Site icon V.E.R Agro Farms

వేల లాభాల వెల్లుల్లి

వెల్లుల్లి… కేవలం మసాలా దినుసే కాదు.. ఎన్నో ఔషధ గుణాలతో కలిపి ప్రకృతి మనకు ప్రసాదించిన విలువైన ఆహారం. వెల్లుల్లిలో ప్రధాన  పోషకం అల్లిసిన్‌. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీనిలో శక్తివంతమైన యాంటీ మైక్రోబయల్‌ ఉంటుంది. ఇది శరీరంపై దాడిచేసే బాక్టీరియా, వైరస్‌లపై యుద్ధమే చేస్తుంది. ప్రతిరోజూ వెల్లుల్లి తినేవారిలో రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. రాత్రి నిద్రపోయే ముందు ఒక పచ్చి వెల్లుల్లి రెబ్బను తింటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇన్ఫెక్షన్‌ నుంచి రక్షిస్తుంది. దీంట్లో కొలెస్ట్రాల్‌ను తగ్గించే గుణం ఉంది కాబట్టి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్స్‌ కారణంగా ఫ్రీరాడికల్స్ అనే క్యాన్సర్‌ కారక కణాల నుంచి రక్షిస్తుంది. సెల్‌ చెడిపోకుండా కాపాడుతుంది. దీర్ఘకాలిక వ్యాధులను మన దరిచేరనివ్వదు.ఆహారంలో వెల్లుల్లి తీసుకునే వారి శరీరం బరువు తగ్గుతుంది. శరీరం మొత్తం శుభ్రం అవుతుంది. శరీరంలోని మలినాలను తొలగించేందుకు వెల్లుల్లి కొవ్వులను వాడుతుంది కనుక బరువు తగ్గుతుంది. వెల్లుల్లిలో నిద్రను ప్రేరేపించే అమైనో ఆమ్లం ట్రిప్టోఫాన్‌ అనే పోషకం ఉంటుంది. కాబట్టి నిద్ర, మేల్కోనే సమయాలను చక్కగా నియంత్రిస్తుంది. అంటే ప్రశాంత నిద్రకు సహాయపడుతుంది. వెల్లుల్లి తినే వారికి దానిలోని విటమిన్‌ బీ 6, విటమిన్ సీ, ఫైబర్‌, మాంగనీస్‌ లాంటి పోషకాలు అంది ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.మూడు గ్రాముల వెల్లుల్లిలో కేలరీలు జీరో అని అధ్యయనాలు తేల్చాయి. వెల్లుల్లిని కాల్చి లేదా వేయించడం కంటే పచ్చిగా తీసుకుంటే ఫలితం ఎక్కువ ఉంటుంది. వెల్లుల్లి చర్మాన్ని రక్షిస్తుంది. మొటిమలను తగ్గిస్తుంది. రక్తపోటు ఉన్నవారిలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుంది. వెల్లుల్లిని భోజనానికి ముందు పౌడర్‌ రూపంలో తీసుకుంటే మధుమేహం నుంచి ఉపశమనం వస్తుంది. చలికాలంలో జలుబును వెల్లుల్లి తగ్గిస్తుంది. మెదడును ఫ్రెష్‌గా ఉంచి, మెంటల్ కండిషన్‌గా పనిచేస్తుంది. పురుషులలో టెస్టోస్టెరాన్‌ను పెంచి, లైంగిక శక్తిని మెరుగు పరుస్తుంది.  నోటి ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. రక్తం గడ్డకట్టించేందుకు శక్తివంతమైన ఏజెంట్ వెల్లుల్లి.ఇలా మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందించే వెల్లుల్లి పంట సాగు.. ఇతర విషయాలు తెలుసుకుందాం.

వర్షాకాలం పూర్తయిన తర్వాత అంటే అక్టోబర్‌, నవంబర్‌ నెలల్లో వెల్లుల్లి సాగు ప్రారంభించాలి. ఆ నెలల్లో వెల్లులి విత్తనాలు నాటుకుంటే పంట బాగా వస్తుంది. వెల్లుల్లి విత్తరాలను భూమిలో పది సెంటీ మీటర్ల దూరంలో నాటుకోవాలి. వెల్లుల్లి పైరులో నీరు ఎక్కువగా నిలిచిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే పంట దెబ్బతింటుంది. వెల్లుల్లిని శుభ్రమైన, సారవంతమైన లోమ్‌ మట్టిలో సాగుచేస్తే.. దిగుబడి మరింత ఎక్కువ వస్తుంది. కర్బనం ఉన్న మట్టి అయితే.. దీనికి అత్యుత్తమమైనదని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతారు. ఇసుక, లూజుగా ఉన్న భూమిలో వెల్లుల్లి పెరుగుదల సాధ్యం కాదంటారు. వెల్లుల్లి సాగుచేసే మట్టిలో పీహెచ్‌ స్థాయిలు 6 నుంచి 7.5 మధ్య ఉండాలి. వెల్లుల్లి మొక్కల ఆకులు విస్తరించిన దశలో నైట్రోజన్‌ బాగా అవసరం అవుతుంది. ఆవుపేడ, లేదా పౌల్ట్రీ నుంచి తీసుకున్న సేంద్రీయ ఎరువులు మట్టిలో కలిపితే వెల్లుల్లి మొక్కలకు నైట్రోజన్ సమృద్ధిగా అందుతుంది. వెల్లుల్లి మొక్క వేర్లు సరిగా ఎదిగేందుకు ఫాస్పరస్ అవసరం అవుతుంది.వెల్లుల్లి విత్తనం నాటిన మరుసటి రోజే నీరు సరఫరా చేయాలి. చాలా సున్నితంగా ఉండే వెల్లుల్లి పంట వాతావరణ పరిస్థితులకు తేలికగా ప్రభావితం అవుతుంది. వెల్లుల్లి పైరుకు తేమ అవసరమే కాని, మరీ ఎక్కువ నీరు ఉండకూడదని రైతులు గుర్తుపెట్టుకోవాలి. నేలలోని తేమను గమనిస్తూ.. వారానికి ఒకసారి నీరు అందిస్తే సరిపోతుంది. వాతావరణంలో మరీ ఎక్కువ వేడి, లేదా పొడిగా ఉన్నా.. పంట నాణ్యతపై ప్రభావం చూపుతుంది. వేసవిలో 7 నుండి 10 రోజులకు ఒకసారి, ఇతర రోజుల్లో ఐదు రోజులకోసారి నీరు అందిస్తే సరిపోతుంది. వర్షాకాలంలో నీరు ఇవ్వాల్సిన పనే ఉండదు. వెల్లుల్లి విత్తనం నాటిన ఐదు నుంచి ఆరు నెలల్లో పంట చేతికి వస్తుంది. సరైన సస్యరక్షణ చర్యలు చేపడితో ఎకరం నేలలో 50 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది.వెల్లుల్లి విత్తనాలుగా నాణ్యమైనవి, ఆరోగ్యంగా, బలంగా ఉండే రెబ్బలను మాత్రమే నాటుకోవాలి. విత్తనాలుగా ఎంచుకున్న రెబ్బలను 5 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత ఉన్నచోట నెలన్నర నుంచి రెండు నెలలు జాగ్రత్త చేసుకోవాలి. రోజుకు ఆరు నుంచి 8 గంటలపాటు సూర్యకాంతి ఉండే నేలలో వెల్లుల్లి పంట సాగు చేస్తే మంచిది. కంపోస్ట్‌ లాంటి సహజ ఎరువును వినియోగిస్తే మేలు. గ్రాన్యూల్‌ లేదా సేంద్రీయ ఎరువులను భూమిలో వేయాలి. మట్టిని తవ్వేందుకు సులువుగా ఉండేలా తయారైన తర్వాత వెల్లుల్లి విత్తనాలు నాటుకోవాలి. భూమిని కాస్త ఎత్తుగా బెడ్లుగా తయారు చేసి వాటిలో నాటుకోవాలి. దానిపై ఆరు అంగుళాల వరకు ఎండుగడ్డిని పొరలు పొరలుగా మల్చింగ్‌ వేయాలి.వెల్లుల్లిని ఆంధ్రప్రదేశ్‌, హర్యానా, ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, ఒడిశా, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, రాజస్థాన్‌, బెంగాల్‌లో ఖరీఫ్, రబీపంటగాను కొండ ప్రాంతాల్లో రబీపంటగా రైతులు నాటుతారు. వెల్లుల్లి విత్తనాలను నేలపై చల్లుకొని దున్నుకోవచ్చు, లేదా బెడ్లలో విత్తుకోవచ్చు. చల్లుకునే విధానంలో అర ఎకరాకు 70 కిలోల విత్తనాలు అవసరం అవుతాయి. కిలో వెల్లుల్లి విత్తనాలు కిలో రూ.150 అయితే.. రూ.10 వేలు ఖర్చు అవుతుంది. కలుపు తీసేందుకు, పంట కోసేందుకు, బస్తాల్లో నింపేందుకు కూలీలు అవసరం అవుతారు. దాంతో పాటు రవాణా ఖర్చు కూడా వెల్లుల్లి రైతులకు ఉంటుంది.సహజంగా చీడ పీడల నివారణగా వెల్లుల్లి పనిచేస్తుంది కాబట్టి వాటి బెడద ఈ పంటకు తక్కువనే చెప్పాలి. అయితే.. వైట్ రాట్‌ అనే ఫంగస్‌ చలికాలంలో వెల్లుల్లిపై దాడి చేసే అవకాశం ఉంటుంది. వైట్‌రాట్‌ వ్యాధి అవశేషాలు చాలా ఏళ్ల పాటు మట్టిలో ఉండగలవు. ఈ వైట్రాట్‌ ప్రధానంగా వెల్లుల్లి ఆకులు, వేర్లను ఆశిస్తుంది.

మార్కెట్‌లో క్వింటాల్‌ వెల్లుల్లికి దాని నాణ్యతను బట్టి 10 నుంచి 21 వేల రూపాయల మధ్య ధర పలుకుతుంది. ఎకరం భూమిలో వెల్లుల్లి సాగుకు అన్ని ఖర్చులూ కలిపి రూ.40 వేలు వరకు పెట్టుబడి అవసరం అవుతుంది. వెల్లుల్లిలో రియావన్‌ రకం ఎక్కువ నాణ్యతతో ఉంటుంది కనుక డిమాండ్ ఎక్కువ. రియావన్ వెల్లుల్లి గడ్డ దాదాపు 100 గ్రాముల బరువు ఉంటుంది. దీంట్లో ఆరు నుంచి 13 రెబ్బలు ఉంటాయి. ఈ రకాన్ని సాగు చేస్తే ఒక ఎకరం నుంచి ఏడాది కాలంలో 5 నుంచి 10 లక్షల రూపాయల దాకా ఆదాయం వచ్చే అవకాశం ఉంటుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Exit mobile version