విద్యార్థులు, ఉద్యోగులు, గృహిణులు, ఉద్యోగాల నుంచి రిటైర్ అయిన వారు.. ఇలా ఎవరైనా ఇళ్లలోనే పండించవచ్చు. కశ్మీర్‌లో మాత్రమే కుంకుమపువ్వు పండుతుందని అందరికీ తెలిసిందే. అక్కడి శీతల వాతావరణం, నేల స్వభావం దీనికి సరిగ్గా సరిపోతాయి. కశ్మీర్ వాతావరణాన్ని కృత్రిమంగా సృష్టించి పండించవచ్చని ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన ఉద్యోగి శ్రీనిధి, ఎన్టీఆర్ జిల్లా విజయవాడకు చెందిన గృహిణి శైలజ, తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఇంజనీరింగ్ విద్యార్థి లోహిత్ నిరూపించారు.
ప్రపంచం మొత్తంలో అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యం కుంకుమపువ్వు. దీనిలో ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. కిలో కుంకుమపువ్వు తయారు చేయాలంటే సుమారు రెండు లక్షల పువ్వులు కావాలి. కుంకుమపువ్వు అనగానే మన దేశంలో ముందుగా గుర్తొచ్చేది కశ్మీర్. కశ్మీర్‌లోని పాంపోర్ ప్రాంతంలో పండుతుంది. అయితే.. అక్కడి వాతావరణ పరిస్థితులను కృత్రిమంగా సృష్టించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా కొందరు ఔత్సాహికులు పండిస్తున్నారు. అక్టోబర్- నవంబర్ నెలల మధ్య కాలంలో కుంకుమపువ్వు పూస్తుంది. దీని ధర గ్రాముకు సుమారు రూ.600 వరకు పలుకుతుంది.
రంగు, రుచి, సువాసన కోసం వంటలలో కుంకుమపువ్వును వినియోగిస్తారు. గర్భిణులు, పిల్లల ఎదుగుదలకు, కొన్ని రోగాలను నిరోధించేందుకు కుంకుమపువ్వును వాడతారు. దీనిలో ఎక్కువగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధకశక్తిని పెంచుతాయి. ఆందోళనను, నిరాశను తగ్గిస్తుంది. లైంగిక శక్తిని మెరుగు పరుస్తుంది. బరువు తగ్గించడానికి, 50 ఏళ్ల వయస్సు పైబడ్డ వారిలో కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. గర్భిణులకు పాలలో కలిపి కుంకుమపువ్వు ఇస్తే పుట్టే బిడ్డలు ఆరోగ్యంగా, మంచి రంగులో ఉంటారని అనేక మంది నమ్ముతారు. నిద్ర సమస్యను కుంకుమపువ్వు తగ్గిస్తుంది. దీన్ని తేనెలో కలిపి వాడితే దగ్గు, ఉబ్బసం నుంచి ఉపశమనం కలుగుతుంది. మెదడుకు పదును పెడుతుంది. గుండెపోటును నివారిస్తుంది. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కడుపునొప్పిని తగ్గించడంలో, ముక్కు సంబంధ వ్యాధులకు పనిచేస్తుంది. చర్మం, జుట్టు సంరక్షణ కోసం కుంకుమపువ్వును వినియోగిస్తారు. తాంబూలంలో కూడా కొందరు కుంకుమపువ్వును వాడతారు. అయితే.. దీన్ని ఎక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతారు.
ఇక కుంకుమపువ్వు సాగుచేసే గదికి కృత్రిమ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేయాలి. ఆ గదికి సూర్యరశ్మి తగిలే అవకాశం ఉంటే అప్పుడప్పుడూ కిటికీలను ఓ గంటపాటు తెరిచి ఉంచవచ్చు. గదిలో ఉష్ణోగ్రత ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు 16, 17 డిగ్రీలు, సాయంత్రం 6 నుంచి ఉదయం 6 వరకు 10 డిగ్రీలు మెయింటెన్ చేయడానికి 24/7 చిల్లర్ ఆన్‌లో ఉంచాలి. చిల్లర్ ఏర్పాటుకు రూ.3 లక్షల వరకు ఖర్చవుతుంది.
బావిస్టా అనే ఫంగిసైడ్ పౌడర్ 2 మిల్లీ గ్రాములను 2 లీటర్ల నీటిలో కలిపి, విత్తనాలను 10 నిమిషాల పాటు ఉంచాలి. విత్తనాలను బయటికి తీసి, ఒక బట్టపై గదిలో ఫ్యాన్ కింద ఒక రోజు ఆరబెట్టాలి. ఎండలో పెట్టకూడదు. తర్వాత విత్తరాల పరిమాణం వైజ్‌గా వాటిని ట్రేలలో ఉంచి, స్టాండ్‌లో పెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా జులై నెలాఖరు లేదా ఆగస్టు తొలి వారం లోపల పూర్తిచేసుకోవాలి. విద్యార్థులు, ఉద్యోగులు, గృహిణులు, జాబ్ నుంచి రిటైర్ అయిన మహిళలు, పురుషులు.. ఇలా ఎవరైనా ఇళ్లలోనే పండించేందుకు అనువైనది కుంకుమపువ్వు.
కుంకుమపువ్వు మొక్కలకు ఫ్లవరింగ్ టైమ్, స్లీపింగ్ సమయం, జెర్మినేషన్ టైమ్ అని మూడు దశలు ఉంటాయి. విత్తనం నుంచి ఉల్లిపాయకు వచ్చిన విధంగా మొక్క వస్తుంది. ఒక విత్తనం నుంచి ఒకసారి మాత్రమే పువ్వు వస్తుంది. అయితే… మొక్క నుంచి వచ్చే ఇతర శాఖల నుంచి కొత్తగా విత్తనాలు తయారవుతాయి. కశ్మీర్‌లో కుంకుమపువ్వు మొక్కలు మట్టిలో నాటుకుంటారు. కానీ కృత్రిమ వాతావరణంలో మట్టి, నీళ్లు లేకుండా వీటిని ఔత్సాహికులు పెంచుతున్నారు. గాలిలో తేమనే మొక్క తీసుకుంటుంది. తేమ మెయింటెన్ చేసేందుకు డివైస్‌లు పెట్టాలి..
కుంకుమపువ్వు విత్తనం పెట్టిన తర్వాత ఉదయం, సాయంత్రం తప్పకుండా పరిశీలించాలి. ఒకవేళ ఏదైనా విత్తనం కింది భాగంలో ఫంగస్ వచ్చిందంటే దాన్ని వెంటనే తీసేసి బయట వేసేయాలి. లేదంటే మిగతా విత్తనాలకు కూడా బూజు పట్టే అవకాశం ఉంటుంది. నిజమైన కుంకుమపువ్వును నీళ్లలో వేస్తే.. దాని రంగు చాలా నెమ్మదిగా నీటిలో కలుస్తుంది. అదే నకిలీదైతే రెండు మూడు సెకండ్లలోనే నీటిలో రంగు కలిసిపోతుంది. కుంకుమపువ్వు నాణ్యతను, అసలుదా? నకిలీదా తెలుసుకోవడానికి ఇదొక పరీక్ష. అలాగే నకిలీ పువ్వు అయితే.. పసుపు, ఎరుపు రంగుల్లో కలగలిసి ఉంటుంది. స్వీట్ కార్న్ పొత్తుకు ఉండే పీచుకు రంగులు వేసి నకిలీ కుంకుమపువ్వు తయారు చేసే అవకాశాలు ఉన్నాయని వినియోగదారులు గ్రహించాలి.
శ్రీనిధి నెంబర్: 9148749057 లోహిత్ నెంబర్: 8179933817 లలో సంప్రదించవచ్చు.

