ఇనుము సమృద్ధిగా లభించే ఆకు కూరల్లో పాలకూర బెస్ట్ అంటారు ఆరోగ్య నిపుణులు. పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. దీనిలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. పాలకూర ఆహారంలో తీసుకునే వారిలో రక్తహీనతను తగ్గిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. జీర్ణ వ్యవస్థను చక్కదిద్దుతుంది. పాలకూరలో లభించే ఐరన్ వల్ల శరీరానికి ఆక్సిజన్ అందుతుంది. కళ్ల ఆరోగ్యాన్ని కాపాడడంలో దీనిలో లభించే విటమిన్ ఏ, కెరోటినాయిడ్స్ బాగా పనిచేస్తాయి. పీచుపదార్థం వల్ల మలబద్ధకం తగ్గుతుంది. జీర్ణక్రియ మెరుగు అవుతుంది. పాలకూరలోని విటమిన్ కే, కాల్షియం ఎముకలను బలంగా మారుస్తాయి.
పాలకూరలో ఖనిజాలు, ప్రోటీన్, కొవ్వు ఆమ్లాలు కూడా లభిస్తాయి. పాలకూరలో కొవ్వును తగ్గించే గుణాలు ఉన్నాయి. గుండె సంబంధ వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. స్థూలకాయాన్ని, డయాబెటీస్‌ను, క్యాన్సర్‌ను నిరోధిస్తుంది. నాడీ కణాలకు పాలకూర తినేవారికి రక్షణ ఉంటుంది. మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం, జింక్, రాగి, మాంగనీస్, సోడియం, ఫాస్పరస్, ఇనుము వంటి ఖనిజాలు పాలకూరలో మనకు లభిస్తాయి. దీంట్లో విటమిన్ బీ 6, విటమిన్ ఈ, ఒమేగా 3 ఫ్యాట్లు బాగా ఉంటాయి. సూక్ష్మ పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారంగా పాలకూరను ఆరోగ్య నిపుణులు సిఫార్సు చేస్తారు.పాలకూర విత్తనాలు వేసిన రోజు నుంచి 25 రోజులకే పంట చేతికి వస్తుంది. తొలిసారి పంట కోసిన తర్వాత మరో మూడు సార్లు కూడా పాలకూర దిగుబడి వస్తుంది. నేల ఆరోగ్యంగా, బలం ఉన్నదైతే మరో రెండు సార్లు కూడా పంట తీసుకోవచ్చు. తరువాత మరో 15 రోజులకే కటింగ్‌కు వస్తుంది. భూమిలో బలం ఉంటే పది రోజులకు కూడా రెండో కటింగ్ రావచ్చు. పాలకూర సాగులో మొత్తం అన్ని ఖర్చులూ కలిపి వెయ్యి రూపాయలు ఖర్చు చేస్తే నాలుగు రెట్ల ఆదాయం ఇస్తుంది. పెట్టుబడి పోగా మూడు రెట్ల లాభం కేవలం రెండు మూడు నెలల్లోనే వస్తుంది. కాకపోతే.. పచ్చ పురుగు, మచ్చ తెగుళ్లు పాలకూరను ఎక్కువగా ఆశిస్తాయి. పచ్చపురుగును మందులు స్ప్రే చేసి, నివారించుకోవాలి. వర్షం పడినప్పుడు మచ్చతెగులు సోకుతుంది. అలాంటి మొక్కలను పొలం నుంచి పీకి పడేయాలి. ఈ రెండు రకాల రక్షణ కల్పించి, నేలను ఆరోగ్యంగా, బలంగా ఉంచితే దిగుబడి మరింత అధికంగా వస్తుంది. ఇలా ఒకసారి విత్తనాలు వేస్తే.. పాలకూర మూడు నెలల వరకు పంట సాగు అవుతుంది. ప్రతిరోజూ ఆదాయం ఇస్తూనే ఉంటుంది. అలాగే చలికాలంలో పాలకూర దిగుబడి ఎక్కువ వస్తుంది.పాలకూర సాగులో రైతు మల్లేష్ సాగు అనుభవాలు తెలుసుకుందాం. మల్లేష్ రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం దెబ్బడగూడలో ఆరేళ్లుగా ఐదు గుంటల్లో పాలకూర సాగు చేస్తున్నారు. తనకు ఉన్న రెండు ఎకరాల్లో మల్లేష్ టమాటా, పాలకూర, తోటకూర, క్యాలీఫ్లవర్ పంటలు సాగుచేస్తున్నారు. ఒక మూటలో 600 కట్టలు పెడతామని చెప్పారు. వాటిని హైదరాబాద్ మాదన్నపేట్ కూరగాయల మార్కెట్‌లో అమ్ముతామన్నారు. ఒక్కో కట్టకు హోల్‌సేల్‌గా తమకు డిమాండ్‌ను బట్టి రూపాయి నుంచి రూపాయిన్నర వరకు ధర వస్తుందన్నారు. అంటే ఒక్కో మూటకు దాదాపు రూ.600 నుంచి రూ.750 వస్తుందన్నారు. ఒక మూటకు తమకు అత్యధికంగా రూ.1,700 ధర వచ్చిందని మల్లేష్ చెప్పారు. పాలకూరను దళారులు కొన్న వెంటనే డబ్బులు చెల్లిస్తారని చెప్పారు.పాలకూరకు దుక్కిలో వేసిన పశువుల ఎరువే కాకుండా.. పంట కాలం 25 రోజుల్లో ఒకసారి డీఏపీ లేదా 28:28 ఎరువు వేస్తామన్నారు. ఐదు గుంటల భూమికి తాము 10 నుంచి 15 కిలోల ఎరువు చల్లి, నీరు పెడతామని చెప్పారు. పాలకూరకు ప్రధానమైన బెడద పచ్చపురుగు. ఆకులను అవి రంధ్రాలు పెట్టి తినేస్తాయి. అలాంటి పాలకూరను మార్కెట్ దళారులు, వినియోగదారులు కొనుగోలు చేయరు. ఆకులు పచ్చగా, శుభ్రంగా ఉంటేనే కొంటారు. తొలి కటింగ్‌లో తమ ఐదు గుంటల్లో 20కి తగ్గకుండా 30 మూటల వరకు వస్తుందన్నారు.ముందుగా పొలం దుక్కి దున్ని, పశువుల ఎరువు వేయాలి. ఆ తర్వాత మరోసారి ఎరువుతో సహా భూమిని మరోసారి మెత్తగా దున్నాలి. మల్లేష్ 5 గుంటల భూమికి 8 కిలోల హైబ్రీడ్ విత్తనాలు వేస్తున్నట్లు చెప్పారు. ఒక్కో కిలో ప్యాకెట్ విత్తనాలు 350 రూపాయల వరకు ఉంటుంది. భూమిని మడులుగా చేసి, వాటిలో విత్తనాలు వేస్తామన్నారు మల్లేష్. విత్తనాలు వేసిన మరుసటి రోజు భూమికి నీరు ఇవ్వాలన్నారు. పాలకూర మొక్కలకు ఎండాకాలంలో నీటి అవసరం ఎక్కువగా ఉంటుంది. విత్తనాలు వేసిన ఐదు రోజులకు మొలకలు వస్తాయి. 25 రోజులకు తొలిసారి పంట కటింగ్‌కు వస్తుంది. ఎర్రనేలలు, నల్లరేగడి భూముల్లో పాలకూర బాగా సాగు అవుతుంది.ఐదు గుంటలలో పాలకూర కట్ చేసి, కట్టలు కట్టేందుకు ఇద్దరు మనుషులు సరిపోతారని మల్లేష్ తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఒక మనిషి 1,800 కట్టలు కడతారని చెప్పారు. 20 కట్టలు కిలో బరువు రావచ్చన్నారు. తెంపిన పాలకూరను రాత్రి ఒంటి గంట సమయంలో మార్కెట్‌లో అమ్ముతామని అన్నారు. ఐదు గుంటల్లో పాలకూర సాగు కోసం దుక్కి, పశువుల ఎరువు, రసాయన ఎరువులు, పురుగు మందులు, కూలీల ఖర్చు, మార్కెట్‌కు తీసుకెళ్లేందుకు అన్నీ కలిపి రూ.6 వేలు ఖర్చవుతుందని మల్లేష్ చెప్పారు. దిగుబడి 40 మూటలు వస్తే.. రూ.18 నుంచి 20 వేలు వరకు ఆదాయం వస్తుంది. ఆరు వేలు ఖర్చులు తీసేస్తే.. ఒక నెల రోజుల్లోనే కనీసం 12 వేలు లాభం కనిపిస్తుంది. పురుగులు, తెగుళ్లు రాకుండా జాగ్రత్తగా కాపాడుకుంటే, ధర బాగుంటే లాభసాటి పంట అని మల్లేష్ చెప్పారు.