మట్టి స్పర్శలో జీవం ఉందనే సత్యాన్ని గ్రహించి, సినిమాల్లో నటనకే కాకుండా నేల తల్లి సేవకు ప్రాణం పోస్తున్నారు నటుడు, నిర్మాత వీరమాశినేని రామకృష్ణ (ఆర్కేమామ). ‘హైదరాబాద్ నవాబ్స్’, ‘ఆంధ్ర బంధువు’ వంటి సినిమాలతో ప్రేక్షకులకు సుపరిచితుడాయన. ప్రకృతి సాగుపై ఉన్న మక్కువతో కర్ణాటకలోని హంపీ పరీవాహక ప్రాంతం ఆనెగొందిలో 21 ఎకరాల విస్తీర్ణంలో అద్భుతమైన ‘ఎకో ఫారెస్ట్’ (ఫుడ్ ఫారెస్ట్) నిర్మించారు రామకృష్ణ. ఒకప్పుడు నిస్సారమై, నిర్జీవ స్థితిలో ఉన్న నేలను కొద్ది సంవత్సరాల్లోనే సస్యశ్యామలంగా మార్చేశారు. వీరమాశినేని రామకృష్ణ అనుభవాలు, అనుసరించిన పద్ధతులు రైతులకు ఆదర్శప్రాయం.
హైదరాబాద్ లాంటి మహానగరంలో ఉంటూనే, కర్ణాటకలోని చారిత్రక విజయనగర సామ్రాజ్య తొలి రాజధాని ఆనేగొంది సమీపంలోని ‘చిక్రాంపుర’లో 21 ఎకరాల విస్తీర్ణంలో అద్భుతమైన ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. రామకృష్ణ తీసుకున్నప్పుడు ఆ భూమి వ్యవసాయానికి అనుకూలంగా లేదు. అంతకు ముందు ఎక్కువగా రసాయన ఎరువుల వాడడం వల్ల నేలలోని ఉపరితల మట్టి గట్టిపడింది. PH సమతుల్యత దెబ్బతిన్నది. జీవక్రియ పూర్తిగా నిలిచిపోయింది. చౌడు భూమిగా మారిపోయింది.ఇలాంటి పరిస్థితిని అధిగమించేందుకు రామకృష్ణ నేలను పునర్నిర్మించేందు ముందుగా అడుగులు వేశారు. మట్టిలో సహజంగా ఉండే మైక్రోబయల్ వాతావరణాన్ని కాపాడేందుకు ఆయన నేలను దున్నడం పూర్తిగా ఆపేశారు. భూమి లోపల తేమను కాపాడేందుకు ఉష్ణోగ్రతను నియంత్రించేందుకు నిరంతర మల్చింగ్ విధానం అమలు చేశారు. సరైన యజమాన్య పద్ధతులు, శాస్త్రీయ బయో-ఫర్టిలైజర్ల వినియోగం ద్వారా మూడేళ్లలోనే మట్టిలో సేంద్రీయ కార్బన్ శాతాన్ని గణనీయంగా పెంచగలిగారు.‘రైతు ఒకే రకం పంటపై ఆధారపడటం పెద్ద పొరపాటు’ అని ప్రగాఢంగా నమ్ముతారు ఆర్కే. ప్రకృతి వైపరీత్యాలు లేదా మార్కెట్ నష్టాల నుంచి తట్టుకోవడానికి ప్రత్యామ్నాయంగా బహుళ పంటల సాగు విధానమే సరైన పరిష్కారమని నిరూపిస్తున్నారు నటుడు రామకృష్ణ. తర ఫామ్‌లో 12 రకాల పనస, మలేషియన్ డ్వార్ఫ్, DJ వెరైటీలతో కలిపి కొబ్బరి మొక్కలు, 1200కు పైగా జామ, నిమ్మ మొక్కలు, మామిడి, బత్తాయి, ఉసిరి, నేరేడు, బొప్పాయి అరటి చెట్లు పెంచుతూ వైవిధ్యంగా బహుళ పంటల సాగు చేపట్టారు.ఫామ్ సరిహద్దు చుట్టూ మహాగని, వాక్కాయ వంటి మొక్కలను రక్షణ కవచంలా నాటారు. పసుపు, కలబంద, లెమన్ గ్రాస్, శంకపుష్పి వంటి మూలికా మొక్కలను ఇతర చెట్ల కింద అంతర పంటగా సాగు చేస్తున్నారు. బంతి, కూరగాయలు కూడా వేశారు. కొబ్బరి, జామ వంటి చెట్ల మొదళ్ల వద్ద పసుపు, అలోవెరా, లెమన్ గ్రాస్ నాటడం వెనుక సరికొత్త ఆలోచన ఉంది. ఇవి కేవలం ఆదాయాన్నిచ్చే పంటలే కాకుండా యాంటీ బయోటిక్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలతో ఉంటాయి. వాటితో పాటు కిడ్నీ సమస్యలకు మంచిదని నిపుణులు చెబుతున్న ‘చిక్లి సాంబా’, డయాబెటిక్ ఫ్రెండ్లీ ‘ఆర్ఎన్ఆర్’, రక్తశాలి, రాజమూడి వంటి మన ప్రాచీన దేశవాళీ వరి రకాలు సాగు చేస్తున్నారు.లెమన్‌గ్రాస్ ఆకులను కత్తిరించి మల్చింగ్గా వాడితే మట్టి సారవంతం అవుతుంది. పసుపు, కలబంద వేర్ల నుండి వచ్చే సహజ సిద్ధమైన గుణాలు ప్రధాన చెట్ల వేర్లకు చేరి, ఫంగల్ ఇన్ఫెక్షన్లు అంటే శిలీంధ్ర వ్యాధులు రాకుండా కాపాడతాయి. ఫలితంగా కొబ్బరి నీరు, కాయల గుజ్జులో సహజ పోషక విలువలు బాగా పెరుగుతాయి. సహజ సాగు విధానం అవలంబించాలని నిర్ణయించుకున్న ఆర్కే రసాయన ఎరువుల దుకాణానికి వెళ్లే పనిని పూర్తిగా పక్కన పెట్టేశారు. కేవలం జీవామృతం, కంపోస్ట్ వంటి మూస పద్ధతులకు మాత్రమే పరిమితం కాకుండా, శాస్త్రీయ సలహాలను కూడా జతచేశారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు రూపినేని క్రాంతి, శ్రీలత వంటి నిపుణుల సలహాలతో నేలలో ఉన్న మైక్రో-న్యూట్రియంట్ లోపాలను (జింక్, సల్ఫర్, మెగ్నీషియం, బోరాన్) గుర్తించారు. సాయిల్ కండిషనర్లు, కార్బన్ ప్రొడక్ట్స్, బయో ఫర్టిలైజర్లు వాడటం ద్వారా రూట్ రాట్ వేరు కుళ్ళు వ్యాధి, నిమటోడ్స్ సమస్యలను అధిగమించి చెట్లలో ఆరోగ్యకరమైన ఎదుగుదల సాధించారు.సినీ నటుడు రామకృష్ణకు వ్యవసాయం కొత్త కాదు. రామకృష్ణకు వ్యవసాయంతో అనుబంధం ఉంది. ఆర్కే తండ్రి హెల్త్ ఆఫీసర్‌గా రిటైర్ అయ్యాక ఇప్పటి యాదాద్రి జిల్లాలో 140 ఎకరాలలో పెద్ద ఎత్తున వ్యవసాయం చేసేవారు. అలా రామకృష్ణకు చిన్నతనం నుంచే మట్టితో అనుబంధం ఏర్పడింది. వ్యవసాయ కుటుంబ నేపథ్యం ఉన్న ఆయన, హంపి సమీపంలోని ఆనెగొంది ప్రాంతంలో 21 ఎకరాల భూమిని తీసుకుని వ్యవసాయంలోకి అడుగుపెట్టారు. పాత వరి పొలాన్ని క్రమంగా ఫుడ్ ఫారెస్ట్‌గా, మల్టీ-లేయర్డ్, బయోడైవర్సిఫైడ్ ఫార్మింగ్ మోడల్‌గా మార్చే ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యారు.ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రారంభించిన రామకృష్ణకు తొలి దశలో పలు సమస్యలు ఎదుర్కొన్నారు. భారీ వర్షాలతో నేలలో సాలినిటీ పెరిగింది. నీరు భూమిలోకి ఇంకేది కాదు. భూమి పైపొరలోనా సారం కొట్టుకుపోయింది. ఆయన నాటిన దాదాపు 300 కొబ్బరి మొక్కలు చనిపోయాయి. ఈ అనుభవాల తర్వాత ఆయన నేలపై మరింత శాస్త్రీయంగా దృష్టి పెట్టారు. తర్వాత సాయిల్ టెస్టింగ్, జీవామృతం, కంపోస్టింగ్, గ్రీన్ మెన్యూర్, మల్చింగ్, జీరో టిల్లింగ్ వంటి పద్ధతులను అనుసరిస్తూ నేలను క్రమంగా పునరుద్ధరించారు.‘తీవ్ర అనారోగ్యంతో ICU లో ఉన్న రోగికి నిపుణుడైన వైద్యుడి చికిత్స ఎంత అవసరమో.. నిర్వీర్యమైపోయిన మన నేలలను పునరుద్ధరించేందుకు సరైన శాస్త్రీయ అవగాహన, బయో-ఇంటర్వెన్షన్ అంతే అవసరం’ అనేది నటుడు రామకృష్ణ సందేశం. రసాయనాలు లేకుండా, ప్రకృతి సూత్రాలకు అనుగుణంగా ఆయన పాషనేట్‌గా సాగు చేస్తూ, తక్కువ సమయంలోనే మోడువారిన కొండలను సైతం హరిత వనంగా మార్చవచ్చని రామకృష్ణ స్వయంగా చేసి చూపించారు.ఒకటి రెండేళ్లు ఫామ్ నుంచి దిగుబడి రాకపోయినా మేనేజ్ చేసుకోవాలంటారు ఆర్కే. కొత్తగా వ్యవసాయంలోకి వచ్చే వారు ముందుగా సాయిల్ టెస్ట్ చేయించడం, అనుభవజ్ఞులైన రైతులను కలసి నేర్చుకోవడం ఎంతో ముఖ్యం అంటారు రామకృష్ణ. డబ్బు సంపాదించడం కంటే నేలను కాపాడుతూ వ్యవసాయం చేయడంలోనే అసలైన సంతృప్తి ఉందని రామకృష్ణ అనుభవం చెబుతోంది.