భూమిలో బలం, జీవం, పోషకాలు సమృద్ధిగా ఉన్నప్పుడు మొక్కల వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందుతుంది. ఆ వేరు వ్యవస్థ పోషకాలను బాగా తీసుకొని మొక్కలకు అందిస్తాయి. అలాంటి భూమిలో పండించే పంటలకు తెగుళ్లు అంతగా సోకవు. క్రిమి కీటకాలు కూడా ఎక్కువగా ఆశించవు. మొక్కలు బలంగా ఏపుగా, పచ్చగా పెరుగుతాయి. దీనితో సస్య రక్షణ కోసం మనం పైనుంచి పిచికారీ చేసే పురుగుమందుల ఖర్చు తగ్గిపోతుంది. మొక్కలను పెంచేందుకు రసాయన ఎరువులు వాడాల్సిన అవసరం ఉండదు. వాతావరణ పరిస్థితులను అవగాహన చేసుకుని, వాటికి అనుగుణంగా పంటలు సాగు చేస్తే మంచి ఫలితాలు వస్తాయని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం గట్టుపల్లిలో సునందనం నేచురల్ ఫార్మ్స్ నిర్వాహకురాలు బొమ్మిశెట్టి సునంద తెలిపారు. బయోచార్‌కు సూక్ష్మ పోషకాలు, ఉపయోగకరమైన బ్యాక్టీరియాలతో సంపన్నం చేసి ‘సునంద బ్లాక్ గోల్డ్’ అనే సహజ వనరును తయారు చేశారు. భూమి ఆరోగ్యాన్ని పెంచే బ్లాక్ గోల్డ్‌ను రైతులే స్వయంగా తయారు చేసుకోవచ్చు.
మొక్కలకు అవసరమైన తేమ ఎప్పుడూ ఉండేలా బ్లాక్ గోల్డ్ చేస్తుంది. వాటికి పౌడరీ మిల్, డౌనీ మిల్ లాంటి రోగాలు తక్కువ అవుతాయి బ్లాక్ గోల్డ్ వల్ల మొక్కలకు ఇమ్యూనిటీ అధికంగా వస్తుంది. వేర్ల వ్యవస్థ భూమి నుంచి పోషకాలను పీల్చుకునే శక్తి బాగా వచ్చేలా చేస్తుంది. మొక్కల రసం పీల్చే పురుగులు, ఆకులను కొరికే పురుగులు, లద్దె పురుగులు, దోమలు లాంటి వాటి ఉధృతిని బ్లాక్ గోల్డ్ బాగా నియంత్రిస్తుంది. బ్లాక్ గోల్డ్ వాడిన రైతులకు రూ.100 పెట్టాల్సినప్పుడు రూ.50 మాత్రమే ఖర్చు చేస్తే సరిపోతుంది. మామిడి, అరటి, సీతాఫలం, బొప్పాయి, దానిమ్మ, పామాయిల్, మల్బరీ తోటలు సహా అన్ని పంటలకు బ్లాక్ గోల్డ్‌ను వాడుకోవచ్చు.సుభాష్ పాలేకర్ పద్ధతిలో సహజ వ్యవసాయం చేస్తున్న తమ ఫార్మ్‌లో మొక్కలకు ఇచ్చే జీవామృతం, కషాయాలతో బలం సరిపోలేదు అనిపించిందని సునంద చెప్పారు. చింతల వెంకటరెడ్డి CVR పద్ధతి ‘మట్టి ద్రావణం’ వారు వాడుతున్నారు. వాటితో పాటు భూమిని మరింత బలంగా ఎలా చేసుకోవాలనే ఆలోచనతో బ్లాక్ గోల్డ్ తయారు చేసినట్లు చెప్పారు. టీసీబీటీ ఫార్మింగ్, బయో ఎంజైమ్స్, కొరియన్ టెక్నాలజీ, జడాం టెక్నిక్స్, చౌహాన్ క్యూ టెక్నిక్, వృక్ష ఆయుర్వేదంలోని కొన్ని విధివిధానాలు అనుసరిస్తూ.. అన్ని పంటల మీదా ప్రయోగాలు చేసినట్లు సునంద తెలిపారు. వివిధ ప్రాంతాల్లోని రైతుల సలహాలు కూడా తీసుకుని, వీటన్నింటినీ కలగలిపి తయారు చేసిందే నల్ల బంగారం అన్నారు.తయారీకి కనీసం రెండు నెలలు తీసుకునే బ్లాక్ గోల్డ్ తయారీ విధానం గురించి తెలుసుకుందాం. బ్లాక్ గోల్డ్ తయారీకి ప్రధానంగా కావాల్సింది ఆవుపేడ. ఈ పేడను తడి ఆరిపోయేదాకా బాగా ఎండబెట్టాలి. ఎండిన ఆవుపేడను బాగా డీకంపోజ్ అంటే మెత్తగా చేసుకోవాలి. ఆవుపేడ పొడిలోకి మైక్రోబ్స్‌ను ఎక్కించేందుకు కానీ, బొగ్గును కలిపేందుకు అది బాగా మగ్గి ఉండాలి. ఆవుపేడ పొడిని బయో ఎంజైమ్స్ కలిపి బాగా మగ్గించాలి. బయో ఎంజైమ్స్‌ను నీళ్లలో కలిపి మూడుసార్లు పేడకు ఇవ్వాలి. దీంతో పేడ మొత్తం 20 రోజుల్లోనే నల్లగా మగ్గిపోయి, మట్టిలా తయారవుతుంది. ఆర్గానిక్ మేటర్‌ను చిన్నగా చేయడం బయో ఎంజైమ్స్ ప్రత్యేకత. ఇతర ఏ పదార్థమూ చేయనంత వేగంగా బయో ఎంజైమ్స్ పనిచేస్తాయి. ఇలా బయో ఎంజైమ్స్‌తో కూడిన ఎరువును భూమికి ఇచ్చినప్పుడు భూమిపై పడిన ఎండిన ఆకులు ఇతర పదార్థాలను కూడా వేగంగా పిండిలా చేసి, మొక్కలకు అందిస్తుంది.బయో ఎంజైమ్స్‌తో డీ కంపోజ్ చేసిన వెయ్యి కిలోల ఎరువుకు 100 కేజీల పల్లి, ఆవాలు, నువ్వులు, కుసుమలు, ఆముదం నూనె చెక్కల్లో ఏదో ఒకటి కలపాలి. ఈ ఐదు రకాల నూనె చెక్కల్లో నైట్రోజన్, కాల్షియం, ఫాస్పరస్ ఉంటాయి కాబట్టి బాగా పనిచేస్తాయి. నూనెచెక్కలు కలిపిన ఎరువుకు మరోసారి బయో ఎంజైమ్స్‌ను పిచికారి చేయాలి. నూనె చెక్కల్ని కూడా బయో ఎంజైమ్స్ చక్కగా వేగంగా డీ కంపోజ్ చేస్తాయి. మొక్కలకు ఎక్కువ బలం రావాలని పశువుల ఎరువును ఉన్నది ఉన్నట్లు వేస్తే.. వేరుపురుగు వస్తుంది. నూనె చెక్కలను అలాగే వేస్తే.. అవి డీ కంపోజ్ అయ్యే లోగా చెడు వాసన వచ్చి, మిథేన్ గ్యాస్ విడుదల చేస్తుంది. దీంతో రెక్కల పురుగులు వచ్చి, అవి అక్కడే గుడ్లు పెట్టి, వేరుపురుగులు పుడతాయి. అవి వేర్లను కొరికి తినడం వల్ల మొక్కలు చనిపోతాయని రైతులు గమనించాలి. ఈ సమస్యల నివారణకు నూనె చెక్కను సరిగా డీ కంపోజ్ చేసి, ఎరువులో కలపాలి.నూనె చెక్కలు కలిపిన తర్వాత ఎరువులో వేడి, చెడు వాసనను పోయిన తర్వాత మంచి క్వాలిటీ ఉన్న నల్ల తుమ్మచెట్టు చెక్కలతో పైరాలసిస్ పద్ధతిలో తయారు చేసిన బొగ్గు కలపాలి. ఈ బొగ్గును పెద్దదిగా కాకుండా, మరీ పౌడర్ మాదిరిగా కాకుండా 3 mm, 5 mm, లేదా 8 నుంచి 10 mm సైజులో ముక్కలుగా చేసి వేసుకోవాలి. బొగ్గుకు కూడా బయో ఎంజైమ్స్ అంటే జీవన ఎరువులు కలపాలి. NPK బ్యాక్టీరియా, అజిటో బ్యాక్టీరియా, ఫాస్పరస్ సోల్యబులైజింగ్ బ్యాక్టీరియా, పొటాష్ మొబిలైజింగ్ బ్యాక్టీరియాలు అన్నింటితో కలిపిన బయో ఫెర్టిలైజర్స్‌తో చార్జి చేసి, ఎరువులో కలపాలి. బొగ్గు కలిపిన ఎరువుకు మళ్లీ బయో ఫెర్టిలైజర్స్‌ను ఎరువు ఎక్కించాలి. తర్వాత శాస్త్రవేత్తల సూచించిన మోతాదులో జిప్సం, డోలమైట్‌లను కలపాలి. ప్రతి వెయ్యి కిలోల ఎరువుకు 50 కిలోల జిప్సం, మరో 50 కేజీల డోలమైట్ కలుపుకోవాలి. డోలమైట్‌లో మెగ్నీషియం, జిప్సంలో కాల్షియం, సల్ఫర్ ఉంటాయి. వీటిని కలపడం వల్ల మొక్కలకు సెకండరీ న్యూట్రియంట్స్ అందుతాయి. జిప్సం కలపడం వల్ల మట్టిలోని PH స్థాయిలు తగ్గుతాయి.ఈ అన్నింటినీ కలిపిన తర్వాత మళ్లీ మూడు నాలుగు రోజులు రోజుకు రెండు సార్లు జేసీబీతో బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక రోజు ట్రైకోడెర్మా ఎక్కించాలి. సూడోమోనాస్ మరో రోజు ఎక్కించాలి. మొక్కలకు నెమటోడ్స్ సమస్య నివారణకు మైక్రోబ్ బ్యాక్టీరియా పెసిలోమైసిస్‌ను ఎక్కించాలి. తయారైన బ్లాక్ గోల్డ్‌లో ఇంకా ఏమైనా పురుగుల లార్వాలు, నులిపురుగులు మిగిలి ఉంటే వాటిని సమర్థవంగా చంపేందుకు మెటారైజం కల్చర్ కూడా ఎక్కిస్తే సరిపోతుంది. ఇలా NPK, సెకండరీ న్యూట్రియంట్స్, మైక్రో న్యూట్రియంట్స్ అన్నింటితో తయారైన బ్లాక్ గోల్డ్ ఎరువుతో నేలతల్లికి పోషకాల ప్యాకేజ్ అందించినట్లు అవుతుంది. మొక్కలు పచ్చగా, ఏపుగా, ఆరోగ్యంగా ఎదుగుతాయి. దిగుబడులు ఇబ్బడిముబ్బడిగా అందిస్తాయి.