మన కుటుంబం, బంధువులు, చుట్టాలు, వారి ఫ్యామిలీలు, స్నేహితులు, వారి కుటుంబాలకు రసాయలు లేని సహజ ఆహారం అందించే ఆలోచనతో వచ్చింది కమ్యూనిటీ కలెక్టివ్ కల్టివేషన్ విధానం. ఒక వ్యక్తికి అన్ని వైపుల నుంచి కనీసం 20 కుటుంబాలతో జీవితం ముడిపడి ఉంటుంది. ఒక్కో కుటుంబంలో నలుగురు ఉన్నా మొత్తం 80 మందికి సహజసిద్ధ ఆహారం అందించాలనే లక్ష్యంతో సీసీసీ సాగు విధానం రూపొందింది. విష రసాయనాల పంటలు తిని తిని రోగాల బారిన పడి, ఆసుపత్రులకు లక్షలాది రూపాయలు ఖర్చయిపోతున్నఈ స్థితిలో ఎక్కువ శాతం మంది సహజసిద్ధ పంటల ఆహారం వైపు చూస్తున్నారు. ఈ సహజ సిద్ధ వ్యవసాయానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సముచితంగా సాయం అందిస్తున్నాయి.
కమ్యూనిటీ కలెక్టివ్ కల్టివేషన్ మోడల్‌లో ఒక ఫ్యామిలీ ఒక ఎకరం వ్యవసాయం చేయడం ప్రధానం. అంటే ఎనిమిది ఫ్యామిలీలు ఎనిమిది ఎకరాల్లో పంటలు సాగు చేయడం. ఒక్కో ఫ్యామిలీ ఒక్కో ఎకరంలో ఒక్కో రకం పంట సాగు చేస్తాయి. ఆ ఎనిమిది కుటుంబాలు తాము పండించిన పంటను సమానంగా పంచుకుంటాయి. అన్ని ఫ్యామిలీలు పండించిన సహజ పంటలు కలెక్టివ్ కమ్యూనిటీ కల్టివేషన్‌లోని ప్రతి కుటుంబానికి అందుతాయి. తద్వారా అన్ని కుటుంబాలకు రుచిగా ఉండే, ఆరోగ్యాన్నిచ్చే ఆహారాలు ఉమ్మడి సమాజ సాగుబడి విధానంలో లభిస్తాయి.
కొంతమంది రైతులు లేదా కొన్ని కుటుంబాలు సమూహంగా ఏర్పడి, ఉమ్మడి భూమిలో ఐక్యంగా వ్యవసాయం చేయడమే ఉమ్మడి సమాజ సాగుబడి (Collective Community Cultivation). ఒక గ్రామం లేదా ఒక పట్టణంలో ఓ ఖాళీ స్థలాన్ని తీసుకొని, స్థానికంగా ఉండే ప్రజలంతా కలిసి కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, ఇతర ఆహార పంటలు పండించడం దీని ముఖ్య ఉద్దేశం. గ్రామాల్లో అయితే.. చిన్న సన్నకారు రైతులు, ముఖ్యంగా మహిళలు గ్రూపులుగా ఏర్పడి ఉమ్మడిగా పంటల సాగు చేయొచ్చు. సహజసిద్ధంగా పండించిన పంటలను వారంతా సమంగా పంచుకొని వాడుకోవడం ప్రధాన అంశం.ఉదాహరణకు ఉమ్మడి సమాజ సాగుబడి విధానంలో ఒక ఎకరంలో వరి పంట వేయాలనుకున్నారు. వరి సాగులో మొత్తం 8 స్టేజీలు ఉంటాయి. వాటిలో భూమిని బెడ్లుగా మార్చేది. రెండోది నారు పోయడం, మూడోది నాట్లు వేయడం. నాలుగోది కలుపు తీయడం, ఐదవది గ్రోత్ ఫిట్ జీవామృతం చల్లడం, ఆరోది కోత కోయడం, కోసిన వాటిని ఎండబెట్టడం, నిల్వ చేయడం ఏడోది, చివరిది ధాన్యాన్ని బియ్యంగా మిల్లు పట్టించడం. ఈ అన్ని సందర్భాల్లోనూ సమాజ సాగులో భాగస్వామ్య కుటుంబాలు పాల్గొనకపోయినా పరవాలేదు. కానీ నాట్లు వేసేటప్పుడు, కోత కోసే రోజు, ధాన్యం మిల్లు పట్టించే సమయంలో మాత్రం తప్పకుండా ఉండాలి.ఉద్యోగం వదిలిపెట్టి, సహజ వ్యవసాయం వైపు అడుగులు వేశారు ఆ ఔత్సాహిక రైతు. సమాజానికి మంచి ఆరోగ్యం అందించాలనే సంకల్పంతో చేస్తున్న కొత్త పద్ధతి ఇది. పెండ్యాల ప్రసాద్. కాన్పూర్ ఐఐటీలో ఎంటెక్ చేశారు. 22 ఏళ్లు ఉద్యోగం చేశారు. ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేశారు. నాలుగేళ్లుగా డయాబెటిక్ ఫ్రెండ్లీ రైస్ సాగు చేస్తున్నారు. ప్రస్తుత స్పీడు జీవితంలో ఆరోగ్యంపై అందరికీ అవగాహన పెరుగుతోంది. మనం తినే ఆహారమే మన ఆరోగ్యానికి ప్రధానం అనేది చాలా మందికి తెలిసింది. ఈ విషయాన్నే బలంగా నమ్మి, కార్పొరేట్ ఉద్యోగం వదిలి, ప్రకృతి వ్యవసాయంలో కొత్త బాటలు వేస్తున్నారు పెండ్యాల ప్రసాద్. సొసైటీకి ఏదైనా మంచి చేయాలనే సంకల్పంతో ఆయన ప్రకృతి వ్యవసాయం చేపట్టారు. ప్రసాద్ ప్రారంభించిన కాన్సెప్టే ‘వన్ ఫ్యామిలీ- వన్ ఏకర్’.ఒక్కో రైతు పది కుటుంబాలకు పంట పండించి ఇస్తుంటాడు. ఈ క్రమంలో కలెక్టివ్ కమ్యూనిటీ కల్టివేషన్ (సమూహ ప్రకృతి సాగు) విధానంలో ప్రసాద్ ముందడుగు వేస్తున్నారు. ఈ కాన్సెప్ట్ ఉద్దేశం ఏమిటంటే.. ఎనిమిది విభిన్న వృత్తుల్లో ఉన్న కుటుంబాలను ఉదాహరణకు డాక్టర్లు, స్కూలు ప్రిన్సిపాళ్లు, టీచర్లు, సాఫ్ట్‌వేర్ జాబ్ చేసేవారిని ఒక గ్రూప్‌గా చేయడం. ఈ పద్ధతి సాగు కోసం సొంత భూమే ఉండాల్సిన అవసరం లేదు. భూమిని కొనుక్కోవాల్సిన ఆవశ్యకతా ఉండదు. ఒకవేళ సొంత భూమి ఉంటే మంచిదే. భూమిని కౌలుకు తీసుకొని కూడా ఈ సమూహ ప్రకృతి సాగు చేయొచ్చు. మొత్తం భూమిలో పంటల సాగు కోసం అయ్యే ఖర్చులను గ్రూప్‌లోని అన్ని కుటుంబాలు సమానంగా పెడతాయి. పంట పండి, వచ్చిన ఉత్పత్తులను ఆ కుటుంబాలన్నీ సమానంగా పంచుకుంటాయి.ఒక కుటుంబానికి ఏడాదికి సుమారు 25 కిలోలు ఉన్న 12 బ్యాగుల బియ్యం సరిపోతాయి. మిగిలిన బియ్యం తమ చుట్టాలు, మిత్రులకు ఇవ్వొచ్చు. దీనివల్ల ఆర్థిక లాభాల కంటే మనశ్శాంతి, మంచి ఆహారం అందించామనే తృప్తి లభిస్తుందని ప్రసాద్ చెప్పారు. ఇప్పుడు ప్రతి ఇంటిలో ఒక మధుమేహ రోగి ఉన్నారంటే అతిశయోక్తి కాదు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రసాద్ షుగర్ పేషెంట్లకు మేలు చేసే RNR రకం వరిసాగు చేపట్టారు. సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ నుండి నాణ్యమైన విత్తనాలు తెచ్చి, సహజ పద్ధతిలో బీజామృతంతో వాటిని శుద్ధి చేసి వరిసాగు చేస్తారు. ఈ వరి సాగు కాలం 120 రోజులు. పంటకు పురుగు మందులు, కృత్రిమ ఎరువుల వాడకం ఉండదు.ఈ విధానంలో పొలాన్ని ఐదుసార్లు బాగా దున్ని, మెత్తగా తయారు చేయాలి. ఎకరం పొలంలో ఐదు ట్రాక్టర్ల ఆవుపేడ ఎరువు వేయాలి. గొర్రెల మందలను పొలంలో ఉంచి సహజ ఎరువును అందించవచ్చు. వరిపంట ముగిసిన తర్వాత గడ్డిని కాల్చేయకుండా, కల్చర్ ఉపయోగించి కుళ్లబెట్టి మంచి ఎరువుగా మార్చవచ్చు. వరి నాట్లు వేసిన తర్వాత ప్రతి వారం క్రమం తప్పకుండా ప్రకృతి ఎరువులు మాత్రమే వేయాలి. మొక్కల ఎదుగుదల కోసం ఆరు సార్లు జీవామృతం, పురుగుల నివారణకో మూడు సార్లు నీమాస్త్రం, పోషకాల కోసం 3 సార్లు పుల్లటి మజ్జిగ పైరుకు స్ప్రే చేయాలి. నాలుగు నెలలకు వరిపంట సిద్ధమయ్యాక కోత కోసి, ధాన్యాన్ని బాగా ఎండబెట్టాలి. దాన్ని దాదాపు 6 నెలల పాటు నిల్వ ఉంచిన తర్వాత మిల్లింగ్ చేయించి వాడుకుంటే మంచిది.వన్ ఏకర్ వన్ ఫ్యామిలీ పద్ధతి సాగులో భాగస్వామ్య కుటుంబాలు తమ బిజీ లైఫ్‌లో కూడా వ్యవసాయ అనుభవాన్ని ఆస్వాదించేందుకు ఓ మంచి మార్గం ఉంది. ఏ రోజు పొలం పనుల వివరాలను ఆ రోజే వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేసుకోవాలి. ముఖ్యంగా నాట్లు వేసే రోజు, పంట కోతల రోజు, ధాన్యం మిల్లింగ్ చేసే రోజున అన్ని భాగస్వామ్య కుటుంబాలు వచ్చి, సంఘటితంగా పనులు చేసుకోవడం దీనిలో మరో ముఖ్యమైన అంశం. దీనివల్ల ఆహారం ఎక్కడి నుంచి వస్తోంది, దాని వెనుక ఎంత కష్టం ఉందనే విషయం పిల్లలు, పెద్దలు అందరికీ ప్రత్యక్షంగా అర్థమవుతుంది.‘మనం మూడేళ్లలో ఫలితం చూడాలంటే వరిపంట వేయాలి. ఐదేళ్లలో ఆదాయం రావాలంటే మామిడి మొక్కలు నాటాలి. కానీ.. వందేళ్ల పాటు సమాజంలో మార్పు తీసుకు రావాలంటే మనుషుల్లో మంచి ఆలోచన అనే విత్తనం నాటాలంటారు పెండ్యాల ప్రసాద్. విష రసాయనాలు లేని ఆహారం సొంతంగా పండించుకుంటూ, తోటివారికి పంచిపెట్టే ఈ ‘వన్ ఫ్యామిలీ- వన్ ఏకర్’ విధానం భవిష్యత్తులో అందరికీ మార్గదర్శకం కావాలని ఆశిద్దాం.