ఈ సంవత్సరం వర్షాకాలంలో నేరేడు చెట్లు విపరీతంగా కాయలు కాశాయి. నేరేడు పండ్లు కూడా మార్కెట్ల నిండా సమృద్ధిగా లభించాయి. వేలాది మంది ప్రజలు ఈ సారి నేరేడుపండ్లను భారీ మొత్తంలో వినియోగించి, ఆనందించారు. అయితే.. త్వరలో వర్షాభావ పరిస్థితులు ఎదురవుతాయని సూచించేందుకే నేరేడుచెట్లు అలా ఎక్కువగా పండ్లు కాస్తాయని వ్యవసాయ నిపుణులు అంచనా వేశారు. ఆ అంచనాతోనే వారు వర్షాభావ పరిస్థితులు పొంచి ఉన్నాయని, వాతావరణంలో నీరు తగ్గిపోతుందని హెచ్చరించారు. కానీ.. వర్షాలు తక్కువ కురవడానికి, నీరు తగ్గిపోవడానికి నేరేడు చెట్లు అత్యధికంగా పండ్లు కాయడానికి లింకేంటి? అంటే.. వర్షాలు కురవని పరిస్థితి తలెత్తే సమస్య వస్తున్నప్పుడు తమ సంతాన వృద్ధి కోసమే నేరేడు చెట్లు విపరీతంగా కాయలు, పండ్లు కాస్తాయనేది ఒక విశ్లేషణ.
ప్రకృతిలో మనకు తెలియని వింతలు, వింతైన అద్భుతాలు ఎన్నో దాగి ఉన్నాయి. ఒక మొక్కకు పదులు, వందల సంఖ్యలో పూలు పూయడం మనం చూస్తుంటాం. కానీ, అసలు ఆకులే లేని ఒక చిన్న తీగమొక్కకు ఒకేసారి 3 నుంచి 4 వేల వరకు పూస్తే ఎలా ఉంటుంది? వినడానికే ఇది ఆశ్చర్యంగా ఉంది కదా! ఇలాంటి వింత ఎక్కడో కాదు.. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో జరిగింది. ఆ తీగమొక్క విపరీతంగా పూసిన పూలను చూసి విద్యార్థులు, వ్యవసాయశాస్త్ర ప్రొఫెసర్లు ఆశ్చర్యపోయారు. వర్షాభావ పరిస్థితులు వచ్చే అవకాశం ఉన్నప్పుడు, నీరు సరిగా లభించనప్పుడు సీరోపిజియా జెనియా మొక్క తన సంతాన వృద్ధి కోసం ఇలా భారీసంఖ్యలో పూలు పూసి, కాయలు కాస్తుందని మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలోని డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు డిగ్రీ అండ్ పీజీ కాలేజి ప్రొఫెసర్ బి.సదాశివయ్య తెలిపారు.
జడ్చర్లలోని డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ, పీజీ కాలేజీ బొటానికల్ గార్డెన్ సుమారు 900 రకాల అరుదైన మొక్కలను సంరక్షిస్తున్నారు. అలాంటి వాటిలో ఒక మొక్కే సీరోపిజియా జెనియా. దాదాపు ఐదు ఎకరాల్లో ఈ తెలంగాణ బొటానికల్ గార్డెన్ నిర్వహిస్తున్నారు. ఆ కాలేజీ బోటనీ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ బి. సదాశివయ్య, ఆయన విద్యార్థులు గత సంవత్సరం మహబూబ్నగర్ శివారులోని ముళ్ల పొదలో పెరుగుతున్న తీగమొక్క నుంచి అర అడుగు పొడవు సేకరించారు. ఆ తీగ మొక్కను పల్లెటూళ్లలో ‘ముళ్లగడ’, అని ‘లంగటాయి’, లేద ‘పుల్లకాడ’ అని పిలుస్తారు. దాన్ని కాలేజీలోని క్యాక్టస్ హౌస్లో నాటారు. దాన్ని ప్రత్యేకమైన శ్రద్ధతో పెంచారు.
ఈ సీరోపిజియా జెనియా తీగ మొక్కను క్యాక్టస్ హౌస్లో ఎంతో వేగంగా పెరిగింది. కొంతకాలానికి మొక్కపై ఆకులు ఇంచుమించుగా కనుమరుగయ్యాయి. దాని కాడలు, వేలాది పూలతో నిండిపోయింది. ఈ వింతను చూసి వృక్షశాస్త్ర నిపుణులు కూడా ఆశ్చర్యపోయారు. ఈ మొక్క ఇన్ని వేల పూలు పూయడం వెనక అద్భుతమైన వృక్షశాస్త్ర రహస్యం ఉంది. ఇది అన్ని వేల పూలు ఒకేసారి పూయడానికి ప్రధాన కారణాల గురించి చూద్దాం..
సీరోపిజియా జెనియా మొక్కను కాలేజీ బొటానికల్ గార్డెన్లో వారు సాధారణ మట్టిలో కాకుండా 3:1 నిష్పత్తిలో ఇసుక, ఎర్రమట్టిని, కొంచెం కోకోపీట్ కలిపిన ప్రత్యేక మిశ్రమంలో నాటారు. దానికి వారు ప్రతిరోజూ నీళ్ళు పోయలేదు. ఈ మొక్కపై వర్షపు నీరు కూడా పడకుండా క్యాక్టస్ హౌస్లో జాగ్రత్తగా పెంచారు. 15 రోజులకు ఒకసారి మాత్రమే నీరందించారు. అదే ఈ మొక్క అసాధారణంగా పూలు పూయడానికి ప్రధాన కారణం అంటారు ప్రొఫెసర్ సదాశివయ్య. మట్టిలో పోషకాలు, నైట్రోజన్ శాతం తగ్గి, నీటి ఒత్తిడి ఏర్పడినప్పుడు మొక్కకు ‘చనిపోతానేమో’ అనే భయం కలుగుతుందని వ్యవసాయ నిపుణులు తెలిపారు. దీంతో తన జాతి అంతరించిపోకుండా కాపాడుకునేందుకు పచ్చని ఆకులను పెంచదని, సంతానోత్పత్తి అంటే విత్తనాల వృద్ధి కోసం ఒకే కాలంలో వేలాది పూలు పూస్తుందని విశ్లేషించారు.
నిజానికి ఈ ‘ముళ్ళగడ’ తీగ కేవలం పూలతీగ మాత్రమే కాదు, ఇది మంచి ఆయుర్వేద మూలిక. సీరోపిజియా జెనియా కాడలతో డికాక్షన్ తయారుచేసి, తాగితే జీర్ణ సంబంధ వ్యాధులు, కడుపులో మంట, అల్సర్లు తగ్గుతాయని వైద్యులు చెబుతారు. ఈ మొక్క వేర్లకు ఉండే దుంపలను కొన్ని గిరిజన ప్రాంతాల వారు ఆహారంగా తీసుకుంటారు. వేద కాలం నుంచి కూడా సీరోపిజియా జెనియాను ఔషధాలలో వాడుతున్నట్టు పరిశోధనలు, ఉదాహరణల ద్వారా తెలుస్తోంది.
ఈ మొక్క దక్షిణ భారతదేశంలో, శ్రీలంక, బర్మా దేశాల్లో తప్ప ప్రపంచంలో ఇంక ఎక్కడా దొరకదని ప్రొఫెసర్ సదాశివయ్య వెల్లడించారు. సీరోపిజియా జెనియా పుష్పాలేవీ తమ గార్డెన్లో ఫ్రూటింగ్కు రావడం లేదన్నారు. దీనికి కారణం క్యాక్టస్ హౌస్ లాంటి క్లోజ్డ్ కండిషన్లో పెంచడమే అన్నారు. క్లోజ్డ్ కండిషన్లోకి మొక్కలకు పరపరాగ సంపర్కం చేయించే కీటకాలు రాలేవు. ఇప్పుడు ఈ మొక్కను బహిరంగ ప్రదేశంలో పెంచాలని నిర్ణయించినట్లు చెప్పారు.
ఈ ఆధునిక కాలంలో జనాభా ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయి పట్టణాలు, రియల్ ఎస్టేట్ విస్తరణ కారణంగా అడవులు, బంజరు భూములు తగ్గిపోయాయి. సీరోపిజియా జెనియా లాంటి అరుదైన ఔషధ మొక్కలు అంతరించిపోతున్నాయి. ఇలాంటి మొక్కలను రక్షించి, విస్తరించడానికి కాలేజీ అధ్యాపకులు, విద్యార్థులు ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు. ప్రకృతిని మనం సరిగ్గా గమనిస్తే అది మనకు ఎన్నో పాఠాలు నేర్పుతుంది. కష్టకాలం వచ్చినప్పుడు కుంగిపోకుండా, తన ఉనికిని కాపాడుకోవడానికి వేలాది పూలతో వికసించిన ఈ చిన్న తీగమొక్కే అందుకు నిదర్శనం.




















