మంచి ఆరోగ్యం కోరుకునే వారికి బెస్ట్ కూరగాయ బెండకాయ. దీనిలో పుష్కలంగా ఉండే పీచుపదార్థం రక్తంలో షుగర్ స్థాయిలను నియంత్రిస్తుంది. డయాబెటిక్ రోగులను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే దీనిలోని పీచుపదార్థం జీర్ణక్రిఇయను మెరుగుపరుస్తుంది. బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. బెండలోని యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించి, గుండె జబ్బుల ప్రమాదం నుంచి కాపాడతాయి. విటమిన్ ఏ, విటమిన్ సీ, విటమిన్ కే, ఫోలేట్, కాల్షియం, మెగ్నీషియంలు దీంట్లో లభిస్తాయి. విటమిన్ కే ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. బెండలోని ఫోలేట్ గర్భిణులకు ఎంతో మంచిది. పిండం నాటీ ట్యూబ్ లోపాలను నివారిస్తుంది. దీనిలోని ప్రత్యేక గుణాలు ఎల్‌డీఎల్‌ని తగ్గించడంలో ముఖ్యపాత్ర వహిస్తాయి. విటమిన్ ఏ ద్వారా కంటి ఆరోగ్యాన్ని బెండకాయలు కాపాడతాయి. బెండలోని విటమిన్ సీ మనలో రోగనిరోధకశక్తిని పెంచుతుంది. వీటిని తింటే కొల్లాజెన్ ఉత్పత్తి పెరిగి, జుట్టు పెరిగేందుకు, జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
అనేక లాభాలతో నిండిన లేడీస్ ఫింగర్ లేదా ఓక్రా అని పిలువబడే బెండ సాగు విధానం, కష్టనష్టాల గురించి పదేళ్లకు పైగా నిరంతరం సాగు చేస్తున్న మెదక్ జిల్లా శివ్వంపేట మండలం మదిరనరసాపురం రైతు దేవుని నర్సింహ, రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం కేంద్రంలోని రైతు శ్రీనివాస్ అనుభవాలను తెలుసుకుందాం. వారు పలు రకాల కూరగాయలు సాగు చేస్తున్నప్పటికీ బెండసాగుకు మాత్రం ప్రత్యేక స్థానం ఇస్తున్నారు వారిద్దరు. బెండపంట జోలికి కోతులు, పందులు రావని నర్సింహ తెలిపారు.
బెండ విత్తనం నాటిన తర్వాత 45 రోజుల నుంచి కాయలు కాయడం మొదలువుతుంది. ఇలా మూడు నెలల పాటు రోజు విడిచి రోజు బెండకాయల దిగుబడి వస్తుంది. రైతులు కాస్తా జాగ్రత్త వహిస్తే.. దాదాపు 60 నుంచి 70 కోతల వరకు బెండకాయలు వస్తాయని చెప్పారు నర్సింహ.
ఎకరం భూమిలో 5నుంచి 6 కిలోల విత్తనాలు అవసరం అవుతాయి. కిలో విత్తనాలు రూ.1800 నుంచి రూ.2 వేల మధ్యన లభిస్తాయని నర్సింహ చెప్పారు. మార్కెట్‌లో దాదాపు రూ.4 నుంచి రూ.5 వేలకు కూడా కిలో విత్తనాలు దొరుకుతాయన్నారు. భూమిని దున్ని, బోదెలు వేసుకొని, సాయిబాబా రకం విత్తనాలను మనుషులతో నాటిస్తామన్నారు. పొలంలో బోదెలు కొట్టే వరకు నాలుగుసార్లు దుక్కి చేయాల్సి ఉంటుంది. దుక్కి దున్నేందుకు ఎకరానికి రూ. 8 వేలు, విత్తనాలు కొనేందుకు సుమారు రూ.18 వేలు అవుతాయి. విత్తనాలను రైతు కుటుంబమే నాటుకుంటే ఖర్చు ఉండదు కానీ కూలీలను పెడితే వారికి డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. బెండ సాగు చేసే పొలంలో పశువుల ఎరువు వేస్తామన్నారు నర్సింహ. దుక్కి దున్నే సమయంలో ఎకరానికి రెండు బస్తాలు దుక్కి ఎరువు వేస్తామన్నారు. ఎరువుకు రూ.2,400 అవుతుంది. మొత్తం మీద రూ.25 నుంచి రూ.26 వేలు అవుతుంది.
బెండ సాగు చేసే నేల పదును చూసుకొని మూడు రోజులకు ఒకసారి బోదెలు లేదా డ్రిప్ ద్వారా నీటిని సరఫరా చేయాల్సి ఉంటుంది. బెండమొక్కలను దోమ, ఆకులు తినేసే సన్నని పురుగులు ఆశిస్తాయి. వాటి నివారణ కోసం 20 రోజులకు ఒకసారి క్రిమిసంహారక మందులు స్ప్రే చేయాల్సి ఉంటుంది. ఇలా బెండ పంట పూర్తయ్యే వరకు నాలుగైదు సార్లు స్ప్రే చేయాలి. లీటరు పురుగుమందు ఎకరానికి రెండుసార్లు వస్తుంది. నాలుగు సార్లకు పురుగుమందుకు రూ.1600లు, స్ప్రే కొట్టేందుకు కనీసం రూ.4 వేలు అవుతుంది. బెండచేలో ఎప్పటికప్పుడు కలుపు తీసేయాలి.లేకపోతే బెండమొక్కలు పైకి ఎదగవు. అందుకే 40 రోజుల్లో కనీసం నాలుగు సార్లు కలుపు తీయాలన్నారు నర్సింహ.
బెండ మొక్కల నుంచి రోజు విడిచి రోజు బెండకాయలు కోసుకోవాలి. ఇలా ఎకరం పొలంలో తడవకు రెండు నుంచి మూడు క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. ఇలా బెండ పంట కాలంలో కనీసం 30 నుంచి 40 సార్లు కోత వస్తుంది. బెండకాయలకు మార్కెట్‌లో 10 కిలోలకు రూ.200 పలుకుతుంది. ఒక్కోసారి కిలో పది రూపాయలు కూడా రాని పరిస్థితి ఎదురు కావచ్చు. కిలో రూ.30 వస్తే.. లాభసాటిగా ఉంటుంది. శీతాకాలంలో బెండకాయలకు ధర ఎక్కువ పలుకుతుంది. అయితే.. చలికాలంలోనే బెండకు తెగుళ్లు ఎక్కువ వస్తాయి. దిగుబడి తగ్గుతుంది. అందువల్లే రేటు ఎక్కువ ఉంటుంది. బెండసాగు చేసిన రైతుకు నష్టం వచ్చే అవకాశం ఉండదని నర్సింహ స్పష్టం చేశారు.
వీడియోలు చూసి వ్యవసాయం చేస్తే కుదరదని రైతు శ్రీనివాస్ అన్నారు. ఏ పని అయినా.. స్వయంగా రంగంలో దిగితేనే కష్టనష్టాలు తెలుస్తాయన్నారు. దశాబ్ద కాలానికి పైబడే తాను ఏడాదికి మూడుసార్లు బెండపంట సాగుచేస్తున్నట్లు చెప్పారు. ఏడాదికి ఒక్కసారి మాత్రమే బెండ పండించాలనుకునే రైతులు కలుపు మొలవకుండా జూన్ నుంచి సెప్టెంబర్, అక్టోబర్ నెలల వరకు దుక్కి చేసుకుంటూ పొలాన్ని సిద్ధం చేసుకుంటూ ఉండాలి. బెండకాయలకు మంచి ధర రావాలని కోరుకునే రైతులు సెప్టెంబర్ ఆఖరి వారం లేదా అక్టోబర్ మొదటి వారంలో విత్తనాలు నాటుకుంటే మేలు అని శ్రీనివాస్ చెప్పారు. ఈ సమయంలో విత్తనాలు నాటితే చలి వచ్చే సరికి మొక్కలు ఎదిగిపోతాయి.
బెండ ఉష్ణ కాలపు పంట. ఎంత వేడి ఉంటే అంతగా కాయ దిగుబడి వస్తుందన్నారు. చలికాలంలో బెండకాయలు వారానికి రెండు సార్లు, ఎండాకాలంలో అయితే.. మూడుసార్లు కోతకు వస్తాయి. ఎర్రనేలలు, ఒండ్రు, వేడి ఎక్కువ నేలల్లో బెండ సాగు బాగా అవుతుంది. ఎండాకాలంలో అయితే.. ఎలాంటి నేలలో అయినా పంట వస్తుంది. ఎండాకాలంలో అయితే.. విత్తు నాటిన 45 రోజులకు కాపు వస్తుంది. అదే చలికాలంలో విత్తు నాటితే మొక్క సరిగా ఎదగదు కాబట్టి 50 రోజులకు తొలికాపు వస్తుందని శ్రీనివాస్ వెల్లడించారు.
చలికాలంలో బెండమొక్క గ్రోత్ సరిగా ఉండదు కనుక ఎకరానికి 8 కిలోలు నీటిలో కలిసిపోయే ఎరువులను డ్రిప్ ద్వారా వారానికి ఒకసారి అందించాలన్నారు. కాయలు మంచి సైజు, షైనింగ్ రావాలంటే వారానికి ఒకసారన్నా త్రిబుల్ 19 ఎరువు ఇవ్వాలని చెప్పారు. విత్తనాలు నాటేందుకు నెల రోజుల ముందు భూమిలో పశువులు, కోళ్ల ఎరువులు వేసుకుంటే దిగుబడి మరింత ఎక్కువ వస్తుంది. బెండకు సాధారణంగా ట్రిప్స్ అంటే పచ్చపురుగు వస్తుంది. మేఘాలు ఉన్నప్పుడు మొక్కల మొగ్గలు, పువ్వులపై నల్లపేను, తెల్లపేను ఆశిస్తాయి. వాటి నివారణకు పురుగు మందులు చల్లుకోవాలన్నారు.
సాలుకు సాలుకు మధ్య రెండు అడుగుల దూరం ఉండేలా బోదెలు కొడతామని శ్రీనివాస్ చెప్పారు. కొందరు రైతులు ఒకటిన్నర అడుగులు కూడా వేస్తారన్నారు. మొక్కకు మొక్కకు మధ్య అడుగు దూరం ఉండేలా తాము విత్తనాలు నాటుతామని తెలిపారు. వర్షాకాలంలో మొక్కల మధ్య ఒకటిన్నర అడుగులు, చలికాలంలో అర అడుగు దూరంలో విత్తనాలు వేస్తామన్నారు. బెండకు చలికాలంలో వచ్చేది ప్రధానంగా బూడిద తెగులు. ఈ బూడిద తెగులు వచ్చిన తర్వాత కంటే అది రాక ముందే అంటే మొక్క మొలిచిన కొద్ది రోజులకే ఇండెక్స్ పౌడర్‌ను స్ప్రే చేయాలన్నారు. లేదా కాంటా ప్లస్, లేదా కస్టోడియా లాంటి మందు లాంటివి వారంలో రెండుసార్లు స్ప్రే చేయాలి.
నిర్వహణ సరిగా చేసుకుంటే మొదటి కాపు వచ్చిన తర్వాత రెండు నెలల వరకు బెండ దిగుబడి వస్తుంది. ఎకరం నేలలో బెండ సాగు చేస్తే.. ఒక సీజన్‌లో ఒకటిన్న టన్నుల దిగుబడి ఉంటుంది. ప్రతిరోజూ క్వింటాలు లేదా కనీసం 60 కిలోల బెండకాయలను మార్కెట్‌కు పంపగలిగితే గిట్టుబాటు బాగుంటుందని శ్రీనివాస్ చెప్పారు. అతి తక్కువగా కిలో బెండకాయలకు రూ.5 రూపాయలు కూడా పలికిన రోజులు ఉన్నాయి. అత్యధికంగా రూ.30 పలికిందన్నారు. చలికాలంలో అయితే.. రూ.60 నుంచి రూ.70 కూడా వచ్చిందన్నారు.
బెండ సాగులో మరిన్ని వివరాల కోసం నర్సింహ: 9676326226 శ్రీనివాస్: 9642771717 నెంబర్లలో సంప్రదించవచ్చు.





















