చిరు ధాన్యాలుగా పిలుచుకునే కొర్రలు లేదా ఫాక్స్‌టెయిల్‌ మిల్లెట్స్‌ అన్నంను మన పూర్వీకులు ఆరోగ్య ఆహారంగా తీసుకునే వారు. పలు పోషకాలతో నిండి ఉండి, తేలికగా జీర్ణం అయ్యే ఆహారం కొర్రలలో లభించే పోషకాలు రోగనిరోధకశక్తిని పెంచుతాయి. గుండె జబ్బుల ప్రమాదం తగ్గిస్తాయి. కొర్రలలో ఎక్కువగా ఉండే పీచుపదార్థం జీర్ణ వ్యవస్థను చక్కదిద్దుతుంది. మలబద్ధకం, గ్యాస్‌ ట్రబుల్‌, అజీర్తి లాంటి సమస్యలు రాకుండా చేస్తుంది. బరువును తగ్గించడంలో బాగా పనిచేస్తుంది.

కొర్రలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి హాని కలిగించే ఫ్రీరాడికల్స్‌ నుంచి కాపాడి ఆరోగ్యంగా ఉంచుతాయి. కొర్రలలో గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ చాలా తక్కువ. దీంతో మన రక్తంలోని సుగర్‌ లెవెల్స్‌ నియంత్రణలో ఉంటాయి. కొర్రలలో విటమిన్లు, మినరల్స్‌ బాగా ఉంటాయి. కొర్రలలో మాంసకృత్తులు, కాల్షియం, ఐరన్‌, మాంగనీస్, మెగ్నీషియం, ధైమిన్‌, రైబోఫ్లేవిన్‌లు అధికంగా ఉంటాయి.అనేక ఆరోగ్య ప్రయోజనాలను మనకు అందించే కొర్ర పొలానికి పురుగు మందులు వేసే అవసరం ఉండదు. పెట్టుబడి కూడా అంత ఎక్కువేం కాదు. దుక్కి దున్నేందుకు, విత్తనాలు నాటేందుకు దాదాపు రూ.2 వేలు అవుతుంది. విత్తనాలకు రూ.500 వరకు అవుతుంది. కలుపు తీసిన తర్వాత ఎకరానికి ఒక యూరియా బస్తా వేస్తే సరిపోతుంది. దీనికి రూ.300 అవుతుంది. కలుపు తీసేందుకు కూలీలకు వెయ్యి రూపాయల ఖర్చు ఉంటుంది. పంటను కోత కోసే యంత్రానికి దాదాపు రూ.2,500 అవుతుంది. ఖర్చు కాస్త అటూ ఇటూగా ఏడు ఎనిమిది వేలు అవుతుంది.ఎకరానికి 10 నుంచి 13 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. క్వింటాలు కొర్రలకు కనీసం రూ.2,500కు ధర తగ్గదు. డిమాండ్ బాగున్నప్పుడు రూ.3 వేలు వరకు పలుకుతుంది. తక్కువలో తక్కువగా చూసుకున్నా 10 క్వింటాళ్లే కొర్రల దిగుబడి వచ్చినా రూ.25 వేలు ఆదాయం ఉంటుంది. పెట్టు ఖర్చు తీసేస్తే రైతుకు కనీసం రూ.18 వేలు నికర లాభం ఉంటుంది.కొర్ర విత్తనాలు నాటినప్పటి నుంచి 80 రోజుల లోపు పంట చేతికి వస్తుందని కడప జిల్లా పెండ్లిమర్రి మండలం తిప్పిరెడ్డిపల్లెకు చెందిన రైతు వడ్డెమాని మనోహర్‌రెడ్డి చెప్పారు. తమ తండ్రి కాలం నుంచి సుమారు పది పన్నెండు సంవత్సరాలుగా ఆయనకు కొర్ర పంట సాగు అనుభవం ఉంది. భూమికి బాగా దుక్కి చేసి, ట్రాక్టర్‌కు సీడ్ డ్రిల్ వేసి దాని ద్వారా విత్తనాలను ఒకసారి నిలువుగా మరోసారి అడ్డంగా నాటుకుంటామని మనోహర్‌రెడ్డి తెలిపారు. ఇలా నాటుకుంటే ఎకరానికి సుమారు 8 కిలోల విత్తనాలు సరిపోతాయి. కొర్ర విత్తనాలను తామే తయారు చేసుకుంటామని, లేదా స్థానికంగా పండించే రైతుల వద్ద కూడా దొరుకుతాయన్నారు.అంతకు ముందు ప్రధాన పంటకు వేసిన ఎరువే కొర్ర పంట పెరిగేందుకు సరిపోతుంది. అయితే.. విత్తనాలు నాటిన పది నుంచి 15 రోజులలోపు పెరిగిన కలుపు మొక్కలు తీసేసి బస్తా యూరియా వేస్తే సరిపోతుందని మనోహర్‌రెడ్డి చెప్పారు. కొర్ర పంటకు తెగుళ్లు రావని, పురుగు మందులు వాడే పని లేదని అన్నారు.కొర్ర మొక్కలకు పది రోజులకు ఒకసారి నీరు సరఫరా చేస్తే సరిపోతుంది. వర్షాకాలంలో కొర్ర పంటకు ఇబ్బంది, ఎక్కువ కష్టం ఉంటుంది కాబట్టి చలి కాలంలోనే రైతులు కొర్ర విత్తనాలు నాటుకుంటారు. కొర్ర పంటను స్థానికంగా ఉండే వ్యాపారులే రైతుల వద్ద కొనుగోలు చేసి, పట్టణానికి తీసుకెళ్లి అమ్ముకుంటారని మనోహర్‌రెడ్డి చెప్పారు.ఆరోగ్యం పట్ల అవగాహన పెరిగిన ఈ కాలంలో ఉపాధ్యాయులు సహా ఉద్యోగులు సహా అనేక మంది కొర్రలను ఆహారంగా తీసుకుంటున్నారు. బండ లాగుడు పోటీలలో పాల్గొనే ఎద్దులకు కూడా కొర్రలను ఆహారం ఇస్తున్నారని మనోహర్‌రెడ్డి అన్నారు. దీంతో కొర్రలకు డిమాండ్‌ బాగా పెరిగింది. డిపార్ట్‌మెంటల్‌ స్టోర్స్‌లో కొర్రలు సహా చిరు ధాన్యాలకు ప్రత్యేకంగా ర్యాక్‌లు ఏర్పాటు చేసి అమ్ముతున్నారు.

కొర్ర సాగుకు సంబంధించి మరిన్ని వివరాలు కావాలంటే.. రైతు మనోహర్‌రెడ్డిని 9963116635 నెంబర్‌లో సంప్రదించవచ్చు.