గులాబీ రంగులో మెరిసిపోతున్న ఈ అరటి చెట్లు చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం ఉబలంక గ్రామంలో ఈ సుందర దృశ్యం అందరినీ ఆకర్షిస్తోంది. ఉబలంక పంచాయతీ కార్యాలయ సమీపంలో నుంచి వెళ్లే బాటసారులు, గ్రామస్థులు ఒక్క క్షణం ఆగి ఆశ్చర్యంతో చూస్తున్నారు. పచ్చని ఆకుల మధ్య ముదురు గులాబీ రంగులో ఎంతగానో మురిపిస్తున్న ఈ ప్రత్యేకమైన అరటి చెట్లే కారణం. మనం ఎప్పుడూ చూసే అరటి చెట్లకు, గెలలకు ఇది పూర్తిగా భిన్నం. ఈ అందమైన అరటి చెట్ల విశేషాలు, ప్రత్యేకతలు ఏమిటో చూద్దాం.
ఈ గులాబీ అరటి ప్రత్యేకత ఏమిటంటే.. దీని పువ్వులు గులాబీ రంగులో ఉంటాయి. శాస్త్రీయంగా దీని పేరు ‘మూసా ఆర్నాటా’ (Musa ornata). ఈ రకం అరటిని సాధారణ భాషలో ‘గులాబీ అరటి’ లేదా ‘ఆర్నమెంటల్ బనానా’ అంటారు.
సాధారణంగా మనం ఎప్పుడూ చూసే అరటి చెట్ల పువ్వులు, గెలలు చెట్టు పైనుంచి కిందకు వేలాడుతుంటాయి. కానీ గులాబీ అరటి మొక్క పువ్వులు మాత్రం ఆకాశం వైపు పైకి నిటారుగా నిలబడి పూస్తాయి. ఈ అరటి చెట్లు 5 నుండి 9 అడుగుల ఎత్తు మాత్రమే పెరుగుతాయి. వీటి ముదురు గులాబీ రంగు పూలు, చిన్నగా ఉండే పండ్లు చూడడానికి ఎంతో అందంగా ఉంటాయి. గులాబీ అరటి చెట్ల కాండం చాలా దృఢంగా ఉంటుంది. దీంతో వాయు గుండాలు, తుపానులు వచ్చినా, పెను గాలులు వీచినా చెక్కు చెదరకుండా నిలబడతాయి. నేలకు పడిపోవు.

