పీతలను ఆహారంగా తీసుకునేవారికి ప్రోటీన్లు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ బీ 12, జింక్, సెలీనియం లాంటి ముఖ్యమైన పోషకాలు ఎక్కువగా లభిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఎర్ర రక్త కణాలు అధికంగా పెరుగుతాయి. నరాల బలహీనతను తగ్గిస్తాయి. పీతల ఆహారంలో తక్కువ క్యాలరీలు ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికి చక్కని ఆహారం పీత అని చెప్పొచ్చు.
పీతలలో లభించే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. గుండె సంబంధ వ్యాధుల ప్రమాదం నుంచి కాపాడుతుంది. వాటిలో లభించే విటమిన్ బీ 12, సెలీనియం నరాల పనితీరును మెరుగుపరుస్తాయి. ఎర్ర రక్తకణాలు ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. వీటిలోని కాపర్, జింక్, సెలీనియం ఖనిజాలు రోగనిరోధక శక్తిని బలంగా ఉంచుతాయి. మెదడు పనితీరును, చురుకుదనం పెంచుతాయి. పీతలలోని పోషకాలు చర్మ ఆరోగ్యాన్ని, కంటిచూపును మెరుగుపరుస్తాయి, పీతలలో కొలెస్ట్రాల్, సోడియం కాస్త అధికంగా ఉండొచ్చు. అందువల్ల హై బ్లడ్‌ప్రెషర్, కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నవారు పీతలను తగిన మోతదులో తీసుకోవడమే మేలు. అలర్జీలు ఉన్నవారు పీతల ఆహారానికి దూరంగా ఉంటే మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
అనేక ఆరోగ్య ప్రయోజనాలే కాకుండా సాగుచేసే వారికి మంచి లాభాలు అందించే పీతలను ప్లాస్టిక్ పెట్టెల్లో సులువుగా పెంచడం ఎలాగో తెలుసుకుందాం. పీతలు సముద్ర, నదీజలాలు, ఇతర జలవనరులు ఉన్న చోట సహజంగా పెరుగుతుంటాయి. పీతలకు భారీ డిమాండ్ ఉండడంతో పలువురు రైతులు ప్రత్యేకంగా చెరువులు ఏర్పాటు చేసి ఇప్పటికే పెంచుతున్నారు. కానీ తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన యువకుడు రామకృష్ణ విభిన్నంగా ఆలోచించాడు. పీత జాతిలో కానిబాలిజం ఎక్కువ. అంటే ఒక పీతను చంపి మరో పీత తినేసే గుణం వాటిది. చెరువులలో వెయ్యి పీతలను వేసి పెంచితే.. సాగు సమయానికి వాటి సంఖ్య చాలా వరకు తగ్గిపోవచ్చు. రైతు అదృష్టం బాగుంటే ఎక్కువ కూడా ఉండవచ్చు.
పీతలను ప్లాస్టిట్ డబ్బాలలో పెంచితే, వాటిని ఎప్పటికప్పుడు జాగ్రత్తగా గమనించవచ్చనే ఆలోచన రామకృష్ణకు వచ్చింది. ఒక్కో బాక్సులో ఒక్కొక్కటే పెంచడం వల్ల ఒకదానిపై మరొకటి దాడిచేసే అవకాశం ఉండదు. పైగా పీత ఆరోగ్యం, మేత తీసుకునే విధానం, మందకొడిగా ఉంటోందా? చురుగ్గా ఉందా? లాంటి విషయాలు సులువుగా తెలుసుకోవచ్చన్నారు రామకృష్ణ. చెరువుల్లో పెంచే పీతలను దగ్గరగా గమనించడం సాధ్యం కాకపోవచ్చన్నారు. వీటన్నిటితో పాటు కంఫర్ట్‌గా ఉండేందుకు, పని తగ్గించుకునేందుకు, నష్టానికి తావు లేకుండా తాను ఇలా బాక్సుల్లో ఆర్‌ఏఎస్ సెటప్ చేసి పీతలను పెంచుతున్నట్లు తెలిపారు రామకృష్ణ. నీటిని రీసైకిల్ చేసి మళ్లీ పీతలు ఉన్న బాక్సులలోకి సరఫరా చేయడం ఈ విధానంలో ప్రత్యేకత అన్నారు.
మార్కెట్‌లో రకరకాల పీతలు ఉంటాయి. వాటన్నింటినీ బాక్సుల్లో వర్టికల్ విధానంలో పెంచితే లాభసాటి కాకపోవచ్చు. తాను మడ్ క్రాబ్ రకాన్ని పెంచుతున్నట్లు రామకృష్ణ తెలిపారు. వీటినే పసుపు పీత లేదా పచ్చ పీత అని కూడా పిలుస్తారు. ఇది రెండు నుంచి మూడేళ్ల పాటు బతుకుతుంది. రామకృష్ణ 20 బాక్సులతో మడ్ క్రాబ్‌ల పెంపకం ప్రారంభించారు. వాటిని 100 బాక్సులకు పెంచేందుకు యత్నిస్తున్నారు. బాక్స్ విధానంలో పీతల పెంపకానికి పెద్దగా స్థలం అవసరం ఉండదు. ఇల్లు- ప్రహారీగోడకు మధ్య ఉండే కొద్దిపాటి స్థలంలో కూడా పెంచవచ్చు.
పీతలకు అత్యంత ప్రమాదకరమైనది అమ్మోనియం. అమ్మోనియం నిల్వ అయితే.. బ్యాక్టీరియా తయారవుతుంది. ఈ బ్యాక్టీరియా వల్ల పీతలు చనిపోయే ప్రమాదం ఉంది. పీతలు విసర్జించే వేస్ట్ వల్ల లేదా మనం వేసే ఫీడ్ వల్ల అమ్మోనియం నైట్రేట్ తయారవుతుందన్నారు రామకృష్ణ. పీతలు పెంచే బాక్సుల్లో అమ్మోనియం నైట్రేట్ ఫార్మ్ కాకుండా జాగ్రత్త వహించాలి. అందుకు బాక్సుల్లోని నీరు వాటి కింద బొగ్గులతో ఉంచిన డ్రమ్ములోకి వచ్చేలా ఏర్పాటు చేసుకోవాలి. బొగ్గుల డ్రమ్ములో నీటిలోని వేస్ట్ జమ అవుతుంది. ఆ నీటిని మళ్లీ పలుమార్లు ఫిల్టర్ చేసి, ఆ నీటిని పీతల బాక్సులోకి వెళ్లేలా చూసుకోవాలన్నారు. అమ్మోనియం ఒకసారి వచ్చిందంటే రెట్లకు రెట్లుగా పెరిగిపోతుంది. అందుకే ఈ విషయంలో రైతులు ఎప్పటికప్పుడు జాగ్రత్త వహించాలన్నారు. అమ్మోనియం వచ్చినప్పుడు బాక్సుల్లోని నీరంతా పూర్తిగా మార్చుకోవాలి. ఏమాత్రం అశ్రద్ధ చేసినా పీతలు చనిపోయే ప్రమాదం ఉంది. బాక్సుల్లో పీతల పెంపకం విధానంలో అమ్మోనియంను నివారించుకుంటే మేలు జరిగినట్టే.
పీతలకు సాధారణంగా జబ్బులు రావు. వాటి పైన ఉండే పెంకు చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి చాల వరకు రక్షణ ఉంటుంది. ఆర్‌ఓఎస్ విధానంలో నీటి సరఫరా చేస్తాం కాబట్టి అది సురక్షితం. చెరువుల్లో పీతలను పెంచితే వైరస్ ఉన్న రొయ్యలను తింటే పీతలకు ఎటాక్ అవుతుంది. బాక్సుల్లో అమ్మోనియం నివారణ కోసం బయోలాజికల్స్ ఉంటే వాడడం, నీటిని నిరంతరం శుద్ధి చేయడం ఈ విధానంలో ముఖ్యమైనవి.
పీతలు మాంసాహారం తినే జీవి కాబట్టి వాటికి నదుల్లో, సముద్రంలో లభించే చేపముక్కలు ఆహారంగా పెట్టొచ్చు. చికెన్ వేస్ట్ వేస్తే.. శుభ్రం చేయడం కష్టమైన పని. చేపముక్కలైతే కేవలం కొన్ని నిమిషాల్లో బాక్సుల్లో వేయొచ్చు. అలాగే పీతలు తినగా మిగిలిన చేపముక్కలను కూడా అంతే త్వరగా బయటికి తీసేయెచ్చు. చేపముక్కల ఆహారం అయితే.. ఖర్చు కూడా చాలా తక్కువ అవుతుంది. పీత ఎంత ఎక్కువ ఆహారం తింటే అంత వేగంగా ఎదుగుతుంది. అయితే.. పీతలు తన బరువులో 5 శాతానికి మించి ఆహారం తినవు. పీతలకు ఆహారాన్ని ఎలా బడితే అలా, చేతులు ఎలా ఉంటే అలా వేయకూడదు. చేపముక్కలను చేతితో తాకకుండా, శుభ్రంగా ఉన్న స్పూన్ లేదా పట్టకారుతో మాత్రమే బాక్సులో వేయాలి. వేసిన ఫీడ్‌ను గంట, రెండు గంటల్లో బయటికి తీసేయాలి. చేపముక్కలు కూడా జీవి కాబట్టి పీతలు తినగా మిగిలిన వేస్ట్ నీటిలో కలిసిపోయి అమ్మోనియం ఫార్మ్ అయ్యే అవకాశం ఉంటుంది.
బాక్సుల్లో పీతలు పెంచేటపుడు నిరంతరం నీరు సరఫరా చేసే హాఫ్ హెచ్‌పీ పంపులు చెడిపోకుండా జాగ్రత్త వహించాలి. పీతల డెక్కలు, కాళ్లు విరిగిపోకుండా చూసుకోవాలి. డెక్క గానీ, కాళ్లు కాని విరిగితే ఎగుమతికి పనికిరాదని గ్రహించాలి. పీతల డెక్కలు మన చేతి వేళ్లను రెండు ముక్కలుగా కట్ చేసేంత గట్టిగా ఉంటాయి. పీత డెక్కలను వెనకకు లేపలేవు కాబట్టి, పైన పెంకుపైన పట్టుకోవచ్చు.
గుల్లపీతలు, లేదా వాటర్ క్రాబ్స్‌ను బాక్సుల్లో పెట్టి, వాటి మాంసం పెరిగేలా చేస్తాం. గుల్లపీత సైజు, వయస్సు, దాని పరిస్థితిని 40 నుంచి 45 రోజుల్లో హార్వెస్ట్ చేయొచ్చని రామకృష్ణ తెలిపారు. 20 బాక్సుల సెటప్, మోటార్ల కోసం రూ.40 వేల వరకు ప్రాథమికంగా ఖర్చవుతుంది. అదనంగా ఖర్చు అయినా మరో నాలుగైదు వేలకు మించి అవదు. పీతలకు వేసే ఫీడ్ ఖర్చు నెలకు రెండు వేలు ఖర్చు వస్తుంది. గుల్లపీతలు కొనేందుకు దాని సైజు, ఏజ్‌ను బట్టి కిలోకు ఆరు నుంచి ఏడు వందల రూపాయలు అవుతుంది. పీతలకు 40 నుంచి 45 రోజుల పాటు ఫీడ్ వేయడానికి అన్నీ కలిపి మరో రూ.10 నుండి రూ.15 వేలు ఖర్చు వస్తుంది. వాటర్ మోటార్లు నిరంతరం నడుస్తూనే ఉండాలి కాబట్టి నెలకు రూ.2 వేలు అవుతుంది.
విత్తనం పెట్టినప్పటి నుంచి ఎక్స్‌పోర్ట్ క్వాలిటీగా పీతను పెంచితే కిలోకు రూ.2 నుంచి, రూ. 2,500 ధర పలుకుతుంది. కిలో పీతలను తీసుకొచ్చి, వాటి ఫీడ్, కరెంట్ ఇతర ఖర్చులన్నీ కలిపి అత్యధికంగా వెయ్యి రూపాయలు ఖర్చు చేసినా అవి తయారైన తర్వాత కనీసం వెయ్యి నుంచి రూ.1500 లాభం ఉంటుందని రామకృష్ణ వెల్లడించారు. పీతలను మార్కెట్ చేయడం ఎలా అనే సంశయాన్ని తీర్చారాయన. పీతలను పెద్దమొత్తంలో కొనేవారి గురించి తెలిస్తే చాలా ఈజీ అన్నారు. తమ వద్దకు వచ్చిన ఔత్సాహికులకు కొనేవారి గురించి స్పష్టంగా వివరిస్తున్నట్లు చెప్పారు. దాంతో పాటే ఒక్క పీతను కూడా కొనే వినియోగదారులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారన్నారు. పీతల సేల్ విషయంలో ఎలాంటి భయమూ, ఇబ్బంది ఉండదని తెలిపారు.
ఉత్సాహం ఉన్న వారు నలుగురైదుగురు కలిసి ఒకేసారి వస్తే.. ఏ సీడ్ ఎంచుకోవాలి? ఫీడ్ ఎలా ఇవ్వాలి? వాటర్ ఫిల్టరేషన్ విధానం, ఫిల్టరేషన్ సెటప్ ఎలా చేయాలి? నీటి సరఫరా సాంకేతికంగా ఎలా జరుగుతుంది? స్పష్టంగా అర్థమయ్యేలా వివరిస్తున్నామని రామకృష్ణ చెప్పారు. బాక్సుల్లో పీతల పెంపకంపై ఎలాంటి సమాచారం కావాలన్నా 9705500631 నెంబర్‌లో సంప్రదించవచ్చు.





















