Site icon V.E.R Agro Farms

విద్యార్థులకు మట్టి పరీక్షల శిక్షణ

మట్టి అంటే ఏమిటి? దాని స్వరూపం ఎలా ఉంటుంది? మట్టిలో ఏమేమి పదార్థాలు ఉంటాయి? ఎలాంటి పోషకాలతో మట్టి సమ్మిళితమై ఉంటుంది? మట్టిలో ఉండే పోషకాలను ఎలా పరీక్షించి తెలుసుకోవాలి? అందు కోసం విద్యార్థులు ఎలాంటి పరీక్షలు చేయాలి? తద్వారా రైతులకు ఎలాంటి సూచనలు, సలహాలు ఇచ్చి సహాయపడాలి? సహజ పద్ధతిలో ఏయే పంటలు సాగు చేయాలి? ఇలాంటి అంశాలన్నింటిపైన విద్యార్థులకు స్కూలు దశ నుంచే అర్థం అయ్యేలా అభ్యాసం చేయిస్తుంది మన దేశంలోని ఒక స్కూలు. అదే పుణెలోని ‘దీప్‌గృహ అకాడమీ‘. ఈ అకాడమీ విద్యార్థులు 13 గ్రామాల్లోని 70 మంది రైతులకు సహాయం చేస్దున్నారు. ఆచరణాత్మక నైపుణ్యాలు పొందుతూ.. అనుభవం ద్వారా మట్టి పరీక్షలు చేస్తున్నారు. ఈ పాఠశాల తరగతి గది శిక్షణ వ్యవసాయంతో ఎలా కలిసిపోతుందో.. రైతులు, ఇతరులు కూడా ఈ బాటలో నడిచేలా ఎలా ప్రభావితం చేస్తుందో చూద్దాం.

వ్యవసాయం చేయడానికి ప్రాథమికంగా నేలే పునాది కదా! ఆ నేలలో ఏమిం ఉందో మనకు తెలియకపోతే పంట బాగా పండాలని ఎలా ఆశించగలం? అంటారు స్వప్న సోన్‌కాంబలే. దీప్‌ గృహ అకాడమీలో ఆమె సేంద్రీయ వ్యవసాయ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. వ్యవసాయ విద్యను విద్యార్థులకు బోధిస్తూనే.. నేల ఆరోగ్యం, సుస్థిర విధానాలు, క్షేత్రస్థాయి శిక్షణ లాంటి వాటిపైన విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు.

దీప్‌గృహ అకాడమీలో వ్యవసాయం రెండో అంశంగానో లేదా కాలానుగుణ కార్యకలాపంగానో ఉండదు. విద్యార్థులు నేర్చుకునేలా, ఆలోచించేలా ప్రపంచంతో మమేకమయ్యే పద్ధతిని ఇది నేర్పిస్తుంది. ఈ పాఠశాలలోని తరగతి గదులు పొలాల్లోకి విస్తరించి ఉంటాయి. ఈ అకాడమీలో చదివే విద్యార్థులకు పాఠ్యపుస్తకాల్లోని అంశాలతో పాటు ప్రత్యక్ష అనుభవాలు కూడా తోడవుతాయి. పిల్లలకు నేల ఆరోగ్యం గురించి బోధించడం కోసం మొదలైన పాఠాలు ఇప్పుడు రైతులు తాము ఆధారపడే నేలను అర్థం చేసుకునేందుకు విద్యార్థులు సహాయపడేలా తయారు చేస్తోంది.తాను పదేపదే గమనించిన ఒక లోపం లేదా కొరత నుండే అకాడమీలో విద్యార్థులకు భూమి ఆరోగ్యం, దానిలో దాగి ఉన్న అంశాలను అర్థమయ్యేలా చేయాలనే ఆలోచన పుట్టిందని స్వప్న చెప్పారు. 2014 నుండి దీప్‌గృహ అకాడమీతో స్వప్నకు అనుబంధం ఉంది. ‘మేము నర్సరీ నుండి 8వ తరగతి వరకు వ్యవసాయం బోధిస్తాం. మేం చేసే ప్రతి పనిలోనూ మట్టి ఒక ప్రధాన అంశం. తమ నేలలో ఏమి ఉందో రైతులకు సరిగా తెలియదని మేం గ్రహించాం’ అని ఆమె అన్నారు. ఈ అవగాహనే 2023లో తమ అకాడమీలో మట్టి పరీక్షల ప్రాజెక్టు ప్రారంభించేందుకు దారితీసిందంటారు. ప్రారంభంలో ఇది పాఠశాలకే పరిమితమైంది. ఈ స్కూల్లో విద్యార్థులు ప్రాథమిక విషయాలు నేర్చుకుని, వారి సొంత పొలాల్లో అభ్యాసం చేశారు. కాలక్రమేణా ఉపాధ్యాయులు, విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచుకోవడానికి ఈ కార్యక్రమం క్యాంపస్ దాటి క్షేత్రాలకు విస్తరించిందని స్వప్ప చెప్పారు.

మట్టి గురించిన పలు అంశాలను ముందుగా తాము నేర్చుకున్నామని, తర్వాత విద్యార్థులతో కలిసి సాధన చేశామని టీచర్‌ స్వప్ప తెలిపారు. ఆ తర్వాతే రైతులకు తాము సహాయం చేయగలమని అనిపించిందని ఆమె పేర్కొన్నారు. 2024 డిసెంబర్ నాటికి రైతులతో మొదటి ప్రయోగాత్మక కార్యక్రమాన్ని దీప్‌గృహ అకాడమీ నిర్వహించింది. అప్పటి నుండి ఈ ప్రాజెక్ట్ విస్తరిస్తూ వచ్చింది. సమీప గ్రామాలకు చేరుకుంది. విద్య, సమాజం మధ్య ఒక వారధిని ఏర్పరిచిందన్నారు స్వప్న.అకాడమీలో ప్రతి విద్యార్థికి చిన్న వయస్సు నుండే మట్టితో పనిచేసే అవకాశం ఉంటుంది. ప్రతి తరగతిలోనూ కొంత భాగాన్ని కేటాయిస్తారు. అక్కడ విద్యార్థులు నేలను సిద్ధం చేయడం నుండి పంటల కోత వరకు అన్నీ నేర్పుతారు. విద్యార్థులే చదువుతో పాటు రకరకాల కూరగాయలను సొంతంగా పండిస్తారు. అలా పండించిన పంటలను స్కూల్లోనే విద్యార్థులు అమ్ముతారు. ఈ విధానం విద్యార్థుల్లో ఆసక్తిని, బాధ్యతను పెంచుతుంది. ‘ఈ స్కూల్లో నేరుగా పరీక్షలతో విద్యార్థులకు విద్యాభ్యాసం మొదలుపెట్టరు. పిల్లలు ముందుగా మట్టి గురించి, దాని ప్రాముఖ్యత గురించి అర్థం చేసుకోవాలి’ అని టీచర్ స్వప్న వివరించారు. దీంతో విద్యార్థులు 7, 8 తరగతులకు వచ్చేసరికి నేలలోని పోషకాలు, వాటి ఉపయోగాలు వంటి మరిన్ని అంశాలు అర్థం అయ్యేలా చేస్తారు.

నత్రజని మొక్కల పెరుగుదలకు ఎలా తోడ్పడుతుందో, భాస్వరం వేర్ల అభివృద్ధికి ఎలా సహాయపడుతుందో, ఈ పోషకాలు లోపించినప్పుడు లేదా అధికంగా ఉన్నప్పుడు ఏం జరుగుతుందో వారు నేర్చుకుంటారు. ‘ఎలాంటి పరిస్థితి ఎదురైతే ఏం చేయాలో విద్యార్థులకు నేర్పిస్తాం. ఏ పోషకమైనా తక్కువగా ఉంటే, సేంద్రియ పద్ధతులతో దానిని ఎలా మెరుగుపరచాలో నేర్పిస్తాం’ అని స్వప్ప చెప్పారు. రసాయన ఎరువులకు బదులు ఆవు పేడ, కంపోస్టు వంటి సేంద్రియ ఎరువుల వాడకాన్ని నేర్పిస్తుంది.విద్యార్థులు అనుసరించే నేల పరీక్షా విధానం క్రమబద్ధంగా ఉంటుంది. శాస్త్రీయతతో పాటు ఆచరణాత్మకంగా ఉంటుంది. ‘Soil Sens’ ప్లాట్‌ఫారమ్ సహకారంతో ఉన్న కిట్‌ను ఉపయోగించి, విద్యార్థులు తక్కువ సమయంలోనే ఫలితాలు పొందగలుగుతున్నారు. నేల ఆరోగ్య సంబంధ ప్రాథమిక అంశాలను విద్యార్థులు అర్థం చేసుకుంటారు. ఇందులో నేల నిర్మాణం, దానిలో పోషకాల పాత్ర, నేల పరీక్ష ఎందుకు అవసరం లాంటి విషయాలు ఉంటాయి. ‘ఈ పద్ధతి జీవశాస్త్రం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రాలను నేర్చుకోవడం లాంటిదే’ అని టీచర్‌ చిరునవ్వుతో వివరించారు. ‘ప్రాథమిక అంశాలపై స్పష్టత లేకపోతే ఆచరణాత్మక వినియోగం అర్థం కాదు. వ్యవసాయం అంటే కేవలం శ్రమతో కూడిన పని మాత్రమే కాదని, పరిశీలన, నిర్ణయం తీసుకోవడంతో కూడిన విధానం అని దీప్‌గృహ విద్యార్థులకు అర్థం అయ్యేలా ఈ అకాడమి చెబుతుంది.

విద్యార్థులు క్షేత్రానికి వెళ్లే ముందు ఆత్మవిశ్వాసం పొందేలా ఆచరణాత్మక అభ్యాసాన్ని ఈ స్కూల్లో జాగ్రత్తగా రూపొందించారు. వారు అనుసరించే దశలవారీ ప్రక్రియ ఇలా ఉంటుంది:

  1. మట్టి నమూనాల సేకరణ:

విద్యార్థులు మొత్తం వ్యవసాయ క్షేత్రం నుండి జిగ్‌జాగ్ పద్ధతిలో మట్టి నమూనాలు సేకరిస్తారు. చెట్ల మొదళ్ళు, దారులు, అసాధారణంగా తడి లేదా పొడిగా ఉన్న ప్రాంతాలు, విభిన్నమైన ఫలితాలు ఇచ్చే ప్రాంతాల్లోని మట్టిని సేకరించి, వాటిలో ఉండే పదార్థాలను విద్యార్థులు నేర్చుకుంటారు. ఇలా పలుచోట్ల చిన్నచిన్న నమూనాలు తీసుకొని, మట్టి సరైన ఆరోగ్య స్థితిని ప్రతిబింబించేలా మిశ్రమ నమూనా తయారు చేస్తారు.

  1. మట్టిని సిద్ధం చేయడం:

విద్యార్థులు సేకరించిన మట్టిని నీడలో లేదా ఫ్యాన్ కింద ఆరబెడతారు. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే మట్టిలో ఏమాత్రం తేమ ఉన్నా దానిలోని రసాయన చర్యలు మారిపోయి, కచ్చితంగా ఫలితం రాకపోవచ్చు. మట్టి ఆకృతి, రంగు మారడాన్ని విద్యార్థులు నిశితంగా గమనిస్తారు. విశ్లేషణకు ఆ మట్టి ఎప్పుడు సిద్ధంగా ఉందో విద్యార్థులు గుర్తిస్తారు.

  1. యాప్‌లో రైతు, పొలం వివరాల నమోదు:

రైతులు, వారి భూమి సంబంధమైన ప్రతి వివరాన్ని వారి పేరు, సంప్రదించాల్సిన నంబర్, పంట రకం, మట్టి కూర్పు, నీటిపారుదల పద్ధతులు, పంటపొలం స్వభావం వంటివి సాయిల్‌సెన్స్ యాప్‌లో డిజిటల్‌ విధానంలో వివరంగా నమోదు చేస్తారు. క్షేత్రం పూర్తి చిత్రం అర్థమయ్యేలా ఇది చేస్తుంది. డేటాను క్రమ పద్ధతిలో ఉంచుతుంది. విద్యార్థులు కాలక్రమేణా జరిగే మార్పులను గమనించడానికి, వివిధ పొలాలలోని ఫలితాలను పోల్చి చూడడానికి, రైతులకు వ్యక్తిగతమైన, నమ్మకమైన సిఫార్సులు చేసేందుకు వీలు కల్పిస్తుంది.

  1. పరీక్షకు మట్టి నమూనా:

విద్యార్థులు ఒక గ్రాము మట్టిని జాగ్రత్తగా చిన్న పరీక్ష నాళికలలో ఉంచి విశ్లేషణకు సిద్ధం చేస్తారు. తర్వాత నత్రజని, భాస్వరం, పొటాషియం వంటి కీలక పోషకాలను కొలవడానికి నిర్దిష్ట ద్రావణాలు కలుపుతారు. ‘ప్రతి మూలకం నేల గురించి ఓ కథ చెబుతుంది. నత్రజని భూమి ఎంత సారవంతమైందో మనకు చూపిస్తుంది. భాస్వరం వేర్ల పెరుగుదల సామర్థ్యం గురించి చెబుతుంది. మొక్క మొత్తం ఆరోగ్యాన్ని అర్థం చేసుకోవడానికి పొటాషియం సహాయపడుతుంది’ అని టీచర్‌ స్వప్న వివరించారు. ఈ ప్రాథమిక పోషకాలతో పాటు విద్యార్థులు PH స్థాయిలు, విద్యుత్ వాహకత, సేంద్రీయ కర్బనంను కూడా పరీక్షిస్తారు. తద్వారా ప్రతి అంశం పంటల పెరుగుదలను ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకుంటారు. ‘నేల ఏమి చేయగలదో అర్థం చేసుకోవడం, ఉత్తమమైన ఎంపికలు చేసేందుకు, రైతులకు ఎలా మార్గనిర్దేశం చేయగలరో విద్యార్థులు తెలుసుకోవడం దీని ముఖ్య ఉద్దేశం’అని ఆమె తెలిపారు.

  1. పరీక్షల నిర్వహణ:

మట్టి నమూనాలను సిద్ధం చేసి, ద్రావణాలను కలిపిన తర్వాత ఫలితాలు తెలుసుకునేందుకే కిట్‌ను డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌కు అనుసంధానిస్తారు. నత్రజని వంటి సాధారణ పరీక్షలు ఐదు నిమిషాల్లోనే ఫలితాలు అందిస్తాయి.. అయితే నత్రజని, భాస్వరం, పొటాషియం, PH, విద్యుత్ వాహకత, సేంద్రీయ కార్బన్‌లను కవర్ చేసే పూర్తి పోషక నివేదికకు సుమారు 30 నిమిషాలు పడుతుంది. ‘ఇది సాంప్రదాయ మట్టి పరీక్షల నుండి ఒక పెద్ద మార్పు’ అని టీచర్‌ వివరించారు. ‘గతంలో రైతులు ప్రభుత్వ ప్రయోగశాలల నుండి ఫలితాలు పొందడానికి వారాలు, కొన్నిసార్లు నెల రోజులు వేచి ఉండాల్సి వచ్చేది. వారికి నివేదిక అందేసరికి పంట కాలం చాలా అయిపోయేది. దీనితో సకాలంలో ఏర్పాట్లు చేయడం కష్టమయ్యేది. ఇప్పుడు విద్యార్థులు రైతులకు వెంటనే నమ్మదగిన సమాచారం అందిస్తున్నారు. ఈ విధానం రైతులకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది.

  1. ఫలితాల విశ్లేషణ, నమోదు:

ఫలితాలు వెలువడిన తర్వాత దీప్‌గృహ అకాడమీ విద్యార్థులు వాటిని విశ్లేషించడం నేర్చుకుంటారు. సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా నేలలోని లోపాలు లేదా అసమతుల్యతలను గుర్తిస్తారు. అవసరమైన సరైన రకం, పరిమాణంలో పోషకాలను ఎలా సరిదిద్దాలో రైతులకు సూచిస్తారు. ‘ఆత్మవిశ్వాసం పెంచడానికి, విద్యార్థులు పాఠశాలలో చాలాసార్లు సాధన చేస్తారు. వారు తరచూ పదికి పైగా వివిధ మట్టి నమూనాలను పరీక్షిస్తారు.  మట్టి నమూనాలను చదవడం, ఫలితాలను పోల్చడం, ప్రతి మట్టి రకం ప్రత్యేకతను అర్థం చేసుకుంటారు. వారు ఒక పొలంలో అడుగుపెట్టే సమయానికి పరీక్షకే కాకుండా రైతుల్లో ఆత్మవిశ్వాసం కల్పించేందుకు, సలహా ఇచ్చేందుకు మార్గనిర్దేశం చేయడానికి సిద్ధంగా ఉంటారు’ అని స్వప్న వివరించారు.

  1. నేర్చుకున్న విషయాల ఆచరణ:

పదేపదే సాధన చేసిన తర్వాతే విద్యార్థులు స్థానిక వ్యవసాయ క్షేత్రాలను సందర్శించడం, నమూనాలను సేకరించడం, మట్టిని పరీక్షించడం, రైతులకు సిఫార్సులు చేస్తారు. ఇది సాంకేతిక పరిజ్ఞానాన్ని, భావ వ్యక్తీకరణ నైపుణ్యాలను ఈ విధానం బలపరుస్తుంది.

8) క్లాస్‌రూం నుంచి బయట శిక్షణ:

దీప్‌గృహ అకాడమీ విద్యా కార్యక్రమం వాస్తవ పరిస్థితులకు ప్రాధాన్యం ఇస్తుంది. విద్యార్థులు బయటకు వెళ్లి రైతులతో కలిసిపోయి, నేల పరీక్షలు చేస్తారు. ‘మా విద్యార్థులకు రైతులతో మమేకం కావడం, చర్చలకు నాయకత్వం వహించడం అలవాటు చేస్తామ’ని కార్యక్రమం, సామాజిక భాగస్వామ్య సమన్వయకర్త ఏంజెలా ఆరామ్ చెప్పారు. ‘వ్యవసాయ క్షేత్రాలను సందర్శించే సమయానికి విద్యార్థులలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వారికి సామాజిక సేవ కేవలం అదనపు కార్యక్రమం కాదు. అది అభ్యాసంలో ఒక ప్రధాన భాగం’ అన్నారు. విద్యార్థులు, రైతుల మధ్య ఈ కార్యక్రమం నమ్మకం పెంచుతుంది. చాలా మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు సమీప గ్రామాల నుంచే వస్తారు. ‘రైతులకు తమ నేలలో ఏముందో సరిగా తెలియదు. కొందరు రైతులు అయితే పరీక్షలే అవసరం లేదనుకుంటారు. కానీ విద్యార్థులు వివరించినప్పుడు వారు వింటారు’ అన్నారు స్వప్న.

ఒకప్పుడు మాట్లాడేందుకే సంకోచించిన విద్యార్థులు ఇప్పుడు నేల నివేదికలను చక్కగా వివరిస్తున్నారు. ఫలితాలను విశ్లేషిస్తున్నారు. పరిష్కారాలు సూచిస్తున్నారు. ఇప్పుడు రైతులు తమ నేలకు నిజంగా ఏమి అవసరమో అర్థం చేసుకునేలా అకాడమీ విద్యార్థులు కృషి చేస్తున్నారు. రైతులు డబ్బు ఆదా చేయడంతో పాటు భూమి ఆరోగ్యాన్ని మెరుగుపరిచేలా చేస్తున్నారు. విద్యార్థులు మట్టిని అర్థం చేసుకున్నప్పుడు, వారు జీవితాన్ని అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారని టీచర్ స్వప్న అన్నారు. సామాజిక భాగస్వామ్యం కల్పించడం ద్వారా విద్యార్థుల్లో నిజమైన మార్పు తీసుకురావడానికి ఈ నమూనా దారి చూపిస్తుంది. గుప్పెడు మట్టి విద్యార్థుల్లో జ్ఞానం పెంచేదిగా మారుస్తుంది.

( Better India నుంచి స్వేచ్ఛానువాదం )

Exit mobile version