కర్ణాటకలోని పెద్దబళ్లాపూర్ మండలం మల్లసంద్ర గ్రామ మహిళా రైతు గంగరత్నమ్మ సాగు విధానానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ మహిళా రైతును చూసిన ఎవరైనా.. ఔరా! అంటారు. మేడ మీద ఆమె గొర్రెల ఫామ్ నిర్వహిస్తోంది. గొర్రెల ఫామ్‌లను పొలాల్లోనో, తోటల్లోనో, పెరటిలోనో గొర్రెలను పెంచుతారు. కానీ గంగరత్నమ్మ వినూత్నంగా మేడ మీద గొర్రెల పెంపకం చేపట్టింది. తమ మేడపై ఒక షెడ్ నిర్మించుకొని ఆమె గొర్రెల ఫార్మింగ్ నిర్వహిస్తోంది. షెడ్ నిర్మాణానికి ఖర్చెంత? షెడ్ నిర్మాణానికి ప్రభుత్వం నుంచి సబ్సిడీ ఏమైనా వచ్చిందా? గొర్రెలకు ఆమె వేస్తున్న దాణా ఏమిటి? వాటికి వచ్చే రోగాలేంటి? రోగ నివారణ చర్యలు ఎలా తీసుకుంటుంది? గొర్రెలకు తాగునీటి సరఫరా కోసం ఎలాంటి సిస్టం ఏర్పాటు చేసింది? గొర్రెల పెంట, మూత్రం శుభ్రం చేసేందుకు ఆమె అనుసరిస్తున్న పద్ధతులేంటి? తెలుసుకుందాం.
గంగరత్నమ్మ కుటుంబం తొలుత గొర్రెలను ఇంటి పరిసరాల్లోనే 20 నాటు గొర్రెలను పెంచేవారు. అయితే.. వాటిని మరింత పెంచేందుకు సరిపడినంత స్థలం లేకపోవడంతో మేడపై షెడ్ వేసి 80 సింధనూరు జాతి అంటే ఎర్రగొర్రెలను పెంచుతున్నట్లు ఆమె వెల్లడించింది. అంతకు ముందు మూడేళ్లకు పైగా నాటుగొర్రెలను పెంచిన అనుభవం తమకు ఉందని తెలిపింది. కటింగ్ పర్పస్ కోసం తాము మగ గొర్రెలను పెంచుతున్నట్లు చెప్పింది.
మేడ మీద గొర్రెల ఫామ్ ఏర్పాటు చేయడం వల్ల ఎండాకాలంలో వాటికి గాలి, వెలుతురు పుష్కలంగా వస్తాయని తెలిపింది. వానకాలంలో వాటికి చెమ్మ, కాలంలో చలి తగలకుండా షెడ్ చుట్టూ మ్యాట్ ఏర్పాటు చేస్తామని గంగరత్నమ్మ పేర్కొంది. గొర్రెలు వేసే పెంట, మూత్రం శుభ్రం చేసేందుకు తాము పవర్ వాటర్ మిషన్ గన్‌తో నీరు కొడతామని గంగరత్నమ్మ చెప్పింది. అలా శుభ్రం చేసిన పెంట, మూత్రం, నీరు కలిసి మేడ కింద ఒక గుంతలో పడేలా ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఆ గుంతలోని పెంట, మూత్రం, నీటి మిశ్రమ ఎరువును తమ వక్క తోటలోని మొక్కలకు వినియోగిస్తామని పేర్కొంది.
పాలు విడిచిన తర్వాత నాలుగైదు నెలల వయసున్న గొర్రె పిల్లలను కొని, తెచ్చి ఫార్మ్ నిర్వహిస్తున్నామని మహిళారైతు వెల్లడించింది. ఆ వయస్సులోని ఒక్కో పిల్లకు రూ.7 వేలు అవుతుంది. కొన్ని కాస్త పెద్ద గొర్రెలను కూడా ఒక్కొక్కటి తొమ్మిదిన్నర వేల రూపాయలకు కొని తెస్తామంది. వాటిని సంతలో కొన్న ఖర్చుతో పాటు రవాణా ఖర్చు కూడా దూరాన్ని బట్టి ఉంటుంది. షెడ్‌లో ఒక్క డ్రమ్ములోని నీళ్లు పైప్ ద్వారా గొర్రెలకు అందుబాటులో ఉండేలా టబ్‌లు ఉంచి, వాటిలోకి నీళ్లు వెళ్లేలా ఏర్పాటు చేసినట్లు తెలిపింది.
గొర్రెలకు తాము తొలుత పచ్చిగడ్డి, జొన్నలు, సెనగపిండిని ఆహారంగా ఇచ్చామని గంగరత్నం చెప్పింది. ఇప్పుడు తాము గొర్రెలకు అన్ని పోషకాలు అందించే టీఎంఆర్ ఫీడ్ వేస్తున్నట్లు తెలిపింది. రోజూ ఉదయం 6, మధ్యాహ్నం 2 గంటలకు, సాయంత్రం గొర్రెలకు తొట్లలో ఫీడ్ వేస్తామని చెప్పింది. ఈ ఫీడ్ ద్వారా గొర్రెలు ఆరోగ్యంగా, బలంగా ఎదుగుతున్నాయని తెలిపింది.
తాము తెచ్చినప్పుడు ఐదు నుంచి 8 కిలోల బరువుండే ఒక్కో గొర్రెపిల్ల మూడున్నర లేదా నాలుగు నెలల్లో 40 కిలోల బరువు వచ్చినట్లు వెల్లడించింది. టెర్రస్‌పై గొర్రెల పెంపకం చేపట్టిన తర్వాత తాము మూడు బ్యాచ్‌లను అమ్మినట్లు ఆమె తెలిపింది. టెర్రస్‌పై తాము వేసిన షెడ్‌లో 120 పిల్లలను పెంచే స్థలం ఉందని చెప్పింది. . గొర్రెల ఫార్మ్ నిర్వహణకు ఒక్క మనిషి సరిపోతారని చెప్పింది. గొర్రెలకు ఏవైనా రోగాలు వచ్చినా.. అత్యవసరమైనా పశువుల డాక్టర్ వచ్చి మందులు ఇస్తారని గంగరత్నమ్మ వెల్లడించింది.
గొర్రెల కోసం వేసిన షెడ్ కోసం ఏడున్నర లక్షల రూపాయలు ఖర్చయిందని గంగరత్నం చెప్పింది. మేడకు గొర్రెల బరువు ఉండకుండా కింద నుంచి పై వరకు చుట్టూరా పిల్లర్లు వేసి, వాటిపై షెడ్ నిర్మించినట్లు తెలిపింది. గొర్రెలు పెంట, మూత్రం నుంచి మేడకు ఎలాంటి నష్టం ఉండకూడదని టెర్రస్‌పై టెయిల్స్ వేసి, వాటిపై మ్యాట్ వేసినట్లు వివరించింది. షెడ్ లోపల ఫ్యాన్లు వేయడం ద్వారా చెడు వాసన రాకుండా చూసుకోవచ్చంది. ప్రతిరోజూ శుభ్రం చేస్తుండడం వల్ల మేడకు ఎలాంటి నష్టమూ రాదని గంగరత్నమ్మ పేర్కొంది. ఆరు, ఏడు నెలలకు ఒకసారి కొత్త మ్యాట్ వేస్తామని తెలిపింది. మూగజీవాల పెంపకానికి ఎన్‌ఎల్‌ఎం పథకం ద్వారా ప్రభుత్వం నుంచి తమకు సబ్సిడీ రాలేదని గంగరత్నమ్మ చెప్పింది. అయితే.. సబ్సిడీని ప్రభుత్వం అందిస్తుంది.
వ్యాపారులు తమ వద్దకే వచ్చి గొర్రెలను కొని, తీసుకెళ్తారు. గొర్రెలను కిలోల లెక్కన అమ్మితే లాభదాయకం. అలా కిలో లైవ్ గొర్రె కిలోకు రూ.350 నుంచి 400 వరకు కొని తీసుకెళ్తారు. కానీ.. ఉన్నది ఉన్నట్లుగా అమ్మితే తక్కువ ధరకు అడుగుతారని, దాంతో నష్టం కూడా వచ్చే అవకాశం ఉంది. మేడ మీద తాము గొర్రెల పెంపకం చేపట్టిన తొలిరోజుల్లో విమర్శలు, ప్రశ్నలు వచ్చాయని పేర్కొంది. తర్వాత తమ నిర్వహణ తీరు చూసిన పలువురు హర్షం వ్యక్తం చేశారని, మరి కొందరు రైతులు కూడా తమలా మేడ మీద గొర్రెల పెంపకం చేపట్టారని తెలిపింది. టెర్రస్ మీద చిన్న స్థలం ఉన్నా షెడ్ వేసి, గొర్రెలు పెంచేందుకు ఇంట్లో ఖాళీగా ఉండే మహిళలకు అనువైన వ్యవసాయం అని చెప్పాలి.
టెర్రస్‌పై గొర్రెల పెంపకంపై సూచనలు, సలహాలు కావాలంటే.. 9900168982 లేదా 9591098393 నెంబర్లలో నాగరత్నమ్మను సంప్రదించవచ్చు.





















