నీలగిరి చెట్లను జామాయిల్ అని, ఇంగ్లీషులో యూకలిప్టస్ అని పిలుస్తారు. నీలగిరి చెట్టు గుజ్జును కాగితం తయారీలో వినియోగిస్తారు. ఇంధనంగా దీని కలప పనికి వస్తుంది. ఇంటి నిర్మాణంలో స్తంభాలుగా నీలగిరి చెట్లు ఉపయోగపడతాయి. నీలగిరి ఆకుల నుంచి తీసిన తైలంలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. నీలగిరి ఆకుల నూనెను కొవ్వును కరిగించేందుకు, కీళ్ల నొప్పుల నివారణకు వాడతారు. నీలగిరి ఆయిల్ నొప్పిని నివారిస్తుంది. చర్మ వ్యాధులు, శ్వాసకోశ సమస్యలు తగ్గించేందుకు వాడతారు. నీలగిరి ఆకులు క్రిమి సంహారిణిలుగా, సువాసన కోసం వినియోగిస్తారు. నీలగిరి చెట్లు గాలిని శుద్ధి చేసి, కాలుష్జాన్ని నియంత్రిస్తాయి. నీలగిరి ఆకులు, వేళ్లు, చెట్టు బెరడు ఆయుర్వేద మందులు తయారీలో ఉపయోగపడతాయి. సుగంధ ద్రవ్యాల తయారీలో వాడతారు. చల్లగా ఉండే నీలగిరి కొండల్లో పెరగడంతో వీటికి నీలగిరి చెట్లు అని పేరు వచ్చింది.
పంటలు పండించేందుకు పనికిరాని కొండలు, రాళ్లతో నిండిన నేలల్లో నీలగిరి చెట్లు సులువుగా, చాలా వేగంగా పెరుగుతాయి. ఒక్కో చెట్టు నిటారుగా దాదాపు 15 నుంచి 20 మీటర్ల ఎత్తు వరకు పెరిగిపోతుంది. నీలగిరి మొక్కల పెంపకానికి ఖర్చు, శ్రమ కూడా చాలా తక్కువ. ఎకరం భూమిలో 700 వరకు నీలగిరి మొక్కలు నాటుకోవచ్చు. వీటిని ఐదు నుంచి ఏడేళ్ల వయస్సు వచ్చే వరకు పెరగనిస్తే.. 2.800 టన్నుల వరకు కలప దిగుబడి వస్తుంది. టన్ను నీలగిరి కలపకు కనీసం రూ.450 చొప్పున ధర వచ్చినా రూ.12 లక్షల వరకు ఆదాయం వస్తుంది. నీలగిరి చెట్టును మొదట్లో కట్ చేస్తే.. దాన్నుంచి మళ్లీ చిగుర్లు వస్తాయి.
యూకలిప్టస్ మొక్కలు నర్సరీలలో రూ.7 లేదా రూ.8కి దొరుకుతాయి. ఎకరం నేలలో 700 మొక్కలు నాటుకుంటే ఐదు నుంచి ఆరు వేలు పెట్టుబడి అవుతుంది. మొక్కలు, నాటేందుకు కూలీలు, యంత్రాల ఖర్చులు ఐదారు ఏళ్లలో ఎకరానికి సుమారు రూ.25 అవుతాయని వ్యవసాయశాఖ నిపుణుల అంచనా. ఐదేరేళ్లకు కలపను అమ్మితే కనీసం రూ.10 నుంచి 12 లక్షల ఆదాయం వస్తుంది.
నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలోని వట్టిపల్లి రైతు వెంకటరెడ్డి ఐదున్నర ఎకరాల్లో జామాయిల్ తోట పెంచుతునున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ప్రాంతంలోని నర్సరీ నుంచి తాను జామాయిల్ మొక్కలు తెచ్చుకున్నట్లు చెప్పారు. ఒక్కొక్క మొక్క ఖరీదుకు, రవాణాకు రూ.6.50 నర్సరీవారు తీసుకున్నారన్నారు. మొత్తం 8,500 మొక్కలు నాటినట్లు చెప్పారు. మొక్కలు నాటుతున్న సమయంలో నీటి సరఫరా కోసం డ్రిప్ ద్వారా నీటిని అందించినట్లు తెలిపారు. సాళ్ల మధ్య బోదెలలో నీళ్లు నిల్వ ఉండేలా చూడాలన్నారు. నీరు ఎంతగా తీసుకుంటే అంత త్వరగా నీలగిరి మొక్కలు పెరుగుతాయన్నారు. నీలగిరి మొక్కలు నెలకు ఒక అడుగు చొప్పున ఎదుగుతాయి. తాను నాటిన మొక్కలు మాత్రం రెండున్నర నెలల్లోనే మూడు అడుగులు పెరిగాయని వెంకటరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. నీలగిరి మొక్కలకు అన్ని ఖర్చులతో కలిపి పెట్టిన పెట్టుబడికి లాభమే గానీ నష్టం రాదని చెప్పారు.
భూమిని దున్నిన తర్వాత నీలగిరి మొక్కలను సాళ్ల మధ్య 9 అడుగుల దూరంలో నాటినట్లు చెప్పారు. మొక్కకు మొక్కకు మధ్య 4 అడుగుల దూరం ఉంచామన్నారు. దీంతో ఎకరంలో 1250 మొక్కలు నాటినట్లు తెలిపారు. నిజానికి నీలగిరి మొక్కలు నాటేందుకు భూమిని దున్నాల్సిన పనిలేదు. ఆపైన ఖర్చు కూడా ఎక్కువ పెట్టొద్దని నర్సరీ నిర్వాహకులు తెలిపారన్నారు. అయితే.. అప్పటికే తాను దుక్కి దున్ని కల్టివేటర్‌కూడా కొట్టించి, డ్రిప్ వేసేశానన్నారు. ఈ మొత్తం ఖర్చులన్నీ కలిపి తనకు ఒక్కో మొక్కకు రూ.10 అయిందన్నారు. నీరిగిరి మొక్కల్లో కమాండర్ రకాన్ని నాటిన ఏడాది పాటు జాగ్రత్తగా కాపాడితే.. ఆ తర్వాత దాన్ని చూసే పని ఉండదని కృష్ణాజిల్లా పెడన మండలం వల్లిపర్రు రైతు సమ్మెట సత్యనారాయణ వెల్లడించారు.
కొన్ని నీలగిరి మొక్కలు ఎండిపోతుంటే.. 14:35:14 ఎరువు మూడు బస్తాలు. 40 కిలోల బకెట్ల గుళికలు కలిపి ఒక్కో మొక్కకు కొద్దికొద్దిగా వేసినట్లు వెంకటరెడ్డి చెప్పారు. ఎరువు, గుళికలను మొక్కల మొదళ్లకు కాస్త దూరంగా గాడి తవ్వి వేయాలన్నారు. మొదళ్లలో ఎరువు వేస్తే మొక్కలు చనిపోయాయని చెప్పారు. మొక్కలు నాటిన మూడేళ్లకు నీలగిరి చెట్లు కటింగ్‌కు వస్తాయని నర్సరీ నిర్వాహకులు తెలిపారన్నారు. నీలగిరి మొక్కల పెంపకానికి ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వదు. తక్కువ ఖర్చే అయినా రైతులు సొంతంగా చేయాల్సిందే. తొలిసారి నీలగిరి మొక్కలను కొట్టేసిన తర్వాత వాటి మొదళ్లలో మళ్లీ ఐదారు మొక్కలు వస్తాయని, మొదటి ఏడాది రెండు మూడింటినే ఉంచి మిగతా పిలకలను పీకేయాలి. మరో ఏడాదిన్నరకు రెండో క్రాప్ ద్వారా ఎకరానికి 20 నుంచి 25 టన్నుల పైనే దిగుబడి వస్తుంది.
యూకలిప్టస్ చెట్లు ఎదిగిన తర్వాత కంపెనీవారే వచ్చి, మిషన్‌తో కట్‌చేసి, చెట్టుకు ఉన్న బెరడు తీస్తారు. చెట్లు ఎన్ని టన్నులైతే వాటికి ధరకు రసీదు ఇస్తారు. బ్యాంకు పాస్‌బుక్, ఆధార్ కార్డు జిరాక్స్‌లో తీసుకెళ్లి నేరుగా ఖాతాలోకి డబ్బులు వేస్తారు. ఉత్సాహం ఉన్న రైతులు ఎవరికైనా జామాయిల్ తోట పెంపకంపై అవగాహన కల్పిస్తానని, తమ క్షేత్రానికి తీసుకొచ్చి ప్రత్యక్షంగా చూపిస్తానని వెంకటరెడ్డి హామీ ఇచ్చారు.





















