మనసు ఉంటే మార్గం అదే దొరుకుతుంది అంటారు పెద్దలు. కొద్దిగా శ్రమ. మరికొంత ఓపిక. వాటికి మించిన ఇష్టం ఉంటే ఏ చిన్న అవకాశాన్నయినా అనుకూలంగా మార్చేసుకోవచ్చు. మన మనసుకు నచ్చిన, ఆనందాన్ని ఇచ్చే, ఆహ్లాదం కలిగించే పనులు ఎన్నో చేసుకోవచ్చు. ఇలాంటి లక్షణాలు ఉంటే చిన్న పాటి మిద్దెపైన కూడా ఎన్నో రకాల పూలు, పండ్లు, కాయగూరలు, కాయలు, ఆకుకూరలు పండించుకోవచ్చు. అది కూడా మనకు ఆరోగ్యాన్నిచ్చే ఆర్గానిక్ విధానంలో మనకు కావాల్సిన పంటలు పండించుకుంటే వచ్చే ఆ కిక్కే వేరప్పా!
ఇలా శ్రమ, ఓపిక, ఇష్టం నింపుకున్న గృహిణి పినాక పద్మ, ఆమె శ్రీవారు శ్రీనివాస్‌లు తమ మిద్దెపై అనేక రకాల ఆర్గానిక్ పంటలు పండిస్తున్నారు. హైదరాబాద్ మహానగరం దీప్తిశ్రీనగర్‌లో వారు తమ 200 గజాల స్థలంలోని చిన్న ఇంటి మిద్దెపై వందల మొక్కలు, చెట్లు పెంచుతున్నారు. వీటిలో పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, పూల మొక్కలే కాకుండా నగర జీవనంలోని యువత ముఖ్యంగా విద్యార్థులకు ఏ మాత్రం అవగాహన ఉండని జువ్వి, రావి, మర్రి చెట్లను, కొన్ని బోన్సాయ్ చెట్లను కూడా పెంచుతున్నారు. పలువురు విద్యార్థులకు వాటిపై అవగాహన కల్పిస్తున్నారు. ఎంతో మందికి మిద్దెతోటపై ప్రేరణగా నిలుస్తున్నారు.
గుత్తులు గుత్తులుగా ఘాటైన మిరియాలు, తలపై జుట్టు మురికి, జిడ్డును వదిలించే సీకాకాయి, ఒక వరస అంతా అందంగా కనిపించేందుకు నేచురల్ కలర్స్‌లో ఉండే రంగు రంగుల పూలమొక్కలు, వేసవిలో మాత్రమే పూసే, నిండుగా తేనెటీగలను ఆకర్షించే ప్రైడ్ ఆఫ్ ఇండియా పూలమొక్కలు, గులాబీ, మందారం మొక్కలు, బంతి, సంపెంగ, కనకాంబరం, కాగడా, సన్‌డ్రాప్ పూలమొక్కలు, మల్లె మొక్కలు, ఎడినియమ్ పూలు,పెద్ద ఉసిరి, ఖర్జూర మొక్కలు పెంచుతున్నారు.
విరగ కాసే టేబుల్ నిమ్మ, వరిగేటెడ్ నిమ్మ, గుత్తులు గుత్తులుగా కాసే స్వీట్ నిమ్మ, కొంచె పెద్దగా ఉండే థాయ్ నిమ్మ, జామ, పంపర పనస, ఎర్రరంగులో ఉండే లలిత్‌జామ, యాపిల్, కొండ మామిడి, గ్రీన్, రెడ్ మల్బరీ, బ్లాక్‌బెర్రీ, పైనాపిల్, రేగు, నారింజ, బత్తాయి, అరటి, కొబ్బరి, రామాఫలం, సీతాఫలం, లక్ష్మణఫలం, హనుమాన్ ఫలం, నల్ల ద్రాక్ష, దానిమ్మ, సీమచింత, నేరేడు, తెల్లనేరేడు, చింతచెట్టు, స్ట్రాబెర్రీ, అంజీర, వెలగ, పనస, కమలా, పులుపు, తీపి రుచుల్లో ఉండే స్టార్ ఫ్రూట్ మొక్కలు, మిరకిల్ ఫ్రూట్ (ఇది తిన్న తర్వాత 4 గంటల వరకు మనం ఏది తిన్నా తియ్యగానే ఉంటుంది) మొక్కలు పెంచుతున్నారు.
కాఫీ, సువాసనగా ఉండే ధవనం, చిలగడదుంప, ముల్లంగి, పొట్ల, టమాటా, చెర్రీ టమాట, చిక్కుడు, కుదురుచిక్కుడు, చిన్న కాకర, దొండ లాంటి తీగజాతి మొక్కలు, మునగ, వంగ, పచ్చిమిర్చి, కరివేపాకు, బ్రెజిల్ కరివేపాకు, వాక్కాయ, దాల్చినచెక్క, బఠాణి, 20 ఏళ్ల వయస్సున్న బోన్సాయ్ జువ్విచెట్టు, మర్రిచెట్టు లాంటి ఎన్నో మొక్కలతో తమ మిద్దెతోటను ఆమె నింపేశారు. నల్లేరు, బిల్వ మొక్కలు పెంచుతున్నారు. వాకింగ్‌కు వెళ్లినప్పుడల్లా నర్సరీలలో కనిపించే కొత్త కొత్త మొక్కలు తెచ్చి, నాలుగేళ్లలో ఆమె తమ మిద్దెతోటలో పెంచుతున్నారు.
కోడిగుడ్లు, వంటనూనెల ద్రావణం వాడుతున్న పద్మ తక్కువ స్థలంలోనే ఎక్కువ దిగుబడులు సాధిస్తున్నారు. 30 శాతం ఎర్రమట్టి, 30 శాతం కోకోపిట్ లేదా వరిపొట్టు, 30 శాతం పశువుల ఎరువు, 10 శాతం వేపపిండి కలిపి వేసిన ప్లాస్టిక్ టబ్బులు, గ్రోబ్యాగ్‌లలో ఆమె మొక్కలు పెంచుతారు. పురుగుల నివారణ కోసం పుల్లటి మజ్జిగను పిచికారి చేస్తారు. నిజానికి కోడిగుడ్డు, వంటనూనెలు, అలోవీర జెల్ కలిపిన ద్రావణం పిచికారి చేస్తే క్రిమి కీటకాల బెడదే ఉండదంటారామె. కోడిగుడ్లు వాడేందుకు ఇష్టపడని వారు అలోవీర, సెనగపిండి, కుంకుడుకాయ రసం కలిపిన ద్రావణం పిచికారి చేయవచ్చు.
ఇనుప స్టాండ్‌లు చేయించి, ఒక్కో దానిలో ఒక్కో ప్లాస్టిక్ టబ్ పెట్టి, వాటిలో మట్టి, కోకోపిట్, పశువుల ఎరువు, వేపపిండి కలిపి వేస్తారు. ఆ టబ్‌లో మరో చిన్న టబ్ గానీ, లేదా గ్రోబ్యాగ్ గానీ పెట్టి వాటిలో కూడా మట్టి, కోకోపిట్ తదితర మిశ్రమం వేసి మొక్కలు నాటుతారు. పెద్ద టబ్‌లో చిన్న టబ్ పెట్టి మొక్కలు పెంచడం వల్ల పెద్ద టబ్‌లోని వానపాములకు చక్కని నీడ ఉంటుంది. మల్చింగ్‌లా పనిచేస్తుందన్నారు. చిన్న టబ్‌లోని మొక్కల వేర్లు పెద్ద టబ్‌లోకి కూడా పెరిగి మరింత ఏపుగా మొక్కలు ఎదుగుతాయి. ఇనుప స్టాండ్‌లో టబ్‌లు పెట్టడం వల్ల వాటినిలో నీరు మిద్దెపై పడి పాడవకుండా ఉంటుందన్నారు. ఒక వేళ నీళ్లు పడినా చీపురుతో తుడుచుకునే వీలు ఉంటుంది. అలాగే తేలికైన మిశ్రమం వల్ల మిద్దెపై బరువు ఉండదన్నారు.
కుండీల్లో పెంచే మొక్కలకు ఎక్కువ నీరు ఇస్తే.. కుళ్లిపోయి చనిపోతాయని పద్మ చెప్పారు. మొక్కల మొదళ్లలోని మట్టిని అప్పుడప్పుడూ ఎండనివ్వాలి. పెద్ద కుండీలలో మొక్కలు పెంచితే నీళ్లు ఎక్కువై అవి చనిపోయే ప్రమాదం ఉంటుంది. మిద్దెతోటలో పండు ఈగల బెడద లేకుండా ఉండేందుకు తప్పకుండా ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్, రెక్కల పురుగులు లాంటి వాటిని ఆకర్షించే లింగాకార బుట్టలు పెట్టాలని పద్మ తెలిపారు. టెర్రస్ గోడపైన, ఇంటి చుట్టూ నేలపైన కూడా అనేక రకాల మొక్కలు, చెట్లను పెంచుతున్నారు. ఐదారు ఏళ్లుగా పద్మ తమ ఇంటిని, పరిసరాలను ఓ చిన్న అడవిలా మార్చేశారు. ‘పట్నంలో పల్లెటూరు’ పేరిట పద్మ యూట్యూబ్ చానల్ బాగా ప్రాచుర్యం పొందింది.





















