Site icon V.E.R Agro Farms

ఆరోగ్యం, లాభాల కలగలుపు నల్ల పసుపు

నల్ల పసుపు లేదా కాలీ హల్దీ అరుదైన, పురాతన ఔషధ మొక్క. గాఢమైన కర్పూర సువాసన ఉండే దీని దుంపల లోపల ముదురు నీలంలో కానీ నలుపు రంగులో కానీ ఉంటాయి. అందుకే దీనిని నల్ల పసుపు అంటారు. పసుపు జాతులలో అంతరించిపోతున్న జాతి నల్ల పసుపు. దీనితో ఆరోగ్య ప్రయోజనాలతో పాటు ఆధ్యాత్మిక విశ్వాసాలు కూడా ఉన్నాయి. అలాగే సాగు చేసిన రైతుకు ఇబ్బడి ముబ్బడిగా లాభాలు అందిస్తుంది. కీళ్లు, కండరాల నొప్పులు, వాపులను తగ్గించేందుకు నల్ల పసుపు చక్కగా పనిచేస్తుంది. నల్ల పసుపు ముద్దను నొప్పి ఉన్న చోట పూత పూస్తే.. సునాయాసంగా తగ్గిపోతుంది. నల్ల పసుపు రసం పార్శ్వ నొప్పి (మైగ్రేన్‌)కి బాగా పనిచేస్తుంది. ఇది పైల్స్‌, కుష్టు, ఆస్తమా, ఎయిడ్స్‌, మూర్చ, జ్వరాలు, సంతానలేమి, సంభోగ సంబంధ సమస్యలు, మహిళల్లో నెలసరి ఇబ్బందులు, పంటి నొప్పులు, వాంతులు తగ్గడానికి ఉపయోగపడుతుంది. నల్ల పసుపులో ఉండే కర్కుమిన్‌ జ్ఞాపకశక్తిని మెరుగు పరుస్తుంది. శ్వాసకోశ వ్యాధులు తగ్గించడంలో నల్ల పసుపు ఎంతగానో పనిచేస్తుంది.

కడుపులో గ్యాస్‌, అజీర్తి, కడుపు నొప్పి లాంటి సమస్యల నివారణలో నల్ల పసుపు పనిచేస్తుంది. దీనిలో యాంటీ మైక్రోబయల్‌, యాంటీ ఫంగల్‌ గుణాలు ఉన్నాయి. ఇవి దెబ్బలు, తామర, దురద, చర్మ వ్యాధులు తగ్గించేందుకు పై పూతగా దీన్ని రాస్తారు. దగ్గు, జలుబు, ఆస్తమా లాంటివి ఉన్నవారు నల్ల పసుపును తేనెతో కలిపి తీసుకుంటే రిలీఫ్‌ వస్తుంది. నల్లు పసుపులో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. నల్ల పసుపులో క్యాన్సర్ కణాలను నిరోధించే శక్తి ఉందని పరిశోధనల్లో తేలింది. నల్ల పసుపు రక్తంలో సుగర్‌ లెవెల్స్‌ను నియంత్రిస్తుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇన్సులిన్‌ సెన్సిటీవిటీని నల్ల పసుపు నియంత్రిస్తుంది. ఒత్తిడి, ఆందోళనను తగ్గించేందుకు నల్ల పసుపు ఉపయోగపడుతుంది. ముఖంపై మొటిమలు, మచ్చలను తగ్గిస్తుంది. ఆరోగ్యాన్ని రక్షించే నల్ల పసుపును గర్భిణులు, బాలింతలు, ఇతర ఆరోగ్య సమస్యలున్నవారు వైద్యుల సలహాతో మాత్రమే వాడాల్సి ఉంటుంది.

నల్ల పసుపు పంటను మన దేశంలోని ఈశాన్య రాష్ట్రాలు, మధ్యప్రదేశ్‌లో ఎక్కువగా పండిస్తారు. పశ్చిమ బెంగాల్‌, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లోనూ పండుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా పలుచోట్ల రైతులు దీన్ని పండిస్తున్నారు. నల్ల పసుపును చైనా, నేపాల్‌, మలేషియా, థాయ్‌లాండ్‌, ఇండోనేషియాలోని పలు ప్రాంతాల్లో పండిస్తున్నారు. నల్ల పసుపును సాగు చేయడం, కోయడం, ఉడకబెట్టడం, ఎండబెట్టడం సాధారణ పసుపులాగే ఉంటుంది. కానీ నల్ల పసుపు దుంపలను ఉడికిస్తే లోపల ఉండే నలుపు లేదా నీలంరంగు పోయి, సాధారణ పసుపు రంగు వచ్చేస్తుంది.నల్ల పసుపు పంట సాగు చేయాలంటే 15 నుండి 40 డిగ్రీల సెల్సియస్‌ మధ్య ఉష్ణోగ్రతలు ఉండాలి. భూమిలో PH స్థాయిలు 4.5 నుంచి 6.5 ఉండాలి. నీరు నిలిచిపోకుండా ఉండే నల్లరేగడి భూమిలో పండించవచ్చు. ఎర్ర ఇసుక నేలలు దీనికి శ్రేష్టం. చౌడు భూములు, నీరు నిల్వ ఉండే నేలలు దీనికి పనికిరావు. నిటారుగా, 0-5 నుండి 1.0 సెంటీమీటర్ల ఎత్తులో నల్ల పసుపు మొక్క పెరుగుతుంది. దీని మొక్కలకు గొట్టం ఆకారంలో లేత గులాబీ రంగులో పువ్వులు పూస్తాయి. దీని కాండం సాధారణంగా 2 నుండి 6 సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఉంటుంది.

జూన్ తొలి వారానికి ముందే భూమిని రెండు నుంచి నాలుగు సార్లు దున్ని, మట్టిని బాగా ఎండనివ్వాలి. ఆ మట్టికి నీరు పారించాలి. ఒక హెక్టారు భూమికి 20 టన్నుల పశువుల పేడ ఎరువు వేయాలి. విత్తనం దుంపలను ఎర్రమట్టి, పేడ, వేపాకులతో కలిపి కోన్‌ ఆకారంలో నేల మీదే మండిలా కట్టి ఉంచాలి. మండి లోపల వేడి బయటికి వెళ్లిపోవడానికి మూడు ఖాళీ పైపులు అమర్చాలి. దుంపల నుంచి 23 రోజులకు అర అంగుళం నుంచి అంగుళం పొడవులో మొలకలు వస్తాయి. మొలిచిన దుంపలను సాళ్లలో నాటుకోవాలి. వర్షాకాలం తర్వాత నెలకు రెండు సార్లు నీరు అందిస్తే సరిపోతుంది. జూన్‌ మొదటి వారం తొలకరి సీజన్‌లో నల్లపసుపు మొక్కలు నాటితే వాతావరణం బాగా సరిపోతుంది. మొక్క తొలి రోజుల్లో 10 నుండి 15 డిగ్రీల సెల్సియన్ ఉష్ణోగ్రతలు ఉంటే మొక్కలు బాగా పుంజుకుని పైకి ఎదుగుతాయి. మొక్కలు వేళ్లూనుకొని, దుంపలు కట్టే సమయంలో ఎక్కువ ఉష్ణోగ్రత అవసరం అవుతుంది.నల్ల పసుపు పంట 9 నుండి పది నెలల్లో కోతకు సిద్ధం అవుతుంది. నల్ల పసుపు దుంపలను భూమి నుండి జాగ్రత్తగా తవ్వి తీసి, పొడిగా ఉన్న నీడ ఉన్న చోట ఆరబెట్టాలి. రైతులు దీని సస్యరక్షణను సరిగ్గా చేస్తే.. పచ్చిగా ఉన్నప్పుడు ఎకరాకు 19 నుండి 20 టన్నుల వరకు వస్తుంది. ఎండబెట్టిన తర్వాత మూడున్నర నుంచి 5 టన్నుల వరకు ఉంటుంది. నల్ల పసుపునకు ఇనుము లాంటి కొన్ని వస్తువులు తగిలితే ఔషధ విలువలు తగ్గిపోతాయని కొందరు చెబుతున్నారు. నల్ల పసుపును పచ్చ కర్పూరం తయారీలో వినియోగిస్తారని అంటారన్నారు.

రంగారెడ్డి జిల్లా గండిగూడ రైతు రాజశేఖర్‌ నల్ల పసుపు సాగు చేస్తున్నారు. సాధారణ పసుపు సాగయ్యే భూముల్లో నల్ల పసుపు కూడా చక్కగా పండుతుందని రాజశేఖర్ చెప్పారు. వన మూలికలా వినియోగించే నల్ల పసుపు మామూలు పసుపు కన్నా అధిక రేటు పలుకుతుందన్నారు. సాధారణ పసుపు కిలో 300 నుండి 450 వరకు ధర వస్తే.. నల్ల పసుపు మాత్రం దాని నాణ్యతను బట్టి రూ.1,500 నుంచి రూ.5 వేలు వరకు ఉంటుందన్నారు.తొమ్మిది నెలల పంట అయ నల్ల పసుపు మొక్కలకు పురుగు మందులేవీ తాము స్ప్రే చేయలేదని రాజశేఖర్‌ వెల్లడించారు. నల్ల పసుపు మొక్కలు సెల్ఫ్‌ రెసిస్టెన్స్‌ కలిగి ఉంటాయి. పురుగులు, వైరస్‌లు, చీడలు నల్ల పసుపు మొక్కలను ఏమీ చేయలేవు. చివరికి ఆకుల్లోని పచ్చని రసాన్ని పీల్చే పురుగులు కూడా దీని జోలికి రావు. నల్ల పసుపు మొక్కలకు నీరు అధికంగా ఇస్తే.. వాటిలోని ఔషధ విలువలు భూమిలోకి దిగిపోయే అవకాశం ఉందని హెచ్చరించారు.

మొక్కల మధ్య రెండు అడుగులు, సాళ్ల మధ్య మూడు అడుగుల దూరం ఉండేలా నల్ల పసుపు మొక్కలు నాటినట్లు చెప్పారు. ఇలా చేస్తే సుమారు 7నుంచి 8 వేల మొక్కలు పడతాయి. మొక్కలకు గాలి, వెలుతురు ధారాళంగా ఉంటే మొక్క ఏపుగా ఎదుగుతుందని, దిగుబడి కూడా అధికంగా వస్తుందని అన్నారు. కలుపు, ఇతర చెత్త చెదారం నల్ల పసుపు చేనులో ఉంచితే రసం పీల్చే పురుగులు, లద్దె పురుగులు లాంటివి పట్టే అవకాశం ఉంటుంది.నల్ల పసుపు పంట సాగు కోసం విత్తనాలు కిలోకు సగటున 2 వేల రూపాయలు ఉండొచ్చని రాజశేఖర్‌ చెప్పారు. అంటే ఎకరానికి వత్నాలు కొనేందుకు లక్ష రూపాయల వరకు అవుతుంది. విత్తనం కొనుగోలు ఒక్కటే దీనికి అతి పెద్ద ఖర్చు. భూమిలో అడుగు దూరానికి ఒకటి ఉండే ఇన్నర్‌ డ్రిప్పర్‌ వేసుకుంటే రూ.20 వేలు ఖర్చు వస్తుంది. పైకి కనిపించే అప్పర్‌ డ్రిప్పర్‌ వేస్లే రూ.15 వేలు అవుతుంది. మల్చింగ్ షీట్ వేస్తే మరో రూ.15 వేలు అవుతుంది. ఎరువులు లేదా పశువుల పెంట వేస్తే రూ.20 వేలు వ్యయం అవుతుంది. కూలీల ఖర్చు మరో రూ.15 వేలు వరకు ఉంటుంది. మొత్తం అంతా కలిపి ఎకరానికి రూ. లక్షా 70 వేల వరకు పెట్టుబడి పెట్టాలి. ఎకరం నేలలో కనిస్టంగా 12 నుండి 15 క్వింటాళ్ల దిగుబడి వచ్చినా, అతి తక్కువగా కిలోకు రూ.2 వేలే పలికినా రూ.24 లక్షల ఆదాయం వస్తుంది. పెట్టిన పెట్టుబడి రూ. లక్షా 70 వేలు పోగా రూ.22 లక్షలు మిగులుతుందని రాజశేఖర్‌ వివరించారు. ఎకరం భూమి నుంచి నల్ల పసుపు హీనాతి హీనంగా 8 క్వింటాళ్లే దిగుబడి వచ్చినా రూ.16 లక్షల ఆదాయం ఉంటుంది. పెట్టుబడిగా రూ.2 లక్షలు తీసేసినా రూ.14 లక్షల లాభం కనిపిస్తుంది.ఒకసారి నల్ల పసుపు మొక్కలు నాటితే దాని నుంచే విత్తనాలు తయారు చేసుకోవచ్చు. పంటకు మనం ఇచ్చే బలాన్ని బట్టి దిగుబడి ఉంటుంది. కేవలం నీరు సరఫరా చేసి పండిస్తే.. దిగుబడి తగ్గుతుంది. నల్ల పసుపు పొలంలో కలుపు తీయకపోతే కూడా దిగుబడి తగ్గుతుంది. నల్ల పసుపు మొక్కలు ఎండిపోయి, పూర్తిగా నేలకు పడిపోతాయి. ఇదే ఈ పంట తీయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇండికేషన్‌. పది పదిహేను రోజులు అలా ఉంచేసినా ఏమీ కాదు. కానీ పంట తయారైన తర్వాత పెద్ద వర్షం కురిస్తే మరో 15 రోజులకు మొత్తం మొలకలు వచ్చేస్తాయి.

నల్ల పసుపు మొక్కలను చీడ పీడలు రావు. అయితే.. సమీప పొలాల్లోని చీడలు ఈ పంటకు ఆశిస్తే.. నీమ్‌ ఆయిల్‌ స్ప్రే చేస్తే సరిపోతుంది. నల్ల పసుపు పంట ఒకసారి వేస్తే.. ఆ తర్వాత మళ్లీ అదే పంట వేయకూడదు. పసుపు పంటకు భూమిలోని కర్బనం అధికంగా ఖర్చయి పోతుంది. అందుకే రెండోసారిగా వేరే పంట వేసుకోవాలి. ఆ తర్వాతి ఏడాది మళ్లీ నల్ల పసుపు పంట సాగుచేస్తే.. దిగుబడి యధావిధిగా వస్తుంది. నల్ల పసుపు పంటకు మధ్యప్రదేశ్‌లోని నీమూచ్‌ మార్కెట్‌లో అధిక డిమాండ్‌ ఉంటుంది.నల్ల పసుపును దిష్టి తీసేందుకు, గుమ్మం ముందు కట్టేందుకు, మరికొన్ని ఇతర అవసరాల కోసం వాడతారంటారు. అందుకే దీని సాగును ప్రభుత్వం నిషేధించినట్లు ప్రచారంలో ఉంది. కానీ, నల్ల పసుపు పంటపై ప్రభుత్వం ఎలాంటి నిషేధమూ విధించలేదు. అరుదైన, అధిక ఔషధ గుణాలు గల పంట. ఈ మొక్కలను అడవుల్లో విచ్చలవిడిగా తవ్వేయడం వల్ల అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. అందుకే అటవీ ప్రాంతాల్లో వీటిని సేకరించడంపై కొన్ని అటవీ శాఖల నిబంధనలు ఉన్నాయి. వ్యవసాయ భూముల్లో ఈ పంటను రైతులు చట్టబద్ధంగా సాగు చేసుకోవచ్చు అని చెబుతారు.

Exit mobile version