సహజ సిద్ధంగా పండిన పంటలను ఆహారంగా తీసుకోవడం ప్రారంభించిన ఆరు ఏడు నెలల తర్వాత అనారోగ్యానికి మందులు వాడే అవసరం ఉండదు. ప్రకృతి ఆహారంలోనే మెడిసిన్‌ ఉందని అర్థం అయిందని విజయనగరం జిల్లా బొబ్బలి మండలం కొత్తపెంట ఆదర్శ రైతు విశ్వనాథ్‌ అన్నారు. తమ తండ్రి రసాయనాలతో పండించిన ఆహారం తీసుకున్నంతకాలం ఎముకల నొప్పుల నుంచి ఉపశమనం కోసం మందులు వాడేవారన్నారు. తమ పొలంలో నేచురల్‌ విధానంలో పండించిన ఆహారం తీసుకోవడం ప్రారంభించిన తర్వాత ఆయనకు మందుల అవసరం రాలేదని సొంత అనుభవాన్ని వివరించారు.దేశవాళీ రకాల వరిపంటను సహజసిద్ధ విధానంలో పండిస్తే.. 20 నుంచి 25 బస్తాల ధాన్యం పండుతుందన్నారు. రసాయనాలతో పండించిన పంట మరింత ఎక్కువ వచ్చినా ఆరోగ్యానికి హాని చేస్తుందన్నారు రైతు విశ్వనాథ్‌. సుభాష్‌ పాలేకర్‌ చెప్పిన జీరో బేస్డ్‌ ఫార్మింగ్‌ వల్ల పంటల సాగుకు ఖర్చు చాలా తక్కువ కాబట్టి, తక్కువ దిగుబడి వచ్చినా ఖర్చులు పోగా ఎకరంలో 20 వేల రూపాయల వరకు మిగులుతుందని విశ్వనాథ్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. దేశవాళీ వరిపంట కోసిన తర్వాత తమ పొలంలో టమాటా, నువ్వులు పండిస్తామని చెప్పారు. ఆర్గానిక్‌ విధానంలోనే విశ్వనాథ్‌ చెరకు పండిస్తారు. ఏడాదికి ఒక్కసారే చెరకు దిగుబడి ఉంటుంది. అయినప్పటికీ పెట్టుబడి అంతా పోగా రూ.80 వేలు వరకు మిగులుతోంది. తమ పొలంలో పండించే పండ్లు, కూరగాయలు ఇంటి అవసరాలు, బంధువులు, స్నేహితులకు ఇవ్వగా మిగిలిన వాటిని అమ్మితే.. ఏడాది పొడవునా తమ పొలంలో పనిచేసే కూలీల ఖర్చులకు సరిపోతోందన్నారు.విశ్వనాథ్‌ పొలంలో మునగ, లక్ష్మణఫలం, సీతాఫలం, రెండు మూడు రకాల మామిడి, కొబ్బరి, జామ, పాల సపోటా లాంటి పంటలు పండిస్తున్నారు విశ్వనాథ్‌. సుభాష్‌ పాలేకర్‌ చెప్పినట్లు 30 ఏళ్ల వయసున్న కొబ్బరిచెట్టు నుంచి విత్తనాలు సేకరించి నాటినట్లు చెప్పారు. ఇలాంటి విత్తనం నుంచి ఎదిగిన కొబ్బరి చెట్లు అధిక దిగుబడి ఇస్తాయని పాలేకర్‌ చెప్పినట్లు చెప్పారన్నారు. ఒక దేశీ ఆవును కొని ప్రకృతి వ్యవసాయం ప్రారంభించినట్లు తెలిపారు. ప్రకృతి వ్యవసాయంలో భూమిని లోతుగా దున్నకూడదు. నాటు ఆవుపేడ, మూత్రంతో ఘనజీవామృతం తయారుచేసి ఎకరానికి 400 కిలోలు చల్లాలని, మల్చింగ్‌ కూడా చేయాలని, ఏక పంట కాకుండా బహుళ పంటలు వేయాలని సుభాష్‌ పాలేకర్ చెప్పారని తెలిపారు. ఈ నాలుగింటిని పాటిస్తే.. భూమి సారవంతం అవుతుందని, ఆరోగ్యాన్నిచ్చే పంటలు పండుతాయని చెప్పారన్నారు. ఇవన్నీ తాను పాటిస్తున్నట్లు తెలిపారు.తమ వ్యవసాయ క్షేత్రంలో విశ్వనాథ్‌ ఘన జీవామృతం, ద్రవ జీవామృతం మాత్రమే వాడతానన్నారు. భూమిలో సారం పెరగాలంటే ఈ రెండూ వినియోగిస్తే చాలని చెప్పారు. వీటి వల్ల నేలలో మైక్రో బ్యాక్టీరియా బాగా అభివృద్ధి చెందుతుందన్నారు. వాటితో పాటు వానపాములు కూడా అభివృద్ధి చెంది భూమినే అవి ఎరువుగా మార్చేస్తాయని చెప్పారు. జీవామృతం వరుసగా ఆరేళ్లు వాడిన నేల ఎరువుగా మారిపోతుందని పాలేకర్‌ చెప్పారని అన్నారు. ఆ తర్వాత భూమికి జీవామృతం కూడా వాడాల్సిన అవసరం ఉండదని ఆయన తెలిపారని విశ్వనాథ్‌ వెల్లడించారు. అలాంటి మార్పును తాను అనుభవంతో తెలుసుకున్నట్లు చెప్పారు. సహజసిద్ధంగా పండించే పంటలకు తెగుళ్లు సోకితే బ్రహ్మాస్త్రం, నీమాస్త్రం, అగ్ని అస్త్రం, బీజామృతం, దశపర్ణి కషాయం తయారుచేసి వాడతామని తెలిపారు. ఇలాంటి కీటక నాశనులు, వాటికి అవసరమైన పదార్థాలను విశ్వనాథ్ తమ పొలంలోని షెడ్డు గోడలపై రాసి పెట్టారు. ఏ అస్త్రానికి ఏమేమి ఏ మోతాదులో వాడాలో అక్కడ రాశారు. తానే మరిచిపోయినా లేదా ఇతర రైతులు చూసి తయారు చేసుకునేందుకు ఉపయోగం అవుతుందని అలా రాసినట్లు వెల్లడించారు.ఇంతకాలం ద్రవ జీవామృతాన్ని ప్లాస్టిక్‌ డ్రమ్ముల్లో కలుపుకోవడం చూశాం. కానీ విశ్వనాథ్‌ తయారు చేసే విధానం చూస్తే ఔరా అనపించక మానదు. తాను ఎకరం నేలలో చేసే సహజ వ్యవసాయంలో ఉపాధి హామీ పథకం కింద 40X80 అడుగుల పరిమాణం, ఆరు అడుగు లోతులో చెరువు తవ్వించారు. దీని కోసం నయాపైసా కూడా తనకు ఖర్చు కాలేదన్నారు. ప్రభుత్వమే చెరువు తవ్వించిందని చెప్పారు. సొంతభూమి ఉంటే ప్రభుత్వం ఉపాధి హామీ కూలీలతో తవ్విస్తుందన్నారు. ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్‌కు చెబితే చెరువు తవ్వించారన్నారు. దాంట్లో ఆవుపేడ, గోమూత్రం వేసి, చేపలు పెంచుతున్నారు. పేడ, మూత్రాన్ని మనం కలిపే పని ఉండదన్నారు. చేపలే తమ ఆహారం  కోసం వాటిని చెరువు నీటిలో కలుపుతాయని చెప్పారు. ఆవుపేడ, గోమూత్రం, చేపల వ్యర్థాలతో కలిసిన చెరువు నీటిని పంటపొలానికి పారిస్తానన్నారు. ఖమ్మం రైతు ఒకాయన ఈ సలహా ఇస్తే.. తాను పాటిస్తున్నానన్నారు.అలాగే 30X60 అడుగుల పరిమాణంలో 5 అడుగుల లోతుతో స్టోరేజ్‌ ట్యాంకును సిమెంట్‌తో విశ్వనాథ్‌ ఏర్పాటు చేశారు. దీనితో పైర్లకు నీటి సమస్య ఉండదన్నారు. ట్యాంకులో పెంచే చేపల ద్వారా సుమారు రూ.10 వేలు ఆదాయం వస్తున్నట్లు చెప్పారు. చేపలకు ఆహారంగా వేసే ఆవుపేడ, చేపల వ్యర్థాల ద్వారా కూడా పైర్లకు బలం వస్తుందన్నారు. ముందుగా ఒక ఎకరంతో ప్రకృతి వ్యవసాయం ప్రారంభించిన విశ్వనాథ్‌ క్రమేపీ 8 ఎకరాలకు పెంచుకున్నారు. ఆర్గానిక్‌ వ్యసాయం ప్రారంభించిన రైతుకు తొలి ఏడాది దిగుబడులు తగ్గుతాయి. ఆ తర్వాతి ఏడాది నుంచి పంటలు బాగా చేతికి వస్తాయన్నారు. ఎనిమిది ఏళ్లుగా తాను చేస్తున్న ప్రకృతి వ్యవసాయం ద్వారా ఆదాయం, ఆరోగ్యం, ఆనందం అన్నీ తమకు దక్కుతున్నాయని విశ్వనాథ్‌ సంతోషంగా చెప్పారు.

రైతునేస్తం సౌజన్యంతో…