ఎండాకాలంలో కుండీల్లో పెంచుకునే మొక్కలు ఎండిపోతున్నాయా? వాడిపోతున్నాయా? ఈ రెండు ఇబ్బందులు మొక్కలకు రాకుండే చేసేందుకు బలవర్ధకమైన ఆహారం అందించాలనుకుంటున్నారా? దాంతో పాటు మొక్కలకు చీడ పీడలు లేకుండా చేయాలనే ఉద్దేశం ఉందా? అయతే.. ఈ మాదిరిగా ద్రావణం తయారు చేసుకుని మొక్కలకు అందిస్తే.. అవి నవనవలాడుతూ ఉంటాయి. చీడపీడలు ఆశించవు. అవి పూలమొక్కలు కానీ, పండ్ల మొక్కలైనా సరే చక్కని దిగుబడి ఇస్తాయి.
ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్‌ను NPK లేదా DAP పెర్టిలైజర్ అంటారు. NPK కన్నా రిచ్‌గా, DAPని మించిన ఫెర్టిలైజర్‌గా చెప్పుకోవచ్చు. ఈ ఫెర్టిలైజర్ మొక్కలకు పది నుంచి 15 రోజులకు ఒకసారి వాడితే ఎండాకాలంలో కూడా మొక్కలు బలంగా, పచ్చగా, ఏపుగా ఎదుగుతాయి. ఈ లిక్విడ్ పెస్టిసైడ్‌గా, ఫంగిసైడ్, ఫెర్టిలైజర్‌గా కూడా ఉపయోగపడుతుంది. రూపాయి కూడా ఖర్చు లేకుండా ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఎలా తయారు చేసుకోవాలి, మొక్కలకు ఏ విధంగా అందించాలో తెలుసుకుందాం.లిక్విడ్ ఫెర్టిలైజర్ తయారీకి అతి ముఖ్యమైనది అలోవీరా. బియ్యం కడిగిన నీళ్లు కానీ, మామూలు నీళ్లు గాని ఒక సీసాలో పోసి, అందులో రెండు మూడు అలోవీరా కొమ్మలను చిన్న చిన్న ముక్కలుగా కత్తించి, దాంట్లో వేసుకోవాలి. పూలు లేదా పండ్లు లేదా కూరగాయల మొక్కలు ఆరోగ్యంగా బాగా ఎదిగేందుకు అవసరమయ్యే ఫోలిక్, అమినో, ఫాటీ యాసిడ్లు అలోవీరాలో పుష్కలంగా ఉంటాయి. మినరల్స్, విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్లు, మెగ్నీషియం, ఐరన్, కాపర్ లాంటివన్నీ అలోవీరా నుంచి మొక్కలకు అందుతాయి. ఇంతకు ముందు రసాయనాలు వాడడం వల్ల తగ్గిపోయిన భూసారాన్ని పెంచడానికి కూడా అలోవీరా ఉపయోగపడుతుంది.ఫెర్టిలైజర్ తయారీకి కావలసిన రెండో పదార్థం పాలు. చిన్న కప్పుడు పాలను అలోవీరా కలిపిన నీటిలో పోసుకోవాలి. పాలలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇవి మొక్కలకు బాగా ఉపయోగపడతాయి. ఈ మిశ్రమం బాగా ఫెర్మెంటేషన్ కావాలంటే చిన్న కప్పుడు బెల్లం కూడా కలపాలి. బెల్లం కాస్త అటూ ఇటూ అయినా పరవాలేదు. ఈ మిశ్రమాన్ని మూడు నాలుగు రోజుల పాటు ఉదయం సాయంత్రం కర్రతో బాగా కలుపుకోవాలి. తర్వాత సీసాకు మూతను ఒక పక్కన కొంచెం తెరిచి ఉండేలా పెట్టుకోవాలి. లేదా ఒక క్లాత్‌ను సీసాకు చుట్టినా పరవాలేదు. ఒకవేళ పాలు అందుబాటులో లేకపోయినా కేవలం అలోవీరా, బెల్లంతో కూడా ఈ ద్రావణం తయారు చేసుకున్నా అదే ఫలితాలు ఇస్తుంది. ఆ సీసాను నీడలో ఉంచుకోవాలి. మిశ్రమాన్ని బాగా కలుపుతూ ఉంటే మూడు రోజులకు వాటిలోని పోషకాలు బాగా నీటిలో కలిసిపోతాయి. పైన ఒక తెట్టులా ఫంగస్ చేరుతుంది.ఇలా సిద్ధమైన లిక్విడ్ ఫెర్టిలైజర్‌ను చక్కగా వడకట్టుకొవాలి. ఆ ద్రావణాన్ని మొక్కలకు ఇవ్వొచ్చు, డ్రిప్ ద్వారా కూడా సరఫరా చేయొచ్చు. పురుగుల నివారణ కోసం మొక్కలపైన స్ప్రే కూడా చేసుకోవచ్చు. ఈ మూడింటి మిశ్రమంలో మైక్రోబ్స్ బాగా ఉత్పత్తి అయి. మొక్కలకు మంచి బలాన్నిచ్చే ఫెర్టిలైజర్‌గా తయారవుతుంది. డల్‌గా ఉన్నమొక్క కూడా ఆరోగ్యంగా ఎదుగుతుంది. రెండు లీటర్ల ద్రావణంలో 20 లీటర్ల నీరు కలిపి మొక్కలకు ఇవ్వాలి. ఇది ఇచ్చిన మొక్కలలో రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. ఈ ద్రావణం కాన్‌సెన్‌ట్రేటెడ్‌గా ఉంటుంది.దీన్ని స్ప్రే చేస్తే పెస్ట్ కంట్రోల్ అవుతుంది. ఆకులు పసుపు రంగులోకి మారి రాలిపోకుండా ఈ ద్రావణం పనిచేస్తుంది. ఈ మిశ్రమంలో తయారైన ఫంగస్ మొక్కలకు మంచి చేస్తుంది. మొక్కల మొదట్లో ఉండే మట్టిలో చెడు ఫంగస్ ఉన్నా నివారణ అవుతుంది. ఈ ద్రావణం వాడితే మొక్కల వేర్ల వ్యవస్థ కూడా బాగా అభివృద్ధి చెందుతుంది.ఫిల్టర్ చేసిన తర్వాత మెత్తగా ఉన్న అలోవీరా ముక్కలను మరోసారి ద్రావణం తయారీకి వాడుకోవచ్చు. కుండీల్లో డల్‌గా ఉన్న మొక్కల పక్కన మట్టిని కొద్దిగా గొయ్యిలా చేసి, దాంట్లో అలోవీరా ముక్కలు వేసిన మట్టితో కప్పితే మంచి పోషకాలను అందిస్తుంది. అలోవీరా, పాలు, బెల్లం లిక్విడ్ తయారు చేసిన తర్వాత ఆరు నెలల వరకు కూడా నిల్వ ఉంటుంది. ఎండాకాలంలో మొక్కలు బాగా ఎదిగేందుకు, వాటిని కూల్‌గా ఉంచేందుకు ఇది ఉపయోగపడుతుంది. వర్షాకాలంలో మట్టిలో ఫంగస్ చేరి వేరుకుళ్లు రాకుండా కాపాడుతుంది. టెర్రస్ గార్డెన్‌లో ఎక్కువ మొక్కలు పెంచేవారు ఈ ద్రావణాన్ని పెద్ద డ్రమ్ములో తయారు చేసి, ఉంచుకుని ప్రతి 10 నుంచి 15 రోజులకు ఒకసారి మొక్కలకు అందించవచ్చు. అధిక ఫలితాలు పొందవచ్చు.