ఫూల్‌ మఖానా గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకున్న వారికి గుండె సంబంధ వ్యాధులు దరి చేరవని ఆరోగ్య నిపుణులు చెబుతారు. తినేందుకు ఎంతో రుచిగా ఉండే మఖానా గింజల్లో పోషకాలు పుష్కలం. వీటిలోని కాల్షియం ఎముకలను బలంగా ఉంచుతుంది. మెగ్నీషియం కూడా ఫూల్‌ మఖానాలో అధికంగా ఉంటుంది. బ్లడ్‌ ప్రెషర్‌ నియంత్రణకు, గుండె ఆరోగ్యాన్ఇ కాపాడతాయి. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఫూల్‌ మఖానా గింజల్లో కేలరీలు తక్కువ. పీచుపదార్థం ఎక్కువ. ఇది జీర్ణక్రియకు తోడ్పడుతుంది. బరువు తగ్గించేందుకు ఉపయోగపతుంది. బ్లడ్ షుగర్‌ స్థాయిలను నియంత్రిస్తాయి కాబట్టి డయాబెటిస్‌ రోగులకు ఎంతో మేలు చేస్తాయి. చర్మ సౌందర్యాన్ని ఫూల్‌ మఖానా గింజలు కాపాడతాయి. అయితే.. వీటిని ఎక్కువగా ఆహారంలో తీసుకుంటే గ్యాస్‌, ఉబ్బరం లాంటి ఇబ్బందులు తలెత్తవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫూల్‌ మఖానాలో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు కూడా ఎక్కువే. ఫాస్పరస్‌ కూడా వీటిలో లభిస్తుంది.

ఫూల్‌ మఖానా అంటే తామర గింజలు. అంటే లోటస్ సీడ్స్‌ లేదా ఫాక్స్ నట్స్‌. ఇవి తెలుపు రంగుల్లో ఉంటాయి. ఎన్నో పోషక విలువలున్న ఫూల్‌ మఖానా సాగు గురించి చూద్దాం. రసాయన ఎరువులతో పండించిన పంటలే తింటున్న ఈ యాంత్రికమైన నగర, పట్టణ సమాజానికి తామరగింజల గురించి తెలియకపోవచ్చు. కానీ కొన్ని దశాబ్దాల క్రితం వరకు గ్రామాల్లో వీటి గురించి తెలియని, తినని వారు చాలా అరుదు అనే చెప్పాలి. అధిక ఆదాయం వచ్చే ఈ మఖానా సాగును ఉత్తర భారతదేశంలోని పలు చోట్ల ఎక్కువగా చేస్తున్నారు. నిస్సారంగా ఉండే నీటి చెరువులలో పెరిగే తామరమొక్కలు గడ్డిజాతికి చెందినవి. ప్రపంచ వ్యాప్తంగా దిగుబడి వచ్చే ఫూల్‌ మఖానాలో ఒక్క బీహార్‌ రాష్ట్రంలోనే 90% ఉంటుందంటే అతిశయోక్తి లేదు. పశ్చిమ బెంగాల్‌, అసోం, మణిపూర్‌లలో మఖానా సాగు కొద్ది మొత్తంలో జరుగుతోంది. చైనా, జపాన్‌, కొద్దిగా ఉత్తర అమెరికాలో మఖానా సాగు అవుతోంది.తామర విత్తనాలను రైతులు డిసెంబర్‌, జనవరి నెలల్లోనే చెరువుల్లో నాటుతారు. విత్తనాలు మొక్కలుగా పెరిగి, ఏప్రిల్‌ నెలలో పూలు పూస్తాయి. ఈ పూలు జులై నెలలో 20 నుంచి 48 గంటల పాటు నీటిపై తేలియాడుతూ ఉంటాయి. తర్వాత తామర పువ్వులు కాయలుగా మారుతూ నీటి లోపలికి వెళతాయి. అవి కుళ్లిపోవడానికి నెల నుంచి రెండు నెలల సమయం పడుతుంది. సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలలలో రైతులు తామర కాయలను హార్వెస్ట్‌ చేస్తారు. వాటిని ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల లోపు మాత్రమే కోసుకోవాల్సి ఉంటుంది. నీటి అడుగులో ఉండే తామర కాయలను సేకరించడం కాస్త కష్టమైన పని అనే చెప్పాలి. కాకపోతే.. ఒక అడుగు లోతు ఉన్న నీటిలో కూడా మఖానా సాగు చేయవచ్చు.ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూర్చే ఫూల్ మఖానా సాగును తెలంగాణలోని నల్గొండ జిల్లా ఉద్యానవనశాఖ, కలెక్టర్‌ తొలిసారి ప్రయోగాత్మకంగా పరిచయం చేశారు. కంపసాగర్‌ వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో ప్రయోగాత్మకంగా మఖాన పంట సాగును ప్రారంభించారు. మనిషికి ఎన్నో పోషకాలు అందించే మకానా గింజలకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ బాగా పెరుగుతోంది. దీంతో ఇప్పుడిప్పుడే ఫూల్ మఖానా పంట పట్ల తెలుగు రాష్ట్రాల రైతులు కూడా ఉత్సాహం చూపిస్తున్నారు. బీహార్‌లోని దర్భంగా క్షేత్రం నుంచి విత్తనాలను వారు తీసుకొచ్చారు. విత్తనాలు మొలకెత్తిన తర్వాత రెండు మూడు నెలలకు అంటే మొక్కలకు 3 ఆకులు వచ్చిన దశలో వాటిని కట్టంగూరులో 3 ఎకరాలు, నకిరేకల్‌లో 2 ఎకరాలు, కొండ మల్లేపల్లిలో మరో 4 ఎకరాల చెరువుల్లో నాటించారు. కొంచెం కష్టంతో కూడుకున్నదే అయినా వరిసాగుతో పోల్చుకుంటే.. మఖానాతో 10 రెట్లు ఆదాయం ఎక్కువ వస్తుందని అధికారులు తెలిపారు.ఎకరంలో 10 కిలోల విత్తనాలను చల్లి, నారు తయారు చేసుకోవాలి ఫూల్‌ మఖానా మొక్కలను ప్రధాన సాగు చెరువులలో 3 ఆకులు వచ్చిన దర్శలో నాటుకోవాలి. మొక్కకు మొక్కకు మధ్య మీటరు దూరం ఉండేలా నాటుకోవాలని నల్గొండ ఉద్యానవన శాఖ అధికారి అనంతరెడ్డి చెప్పారు. ఇలా ఒక ఎకరం విస్తీర్ణం ఉన్న చెరువులో అత్యధికంగా 4 వేల మఖానా మొక్కలు నాటుకోవచ్చన్నారు. ఫూల్ మఖానా విత్తనాలకు సూర్యరశ్మి తగలకుండా జాగ్రత్త తీసుకోవాలని అధికారి చెప్పారు. వాటిని చీకటిలో గానీ, నీటిలో గానీ భద్రపరచాలన్నారు. విత్తనం నాటిన తర్వాత నారు మడికి మూడు నెలలు, మొక్కలు ప్రధాన చెరువులో నాటిన తర్వాత 5 నెలలకు అంటే మొత్తం 8 నెలలకు మఖానా పంట దిగుబడి చేతికి వస్తుంది. తామర మొక్కలు నాటిన ఎకరం చెరువులో 50 కిలోల డీఏపీ, 20 కిలోల యూరియా, 25 కేజీల పొటాష్ వేసుకుంటే సరిపోతుందన్నారు. వాటితో పాటు 2 నుంచి 3 క్వింటాళ్ల పశువుల ఎరువు వేస్తే పంట మరింత నాణ్యతతో వస్తుందని తెలిపారు.ఇతర పంటలతో పోల్చుకుంటే ఫూల్‌ మఖానా మొక్కలకు చీడ పీడల బాధ అంతగా ఉండదు. దీనికి వచ్చే వీవిల్స్‌ లాంటి రెండు మూడు చీడపీడలకు వేపనూనె పిచికారి చేస్తే నివారణ అవుతాయి. మఖానా మొక్కలకు నీటి నిల్వ అత్యంత ప్రధానమైన విషయం. బురదలో పెరిగే మొక్క కాబట్టి అడుగు లోతుకన్నా తక్కువ నీరు ఉండకుండా రైతులు జాగ్రత వహించాలి. ఇలా జాగ్రత్తలు తీసుకుంటే ఒక్కో తామర మొక్క నుంచి కనీసం 12 పూలు పూస్తాయి. తామర పువ్వు నుంచి కాయగా మారిన ఒక్కో దానిలో 80 నుంచి 100 గింజలు తయారవుతాయి. తామర ఆకులు, పువ్వులు నీటి లోపలికి వెళ్లిపోయినప్పుడు పంట సిద్ధమైనట్లు గ్రహించాలి. ఇలా ఎకరం మఖానా సాగులో 30 నుంచి 32 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది.మఖానా గింజలను హార్వెస్ట్‌ చేసిన తర్వాత కనీసం 12 నుంచి 14 గంటల పాటు ఎండబెట్టాలి. వాటిని ఆ వెంటనే 280 డిగ్రీల సెంటీగ్రేడ్‌ వేడిలో వేగించి రోస్ట్ చేయాలి. ఆ తర్వాత 48 గంటల పాటు నిల్వ ఉంచి, రెండోసారి కాల్చాలి. వేడి వేడిగా ఉన్న మఖానా గింజలపై ఉండే పెంకులను పగలగొట్టి ఫూల్‌ మఖానాలను తయారు చేసుకోవాలని అనంతరెడ్డి చెప్పారు.సూపర్‌ ఫుడ్‌ అని మఖానాను మన దేశ ప్రధాని మోదీ అభివర్ణించారు. ఎన్నో పోషక విలువలు ఉన్న మఖానా దేశంలో పలుచోట్ల ఉదయం అల్పాహారంలో ఒక భాగం అయిందన్నారు. బీహార్‌లో మఖానా సాగు చేసే రైతుకు ప్రోత్సాహం అందించేందుకు ప్రధాని మోదీ ఒక బోర్డును ఏర్పాటు చేశారు. బీహార్‌లోని దర్భంగా, మధుబని, పూర్ణియా, కతిహార్‌, సహార్సా, సుపౌల్‌, అరారియా, కిషంగానీ, సీతామర్హి జిల్లాల్లో మఖానా సాగును రైతులు ఎక్కువగా చేస్తున్నారు. బీహార్‌లోని మిథిలాంచల్ ప్రాంతం మఖానా సాగుకు ప్రసిద్ధి చెందింది. దేశీయంగానే కాకుండా విదేశాలకు కూడా బీహార్ నుంచి మఖానా గింజల ఎగుమతి అవుతోందని మోదీ సంతోషంగా చెప్పారు.కిలో మఖానా విత్తనాల ధర రూ.300 నుంచి 400 వరకు ఉంటుంది. అన్‌ సీజన్‌లో కూడా రైతులకు కిలో గింజల ధర రూ.800 నుంచి 900 పలుకుతుంది. తద్వారా ఎకరం మఖానా సాగు ద్వారా సుమారు రూ.3 లక్షల వరు ఆదాయం వస్తుంది. ప్రాసెస్‌ చేసిన మఖానాలు వినియోగదారులకు కిలో వెయ్యి నుంచి, రూ.2 వేలకు మార్కెట్‌లో లభిస్తున్నాయి. మఖానా సాగు కోసం అన్నీ కలుపుకొని రూ.60 నుంచి 70 వేలు పెట్టుబడిగా తీసేస్తే.. రూ.2.30 లక్షల లాభం కనిపిస్తుందని అధికారి అనంతరెడ్డి తెలిపారు. తెల్లగా ఉండే మఖానా గింజలు మాత్రం పుట్టేది, పెరిగేది బురదలోనే! పోషకాలతో నిండి ఉన్న ఫూల్‌ మఖానాను ఆహారంగా తీసుకున్నా.. పండించినా లాభమే.