కనకాంబరం పూలను దక్షిణ భారతదేశం, శ్రీలంక రైతులు ఎక్కువగా సాగుచేస్తారు. చాలా తేలికగా పూలు ఉండే కనకాంబరం మొక్కలు ఉష్ణమండల వాతావరణంలో బాగా పెరుగుతాయి. నారింజ, పసుపు, గులాబీ, తెలుపు రంగుల్లో లభించే కనకాంబరాలను మహిళలు మాలలుగా కట్టుకొని కేశాలంకరణలో విరివిగా వినియోగిస్తారు. పూజలలో కనకాంబరాల వాడుక ఎక్కువే. మాలలు, తోరణాలుగా కట్టి ఆలయాల అలంకరణలో వీటిని వాడతారు.

కనకాంబరాలు మిగతా పువ్వుల మాదిరిగా మొక్క నుంచి కోసిన ఒక్క రోజులోనే వాడిపోవు. నాలుగైదు రోజుల వరకు తాజాగా కనిపిస్తాయి. నిల్వ సామర్ధ్యం ఎక్కువ ఉండే కనకాంబరాలను దూర ప్రాంతాలకు రవాణా చేసేందుకు కూడా అనువైనవి. కనకాంబరాల మొక్కలకు సూర్యరశ్మి, నీరు తగినంత అవసరం అవుతుంది. వ్యవసాయ క్షేత్రాలలోనే కాకుండా కుండీలలో కూడా ఈ మొక్కలు చక్కగా పెరుగుతాయి. కనకాంబరం పూలకు మార్కెట్‌లో ఎప్పుడూ మంచి డిమాండ్‌ ఉంటుంది. వాతావరణ పరిస్థితులను తట్టుకొని కనకాంబరాల మొక్కలు పెరుతాయి. నిత్యం దిగుబడి ఇస్తాయి.మంచి డిమాండ్‌ ఉండే కనకాంబరాలను తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం, ముక్కామల రైతు కంటన సుబ్బారావు కొన్ని సంవత్సరాలుగా ఆర్గానిక్‌ విధానంలో పండిస్తున్నారు. ఎకరం కొబ్బరి తోటలో ఆయన అంతర పంటగా కనకాంబరాలు పండిస్తున్నారు. సహజసిద్ధమైన పశువుల ఎరువు, పురుగుల మందులు, నీటి సరఫరా కోసం, పూలు కోసే కూలీల ఖర్చు తప్ప ఆపైన ఒక్క రూపాయి కూడా తనకు ఖర్చు లేదని తెలిపారు. అందువల్ల ప్రతి నెలా కూలీల ఖర్చు రూ.25 వేలు తీసేసినా రూ.25 వేలు వరకూ నికర లాభం ఉంటోందని వెల్లడించారు.అంతకు ముందు పది సంవత్సరాలుగా ఆయన రసాయనాలు, ఎరువులతో కనకాంబరాలను సుబ్బారావు సాగుచేశారు. అయితే.. రెండేళ్లుగా ఆర్గానిక్‌ పద్ధతిలో కనకాంబరం మొక్కలను పెంచుతున్నారు. దీంతో తనకు దిగుబడి మరింతపెరిగిందని, మొక్కలు కూడా ఎక్కువ కాలం పూలు పూస్తున్నాయని సుబ్బారావు తెలిపారు.మొక్కలకు వాడే ఘన, ద్రవ జీవామృతాలను తానే స్వయంగా తమ వ్యవసాయ క్షేత్రంలోనే తయారు చేసి, వాడుతున్నట్లు చెప్పారు. ప్రకృతి విధానంలో తాను కనకాంబరాల సాగు చేయడం వల్ల నాణ్యమైన పువ్వులు వస్తున్నాయన్నారు. మొక్క నుంచి కోసిన తర్వాత రెండు రోజులు నిల్వ ఉన్నా కూడా నాణ్యతలో ఏమాత్రం తేడా ఉండడం లేదు.రసాయనాలతో చేసే కనకాంబరాల పంటకు వచ్చినట్లు ఎండు తెగులు ఈ ఆర్గానిక్‌ పద్ధతితో కనిపించడం లేదని సుబ్బారావు స్పష్టం చేశారు. రసాయనాలు వాడి చేసిన సాగు కన్నా ఆర్గానిక్‌ విధానంలో తనకు కనకాంబరాల దిగుబడి మరో ఏడాది పాటు వచ్చేలా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. పంట మార్పిడి కోసం అయితేనే ఆర్గానిక్‌ విధానంలో కనకాంబరం మొక్కలను తీసేయాలి కానీ, మొక్క చనిపోయే ప్రసక్తే లేదంటున్నారు.తమ కొబ్బరితోటలో ముందుగా 30 ట్రక్కుల ఘన జీవామృతం వేసి నేలను బాగా కలియదున్నించారు సుబ్బారావు. ఆ తర్వాత కనకాంబరం మొక్కలు నాటారు. ద్రవ జీవామృతాన్ని నేరుగా కనకాంబరం మొక్కల మొదళ్లకు అందించారు. తద్వారా మొక్కలకు అనేక పోషకాలు సమృద్ధిగా అందేలా చూశారు. మొక్కలను చీడ పీడలు ఆశించకుండా ముందు జాగ్రత్తగా మొక్కలపై వేప కషాయం పిచికారి చేయించారు.  దీనితో పాటు రెండు నెలలకు ఒకసారి ఇంగువ, మీనామృతం ద్రావణాన్ని మొక్కలకు అందించారు. పావు ఎకరంలోని మొక్కలకు 200 లీటర్ల ద్రవ జీవామృతం సరిపోతుందన్నారు. ఆవుపేడ, గోమూత్రం, బెల్లం, సెనగపిండి, నీటితో తయారుచేసిన ద్రవ జీవామృతాన్ని తాము తమ కనకాంబరం మొక్కలకు అందిస్తామని సుబ్బారావు తెలిపారు. ఆర్గానిక్‌ విధానంలో వీటిని ప్రకృతి నుంచి తయారు చేసుకోవడంతో చేతి నుంచి ఖర్చు ఉండదని చెప్పారు.కనకాంబరం మొక్కలు నాటిన నాలుగు నెలల నుంచి పూల దిగుబడి మొదలైనట్లు రైతు సుబ్బారావు చెప్పారు. తమ తోటలో వారానికి 20 నుంచి 25 కిలోల వరకు కనకాంబరాల దిగుబడి వస్తోందన్నారు. మార్కెట్‌లో తమ కనకాంబరాలకు ఒక్కోసారి వెయ్యి, మరోసారి రూ.1200 ధర వస్తోందని తెలిపారు. మార్కెట్‌లో ధరలు బాగా పడిపోయినప్పుడు కూడా తమ పూలకు సగటున రూ.600 పలుకుతుందన్నారు. సుబ్బారావు ఆర్గానిక్‌ కనకాంబరాల సాగులో లాభాల గురించి తెలుసుకున్న మరికొందరు రైతులు కూడా తన బాటలో నడిచేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని ఆయన తెలిపారు.