామానికి వచ్చేశారు. ఒక ఏడాది పాటు తన తండ్రితోనే దివాకర్ గడిపారు. నగర జీవితాన్ని తాను ఇష్టపడడం లేదనే విషయం ఆ సమయంలోనే దివాకర్‌కు అర్థం అయింది. అప్పుడే దివాకర్ జపాన్ రైతు మసనోబు ఫుకోవా రాసిన ‘ఒన్ స్ట్రా రివల్యూషన్’ పుస్తకం చదివారు. ఆ పుస్తకం చదువుతున్న నాలుగో రోజునే తాను వ్యవసాయం చేయాలనే నిర్ణయం తీసుకోవడానికి ధైర్యం వచ్చిందన్నారు 47 ఏళ్ల దివాకర్. ఆ తర్వాత రైతుగా మారినా వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదన్నారు దివాకర్. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే ఎడారుల్లో పండే ఖర్జూరాన్ని సహజమైన పద్ధతిలో సాగు చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే.. ఇస్రో సైంటిస్ట్‌తో తమ కుమార్తెను పెళ్లి చేసిన తన అత్తమామలు తన నిర్ణయాన్ని ససేమిరా అన్నారు. కానీ.. తన మనస్సు ఏమి కోరుకుంటోందో అర్థమైన తాను వ్యవసాయం వైపే మొగ్గుచూపినట్లు దివాకర్ వివరించారు.వ్యవసాయం ప్రారంభించిన తొలిరోజుల్లో దివాకర్ తన తండ్రి, ఇతర రైతుల మాదిరిగానే చిరుధాన్యాల్లో రాగి, కందులు, మొక్కజొన్నపంటలు సాగుచేశారు. వీటి కోసం ఆయన రూ.22 వేలు ఖర్చుచేస్తే.. రూ.33 వేలు ఆదాయం వచ్చింది. దివాకర్ గతంలో సంపాదించిన దానితో పోలిస్తే రూ.11 వేల లాభం చాలా తక్కువే. అందుకే తండ్రి తనను రైతుగా మారాలనే కోరిక రాకుండా చేశారని దివాకర్ తల్లి గుర్తుచేశారు. పైగా తన చిన్నారి కూతురు బాధ్యతలను కూడా ఆమె గుర్తుచేశారు. అప్పటికే ఇస్రో ప్రాజెక్ట్ సైంటిస్ట్‌గా తాను తెచ్చుకున్న గుర్తింపును కూడా ఆమె ప్రస్తావించారు. ఈ విషయాలు తనను చాలాకాలం పాటు ఇబ్బంది పెట్టాయని దివాకర్ చెప్పారు. వీటన్నింటి నేపథ్యంలో గుంపులో గోవిందయ్యలా ఇతర రైతుల్లా కాకుండా ప్రత్యేకమైన పంట ఏదైనా పండించాలని ఆలోచించారు. ఈ క్రమంలో దివాకర్ ఎడారులతో ఉండే ఈజిప్ట్, సౌదీ అరేబియా, ఒమన్ లాంటి అధిక ఉష్ణోగ్రతలు ఉన్న దేశాల్లో పండే ఖర్జూర సాగు తమ పొలంలో చేయాలనుకున్నారు.ఖర్జూర సాగు చేపట్టక ముందు దివాకర్ బెంగళూరులో జరిగిన కృషి మేళాలో ఓ ఖర్జూర రైతుతో మాట్లాడారు. తమిళనాడులోని ధర్మపురికి చెందిన ఆ రైతు భారతదేశంలో ఖర్జూర సాగు ఎలా చేయాలనే దానిపై కరపత్రాలు ముద్రించి పంచిపెడుతున్నారు. ఎడారిలో మాత్రమే పండే ఖర్జూరాలు మన దేశంలో పండుతాయా? అని ఆ రైతును దివాకర్ ప్రశ్నించారు. ఆ తర్వాత ఆరు నెలల వరకు ఏమిచేయాలనే దానిపై తర్జనభర్జనలు పడుతూ ఉండిపోయారు. ఆ తర్వాత ఖర్జూర సాగులో సూక్ష్మ అంశాలను తమిళనాడు వెళ్లి తెలుసుకున్నారు. తమిళనాడు వాతావరణం తమ గ్రామంలోని వాతావరణం ఇంచుమించు ఒకేలా ఉండడంతో ఖర్జూర సాగు చేయాలని నిశ్చయించుకున్నారు. ఎడారి వాతావరణంల్లో మాత్రమే ఖర్చూరం పండుతుందనేది సరైన అభిప్రాయం కాదన్నారు దివాకర్. నిజానికి ఖర్జూర చెట్టుకు కావాల్సింది అత్యధిక తేమ, 40 నుండి 45 డిగ్రీల వేడితో సూర్యరశ్మి, కొద్దిపాటి వర్షం అవసరం అవుతాయి. అయితే.. మన దేశంలో వేసవి కాలంలో కూడా 38 డిగ్రీలు వరకు మాత్రమే వేడి ఉంటుందని దివాకర్ తెలిపారు.బర్హి రకం ఖర్జూర మొక్కలను నాటేందుకు దివాకర్ భూమిలో 2 అడుగుల లోతు 2 అడుగుల వెడల్పు గుంతలు తీశారు. ఆ గుంతల్లో మొక్కలు నాటక ముందే నది తెచ్చిన మట్టి, వేప, ఆముదం పిండి, వర్మీ కంపోస్ట్, పంచగవ్య కలిపి నింపారు. మొక్కలు నాటిన తర్వాత నుంచి ఆవుపేడ, గోమూత్రం, జీవామృతం లాంటి పులియబెట్టిన ఆర్గానిక్ మిక్సర్‌ను మాత్రమే వినియోగించారు. ఖర్జూర మొక్కల గురించి తాను చెబితే ఒక్క రైతు కూడా నమ్మలేదని చెప్పారు. పైగా తనను ఓ ఫూల్‌గా అభివర్ణించారని, అనేక ప్రశ్నల వేసి, వేధించారని చెప్పారు. వారి ప్రశ్నలకు తొలుత తాను జవాబులు చెప్పలేకపోయానని చెప్పారు.ఆర్గానిక్ పద్ధతిలో ఖర్జూర సాగే చేయాలని నిర్ణయించుకున్న దివాకర్ ఒక్కొక్కటీ రూ.3 వేలు చొప్పున 150 బర్హి రకం ఖర్జూర మొక్కలు తెచ్చారు. రూ.4.5 లక్షలు ఖర్చుపెట్టి తెచ్చిన ఖర్జూర మొక్కలను తగినంత వేడి ఉండని కర్ణాటకలో ఎలా పెంచాలని తనకు పలు ప్రశ్నలు వచ్చాయన్నారు. తమ పొలంలో ఎడారి వాతావరణం కల్పించాలనుకున్న తన ఉద్దేశాన్ని పలువురు ప్రశ్నించారు. ఎగతాళిగా నవ్వారు కూడా అని దివాకర్ గుర్తుచేసుకున్నారు. దివాకర్ చెన్నప్ప తమ క్షేత్రంలో ఖర్జూర మొక్కల మధ్య 24 అడుగుల దూరం, వరుసల మధ్య 24 అడుగులు ఉండేలా నాటారు. ఈ విధంగా నాటితే ఎకరం భూమిలో సుమారు 65 నుంచి 70 మొక్కలు పడతాయి. తగినంత సూర్యరశ్మి తగిలి, మొక్కలు బాగా ఎదిగేందుకు ఆ మాత్రం ఖాళీ ఉండాలి.నాటిన నాలుగున్నరేళ్లకు ఖర్జూర మొక్కలకు తొలి పూతను చూసినట్లు దివాకర్ చెప్పారు. అప్పుడు తన ఆనందానికి హద్దులు లేవన్నారు. రెండున్నర ఎకరాల్లోని ఖర్జూర చెట్ల నుంచి తొలి పంటగా 800 కిలోలు వచ్యాయని చెప్పారు. ఇప్పుడు ఆ చెట్ల నుంచి ఐదు టన్నులు వస్తోందన్నారు. సహజ పంటల విధానంలో తాను పండించిన ఖర్జూర పండ్లను కిలో రూ.375కి అమ్ముతున్నట్లు తెలిపారు. తద్వారా ఎకరం ఖర్జూర క్షేత్రం నుంచి ఏటా తనకు రూ.6 లక్షల ఆదాయం వస్తోందని వెల్లడించారు. అప్పటి నుంచి తనకు ఊహించని విధంగా గుర్తింపు లభించిందని అన్నారు. దాంతో తనను పలువురు జర్నలిస్టులు కలిసి, ఇంటర్వ్యూలు చేశారని, వాటిలో ఒకటి ఓ టీవీ చానల్‌లో ప్రసారం అయిందని గర్వంగా దివాకర్ తెలిపారు. ఆ తర్వాత తన మామగారు కూడా తమ ఖర్జూర క్షేత్రాన్ని సందర్శించారని సంతోషంగా చెప్పారు. అంతకు ముందు ఆయన తాను వ్యవసాయం చేస్తానంటే ఒప్పుకోని మామ తమ పొలాన్ని సందర్శించడం గొప్ప విజయం అన్నారు. కర్ణాటకలో ఖర్జూరం సాగు చేసిన తొలి రైతు తానే కావచ్చని, దక్షిణ భారత దేశంలో ఆర్గానిక్ పద్ధతిలో ఖర్జూరం పండించిన తొలి రైతు కూడా తానే అనుకుంటున్నానని దివాకర్ అన్నారు.
వ్యవసాయం మన అన్ని అవసరాలు తీర్చవచ్చు కానీ, అంతే లేకుండా వచ్చే కోరికలను నెరవేర్చకపోవచ్చని దివాకర్ బాగా అర్థం చేసుకున్నారు. తొలిపంటలో దివాకర్ పెట్టుబడిని, రాబడిని బ్యాలన్స్ చేయలేకపోయి ఉండొచ్చు. కానీ తర్వాతి పంటల్లో వచ్చిన ఆదాయంతో తన కుటుంబాన్ని, రెండున్నర ఎకరాల ఖర్చూర క్షేత్రాన్ని మంచి స్థితిలో నిలబెట్టానని సంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్థిక అవసరాల కంటే ఆత్మ సంతృప్తే ముఖ్యం అన్నారు దివాకర్.