తెలంగాణ- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. ఖమ్మంలో మొదలయ్యే గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి 365 బీఈ హైవే ఇటీవలే పాక్షికంగా అందుబాటులోకి వచ్చింది. ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవేపై వాహనాల రాకపోకలు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. చుట్టూ పచ్చని పొలాలు, తోటల మధ్య సాగిపోతుంది ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవే. ప్రస్తుతం నాలుగు లేన్లుగా తయారైన ఈ హైవేను భవిష్యత్తులో ఆరు లేన్లుగా విస్తరించేందుకు అనుకూలంగా ఏర్పాటు చేశారు.
ఖమ్మం జిల్లా వైరా నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని దేవరపల్లి దాకా 162 కిలోమీటర్ల వరకు నాలుగు లేన్ల రహదారిగా ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మించారు. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో కార్లు, 80 కిలోమీటర్ల స్పీడుతో భారీ వాహనాలకు గ్రీన్‌ఫీల్డ్ హైవేపై అనుమతి ఉంటుంది. ఖమ్మం- దేవరపల్లి మధ్య గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులు పూర్తయ్యాయి. దీంతో విశాఖపట్నం- హైదరాబాద్ మధ్య ప్రయాణ దూరం, సమయం తగ్గిపోయాయి.

