వైట్‌ పిగ్మీ బాంటమ్‌ గోట్‌.. తెల్లగా.. చూసేందుకు అందంగా కనిపించే ఈ మేకలు అడుగున్నర ఎత్తు వరకు మాత్రమే ఎదుగుతాయి. సహజసిద్ధంగా లభించే గడ్డి, ఆకులు చాలా తక్కువగా తింటాయి. అయితేనేం.. 40 కిలోల వరకు బరువు వస్తాయి. పుట్టిన మూడు నాలుగు నెలల నుంచే గర్భం ధరిస్తాయి. ఈతకు కనీసం రెండు పిల్లలు పెడతాయి. ఒకసారి పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత మళ్లీ 40 రోజుల్లోనే గర్భం ధరిస్తాయి. గర్భం ధరించిన ఐదు నెలల్లో పిల్లలకు జన్మనిస్తాయి. ఏడాదిలో మూడుసార్లు గర్భం దాలుస్తాయి. ఇలా ఏదాడికి ఆరు నుంచి 8 పిల్లలకు జన్మనిస్తాయి.

మామూలు పశువులతో పాటుగానే వైట్ పిగ్మీ బాంటమ్‌ మేకలను పెంచుకోవచ్చు. ప్రత్యేకంగా ఎలాంటి నిర్వహణ ఖర్చు ఉండదు. వర్షం చుక్క మీద పడక ముందే ఇవి షెడ్‌లోకి పారిపోతాయి. వర్షం మీద పడితే వీటికి జ్వరం వస్తుంది. అప్పుడు పారాసిటమాల్‌ మందు వేస్తే సరిపోతుంది. క్రమం తప్పకుండా డీవార్మింగ్‌ చేస్తే సరిపోతుంది. వీటి కోసం ప్రత్యేకంగా ఆహారం ఏదీ ఇవ్వక్కరలేదు. పగటిపూట ఆరు బయట చక్కగా తిరిగి పచ్చిగడ్డి, ఆకులు తింటాయి. చాలా పొట్టిగా ఉన్నప్పటికీ పిగ్మీ బాంటమ్‌ మేకలకు ప్రసవ సమయంలో ఎలాంటి ఇబ్బందులూ రావు. తిరుగుతూ తిరుగుతూనే పిల్లలను ప్రసవిస్తాయి.ఈ రకం మేకలు యజమాని భూమి సరిహద్దుల్లోనే తిరుగుతాయి. తప్పించుకుని వెళ్లిపోయే తత్వం వీటికి ఉండదు. మన ఇంటిలో పెంపుడు జంతువుల మాదిరిగానే ఇవి కూడా పెరుగుతాయి. ఒక్కో మేక లీటర్‌ వరకు పాలు ఇస్తాయి. అయితే.. వాటి పిల్లలకే ఆ పాలు సరిపోతాయి.వీటి మాంసానికి ఇతర మేక మాంసం ధర వస్తుంది. 40 కిలోల బరువున్న పొట్టి మేకకు రూ.18 నుంచి 20 వేలు ధర వస్తుంది. పెద్ద వాటి కన్నా మూడు నెలల పిల్లలను అమ్మితే ఒక్కొక్క దానికి సుమారు రూ.7 నుండి 10 వేలు వస్తుంది. అందుకే పిగ్మీ మేకలను పిల్లలుగా అమ్మితేనే మరింత ఎక్కువ లాభం అంటారు కర్ణాటక రాష్ట్రం చిక్కబళ్లాపూర్‌ జిల్లా గొడ్డవల్లహళ్లికి చెందిన ఔత్సాహికుడు ఇనయతుల్లా ఖాన్‌. పిగ్మీరకం పొట్టి మేకలను ఆయన హాబీగా పెంచుతున్నారు. బెంగళూరులో ఒక రైతు పెంచుతుంటే తాను ఒక ఆడ, ఒక మగ పిగ్మీ మేకపిల్లలను తెచ్చుకున్నట్లు చెప్పారు. ఒక మగ, నాలుగు ఆడ పిగ్మీ మేకలు ఉంటే ఏడాదిలో వాటి సంతతి 30 నుంచి 40 వరకు పెరుగుతుంది.పిగ్మీ బాంటమ్‌ మేకల జీవిత కాలం 8 నుంచి 10 సంవత్సరాలు ఉంటుంది. తక్కువ ఎత్తుతో.. చూసేందుకు అందంగా కనిపిస్తాయి ఈ మేకలు. ఇవి మొండిజాతివి. రోగాలు చాలా తక్కువగా వస్తాయి. ఖర్చు తక్కువ, మెయింటెనెన్స్‌ పెద్దగా ఉండదు. ఆరోగ్యంగా ఉంటాయి. తక్కువ సమయంలోనే పునరుత్పత్తి చేసే పిగ్మీ బాంటమ్‌ మేకలతో అధిక లాభం వస్తుందని ఇనయతుల్లా ఖాన్ చెప్పారు. పిగ్మీ బాంటమ్‌ పిల్ల మేకలకు మంచి డిమాండ్‌ ఉందన్నారు. వైట్ పిగ్మీ బాంటమ్‌ మేకలను పెంచుకుంటే.. రైతులకు ఆదాయం చాలా త్వరగా చేతికి వస్తుందన్నారు ఖాన్‌.

ఇంకా వివరాలు కావాలంటే.. ఇనయతుల్లా ఖాన్‌: 9448237349లో సంప్రదించవచ్చు.