Site icon V.E.R Agro Farms

మిల్లెట్‌ సిస్టర్‌ మొగులమ్మ

చదువుకోలేదు. వ్యవసాయమే ఆధారం. భర్త మరణించినా ముగ్గురు బిడ్డలను విజయవంతంగా పెంచుతోంది. భారత రాష్ట్రపతి నుంచి 2018లో నారీశక్తి అవార్డు అందుకుంది. ఆమెను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తన ఇంటికి భోజనానికి పిలిచి ఆదరించారు. ఆ రోజుల్లో కేంద్ర మంత్రి మేనకా గాంధీ కూడా తన ఇంటికి తీసుకెళ్లి, భోజనం పెట్టి, సత్కరించారు.. అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కూడా తన నివాసంలో ఆతిథ్యం ఇచ్చి, గౌరవించారు. 2919లో అమెరికాలోని న్యూయార్క్‌ నుంచి ఈక్వేటర్‌ అవార్డు అందుకుంది. ప్రత్యేక వ్యవసాయ విధానాలతో చిరుధాన్యాలు సాగు చేస్తున్న ఆదర్శ మహిళా రైతు కందుక మొగులమ్మ డెక్కన్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ సభ్యురాలిగా ఉన్నారు.

మొగులమ్మ ప్రత్యేక ఏమిటంటే.. ఎకరం భూమిలో దాదాపు 30 రకాల చిరుధాన్యాలను ఒకే సమయంలో సాగు చేస్తున్నారు. మిల్లెట్ సిస్టర్‌గా ప్రసిద్ధి చెందిన మొగులమ్మ వివిద దేశాలు తిరిగారు. తన చిరుధాన్యాల సాగు విధానం వారికి వివరించారు. ఆయా దేశాల్లోని సాగు పద్ధతులపై చక్కని అవగాహన తెచ్చుకున్నారు. తాను పండించి, నిల్వ చేసిన చిరుధాన్యాల విత్తనాలు ఆయా దేశాల్లోని ఔత్సాహికులకు అందించి, అక్కడి విత్తనాలను తాను తీసుకొచ్చి, మదేశంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో సాగు చేస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆమె విజయగాధలు చాలానే ఉన్నాయి. సహజసిద్ధ వ్యవసాయ సాగులో చిరుధాన్యాలు పండిస్తూ వందలాది మంది మహిళా రైతులకు ప్రేరణగా నిలుస్తున్న కందుక మొగులమ్మ విజయ గాధ గురించి తెలుసుకుందాం.మొగులమ్మ సంగారెడ్డి జిల్లా ఝరాసంఘం మండలం పొట్‌పల్లి గ్రామస్థురాలు. తమ రెండెకరాల పొలంలో ఆమె పచ్చజొన్నలు, సజ్జలు, రాగులు, తెల్లజొన్నలు, తైదలు, కొర్రలు, నల్ల కుసుమలు, బొబ్బర్లు, అనుములు, మంచి నువ్వులు, గడ్డి నువ్వులు లాంటి అనేక రకాలకు చెందిన 30కి పైగా సాంప్రదాయ చిరుధాన్యాలు పండిస్తున్నారు. మరికొంత భూమిని కౌలుకు తీసుకొని చెరకు పంట సాగుచేస్తున్నారు. ఎన్ని కష్లాలు వచ్చినా ఆమె చిరుధాన్యాల పంటల సాగు చేయడం ఆపలేదు. దాదాపు 80 రకాల సాంప్రదాయ చిరుధాన్యాల విత్తనాలను ఆమె తమ వద్ద నిల్వ ఉంచారు.ఎకరం భూమిలో 30 కంది సాళ్లు వేసి, ఒక్కో సాలులో కొర్రలు, సామలు, సజ్జలు, ఉలవలు, గడ్డినువ్వులు ఇలా ఒక్కొక్క సాలులో ఒక్కోరకం చిరుధాన్యపు పంటను మొగులమ్మ సాగుచేస్తారు. ఎప్పుడు ఏ చిరుధాన్యం పంట సాగు చేస్తే ఫలితం బాగుంటుందో తనకు అనుభవం మీద లెలిసిందని మొగులమ్మ చెప్పారు. వర్షం ఎక్కువైతే ఏ పంట బాగుంటుంది? తక్కువైతే ఎలాంటి పంట దిగుబడి ఎక్కువ వస్తుందో తెలుసని పేర్కొన్నారు. కౌలుకు తీసుకున్న 8 ఎకరాలలోని ఐదు ఎకరాల్లో ఆర్గానిక్ పద్దతిలో చెరుకు పండిస్తున్నారు, బెల్లం తయారు చేసి డెక్కన్ డెవలప్‌మెంట్‌ సొసైటీకే ఆర్గానిక్ బెల్లం తయారు చేసి అమ్ముతున్నట్లు తెలిపారు.మొగులమ్మ తమ పొలంలో ఎలాంటి రసాయనాలు వాడరు. వానపాములు, వర్మీ వాష్‌, పంచగవ్య కషాయం, మేకల పెంట, పశువుల పెంటతో వ్యవసాయం చేస్తామని చెప్పారు. రసాయన ఎరువులు చిరుధాన్యాల పంటలకు సరిపడవు. ఒకవేళ కక్కుర్తిపడి రసాయనాలు వాడితే ఒకటి, రెండేళ్లు ఎక్కువ దిగుబడి రావచ్చు. కానీ ఆ తర్వాత భూమిలో సారం పోయి, పంటలు పండే పరిస్థితి ఉండదని ఆమె వివరించారు. తాము చేసే సాగు విధానంలో భూమి ఆరోగ్యంగా ఉంటుందని, పశుల దాణాకు లోటు ఉండదని చెప్పారు.గతంలో కేంద్ర మంత్రిగా ఉన్న మేనకా గాంధీ ఢిల్లీలో మహిళా రైతులతో ఒక సమావేశం నిర్వహించినప్పుడు తాను కూడా వెళ్లానని మొగులమ్మ తెలిపారు. ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రదర్శన స్టాళ్లలో తాము పండించిన చిరుధాన్యాలతో అక్కడే రాగి అంబలి, జొన్న అంబలి, మురుకులు, కిచిడీ, రొట్టెలు వండి కొందరికి రుచి చూపించినట్లు చెప్పారు. దాంతో ఒక్క రోజులోనే తాము చేసిన వంటలకు లక్ష రూపాయల ఆదాయం వచ్చిందని వెల్లడించారు. ఢిల్లీలో 20 రోజులు జరిగిన ఆ కార్యక్రమంలో తమ పంటలు, వంటలను చూసిన మేనకా గాంధీ సంతోషం వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఆ తర్వాత సంగారెడ్డిలో ఒక సమావేశానికి వచ్చిన మేకకా గాంధీకి తాను పండిస్తున్న చిరుధాన్యాల పంటలు, విత్తనాలను ప్రత్యక్షంగా చూపించినట్లు తెలిపారు. దాంతో ఆమె తనకు నారీశక్తి అవార్డు ఇవ్వాలని కేంద్రానికి సిఫార్సు చేసినట్లు చెప్పారు.నారీశక్తి అవార్డు ఫంక్షన్‌కు మిగతా గ్రహీతలు ఖరీదైన దుస్తులు ధరించి వచ్చారని మొగులమ్మ పేర్కొన్నారు. తాను మాత్రం చిరు ధాన్యాల కంకులు అద్దకం చేసిన చీర కట్టుకొని వెళ్లినట్లు చెప్పారు. అవార్డు ఇచ్చే ముందు ప్రధాని మోడీ నువ్వు మాత్రమే ఇలాంటి చీర ఎందుకు కట్టుకున్నావని ప్రశ్నించినట్లు తెలిపారు. పంటలు పండించే రైతునని, మీలాంటి పెద్ద పెద్దవాళ్లకు కడుపు నిండా ఆహారం పెట్టడమే తన పని అని చెప్పానని వెల్లడించారు. దీంతో మురిసిపోయిన మోడీ తనను తమ ఇంటికి భోజనానికి రావాలని ఆహ్వానించారని తెలిపారు. ఆ సాయంత్రం ప్రధాని మోడీ ఇంటికి వెళ్లినప్పుడు అంతకు ముందే తన కుటుంబ పరిస్థితి గురించి తెలుసుకున్న మోడీ నీకు ఏం కావాలో కోరుకో.. చేస్తా అన్నారని చెప్పారు. అయితే.. చిరుధాన్యాల పంటలకు మార్కెట్ సరిగా లేదని, వాటికి మద్దతు ధర కల్పించమని అడిగానని చెప్పారు. తర్వాతి రోజు మేనకా గాంధీ తన ఇంటిలో విందు ఇచ్చి, సన్మానం చేశారని తెలిపారు. ఆ మరుసటి రోజు రాష్ట్రపతి కోవింద్‌ తన నివాసానికి పిలిచి గౌరవించారని పేర్కొన్నారు. మంచి పని, చేశావు, మంచి మాటలు చెప్పావని రాష్ట్రపతి మెచ్చుకున్నారని మొగులమ్మ చెప్పారు.మేనకా గాంధీ సంగారెడ్డి వచ్చినప్పుడే న్యూయార్క్‌ నుంచి ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు చిరుధాన్యాల పంట సాగుపై మూడు నెలల శిక్షణ కోసం వచ్చారని మొగులమ్మ తెలిపారు. వారికి తాను విత్తనాల దగ్గర నుంచి, సాగు విధానాలను వివరంగా చూపించానని చెప్పారు. పశువులు, పక్షులు, పురుగులు కూడా బతికేందుకు తాను పండించే పంటల కృషిని గుర్తించి వారు పర్యావరణ పరిరక్షణలో తన కృషికి మెచ్చి ఈక్వేటర్ అవార్డుకు సిఫార్సు చేసినట్లు తెలిపారు. న్యూయార్క్ నుంచి తనకు అవార్డు వచ్చినట్లు లెటర్ వచ్చిందని చెప్పారు. అమెరికా వెళ్లేందుకు వీసా ఇంటర్వ్యూకు వెళితే ఇంగ్లీషు రాని తాను ఈక్వేటర్ అవార్డు అని పలకడం రాలేదని, ఈట్వేటర్ అవార్డు అని తప్పు చెప్పడంతో రిజెక్ట్‌ చేశారని మొగులమ్మ తెలిపారు. రిజెక్ట్ అయిన విషయం కూడా తనకు తెలియక సంతోషంగా బయటకు వచ్చానని పేర్కొన్నారు. తనకు వీసా రిజెక్ట్‌ అవడంపై తాను మీడియాలో మాట్లాడినట్లు చెప్పారు. చిరుధాన్యాలు పండించే రైతులకు వివిధ దేశాలవారు మద్దతు ఇస్తే.. మన ప్రభుత్వం అన్యాయం చేయొద్దని కోరినట్లు చెప్పారు. మూడు రోజులు హైదరాబాద్‌లో ఉన్నా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో తాను నేరుగా మంత్రి కేటీఆర్‌ ఇంటికి వెళ్లినట్లు తెలిపారు. నిద్రపోతున్న కేటీఆర్‌కు తన వీసా రిజెక్ట్‌ అయిన విషయం చెప్పానని చెప్పారు. కేటీఆర్‌ 24 గంటల్లో తనకు అమెరికా వీసా ఇప్పించారని సంతోషంగా తెలిపారు.మొగులమ్మ హైబ్రీడ్‌ విత్తనాలను అస్సలు వాడరు. మొత్తం దేశీ విత్తనాలతోనే అమె చిరుధాన్యాలు పండిస్తారు. తాము పండించిన దేశీ విత్తనాలను నిల్వ చేసుకునే విధానం గురించి ఆమె వివరంగా వెల్లడించారు. విత్తనాలను తాను నిల్వ చేసే విధానం వల్ల ప్రతి గింజ గ్యాంటీగా మొలుస్తుందని చెప్పారు. శ్రీలంక నుంచి సజ్జ విత్తనాలు తెచ్చినట్లు తెలిపారు. మన దగ్గర సజ్జ కంకి పొట్టిగా ఉంటుందని, శ్రీలంక సజ్జ కంకి ఒక మీటర్ పొడవు ఉంటుందని చెప్పారు. శ్రీలంక నుంచి నలుపు, మెరూన్‌ రంగులో ఉండే కొర్రలు తెచ్చినట్లు తెలిపారు. నేపాల్ నుంచి కూడా విత్తనాలు తెచ్చినట్లు మొగులమ్మ చెప్పారు.

చిరుధాన్యాల పైరు ఆకు కింద పేను వస్తుందని మొగులమ్మ తెలిపారు. బూడిదను పల్చని వస్త్రంలో పోసి కట్టి, మొక్కలపై ఊపితే పేను కంటిలో పడి చనిపోతుందని చెప్పారు. భారీ వర్షాలు కురిసినప్పుడు మినుములు, పెసర పంటలకు పట్టిన పేను కొట్టుకుపోతుంది. మందులు కొట్టాల్సిన అవసరం ఉండదని చెప్పారు. కాయతొలిచే పురుగు వస్తే పసుపు, వేపాకు, పచ్చిమిర్చి, సర్ఫ్‌, వెల్లుల్లితో కషాయం చేసి స్ప్రే చేస్తామని తెలిపారు.

Exit mobile version