పత్తి పంటను మన దేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర, పంజాబ్‌, రాజస్థాన్‌, తమిళనాడులోను, తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో కూడా పత్తిని రైతులు పండిస్తారు. వేడి వాతావరణంతో పాటు నల్ల బంకమట్టి నేలలో పత్తి బాగా పెరుగుతుంది. పత్తి సున్నితమైన ఫైబర్‌. పత్తితో మెత్తని, మన్నికైన వస్త్రాలు తయారుచేసే విధానం అత్యంత పురాతన కాలం నుంచీ ఉంది. పత్తి ఫ్యాబ్రిక్‌ అవశేషాలు సింధులోయ నాగరికతలో ఉన్నట్లు పరిశోధకులు కనుగొన్నారు.ప్రపంచం మొత్తంలో 2022లో పత్తి ఉత్పత్తి 69.7 మిలియన్ టన్నులుగా రికార్డు అయింది. అందులో 26 శాతం ఉత్పత్తితో చైనా ముందు ఉంద. ఆ తర్వాత 22 శాతంతో  భారతదేశం కూడా ప్రధాన పత్తి ఉత్పత్తిదారుగా నిలిచింది. పత్తి సాగు ద్వారా ప్రపంచంలో 100 మిలియన్ల చిన్నకారు రైతులకు, ఒక బిలియన్ ప్రజలకు జీవనోపాధి కల్పిస్తోంది. ఇంతటి ప్రాధాన్యం, చరిత్ర ఉన్న పంతి పంటకు గులాబీరంగు పురుగు అంటే బోల్‌ వార్మ్‌ బెడదతో రైతులు ఎక్కువగా పోరాటం చేయాల్సి వస్తోంది. పత్తి సాగులో బోల్‌ వార్మ్‌ బెడదను నివారించే పద్ధతులను తెలుసుకుందాం.రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రైతులు పత్తిని వర్షాధార పంటగా సాగుచేస్తున్నారు. రసం పీల్చే పురుగును రైతులు వివిధ సస్యరక్షణ చర్యల ద్వారా నివారించుకోగలుగుతున్నారు. అయితే.. గులాబీ రంగు పురుగు ప్రమాదాన్ని రైతులు అంత తేలికగా కనిపెట్టలేరు కాబట్టి దీనితో ఎక్కువ నష్టం జరిగే ప్రమాదం ఉంది. పత్తికాయ లోపల ఇది తిష్ట వేస్తుంది. కనుక బయటకు కనిపించదు. ముఖ్యంగా బీటీ పత్తిలో దీని బెడద ఏటేటా పెరుగుతోందని అధ్యయనాలు తేల్చాయి. రైతుల అనుభవం కూడా దీన్నే నిర్ధారిస్తోంది.పత్తికాయల నుంచి పత్తిని తీసేటప్పుడు మాత్రమే గులాబీరంగు పురుగు ఉన్నట్లు తెలుస్తుంది. పత్తిని కాయ నుంచి తీసినప్పుడు అది ఇరుక్కుపోయి ఉంటుంది. కాయ నుంచి పత్తి తేలికగా ఊడి రాదు. అప్పుడు పురుగు నివారణ చర్యలు రైతులు చేస్తారు. దీనివల్ల గులాబీ రంగు పురుగు పూర్తిగా నివారణ కాదని అనుభవం ఉన్న పత్తి రైతులు చెబుతున్నారు. పత్తిని తీసే సమయానికే గులాబీ రంగు పురుగు ఉధృతి బాగా పెరిగిపోయి, నష్టం కూడా అదే మోతాదులో ఉంటుంది కనుక దాన్ని ముందే కనిపెట్టాల్సి ఉంటుంది.గులాబీ రంగు పురుగులో రెక్కల పురుగు దశ, గుడ్డు దశ, లార్వా దశ, ప్యూపా దశలు ఉంటాయి. ఈ అన్ని దశల్లోనూ పత్తిరైతులు గులాబీ రంగు పురుగులను పూర్తిగా నిర్మూలించినప్పుడే పంట దిగుబడి సరిగ్గా వస్తుంది. మగ రెక్క పురుగుతో ఆడ రెక్కల పురుగు జతకట్టిన తర్వాత పత్తి లేత ఆకులు, పువ్వుల మొగ్గలు, లేత కాయల మీద దాదాపు 100 నుంచి 200 వరకు గుడ్లు పెడుతుంది. రెక్కల పురుగు దశ నాలుగు నుంచి 8 రోజులు ఉంటుంది. నాలుగైదు రోజుల తర్వాత గుడ్ల నుంచి లార్వా బయటకు వచ్చేస్తుంది. లార్వాలు పూమొగ్గలకు కంటికి కనిపించనంత చిన్న రంధ్రాలు చేసి, లోపలికి వెళ్తుంది. దాని జీవిత కాలం అంతా పత్తికాయ లోపలే తినేస్తూ ఉంటుంది. లార్వాలు ఆశించినప్పడు పత్తి పూమొగ్గలు సరిగా విచ్చుకోవు. అవి గులాబీ పువ్వుల మాదిరిగా మారిపోతాయి. అలాగే తయారైన పువ్వులను ఆశించిన లార్వాలు  పువ్వులోని పుప్పొడిని, అండాశయాలను తినేస్తాయి. దీంతో పూమొగ్గలు రాలిపోతాయి. పత్తి కాయల్లో ఉన్న గులాబీ రంగు పురుగు లార్వాలు కాయల్లోని గింజలను తింటాయి. దీంతో కాయ రాలిపోతుంది.లేదా కాయ పరిమాణం సరిగా పెరగదు. గులాబీ రంగు పురుగు వల్ల కాటన్ నాణ్యత, దిగుబడి తగ్గిపోతుంది. గులాబీ రంగు పురుగు లార్వా దశ 10 నుంచి 14 రోజులు ఉంటుంది. తర్వాత అది పత్తికాయ లోపలే ప్యూపాగా అభివృద్ధి చెందుతుంది. ప్యూపా గడువు 9 రోజులు ఉంటుంది. తొమ్మిది రోజుల తర్వాత అది రెక్కలపురుగా మారి పత్తి కాయ నుంచి బయటకు వస్తుంది. ఇలా గులాబీ రంగు పురుగు తన జీవిత చక్రాన్ని 25 నుంచి 30 రోజుల్లో పూర్తి చేసుకుంటుంది. దాని వల్ల పత్తి పంటకు కలిగే నష్టం అని వ్యవసాయ నిపుణులు వెల్లడించారు.పత్తి పంటలో గులాబీ రంగు పురుగులను గుర్తించేందుకు ముందుగా విత్తు నాటిన 45 రోజులకు ఎకరానికి నాలుగు లింగాకార బుట్టలు ఏర్పాటు చేసుకోవాలి. లింగాకార బుట్ట పైభాగంలోని మూతకు మధ్యలో గులాబీ రంగు పురుగుకు సంబంధించి ల్యూర్‌నో పెట్టాలి. ఈ ల్యూర్‌కు ఆడరెక్కల పురుగు వాసన ఉంటుంది. ఆ బుట్టలను పొలంలో గెడకు కట్టాలి. ల్యూర్ వాసనకు మగరెక్కల పురుగులు లింగాకార బుట్టలోకి వచ్చి దాంట్లోనే ఇరుక్కుపోతాయి. ఈ విధానం ద్వారా పత్తి పైరులో గులాబీ రంగు పురుగు ఉధృతి ఎంత ఉందో తెలుస్తుంది. దీన్ని బట్టి తగిన సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి. వ్యవసాయ అధికారులు, దగ్గరలో ఉన్న కృషి విజ్ఞాన కేంద్రాల్లో లేదా వ్యవసాయ శాస్త్రవేత్తల వద్ద ఈ బుట్ట ఒక్కొక్కటి రూ.50కే లభిస్తాయి. మరో విధానంలో కూడా గులాబీ రంగు పురుగును కనిపెట్టొచ్చు. పత్తిచేను నుంచి అక్కడక్కడా కొన్ని పత్తికాయలు తెంపి, వాటిని పగలగొట్టినప్పుడు కూడా వాటి ఉధృతిని గమనించవచ్చు. పది కాయలను ఇలా సేకరించి పగలగొట్టినప్పుడు ఒక్క కాయల పురుగు కనిపిస్తే, పంటకు 10 శాతం నష్టం వాటిల్లుతుందన శాస్త్రవేత్తలు చెబుతున్నారు.పత్తి కాయ లోపల నల్లగా తయారైన ఫంగస్‌ కారణంగా గులాబీ రంగు పురుగు తయారవుతుందని   పత్తి సాగులో అనుభవజ్ఞుడైన రైతు అమృతరావు దేశ్‌ముఖ్‌ తెలిపారు. అలాగే పత్తిపంటలో ఎక్కువగా కనిపించేదే కాయకుళ్లు అని, కుళ్లిన కాయలో పురుగు తయారవుతుందని అంటారాయన.పత్తికాయ లోపలకు గులాబీరంగు పురుగు వెళ్లిపోతే ఎన్ని మందులు కొట్టినా అది చావదు. అందుకే వాటిని రెక్కల పురుగు దశలో లేదా గుడ్డు దశలోనే నాశనం చేసుకోవాలి. సాధారణంగా అమావాస్య రోజు చిమ్మ చీకటి ఉన్నప్పుడు రెక్కల పురుగులు గుడ్లు పెడతాయి. అమావాస్య వెళ్లిన ఒకటి రెండు రోజుల్లోనే వాటి నివారణకు ప్రొఫెక్స్‌ సూపర్‌ లాంటి  పురుగు మందులు స్ప్రే చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. ఈ మందు స్ప్రే చేస్తే.. పత్తి ఆకులు కాస్త గట్టిగా మారతాయి కనుక రెక్కల పురుగులు ఆశించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అయితే.. పత్తిపంట కాలంలో ఒక్కసారి మాత్రమే ఈ మందు పిచికారి చేసుకోవాలి. అంతకంటే ఎక్కువ సార్లు స్ప్రే చేస్తే.. ఆకులు ఎక్కువగా ముదిరిపోయే అవకాశం ఉంటుందని నిపుణులు చెప్పారు. మరో మందు యాంప్లిగో, ఏఎస్‌ అగ్ని మందులతో కూడా రెక్కలపురుగులు, గుడ్లను నివారించవచ్చు. అగ్నిలో యాంప్లిగో కన్నా ఎక్కువ మోతాదు క్రిమి సంహారిణి ఉంటుంది. అందుకే ఈ మందు చల్లిన 20 రోజుల వరకు ఎలాంటి బెడద ఉండదు. లింగాకార బుట్టల్లో పడిన రెక్కల పురుగులు లేదా లార్వాదశలో పత్తికాయలకు 10 శాతం నష్టం కనిపించినా..  1500 పీపీఎం వేపనూనెను లీటర్ నీటిలో 5 మిల్లీలీటర్ల నూనెను కలిపి పిచికారి చేసినా పురుగులు రాకుండా నిర్మూలించవచ్చు. గుడ్లను కూడా వేపనూనె నివారిస్తుంది. రసం పీల్చే పురుగు కూడా వేపనూనెతో నివారణ అవుతుంది. పత్తి విత్తు నాటిన 45 నుంచి 120 ఫినాల్‌ పాస్ మందును లీటర్ నీటిలో 2 మిల్లీలీటర్లు కలిపి పిచికారి చేయాలి. లేదా క్లోరిపైరిఫాస్‌ 2.5 మిల్లీలీటర్లను లీటర్‌ నీటిలో కలిపి చల్లుకోవాలి. పంట మధ్య దశలో గులాబీరంగు పురుగుల ఉధృతి ఉంటే సింథటిక్‌ పయోతాట్స్‌ మందులు స్ప్రే చేయాలి.గులాబీరంగు పురుగు నివారణకు మరో పద్ధతిని రైతులు పాటించాలి. ప్రతి రెండేళ్లకు ఒకసారి తప్పనిసరిగా పంట మార్పిడి చేయాలని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.  పత్తి చేనులో తిరిగి గుడ్డిపూలను ఎప్పటికప్పుడు తెంపి, నాశనం చేయాలి. దాంతో పాటుగా మాస్‌ ట్రాపింగ్ ్అంటే ఎకరం పొలంలో లింగాకార బుట్టలను నాలుగు మాత్రమే కాకుంగా ఎనిమిది బుట్టలు పెట్టుకుంటే ఫలితం మరింత అధికంగా ఉంటుంది. మాస్ ట్రాపింగ్‌ ద్వారా మగరెక్క పురుగులు ఆడరెక్కల పురుగులతో సంయోగం చెందకుండా నివారించడం ద్వారా వాటి సంతానోత్పత్తిని నిరోధించవచ్చు. అలాగే పత్తి పంటను తీసుకున్న తర్వాత పొలంలో ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలను మేతకు వదిలాలి. అలా లార్వా దశలోనే గులాబీరంగు పురుగులను నివారించవచ్చు.

 

పత్తిమొక్కలు వేర్లతో సహా భూమిలో కలిసిపోయేలా రొటావేటర్‌తో దున్ని నీళ్లు పెడిగే లార్వా, ప్యూపా దశల్లోని పురుగులు చనిపోతాయి. ఆ తర్వాత పెసలు, మినుములు, తెల్ల నువ్వులు లేదా మొక్కజొన్న సాగు చేస్తే.. గులాబీరంగు పురుగులు అంతటితో నిర్మూలన అయిపోతాయి. అలాగే పత్తిపంటను 200 రోజులకు మించి ఉంచకూడదు. అలా చేస్తే.. గులాబీరంగు పురుగు దశలు మరింత ఎక్కువ అయిపోయి, రెండోసారి వేసే పత్తిపంటకు తొలిరోజుల్లోనే నష్టం ఎక్కువగా ఉంటుంది. పత్తిపైరు వేసుకునే భూమిని ఎండాకాలంలో బాగా లోతుగా దున్నితే భూమిలో ఉన్న పురుగులు బయటపడి ఎండకు చనిపోతాయి. లేదా పక్షులకు ఆహారం అవుతాయి. ఏదేమైనా గులాబీరంగు పురుగులు పత్తిపంటను ఆశించినప్పుడు దగ్గరలోని వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తలను సంపదించి, సరైన సస్యరక్షణ చర్యలు తీసుకుంటే లాభసాటిగా ఉంటుంది.