పురాణాల కాలం నుండి మనుషులకు వెదురుతో ఎంతో అనుబంధం ఉంది. మనుషుల మనుగడకు, ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. వెదురుగడలతో ఇళ్లు నిర్మిస్తారు. ఇంటిలో ఉపయోగపడే అనేక రకాల వస్తువులుగా వెదురు గడలను వాడతారు. వెదురు గడలతో బల్లలు, నిచ్చెనలు, వెదురు నారతో బుట్టలు లాంటి పలు గృహోపయోగకర పరికరాలు తయారు చేస్తారు. ఇంటి అలంకరణకు వెదురు ఉపయోగపడుతుంది. వెదురు గొప్పదనం గురించి చెప్పాలంటే.. పుట్టినప్పుడు ఉయ్యాల మొదలు మరణించినప్పుడు అంతిమయాత్ర వరకు చెప్పలేనన్ని ఉపయోగాలు వెదురుతో ఉంటాయి. కాగితం తయారీలో వెదురు వాడతారు. వెదురు బియ్యంను కొన్ని గిరిజన జాతులు ఆహారంగా వండుకుని తీసుకుంటారు. వెదురు బియ్యంను పిండిగా చేసుకొని రొట్టెలు చేసి తింటారు.
వెదురు ఆకులు మన ఆరోగ్య రక్షణలో బాగా పనిచేస్తాయి. వాటిలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. వెదురు ఆకులు మధుమేహ రోగులకు చక్కగా పనిచేస్తాయని స్పష్టం అయింది. ఈ ఆకుల్లో పీచుపదార్థం చాలా ఎక్కువ కాబట్టి మన రక్తంలో సుగర్ లెవెల్స్‌ను నియంత్రిస్తాయి. వైద్యుల సలహాతో వెదురు ఆకులతో టీ తయారుచేసుకుని తాగినవారి శరీరంలో ఇన్సులిన్ పెరిగిపోకుండా చేస్తుంది. ఊబకాయం, శ్వాసకోస సమస్యల నుంచి వెరుదు ఆకులు ఉపశమనం కలిగిస్తాయి. వెదురు ఆకులను మెత్తగా రుబ్బి, తేనె కలిపి నోటి పూత ఉన్నచోట కొన్ని రోజుల పాటు రాస్తే మంచి ఫలితం ఉంటుంది. ఎండబెట్టిన వెదురు ఆకులు పౌడర్‌గా చేసి, తేనె కలిపి తింటే పొడి దగ్గు, శ్వాస సంబంధ సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతారు. వెదురు ఆకుల టీ లేదా డికాక్షన్ తీసుకుంటే గ్యాస్, మలబద్ధకం నుంచి ఉపశమనం కలుగుతుంది. తాజా వెదురు ఆకులను పేస్ట్‌లాగా రుబ్బుకొని రాసుకుంటే చర్మ సమస్యలు తగ్గుతాయి. చర్మాన్ని ఆరోగ్యం ఉంచుతుంది.వెదురు మొక్కలు ఒకసారి నాటితే కొన్ని తరాల వారికి ఆదాయం ఇస్తూనే ఉంటాయి. నిటారుగా పెరిగే గడ్డి జాతికి చెందిన వెదురు ఉష్ణ ప్రదేశాలలో పెరుగుతుంది. వెదురులో సుమారు 75 రకాల జాతులు ఉన్నాయంటారు. అలాగే 1,500 రకాల వెదురు మొక్కలు ఉన్నాయి. పెద్ద రాకాసి అనే రకం 35 మీటర్ల ఎత్తు, 18 సెంటీమీటర్ల లావు వరకు పెరుగుతుంది. శీతల ప్రాంతంలో పెరిగే వెదురు చాల వేగంగా దట్టమైన గుబురు అడవిలా ఎదుగుతుంది. నిజానికి వెదురు మొక్కలు పెరగాలంటే భూమిలో తేమ ఉండాలి. నీరు లేకపోతే దీని ఎదుగుదల అంతగా ఉండకపోవచ్చు. ప్రపంచంలో ఎక్కడైనా సరే ఒకే రకం వెదురు మొక్కలు ఒకే సమయంలో పూత పూస్తాయి. మొలాకా రకం వెదురు ఒక రోజులో రెండు అడుగుల ఎత్తు పెరుగుతుందని అంటారు. ముళ్లు కలిగి ఉండే బంబూసా అరుండానేషియా వెదురుకు 50 లేదా 60 ఏళ్లకు ఒక్కసారి మాత్రమే పూత వస్తుంది. ఈ రకం వెదురు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో బాగా పెరుగుతుంది.సుదీర్ఘ కాలం పంట వెదురును ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా, ఈపూరు మండలం ఉడిజెర్ల గ్రామంలో రైతు పూర్ణచంద్రరావు 14 ఎకరాల్లో ఏడాది కాలంగా సాగు చేస్తున్నారు. వెదురు క్షేత్రంలో ఆయన అంతర పంటగా టేకు మొక్కలు పెంచుతున్నారు. వెదురు మొక్కలను ఆయన రసాయనాలు వినియోగించకుండా.. సహజసిద్ధ విధానంలో కమర్షియల్‌గా అభివృద్ధి చేశారు. వెదురు సాగు గురించి, పెట్టుబడి, మొక్కల మధ్య ఎంత దూరం ఉంచాలి?, నిర్వహణ?, ప్రభుత్వ సబ్సిడీలు, సాగులో పాటించాల్సిన జాగ్రత్తలు, దిగుబడి, మార్కెట్ అవకాశాలు ఎలా ఉంటాయనే విషయాలు పూర్ణచంద్రరావు పరిశీలన గురించి తెలుసుకుందాం.ముందుగా తాము వెదురు సాగు చేయాలనుకున్న భూమిలో సాయిల్ టెస్ట్, వాటర్ రిపోర్ట్ చేయించి రూపినేని కాంతి సలహాతో వెదురు సాగు చేపట్టారు పూర్ణచంద్రరావు. అలాగే వాతావరణం, వర్షపాతం ఎంత నమోదవుతుంది? గాలిలో తేమ ఏ మేరకు ఉంటుందనే విషయాలు పరిశీలించి కాంతి తమకు వెదురు సాగుకు అవకాశం ఉన్నట్లు చెప్పారన్నారు. ఆర్థికంగా ఇబ్బంది లేని, నాలుగేళ్ల వరకు ఆదాయం లేకపోయినా నిలదొక్కుకోగల రైతులు, పర్యావరణాన్ని పరిరక్షిద్దామనే కుతూహలం ఉన్నవారు వెదురు సాగు చేయవచ్చని పూర్ణచంద్రరావు చెప్పారు. పూర్ణచంద్రరావు తమ క్షేత్రంలో ఒక్కొక్కటీ ఒక్కో ప్రత్యేకత ఉన్న సుమారు 10 రకాల వెదురు మొక్కలు నాటారు. మొక్కలను ఒడిశా నుంచి రూపినేని కాంతి కొనుగోలు చేసి, ట్రీట్‌మెంట్ ఇచ్చి తనకు అందజేశారన్నారు. రవాణా చార్జీలు కాకుండా ఒక్కో మొక్క రూ.50కి వచ్చిందన్నారు. తాము నాటిన మొక్కల్లో 90% బతికినట్లు చెప్పారు. మొక్కలు నాటిన మొదటి రోజున బెల్లంను మదర్ కల్చర్‌తో కలిపి వాము ట్రీట్‌మెంట్ ఇచ్చామన్నారు.మొక్కకు మొక్కకు మధ్య 10 అడుగుల దూరంలో నాటినట్లు తెలిపారు. ఎకరం నేలలో సుమారు 400 మొక్కలు నాటినట్లు చెప్పారు. వెదురు మొక్కలు నాటిన నెల రోజులకు పలువురి సలహా మేరకు వాటి మధ్య అంతర పంటగా టిష్యూ కల్చర్ టేకు మొక్కలు నాటినట్లు చెప్పారు. టేకు మొక్కలు కూడా సుమారుగా 400 వేశామన్నారు. వెదురు మొక్కలు గుబురుగా పెరిగే సమయానికే టేకుమొక్కలు పైకి ఎదిగిపోతాయి కాబట్టి ఎలాంటి ఇబ్బందీ ఉండదు. వెదురు మొక్కలకు నెలకోసారి బెల్లం కలిపిన నీళ్లు తప్ప ఎలాంటి ఎరువులు, పురుగు మందులు ఇవ్వలేదన్నారు. వెదురు మొక్కలు ఏడాదికే అనేక పిలకలు వేసి, గుబురుగా ఏపుగా ఎదిగాయి. నేషనల్ బాంబూ మిషన్ (MBM) నుంచి పూర్ణచంద్రరావుకు సబ్సిడీ కూడా వచ్చింది. మొదటి సంవత్సరం 14 ఎకరాల వెదురు క్షేత్రానికి రెండు లక్షల రూపాయల సబ్సిడీ వచ్చిందన్నారు. రెండో ఏడాది రెండు విడతలుగా రూ.66,500 చొప్పున సబ్సిడీ ఇచ్చారని చెప్పారు. ఎంబీఎం సంస్థ వెదురు మొక్కల మెయింటెనెన్స్ కోసం సబ్సిడీ ఇచ్చినా తనకు ముందుగా మొక్కలు కొన్న ఖర్చు వచ్చేసిందన్నారు.మొక్కలు నాటే ముందు భూమిని దుక్కి దున్నేందుకు, కూలీల ఖర్చు తాను పెట్టినట్లయిందని అన్నారు. వెదురు మొక్కలు పెరిగి పెద్దవయ్యే వరకు కలుపు విపరీతంగా వచ్చింది. వెదురు సాగులో మొదటి మూడు, నాలుగు నెలల్లో కలుపు తీయించడం ఒక్కటే కాస్త ఖర్చు, కష్టంతో కూడుకున్న పని. ఇలా ప్రతిరోజు 14 ఎకరాల్లో కలుపు తీసేందుకు 20 నుంచి 30 మంది కూలీలను పెట్టాల్సి వచ్చింది. తద్వారా ప్రతి నెలా రూ.20 నుంచి 25 వేలు ఖర్చయిందన్నారు. మొక్క ఐదారు అడుగులు పెరిగిన తర్వాత కలుపు ఆటోమేటిక్‌గా తగ్గిపోయిందని పూర్ణచంద్రరావు చెప్పారు.వెదురు సాగుకు తాము ఎరువులు వేయాల్సి అవసరం ఉండదు. పురుగు మందులు కొట్టే పనే లేదు. న్యూట్రియంట్స్ వాడాల్సిన అక్కర లేదు. తమ క్షేత్రం ఉన్న ప్రాంతంలో గాలి, వేడి ఎక్కువ అన్నారు. దీంతో భూమిలో తేమ త్వరగా ఆవిరైపోతుంది. ఎంత వర్షం పడినా గంట తర్వాత అక్కడి నేల ఎండిపోతుంది. దీంతో డ్రిప్ వేసి, రోజూ నీరు ఇచ్చామన్నారు. వర్షం కురిసి, నేల తేమగా ఉంటే రెండు లేదా మూడు రోజులకు ఒకసారి నీరు ఇస్తే సరిపోతుంది. ఎరువులు, పురుగుమందులు వాడని నేల కాబట్టి ఇంటికి అవసరమైన కూరగాయలు, అరటి చెట్లు, 50 నుంచి 60 రకాల పండ్ల చెట్లు కూడా వేశామన్నారు. పూర్ణచంద్రరావు క్షేత్రం చుట్టూరా సహజసిద్ధమైన ఫెన్సింగ్‌గా ఉంటుందని వాక్కాయ మొక్కలు వేశారు. అవి పెరిగిన తర్వాత వాటి నుంచి కూడా ఆదాయం వస్తుందన్నారు.ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్‌కు రోజూ సుమారు 600 లారీల వెదురు గడలు లోడ్‌లు వస్తున్నాయి. ఇప్పుడిప్పుడే మన దగ్గర రైతుల్లో కూడా వెదురు సాగుపై అవగాహన వస్తోంది. హార్టీ కల్చర్ శాఖ అధికారులు పల్నాడు జిల్లాలో పర్యటించి, చుట్టుపక్కల రైతును తీసుకొచ్చి, తమ వెదురు సాగు గురించి అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. ఆదాయం లేకుండా నాలుగేళ్ల పాటు తట్టుకునే శక్తి ఉన్నవారు వెదురుసాగు చేస్తే.. ఆ నాలుగేళ్ల ఆదాయం మొత్తం ఒకేసారిగా వచ్చే అవకాశం ఉందని పూర్ణచంద్రరావు చెప్పారు. దూర ప్రాంతాల్లో ఉండి, ఖాళీ భూములు ఉన్నవారు మెయింటెనెన్స్ చేయనక్కరలేని వెదురు మొక్కలు నాటి, నమ్మకమైన ఒక కుటుంబాన్ని పెడితే.. మేలు జరుగుతుంది. ఉద్యోగ, వ్యాపారాల కోసం సిటీలకు వెళ్లిన వారు తమ భూములను ఖళీగా ఉంచే బదులు వెదురు మొక్కలు వేసి, మూడు, నాలుగేళ్లు ఉంచితే మంచి ఆదాయం వస్తుందన్నారు. వెదురు సాగుకు మొదటిసారి మాత్రమే పెట్టుబడి అవుతుంది. ఆ తర్వాత దానికి పెద్దగా ఖర్చు చేయాల్సిన పని ఉండదు. ఈ సాగు మొదలు పెట్టిన వారికే కాకుండా, ఆ తర్వాతి తరాలకు కూడా ఆదాయ వనరుగా మారుతుందన్నారు.అత్యంత వేగంగా పెరిగే గడ్డి చెట్టు వెదురు. ఆగ్రో ఫారెస్ట్‌లో భాగంగా ప్రభుత్వాలు కూడా అనేక రకాలుగా ఆరోగ్య, ఆరోగ్య ప్రయోజనాలు ఇచ్చే వెదురు సాగును ప్రోత్సహిస్తున్నాయి. ప్రపంచం మొత్తంలో వెదురు సాగు చేస్తున్న దేశాల్లో చైనా అగ్రభాగంలో ఉంది. తర్వాతి స్థానంలో భారత్‌ను చెప్పుకోవచ్చు. దీర్ఘకాలం పాటు ఆదాయం ఉండాలనుకునే రైతులు వెదురు సాగు చక్కని ప్రత్యామ్నాయంగా ఎంచుకోవచ్చు.