Site icon V.E.R Agro Farms

ఖర్చే లేని కమ్మని పంటలు!

ఒక్కసారి ఖర్చు. వందేళ్ల వరకు పంటలు వచ్చే మోడల్‌ వ్యవసాయం ఇది. తొలిసారి మాత్రమే దుక్కి దున్ని బెడ్లు వేసుకొని, వాటి మీద నిరంతరం పంటలు పండించవచ్చు. బెడ్ల మీద వచ్చే కలుపే ఈ విధానంలో మొక్కలకు పరమ ఔషధం. బలం. ఈ విధానంలో బెడ్లు వేసిన భూమి స్పాంజ్‌ మాదిరిగా మెత్తగా అవుతుంది. కోటానుకోట్ల జీవరాశులకు నిలయంగా మారుతుంది. ఆ జీవరాశులే మొక్కలకు కావాల్సినంత పోషకాలు అందిస్తాయి. అయితే.. ఆ జీవరాశులకు మనం రూపాయి ఖర్చు లేని ఆహారం అందిస్తే సరిపోతుంది. ఖర్చులేని ఆహారం అంటే బెడ్ల మీద ఉన్న కలుపు, ఒకసారి పంట తీసిన తర్వాత మొక్కలను ఆ బెడ్ల మీదే వేయడం. కలుపు మొక్కలు తిన్న జీవరాశులు విసర్జన ద్వారా మొక్కలకు కావాల్సినన్ని పోషకాలు అందిస్తాయి.

పంలలకు రసాయనాలు వాడితే నేత గట్టిగా మారిపోతుంది. అలాంటి భూమిలో వానపాములు సహా జీవరాశులు ఉండవు. వాటికి కావాల్సిన ఆహారం దొరకదు. పైగా రసాయనాల్లోని విషం వాటిని చంపేస్తుంది. లేదా అవి వేరే చోటకు వలస పోతాయి. దీంతో పంటలకు సరైన ఆహారం ఉండదు. సరిగా పెరగవు. మళ్లీ మళ్లీ విష రసాయనాలే వేస్తూ ఉండాలి. అలా పండించిన పంటలు తిన్న మన ఆరోగ్యం దెబ్బతిని, ఆసుపత్రుల పాలు కాకతప్పదు.ఒక్కసారి ఖర్చు వందేళ్ల పంటల విధానంలో మంచి ఆహారం లభిస్తుంది. రుచిగా ఉంటుంది. పంట దిగుబడులు కూడా ఎక్కువగానే వస్తాయి. కాకపోతే ఈ విధానంలో పంటలను భారీ ఎత్తున అమ్ముకోవాలనుకోకూడదు. ఎకరం లేదా అంతకు కొంచెం ఎక్కువ భూమిలో సాగు చేసుకుంటే.. మన ఇంటి ఆహారానికి సరిపోతుంది. మరో పది పదిహేను కుటుంబాలకు ఆరోగ్యకరమైన ఆహారం అందించవచ్చు. ఈ ఆహారం తిన్న వారు మళ్లీ మళ్లీ మన పంటనే కోరుకుంటారు. మామూలు కన్నా ధర కొంచెం ఎక్కువకు కొనేందుకు వెనుకాడరు. మేడ్చల్‌ జిల్లా మూడు చింతలపల్లి మండలం ఉద్దమర్రి రైతు ప్రసాద్‌రెడ్డి సస్టెయినబుల్‌ సాగు చేస్తున్నారు. ఇందులో భూమిని ఆయన ఆరు బ్లాక్‌లుగా చేసి, ఫార్మింగ్‌ చేస్తున్నారు. ఆయన సహజసిద్ధ, ఆరోగ్యకరమైన సాగు విధానం గురించి చూద్దాం.భూమిని దుక్కి దున్నిన తర్వాత ఆరు బ్లాక్‌లుగా చేశారు ప్రసాదరెడ్డి. ఒక బ్లాక్‌లో ఎక్కువ సంవత్సరాలు బతికి పంట ఇచ్చే కొబ్బరి, మామిడి, సీతాఫలం, సపోటా, నిమ్మ, మునగ, పనస, లక్ష్మణఫలం లాంటి చెట్లు పెంచారు. మరో బ్లాక్‌లో కేవలం కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నారు. కంద, అల్లం, వెల్లుల్లి, పసుపు, ఉల్లి లాంటి పంటలు ఒక బ్లాక్‌లో సాగుచేస్తున్నారు. ఇంకో బ్లాక్‌లో మధ్యంతరంగా దిగుబడి ఇచ్చే అరటి, బొప్పాయి లాంటి పంటలు పెట్టారు. దీనికి ఆయన ఆరోగ్యవంతమైన, లో కాస్ట్‌ సస్టెయినబుల్‌ ఫార్మింగ్‌ అని పేరు పెట్టారు. దీన్నే కొద్దిపాటి భూమిలో ఎక్కువ ఫలితాన్ని ఇస్తున్న స్మార్ట్‌ ఫార్మింగ్ అంటారు.ఈ వినూత్న ప్రకృతి వ్యవసాయంలో అంతర పంటలూ పండంచవచ్చు. వ్యవసాయం అంటేనే ఖర్చుతో కూడింది అంటారు ప్రసాదరెడ్డి. అది కూలి ఖర్చులు, దుక్కి దున్నడం, కలుపుతీత, మందులు, విత్తనాలు ఇలా పలు రకాలుగా పెట్టుబడి పెడుతూనే ఉండాలి. ఈ ఖర్చులను ఎలా నియంత్రించ వచ్చో అనే ఆలోచన చేసి కొత్త పంటల విధానాన్ని ప్రసాదరెడ్డి తీసుకొచ్చారు. ఎకరం 24 గుంటల్లో ప్రయోగాత్మకంగా ఈ వ్యవసాయం చేశానన్నారు. ఒక బ్లాక్‌లో కూరగాయల కోసం 24 గుంటల భూమిలో 100X100 అడుగుల విస్తీర్ణంలో రెండు మడులు చేసినట్లు చెప్పారు. ఈ బెడ్ల గట్టు స్థలం వృథా కాకుండా కొబ్బరి, మామిడి, సీతాఫలం లాంటి మొక్కలు నాటారు. ఎకరం భూమిలో ఫుడ్ ఫారెస్ట్‌ రూపొందించినట్లు తెలిపారు. ఫుడ్‌ ఫారెస్ట్‌లో తాను ఏక వార్షికం అంటే ఒక ఏడాదిలో పంట వచ్చే పంటలు, బహువార్షికం అంటే ఒకటి కంటే ఎక్కువ సంవత్సరాలు తీసుకొని దిగుబడి ఇచ్చే పంటలుగా విభజించినట్లు చెప్పారు. ఏక వార్షికం, బహు వార్షికం పంటల సాగును మిక్స్‌ చేయకూడదని చెప్పారు. రెండూ కలిపితే. నిత్యం పని చేసే అవసరం లేని బహువార్షిక పంటలకు నిత్యం పనిచేయాల్సి ఉంటుంది. బహు వార్షికం సాగులో నీరు సరఫరా సక్రమంగా చేస్తే సరిపోతుంది. ఏకవార్షిక పంటల్లో సీజనల్‌గా వచ్చే కూరగాయలను తమ కుటుంబంతో పాటు మరికొన్ని కుటుంబాలకు ఇచ్చేలా ఏర్పాటు చేశారు.మూడు సంవత్సరాల్లో ఆరోగ్యవంతమైన భూమిని, తోటను ఎలా తయారు చేయాలో చెప్పారు. ఒకసారి బెడ్లు వేసిన తర్వాత ఇంకెప్పుడూ ట్రాక్టర్‌ కానీ, నాగలి కానీ మనిషి కానీ వాటిని ముట్టుకునే పని లేదు. దీంతో రైతుకు ఖర్చు ఉండదు. భూమి తనంతట తానే సారాన్ని పెంచుకుంటుంది. భూమిని తన పని తాను చేసుకోనిస్తే.. సక్సెస్ రేటు ఎక్కువ ఉంటుందని అన్నారు ప్రసాదరెడ్డి. ఈ విధానలో పారలు, గునపాలు లాంటి పరికరాలతో చేత్తో చేసే పని కూడా ఉండదు. ఈ పద్ధతిలో కూరగాయల నారు ఒకచోట పోసుకోవాలి, మరోచోట నారు నాటుకొని పంటలు తీసుకోవాలి. ప్రసాదరెడ్డి ఫార్మ్‌లో నడిచే దారి తప్ప పెద్ద వాహనాలు వెళ్లే స్థలం ఉండదు.ఎకరం నాలుగు గుంటల్లో ప్రసాదరెడ్డి 100 కొబ్బరి, మామిడి 70, మరో 70 జామ మొక్కలు నాటారు. సీజన్‌ ప్రకారం ఆకుకూరలు, కూరగాయలు వేస్తున్నారు. భూమిలో నైట్రోజన్‌ను స్థిరీకరించే గిరిపుష్పం పెంచుతున్నారు. కొత్తగా ఈ విధానంలోకి వచ్చే రైతులు ముఖ్యంగా ఏ సీజన్‌లో ఏ పంట బాగా వస్తుందో తెలుసుకుంటే సక్సెస్ రేటు ఎక్కువ ఉంటుంది. ట్రాక్టర్‌ కోసం స్థలం వదిలితే చాలా భూమి ఖాళీగా ఉంచాలి. మందుల స్ప్రే చేయక్కర్లేదు కాబట్టి ఖాళీ స్థలం అవసరంలేదు. మూడున్నరేళ్లుగా తాను ఈ పద్ధతిలోనే సాగు చేస్తున్నట్లు ప్రసాదరెడ్డి వెల్లడించారు. భూమిని దున్నకుండా మొక్కలు ఎలా పెడతారనే అనుమానం రావచ్చు. నారును ట్రేలలో పెంచి, అది తయారైన తర్వాత 40 సెంటీమీటర్లకు ఒక మొక్క చొప్పున బెడ్లపై నాటాలి. ముందే వేసిన డ్రిప్‌ పాయింట్‌ వద్ద, నేల తడిగా ఉన్న చోట నాటుతారు. కూరగాయలకు చల్లని వాతావరణం ఉంటే మంచిది. అందుకే బెడ్ల మీద నీడ ఇచ్చే కొబ్బరి, మామిడి, సీతాఫలం, మునగ, అవిశ లాంటి మొక్కలు పెంచారు. బహు వార్షిక మొక్కలు పెరిగే సరికి ఆదాయం ఆకు కూరలు, కూరగాయల ద్వారా వచ్చేస్తుంది. బెడ్ల మీద పెంచే మిర్చి మొక్కల నుంచి రెండేళ్లు పంట వస్తుంది. మరి కొన్నింటి నుంచి మూడేళ్ల వరకు కూడా పంట వస్తుంది. సీజనల్‌గా వచ్చే గోబీ, క్యాబేజీ లాంటి పంటలు తీసేశాక మిర్చి, బీర, బెండ, వంగ, కాకర మొక్కలు నాటుతారు., పంట పూర్తయిన తర్వాత మొక్కలను పీకి బెడ్‌ మీదే వేయాలి. అవి మల్చింగ్‌గా, జీవరాశులకు ఆహారంగా పనికొస్తాయి.భూమిని దున్నితే వయ్యారిభామ లాంటివి పంటల మీద దాడిచేస్తాయి. భూమిని దున్నకపోతే అవి రావు. బయోచార్‌, ఫిష్‌ అమినో యాసిడ్స్‌, ఎంజైమ్స్ లాంటి వాటిని సాధారణ రైతు సొంతంగా తయారు చేయడం కష్టం. అందుకు వాటిని కొనేందుకు ఖర్చు అవుతుంది. కలుపు మొక్కలను బెడ్లపై పరిస్తే.. వాటి నుంచే జింక్, పొటాష్‌, నత్రజని లాంటివి మొక్కలకు సమృద్ధిగా అందుతాయి. రకరకాల కలుపు మొక్కలు సూర్యుడి నుంచి వివిధ రకాల పోషకాలను గ్రహిస్తాయి. వాటిని ఎరువుగా మార్చి మొక్కలకు అందిస్తాయి. ఆ కలుపు మొక్కలను పీకి బెడ్లపై వేస్తే.. అవి గ్రహించిన పోషకాలన్నీ భూమిలోపల ఉండే కొన్ని కోట్ల వానపాములు, ఇతర జీవరాశులకు ఆహారం అవుతాయి. ఆ ఆహారం తీసుకొని, విసర్జించే వాటితో ప్రధాన మొక్కలకు ఎరువు అందిస్తాయి. కలుపు మొక్కల నుంచి జీవరాశులకు 6 నెలల వరకూ ఆహారంగా పనికొస్తుంది. మునగ, అవిశె చెట్లకు కాకర, బీర పాదులు పాకించవచ్చు, భూమిలో జీవరాశులకు ఆహారం తయారు చేసేందుకు అవి ఉపయోగపడుతాయి, దాంతో పాటు కింద ఉన్న మొక్కలు, పాదులకు ఎండాకాలంలో చల్లదనం ఇస్తాయి.మరో బ్లాక్‌లో నల్ల మిర్చి, దేశవాళీ టమోటా, బీట్‌రూట్‌, క్యాబేజీని ప్రసాదరెడ్డి పెంచుతున్నారు. నల్ల మిర్చి తింటే ఎసిడిటీ రాదు, కారంగా ఉంటుంది. ముదిరినప్పుడు నల్లమిర్చి ఎర్రరంగులోకి మారుతుంది. దీనికి ఎలాంటి పోషకాలు ఇవ్వకుండానే దానంతట అదే పెరుగుతుంది. ప్రసాదరెడ్డి సహజ వ్యవసాయంలో ఒక్కో క్యాబేజి మొక్క నుంచి ఎనిమిది క్యాబేజీలు వచ్చాయి. కుషన్‌లా మెత్తగా ఉండే బెడ్ల మీద కాలు పెట్టకూడదు. బెడ్ల మధ్య ఉండే కాల్వల్లో నడవాలి. బెడ్‌పై పెట్టిన మిర్చి కాపు కాసే సమయంలో వంకాయ మొక్క పెట్టారు. వంగమొక్క పెరిగే సమయానికి మిర్చి మొక్క పీకేసి బెడ్‌ మీద పరచాలి. వంగ పంట పూర్తయ్యే సమయానికి దాన్ని పీకేసి, డ్రిప్ పాయింట్‌ వద్ద తడి ఉన్నచోట ఉల్లి నారు నాటారు. దీంతో ఒకేచోట బహుళ పంటల విధానం అనుసరించినట్లు అవుతుంది. నేల సారం మరింతగా పెరుగుతుంది. ఇలా ప్రతి బెడ్‌ పైనా ఒక మొక్క పంట పూర్తవుతుందనగా రెండు నెలల ముందే మరో రకం మొక్కను చిన్న రంధ్రం చేసి, నాటుకోవాలి. దీనితో భూమిని దున్నే పనిఉండదు. ఎరువు వేసే అవసరం ఉండదు. కొద్దిగా నువ్వు చెక్క వేస్తే సరిపోతుంది.బెడ్లలో ఒకలైన్ అంతా ఆయన బీన్స్‌ సాగుచేశారు. పసుపు పంట తీసినప్పుడే ఒక దుంపను భూమిలో నాటుతానని ప్రసాద్‌రెడ్డి చెప్పారు. అది కూడా దానంతట అదే పెరుగుతుంది కలుపు మొక్కలతో భూమి సారవంతం అవుతుంది. భూమిని దున్నపోయినా మొక్కలు నాటి, పంట కోసుకుంటాం ఈ విధానంలో. రూపాయి ఖర్చు లేదు. దిగుబడి వస్తుంది. ఒకవేళ మొక్కలకు పేడ లేదా పశువుల ఎరువు వేస్తే.. 15 రోజులకు మళ్లీ వేయాలి. అంటే ఆ ఎరువులోని ఆహారాన్ని జీవరాశులు తినేస్తాయి. కలుపు మొక్కలు ఎంత ఎక్కువ అయితే.. అంతలా జీవరాశులకు ఆహారం నిరంతరం అందుతూనే ఉంటుంది. ఒక బెడ్‌పై అల్లం, పుల్ల కంద, చిలగడ దుంపను ప్రసాదరెడ్డి పెంచారు. ప్రసాదరెడ్డి సాగు విధానంలో ఇవన్నీ వాటంతట అవే పెరుగుతాయి. వర్షాకాలంలో ప్రసాదరెడ్డి డ్రిప్ పాయింట్లు ఉన్నచోటల్లా వరి నాటి, ధాన్యం కూడా పండిస్తారు.కలుపు మొక్కలను, పంట పూర్తయ్యాక పీకిన మొక్కలను బెడ్‌ మీదే వేయడం వల్ల మల్చింగ్‌లా ఉంటుంది. దాని నుంచి జీవరాశులకు మంచి ఆహారం అందుతుంది. డ్రిప్‌ పాయింట్ ఉన్న చోటల్లా ఏదో ఒక మొక్క నాటుతూనే ఉండాలి. అది బతికి, పెరిగి, పంట ఇస్తే ఇస్తుంది. లేకపోతే లేదు.పైసా ఖర్చు లేదు కాబట్టి నష్టం మాటే ఉండదన్నారు. కొబ్బరి కాయ నుంచి మొక్క వచ్చిన తర్వాత దాన్ని భూమిపైన కొద్దిగా కనిపించేలా నాటుకోవాలి. కొబ్బరి మొక్కలకు మూడేళ్లు వచ్చే వరకు 15 రోజులకోసారి దోసెడు గోమూత్రం మొవ్వులో పోస్తూ ఉండాలి. దీంతో కొబ్బరి ఆకును తినే పురుగులు అలా తింటూనే చనిపోతాయి. గోమూత్రం లేకపోతే.. నేలమట్టిని నీటిలో కలిపి మొవ్వులో పోసినా పురుగులు చనిపోతాయి. ప్రసాదరెడ్డి మోడల్‌ సాగులో కూలీలు అవసరం లేదు, ఎరువులు, పురుగుమందులు వేయక్కరలేదు, కలుపు కోసం కష్టపడాల్సిన పని లేదు.తొలకరి వర్షాలు పడగానే బెడ్ల మీద జనుము కానీ జీలుగు విత్తనాలను చిక్కగా చల్లుకోవాలని ప్రసాదరెడ్డి చెప్పారు. దీంతో వయ్యారి భామలు చాల వరకు తగ్గిపోతాయి. జనుము, జీలుగు మొక్కలను పూత రాక ముందే పీకేసీ బెడ్లపై పరిస్తే వయ్యారి భామలు మరింతగా తగ్గుతాయి. ఫుడ్‌ ఫారెస్ట్‌లో రైతు చాలా తక్కువ సమయం వెచ్చించినా ఆదాయం వస్తూనే ఉంటుందన్నారు ప్రసాదరెడ్డి. ఖర్చేమీ లేకుండా.. మనకు ఉన్న వనరులతో పంటల సాగు ఎలా చేయాలనేది ప్రసాదరెడ్డి సహజ పంటల పద్ధతి. ఈ విధానంలో పర్యావరణం దెబ్బతినదు. మనం పెట్టిన కొబ్బరి చెట్లలో ఒకటి రెండు చనిపోవచ్చు. మొక్కలు చనిపోయాయని రసాయన మందులు కొడితే.. తోట పర్యావరణంలో ఉన్న జీవజాలం మొత్తం నశించిపోతుంది. ఎక్కువ లాభాలు ఆశించకుండా, పెద్దమొత్తంలో సాగు చేయాలనుకోకుండా.. పది కుటుంబాలకు సరిపోయే పంటలు సాగు చేస్తే.. రైతుకు ప్రయోజనం ఉంటుందని ప్రసాదరెడ్డి చెప్పారు. తగు మాత్రంగా పంట దిగుబడి తీస్తే.. రైతు కుటుంబానికి మంచి ఆహారం ఉంటుంది. ఇతరులకు డిమాండ్‌ మీద కాస్త ఎక్కువ ధరకు అమ్ముకోవచ్చు. ఖర్చు పెట్టకుండా భూమి నుంచి ఎంత వచ్చినా లాభమే కదా!

మరిన్ని వివరాల కోసం ప్రసాద్‌రెడ్డి నుంచి 6302049504 నెంబర్‌లో సంప్రదించవచ్చు.

 

 

 

Exit mobile version