శాండ్‌విచ్ పద్ధతి’ మట్టి. ఎండిపోయిన మొక్కలు, కలుపు మొక్కలు, కత్తిరించిన కొమ్మలే సులువుగా తయారు చేసుకునే శాండ్‌విచ్ మట్టికి మూలాధారం. తోటలో వ్యర్థంగా ఉండే వాటితోనే సారవంతమైన మట్టిగా మార్చేది శాండ్‌విచ్ తయారీ విధానం. సులభమైన ‘శాండ్‌విచ్ పద్ధతి’ని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మొక్కల ప్రేమికురాలు గుత్తికొండ మాధవి అమలు చేస్తున్నారు. తద్వారా ఆమె ప్రతి పంట కాలంలోనూ డబ్బు ఆదా చేయడమే కాకుండా వ్యర్థాలను తగ్గిస్తున్నారు. వ్యర్థాలతో ఆరోగ్యకరమైన, సారవంతమైన మట్టిని తయారు చేస్తున్నారు. ఆ మట్టితో టెర్రస్ గార్డెన్‌లో పెంచుతున్న మొక్కల నుంచి చక్కని దిగుబడులు సాధిస్తున్నారు.
మాధవి ఇంటి టెర్రస్‌పై ఉన్న గార్డెన్‌లో ఎండిన తీగలు, ఎండిన మొక్కల కాండాలు, కలుపు మొక్కలు, కత్తిరించిన కొమ్మలతో ఈ శాండివిచ్ మట్టిను తయారు చేస్తున్నారు. నిజానికి చాలామంది అలాంటి వాటిని ఆలోచన లేకుండా తీసి బయట పారేస్తుంటాం. కానీ, టెర్రస్ గార్డెనర్ మాధవి వాటిని పడేయరు. వాటిని ఎరువు తయారీకి అత్యంత విలువైన వస్తువులు అంటారు. టెర్రస్ గార్డెన్‌లో తాను పెంచుతున్న మొక్కల కోసం తోట వ్యర్థాలను మాధవి ఆరు ఏడు సంవత్సరాలుగా సారవంతమైన మట్టిగా ‘శాండ్‌విచ్ పద్ధతి’లో మారుస్తున్నారు. శాండ్‌విచ్ పద్ధతి దాదాపు రెండు మూడు నెలల సమయం పట్టే నెమ్మదైన ప్రక్రియ. దీనివల్ల డబ్బు ఆదా అవుతుంది. తోటలోని వ్యర్థాలు తగ్గిపోతాయి. మొక్కలు నాటేందుకు మంచి ఆరోగ్యకరమైన మట్టి కూడా దీనితో లభిస్తుంది.
ఇటీవల ఆమె ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో ఈ పద్ధతి ఎలా పనిచేస్తుందో ప్రదర్శించారు. ‘ఇన్‌స్టాగ్రామ్’లో ఆమె @madgardener_madhavi పేజీ నిర్వహిస్తున్నారు. ప్రతి సీజన్‌లో కొత్త మట్టి కొనడానికి బదులు తానే సొంతంగా కుండీ మట్టి తయారు చేయడానికే ఎందుకు ఇష్టపడతారో రీల్స్ ద్వారా వివరించారు. కంటైనర్‌లో చేసే శాండ్‌విచ్ కంపోస్టింగ్ ప్రక్రియతో ఎంత లాభమో వెల్లడించారు. శాండ్‌విచ్ మట్టి తయారీకి మనం ఒకసారి శ్రమపెడితే, తర్వాత కొన్ని నెలల వరకు అది ఉపయోగపడుతూనే ఉంటుంది.
శీతాకాలంలో పంటలు కోసిన తర్వాత మాధవి శాండ్‌విచ్ మట్టి తయారీని ప్రారంభించడం మొదలుపెడతారు. తర్వాతి సీజన్ కోసం ఆరోగ్యంగా, బలంగా ఉన్న మొక్కల నుండి విత్తనాలు సేకరిస్తారు. డిన కూరగాయల తీగలు, ఎండిన మొక్కలు, కలుపు మొక్కలు, కాండాలు, కత్తిరించిన కొమ్మలన్నింటినీ మాధవి సేకరిస్తారు. వాటిని తిరిగి మట్టిలో కలుపుతారు జూన్ నెల మట్టిని సిద్ధం చేయడానికి అత్యంత అనువైన సమయం అంటారామె. ఈ సమయంలోనే అనేక రకాల పండ్ల పంటలు వస్తాయి. తోటలలో రీసైకిల్ చేయడానికి వీలైన సేంద్రీయ పదార్థం కూడా అధికంగా దొరుకుతుంది.
శాండ్‌విచ్ నేల సిద్ధం చేసే విధానం:
ముందుగా తోటలలోని వ్యర్థాలు సేకరించాలి. శీతాకాలపు పంటలు కోసిన తర్వాత, తోటలో మిగిలిపోయిన సేంద్రియ పదార్థాలన్నింటినీ సేకరించాలి. వాటిలో ఎండిన తీగలు, పాత కాండాలు, కలుపు మొక్కలు, కత్తిరించిన కొమ్మలు, ఇతర మొక్కల పదార్థాలు కూడా వినియోగించవచ్చు. అంతకు ముందే ఆరోగ్యంగా, బలంగా ఎదిగిన మొక్కల నుండి విత్తనాలు సేకరించి వచ్చే సీజన్ కోసం భద్రపరచాలి.
పొరలుగా మట్టి, వ్యర్థాలు:
మొక్కల కుండీలు లేదా గ్రోబ్యాగ్ అడుగు భాగంలో మట్టిని తొలి పొరగా వేయాలి. తర్వాత ‘శాండ్‌విచ్’ను సిద్ధం చేయాలి. మట్టి పైన తోట వ్యర్థాలతో మరో పొర పరచాలి. భద్రపరిచిన విత్తనాలను మట్టి, వ్యర్థాల పొరల మధ్య వేయాలి. కుండీలో సుమారు సగం వరకు నిండేలా మట్టి, సేంద్రీయ వ్యర్థాలను ఒకపై దానిపై మరో రెండు లేదా మూడు పొరలు ఏర్పాటు చేయాలి. అలా మట్టి, తోట వ్యర్థాలతో పొరలు అమర్చిన తర్వాత అవి కుళ్లేందుకు వీలుగా కుండీలో నీరు పోయాలి.
తర్వాత శాండ్‌విచ్ మట్టి తయారయ్యే వరకు వేచి చూడాలి. కుండీని రెండు, మూడు నెలల పాటు కదపకుండా వదిలేయాలి. ఈ సమయంలో సేంద్రియ పదార్థం నెమ్మదిగా విడిపోతూ సహజంగా సారవంతమైన మట్టిగా మారుతుంది. పొరల్లోని వ్యర్థాలు, మట్టి కుళ్ళిపోయే ప్రక్రియ జరుగుతున్నప్పుడు కుండీలోని సారవంతమైన పదార్థం అడుగు భాగానికి చేరుతుంది. అప్పుడప్పుడు ఆ కుండీని తనిఖీ చేస్తే మంచిది. వ్యర్థాలు క్రమంగా ముదురు రంగులో పోషకాలతో గుల్లని మట్టిగా మారతాయి.
డబ్బు ఆదా:
శాండ్‌విచ్ మట్టి ప్రక్రియ నెమ్మదిగా జరుగుతోందని అనిపించవచ్చు, కానీ దీనికి ప్రతి సీజన్‌లో ఒక్కసారి ప్రయత్నిస్తే చాలు. కుండీలో వేసుకునే మట్టి కోసం డబ్బులు ఖర్చు చేయడం, నర్సరీల నుండి సంచులకు సంచుల మట్టి తీసుకు వచ్చే అవసరం ఉండదు. విలువైన సేంద్రియ పదార్థాన్ని పడేయకుండా ఇలా తమ ఇంట్లోనే సారవంతమైన మట్టిని తయారు చేసుకోవచ్చు. తద్వారా డబ్బు కూడా ఆదా అవుతుంద. కొత్త మొక్కలు ఆరోగ్యంగా, బలంగా ఎదుగుతాయి. దిగుబడులు అధికంగా ఇస్తాయి.
టెర్రస్‌పైన, కుండీలలో మొక్కలు పెంచేవారికి ఈ శాండ్‌విచ్ మట్టి తయారీ విధానం సులువైనది, మట్టి ఆరోగ్యాన్ని సహజంగా మెరుగుపరుస్తుంది. ఈ విధానం ఒక ఆచరణాత్మక మార్గం అంటారు మాధవి. ఉత్తమమైన ఎరువు అంటే కేవలం కొని తెచ్చేది కాదు. మనం మన తోట నుంచి ఎప్పటి నుంచో అభిస్తున్నదే అని తెలుసుకోవాలని మాధవి చెప్పారు.





















