ఈ ఆధునిక సమాజంలో ఆహారంలో క్యాప్సికం వాడకం బాగా పెరిగింది. పట్టణ, నగర వాతావరణంలో నివసిస్తున్న అనేక మంది క్యాప్సికంను వినియోగిస్తున్నారు. క్యాప్సికం పట్ల ఇప్పుడు ఎంతో మోజు పెరిగింది. ఆరోగ్యంగా ఉండాలని కోరుకునే పలువురు విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం అధికంగా లభించి క్యాప్సికం పట్ట మక్కువ పెంచుకుంటున్నారు. కేలరీలు తక్కువ ఉండడం వల్ల క్యాప్సికం వాడిన వారి శరీర బరువు తగ్గుతుంది. దీనిలోని పీచుపదార్థం కారణంగా జీర్ణక్రియ మెరుగవుతుంది. మలబద్ధకం, అజీర్తిని తగ్గిస్తుంది.
క్యాప్సికంలో ఉండే పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్ల వల్ల రక్తపోటును నియంత్రిస్తాయి, కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గిస్తాయి. దీనితో గుండె ఆరోగ్యంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు తేల్చి చెప్పారు. క్యాప్సికంలో ఉండే విటమిన్ సీ వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. హాని కలిగించే ఫ్రీరాడికల్స్ బారి నుండి క్యాప్సికం తీసుకునే వారికి రక్షణ ఉంటుంది. పచ్చరంగు క్యాప్సికంలో ఎక్కువగా ఉండే విటమిన్ కే ఎముకలకు ఎంతో ప్రయోజనం కలిగిస్తుంది. లైకోపీన్ ఉండే ఎరుపు రంగు క్యాప్సికం గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. క్యాన్సర్ ప్రమాదం లేకుండా చేస్తుంది.
క్యాప్సికం సాగు అంటే ఒక పుస్తకం లాంటిదని, దీని గురించి పూర్తి అవగాహన వచ్చిన తర్వాతే సాగులో దిగితే మంచిదంటారు రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం కుర్వగూడలో ఆరు ఎకరాల్లో షేడ్‌నెట్ కింద క్యాప్సికం పండిస్తున్న అనుభవంతో రైతు రాజు చెప్పారు. బెంగళూరులో షేడ్‌నెట్‌లో క్యాప్సికం పండిస్తున్న పలువురు రైతుల అనుభవాలు, సాగు విధానం తెలుసుకొన్నట్లు తెలిపారు. విత్తనాలను ప్రో ట్రేలలో పెట్టినప్పటి నుంచి పంట తొలి కోత వచ్చే వరకు తమకు ఎకరానికి రూ.4 లక్షల ఖర్చు అయిందన్నారు రాజు.
షేడ్‌నెట్ వేసేందుకు 10 అడుగుల వెదురు గెడలను ఒక్కొక్క దాన్ని 9 అడుగుల దూరంలో అడుగు లోతులో భూమిలో పాతినట్లు రాజు చెప్పారు. వాటికి జీఈ వైర్ వేసి, దానిపై షేడ్ నెట్ బిగించినట్లు తెలిపారు. ఎకరం క్యాప్సికం పంటకు షేడ్‌నెట్ వేసేందుకు సుమారు రూ.90 వేలు ఖర్చయిందన్నారాయన. నాలుగు సంవత్సరాల పాటు ఈ షేడ్‌నెట్ పాడవకుండా ఉంటుంది. షేడ్‌నెట్ లోపలికి పురుగులు రాకుండా నివారణకు సైడ్ వాల్ నెట్ వేసేందుకు మరో రూ.30 వేలు అయింది. వెదురు కర్రలకు రూ.60 వేలు, జీఈ వైర్ కోసం మరో రూ. 30 వేలు, కూలీలకు అయ్యే ఖర్చు ఉంటుందన్నారు. మల్చింగ్ షీట్‌కు ఎకరానికి రూ.15 వేలు ఖర్చయింది. డ్రిప్‌కు మరో ఆరు ఏడు వేలు అవుతుంది. బెంగళూరులో ఉన్న ప్రముఖ కంపెనీల నుంచి నాణ్యమైన విత్తనాలు తెచ్చుకున్నట్లు చెప్పారు. విత్తనాలను ప్రోట్రేలలో వేసి, 40 రోజుల పాటు పెంచిన మొక్కలను ప్రధాన భూమిలో ఫిబ్రవరి తొలి వారంలో నాటినట్లు రాజు చెప్పారు. విత్తనం ప్రోట్రేలలో పెట్టిన 10 రోజులకు మొక్కలు వస్తాయి.
షేడ్‌నెట్ కింద పెంచే క్యాప్సికం మొక్కలు దిగుబడి ఇస్తూనే ఉంటాయి. ప్రధాన భూమిలో మొక్కలు నాటిన తర్వాత 55 రోజులకు తొలి కోత వస్తుంది. ఆ తర్వాత వారానికి ఒకసారి చొప్పున కాయలు కోయవచ్చు. మెయింటెనెన్స్‌ను బట్టి తొలి కోత నుంచి ఐదారు నెలల పాటు వారానికి ఒకసారి కాయలు కోసుకోవచ్చు. పూత వచ్చినప్పటి నుంచి 25 రోజులకు కాయ తయారవుతుంది. మొక్కలు నాటిన తొలి 100 రోజులు తమకు దిగుబడి చాలా ఎక్కువ వచ్చిందన్నారు. తమ 6 ఎకరాల నుంచి ప్రతిరోజూ రెండున్నర టన్నుల దిగుబడి వచ్చినట్లు రాజు చెప్పారు. తర్వాత కొద్దిగా తగ్గినా మళ్లీ మొక్కలకు పూత, కాయలు కాసినట్లు తెలిపారు. ఒక్కొక్క మొక్క నుంచి సుమారు 4 కిలోల కాయలు దిగుబడి వచ్చిందన్నారు.
పూత సమయంలో కొద్దిగా ఎరువు, కాయలు వచ్చినప్పుడు దానికి కావాల్సిన మైక్రో న్యూట్రియంట్లు, మొక్క మొదట్లో వేసే ఎరువులు అందిస్తే కాయలు త్వరగా తయారవుతాయి. మొక్కలు నాటిన 25 రోజులకు 5:61 ఎరువును ఐదు నుంచి పది రోజులు, తర్వాత 13:0:45, ఆ తర్వాత 0:0:50, అప్పుడప్పుడూ 12:61, కాల్షియం, నైట్రోజన్ లాంటివి ప్రతిరోజూ ఏదో ఒకటి డ్రిప్ ద్వారా వదిలినట్లు రాజు వెల్లడించారు. పూత రాలిపోకుండా బోరాన్ వాడినట్లు చెప్పారు.
కిలోకు 10 కాయలు తూగే క్యాప్సికం కాయలను ఒక మనిషి రోజుకు 5 క్వింటాళ్ల కాయలను సులువుగా తెంపుతారు. మొక్కలు నాటిన నెల రోజుల నుంచి పురికొస లాంటి తాడుతో స్టేకింగ్ చేయాలి. తర్వాత ప్రతి నెలా జాగ్రత్తగా గమనిస్తుండాలి. లేదంటే కాయల బరువుకు మొక్క వంగి, విరిగిపోయే ప్రమాదం ఉంది. ఆరు ఎకరాలకు స్టేకింగ్ చేసేందుకు క్వింటాల్ పురికొస అవసరం అవుతుంది. అందుకు రూ.13 వేల వరకు ఖర్చు అవుతుంది. మొక్కల మొదళ్లకు ఆచ్ఛాదనగా మల్చింగ్ వేసుకోవాలి. పైన షేడ్‌నెట్, కింద మల్చింగ్ షీట్ ఉంటుంది కాబట్టి ఎంత ఎండాకాలమైనా ఒక ఎకరానికి రోజుకు 30 నిమిషాల పాటు నీటిని అందిస్తే సరిపోతుంది.

